సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకీ అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు అసాధ్యం అనుకున్నవి సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మనిషి సుసాధ్యం చేసుకుంటున్నాడు. అత్యంత సూక్ష్మ పరికరాలనుండి అతి పెద్ద ఆకాశ హర్మ్యాల వరకూ మనిషి తన జీవన సౌకర్యాల కోసం అభివృద్ధి చేసుకున్నాడు. పెద్ద పెద్ద డ్యాం లు కట్టి నీటిని నియంత్రణలోకి తెచ్చుకున్న మనిషి తనకు అవసరమైన చోటికి నీటిని తీసుకెళ్ళగలగడం వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులను తెచ్చి పెట్టింది.
యేసు క్రీస్తు నీటి మీద నడవడం నిజమో కాదో తెలియదు కాని ప్రస్తుతం మానవ జాతి అచ్చంగా నీటిమీద కాకపోయినా వంతెనలు నిర్మించడం ద్వారా నీటిపైన నడుస్తున్నాడు. సముద్ర గర్భంలో సొరంగాలు నిర్మించి దగ్గరి దారులు నిర్మించుకున్నాడు. వంతెనల నిర్మాణం అనేక శాస్త్రాల ఉమ్మడి కృషి ఫలితం.ప్రపంచంలో పెద్ద వంతెనల ఫోటోలను యాహూ సంస్ధ ప్రచురించింది. అవి ఇక్కడ యధాతధంగా:
- ప్రపంచంలో అతి పొడవైన బ్రిడ్జి ఇది. 36.48 కి.మీ పోడవు ఉన్న ఈ వంతెన చైనాలోని షాన్ డాంగ్ రాష్ట్రంలొ జియావో ఝౌ వద్ద ఈ వంతెన నిర్మాణం ప్రారంభంచిన నాలుగు సంవత్సరాల్లోనే వాడుకలోకి వచ్చింది.
- అమెరికాలోని లాసియానా రాష్ట్రంలోనిది ఈ బ్రిడ్జి. ‘ది లేక్ పాన్షర్ట్రైన్ కాస్వే’ గా పిలిచే ఈ వంతెనలో రెండు సమానంతర వంతెనలు ఉన్నాయి. 9,500 కాంక్రీట్ పిల్లింగ్ల పైన నిలబడిన ఈ వంతెన పొడవు 38.35 కిలో మీటర్లు.ఈ వంతెన దక్షిణాగ్రం లూసియానాలోని న్యూ ఓర్లెన్స్ లో ఉంది. ఉత్తరాగ్రం అదే రాష్ట్రంలోని మాండ్విల్లేలో ఉంది.
- డిసెంబరు 10, 2005 తేదిన పూర్తయిన ఈ ‘డోంఘై బ్రిడ్జి’ పొడవు 32.5 కిలో మీటర్లు. చైనాలోని షాంఘై, యాంగ్షాన్ ఓడరేవులను కలుపుతుంది. ఈ వంతెన “ది స్టోన్” గా ప్రసిద్ధి చెందింది.
- నాలుగు లేన్ల ‘ఛేసా పీక్’ బ్రిడ్జి అమెరికాలోనిది. వర్జీనియాలోని డెల్మార్వా ద్వీపకల్పం తూర్పు ఒడ్డును వర్జీనియా బీచ్ తోనూ హేంప్టన్ రోడ్స్ కి చెందిన మెట్రోపాలిటన్ ప్రాంతంతోనూ కలుపుతుంది. ఈ వంతెన పొడవు 37 కిలో మీటర్లు
- వాస్కో డి గామా బ్రిడ్జి గా పిలిచే ఈ వంతెన పొడవు 17.2 కిలో మీటర్లు. 29 మార్చి, 1998 న ప్రారంభించబడిన ఈ వంతెన పోర్చుగల్ రాజధాని లిస్బన్ వద్ద గల టాగుస్ నదిపైన నిర్మించబడింది.
- సెప్టెంబరు 14, 1985 తేదీన తెరిచిన ఈ వంతెన మలేసియాలోని పెనాంగ్ ద్వీపంలో ఉన్న గెలుగార్నూ సెబెరాంగ్ ప్రాయ్నూ ప్రధాన భూభాగంతో కలుపుతుంది. వంతెన పొడవు 13.5 కిలో మీటర్లు.
- బ్రెజిల్ రాజధాని రియో డి జనేరియో ను నిటేరోయ్ తో కలిపే ఈ వంతెన పేరు రియో-నిటేరోయ్ బ్రిడ్జి. 4 మార్చి, 1974లో ప్రారంభించిన ఈ వంతెన పొడవు 13 కిలో మీటర్లు.
- 12.9 కి.మీ పొడవున్న ఈ వంతెనను 31 మే, 1997 న ప్రారంభించారు. కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ద్వీపాన్ని న్యూ బ్రన్స్విక్ తో కలుపుతుంది. ఇది రెండు లేన్ల టోల్ బ్రిడ్జి.
- సాన్ మటేవో బ్రిడ్జిగా పిలిచే ఈ వంతెన పూర్తి పేరు ‘సాన్ మటేవో-హేవార్డ్ బ్రిడ్జి. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో ద్వీపకల్పాన్ని ఈస్ట్ బే తో కలిపే ఈ వంతెన పొడవు 11.26 కిలో మీటర్లు









