జన్ లోక్ పాల్ బిల్లుని పార్లమెంటు ముందుకి తేవాలన్న డిమాండ్‌తో నిరవధిక నిరాహార దీక్ష తలపెట్టిన అన్నా హజారే దీక్ష గడువు విషయంలో బుధవారం అర్ధరాత్రి దాటాక కూడా చర్చలు జరిగాయి. మూడు రోజుల గడువునుండి ఐదురోజులకూ, అటు పిమ్మట వారానికీ గడువు పెంచినప్పటికీ హజారే బృందం తిరస్కరించడంతో పోలీసులు అన్నా బృందానికి నచ్చజెప్పటానికి తీవ్రంగా ప్రయత్నించారు. చివరికి రెండు వారాల పాటు దీక్షను అనుమతించడానికి పోలీసులు, అన్నా హజారే బృందం అంగీకరించారు.
అయితే రెండు వారాల గడువు పట్ల కూడా హజారే బృందం సభ్యులందరూ సంతోషంగా ఏమీ లేరు. నిరవధిక నిరాహార దీక్ష అని ప్రకటించాక దానికి వారం రెండు వారాలు అన్న పరిమితి ఉండడం ఏమిటని వారు అభిప్రాయపడుతున్నారు. రెండు వారాల గడువు అంతిమం కాదని గడువు ముగుస్తున్నపుడు మరలా నిర్ణయాన్ని సమీక్షించి గడువు పెంచే యోచనలో అన్నా బృందం ఉన్నట్లుగా ది హిందూ పత్రిక తెలిపింది. రాంలీలా మైదాన్ దీక్షకు ఇంకా అనువుగా లేదు. దీక్షకు మద్దతుగా వచ్చేవారందరికీ సరిపడా ఏరియాను శుభ్రం చేయవలసి ఉంది. పార్కింగ్, మంచినీరు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయవలసి ఉంది. అందువలన అన్నా హజారే గురువారం రాత్రికి గానీ, శుక్రవారం గాని జైలునుండి బైటికి రావచ్చని అన్నా మిత్రులు తెలిపారు.
గడువు విషయంలో రాజీకి రావడం గురించి చెబుతూ సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ “దీక్ష గడువుపై ఘర్షణకు దిగే బదులు పోలీసుల ప్రతిపాదనను ఆమోదించి పదిహేరు రోజుల తర్వాత గడువుని సమీక్ష చేయాలని కోరవచ్చని భావించాం” అని అన్నాడు. అన్నా బృందాన్ని అరెస్టు చేసి తీహార్ జైల్లో పెట్టడంపై ఆర్.టి.ఐ కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. అరెస్టు చేయడం, రెండు గంటల్లోనే విడుదల చేయడం చట్టాలతో పని లేకుండా ఎవరి ఇష్టానుసారం జరిగిందని ఆయన ప్రశ్నించాడు.
తీహార్ జైలు గేటు వద్ద సమకూడిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ప్రజలను తమ ఇష్టం వచ్చిన పద్ధతిలో అరెస్టు చేసి, తమ ఇస్టం వచ్చినపుడు వదిలిపెట్టడంపై ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించాలని కోరాడు. “ఏం చట్టం ఇది? ఏ రకం ప్రజాస్వామ్యం ఇది? ఈ అంశంపైనె అన్నా ఆగ్రహించారు. ప్రభుత్వం తన ఇస్టమొచ్చిన రీతిలో అన్నాను జైలులో పెట్టింది. ఇపుడు అన్నా తన ఇష్టం వచ్చినపుడు జైలు నుండి వెళ్తానని ప్రభుత్వానికి స్పష్టం చేశాడు” అని అరవింద్ కేజ్రీవాల్ తెలిపాడు.
శాంతికి భంగం కలిగించడానికి హజారే సిద్ధపడినందున దానిని అడ్డుకోవడానికే తమను అరెస్టు చేశామని ప్రభుత్వం సమర్ధించుకోవడాన్ని అన్నా బృందం తిరస్కరించింది. అది తప్పని గత రెండు రోజుల పరిణామాలు రుజువుచేశాయని వారు తెలిపారు. దేశంలో అన్నా అరెస్టుకి నిరసనగా ప్రజలు ఉద్యమించిన ప్రతిచోటా శాంతియుతంగానే నిరసన కొనసాగిన సంగతిని వారు గుర్తు చేశారు. “రాజకీయ ఊరేగింపులలో హింస జరగవచ్చేమో కాని అన్నా ఊరేగింపులలో కాదు” అని అన్నా బృందం తెలిపింది.
లోక్ పాల్ విషయంలో ప్రభుత్వం నుండి తమకు ఏ ప్రతిపాదనా రాలేదని అన్నా హజారే బృందం తెలిపింది. జన్ లోక్ పాల్ లో ఉన్న అంశాలను ప్రభుత్వం రూపొందించిన లోక్ పాల్ బిల్లులో పొందుపరచాలన్న డిమాండ్‌పై ప్రభుత్వం తమతో ఏమీ చెప్పలేదని వారన్నారు. “జన్ లోక్‌పాల్ బిల్లు, పార్లమెంటును చేరడానికి పోరాటం ఇప్పుడే మొదలయ్యింది. రాంలీలా మైదాన్ లో నిరవధిక నిరాహార దీక్ష చేయడానికి పోలీసులు రెండు వారాలపాటు అనుమతి ఇవ్వడంతో మనం ఇప్పుడే యుద్ధ ప్రాంతంలోకి ప్రవేశించాము” అని అన్నా బృందం వ్యాఖ్యానించింది. అన్నా హజారే ఆరోగ్యంపై వచ్చిన వార్తలను వారు కొట్టిపారేశారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు.
