కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా యెడ్యూరప్ప మద్దతుదారు “సదానంద గౌడ” ఎన్నిక


కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప మొత్తం మీద తన పంతం కొంతమేరకు నెగ్గించుకున్నాడు. నూతన ముఖ్యమంత్రిగా, యెడ్యూరప్ప వర్గీయుడైన “సదానంద గౌడ” ఎన్నికయ్యాడు. కర్ణాటక లెజిస్లేచర్ పార్టీ నూతన నాయకుడిని ఎన్నుకోవడానికి బుధవారం సమావేశమైంది. ముఖ్యమంత్రి పదవి కోసం యెడ్యూరప్ప, బి.జె.పి అధిష్టానంలు చెరొక అభ్యర్ధిని నిలబెట్టినట్లుగా వార్తా ఛానెళ్ళు చెప్పాయి. రహస్య ఓటిం కూడా జరిగిందని అవి తెలిపాయి. చివరికి సదానంద గౌడను నూతన ముఖ్యమంత్రిగా బి.జె.పి శాసన సభా పక్షం ఎన్నుకుందని ప్రకటన వెలువడింది.

బి.జె.పి శాసన సభా పక్ష సమావేశం బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ఏకాభిప్రాయంతో ముఖ్యమంత్రి పదవికి ఎన్నుకుందామన్న కేంద్ర పరిశీలకుల ప్రయత్నాలు సఫలం కాలేదు. యెడ్యూరప్ప ప్రత్యర్ధులు షెట్టర్ ను తమ అభ్యర్ధిగా నిలిపినట్లు తెలుస్తోంది. కేంద్ర పరిశీలకులు ఏకగ్రీవంగా నూతన ముఖ్యమంత్రిని ఎన్నిక చేయడానికి చివరి ప్రయత్నాలు చేయడంతో ప్రకటించిన సమయానికి గంట ఆలస్యంగా సమావేశం ప్రారంభమైంది. అక్రమ మైనింగ్‌లో పాత్ర ఉన్నందుకు గాను యెడ్యూరప్పపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని లోకాయుక్త సిఫారసు చేయడంతో ఆయన రాజీనామా చేశాడని తెలిసిందే.

యెడ్యూరప్ప తన అభ్యర్ధి సదానంద గౌడ అని ప్రకటించాడు. యెడ్యూరప్ప ప్రత్యర్ధులు హెచ్.ఎన్.అనంత కుమార్, బి.జె.పి రాష్ట్ర అధ్యక్షుడు ఎ.ఎస్.ఈశ్వరప్ప తదితరులు జగదీష్ షెట్టర్ ను సదానంద గౌడకు పోటీగా నిలబెట్టారు. తనకు ఇష్టుడైన వారిని సి.ఎంగా నియమించుకోవడం ద్వారా మాజీ ముఖ్యమంత్రి, అక్రమ మైనింగ్ ఆరోపణల నుండి క్షేమంగా బైటపడడానికి ప్రయత్నిస్తున్నాడు.

వ్యాఖ్యానించండి