ఇంగ్లండు క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న మాజీ జింబాబ్వే ఆటగాడు ఆండి ఫ్లవర్, సచిన్ టెండూల్కర్‌ను ఒకసారి తలచుకున్నాడు. రెండవ టెస్టు మ్యూచ్ జరుగుతున్న సందర్భంగా ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ బెల్ రనౌట్‌ను తిరిగి పరిశీలించాలని భారత్ జట్టు డ్రెస్సింగ్ రూంకి వెళ్ళి కోరడాన్ని ఆయన సమర్ధించుకుంటూ తన నిర్ణయంలో సచిన్‌ని ప్రతిక్షేపించుకున్నాడు. “ఇయాన్ బెల్ లాగే సచిన్ అవుటై ఉన్నట్లయితే క్రికెట్ ప్రపంచం అంతా గగ్గోలు పెట్టి ఉండేది” అని చెబుతూ తమ చర్యను సమర్ధించుకున్నాడు. ఇయాన్ లాగే సచిన్ రనౌట్ అయినట్లయితే అది “అంతర్జాతీయ స్ధాయిలో పెద్ద ఘటన”గా ప్రాచుర్యం పొంది ఉండేదనీ, గొడవ జరిగేదనీ ఆండీ ఫ్లవర్ అభిప్రాయపడ్డాడు.
రెండవ టెస్టు జరుగుతుండగా టీ బ్రేక్ గా భావించిన ఇయాన్ బెల్, క్రీజులో బ్యాట్ తాకించకుండా పెవిలియన్ వైపుకి నడక మొదలుపెట్టాడు. దాన్ని చూపుతూ ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఔట్ కి అప్పీలు చేయడంతో అంపైర్, నిబంధనల ప్రకారం అవుట్ ప్రకటించాడు. ఆ తర్వాత టీ బ్రేక్ లోనే ఇంగ్లండ్ కోచ్ అండీ ఫ్లవర్, కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ లు ఇండియా డ్రెస్సింగ్ రూమ్ వద్దకు వెళ్ళి ఇయాన్ ఔట్ అయ్యాడన్న అప్పీలును ఉపసంహరించుకోవలసిందిగా కోరారు. ఇండియా టీం సభ్యులు తమలో తాము చర్చించుకొని ఇయాన్ బెల్ రనౌట్ అప్పీలును ఉపసంహరించుకున్నారు. ఈ మ్యాచ్‌ను ఇంగ్లండు 319 పరుగులతో గెలిచిన సంగతి విదితమే.
భారత టీం అప్పీలును ఉపసంహరించుకోమని అడిగేందుకు ఇంగ్లండ్‌కి అన్ని హక్కులూ ఉన్నాయని ఆండీ అన్నాడు. “డ్రెస్సింగ్ రూంలో కూర్చుని నిశ్శబ్దంగా గొణుక్కోవడం వలన మంచి జరుగుతుందని మేము భావించలేదు” అని రెండవ టెస్ట్ మ్యాచ్ జరిగిన టెంట్ బ్రిడ్జ్ వద్ద విలేఖరులతో మాట్లాడుతూ ఆండీ అన్నాడు. “ముంబైలో టెండూల్కర్‌కి వ్యతిరేకంగా ఇంగ్లండ్ అలా చేసినట్లయితే, ఒక అంతర్జాతీయ ఘటన చోటు చేసుకుని ఉండేది. అదేమీ (ఆండీ, స్ట్రాస్ లు రనౌట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని ఇండియా టీం ని కోరడం) పెద్ద డ్రమెటిక్ విషయమేమీ కాదు. అలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయని మాకు తెలుసు. పరిస్ధితిని విశ్లేషించేటప్పుడు ద్వంద్వ విధానం పనికిరాదు” అని ఆండీ విలేఖరులతో మాట్లాడుతూ తన చర్యను సమర్ధించుకున్నాడు.
అయితే ఇయాన్ బెల్‌ని రీకాల్ చేయడం వెనక సచిన్ టెండూల్కర్ ప్రభావం ఉందని “ది డెయిలీ మెయిల్” పత్రిక పేర్కొంది. మైదానంలో ధోనీని ఇయాన్ బెల్ అవుట్‌మి కోరుతున్నదీ లేనిదీ అంపైర్లు మూడు సార్లు అడిగారనీ, ధోనీ అవుననే చెప్పాడనీ ఆ పత్రిక తెలిపింది. ఆ తర్వాత ఆండీ ఫ్లవర్, ఆండ్రూ స్ట్రాస్ లు ధోనీ, ఇండియా కోచ్ ఫ్లెచర్ ల వద్దకు వెళ్ళి అడిగినప్పుడు కూడా ధోని తమ నిర్ణయంలో మార్పు లేదని చెప్పాడని, ఆ తర్వాత టెండూల్కర్, ధోనీకి నచ్చ జెప్పడంతో ఇయాన్ బెల్‌ని రీకాల్ చేయడం సాధ్యమయ్యిందనీ డెయిలీ మెయిల్ పేర్కొంది.
డెయిలీ మెయిల్ పత్రిక ఈ వార్త రాస్తూ “ఇయాన్-బెల్” రనౌట్ గా ప్రకటించడాన్ని “వివాదస్పద నిర్ణయం”గా పదే పదే పేర్కొంది. వాస్తవానికి ధోనీ నిర్ణయం నిబంధనల ప్రకారమే జరిగిందన్న సంగతిని ఆ పత్రిక దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నట్లుగా కనిపించింది. “ఒక పెద్ద వివాదం తలెత్తకుండా చేయడంలో సచిన్ విజయవంతమయ్యాడు” అని ఆ పత్రిక పేర్కొంది. ఎల్.బి.డబ్ల్యూ గా ఔట్ ఇవ్వడం అనేది ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటుంది. బంతి వికెట్ల మీదికి వెళ్తుండగా బ్యాట్స్ మేన్ కాలు అడ్డొచ్చిందా లేదా అని ఖచ్చితంగా చెప్పడం ఏ అంపైర్‌కి ఐనా చెప్పడం కష్ట తరమే. ఆ అంశంలో ఉన్న అనిర్ధిష్టతే దాన్ని వివాదాస్పదంగా ఉంచుతుంది.
కానీ రనౌట్ పరిస్ధితి అది కాదు. మూడో అంపైర్ వచ్చాక రనౌట్‌లను ఖచ్చితంగా నిర్ణయించడం సాధ్యమయ్యింది. ఇయాల్ బెల్ సంగతి నిజానికి అది కాదు. బౌలింగ్ చేసిన తర్వాత క్రీజులోంచి బైటికి వచ్చిన బ్యాట్స్ మేన్ బ్యాట్‌ని గానీ, తన బాడీని గాని మళ్ళీ క్రీజులోకి తేవాలన్నది ప్రశ్నించడానికి వీలు లేని నియమం. ఎల్.బి.డబ్య్లూ ఔట్ అయ్యాక బ్యాట్స్ మేన్ ‘నేను ఇలా కదిలినప్పుడు నా కాలు బంతికి ఆ విధంగా అడ్డొస్తుందని అనుకోలేదు. అది నాకు తెలియకుండా జరిగింది. కనుక నన్ను బ్యాటింగ్ కొనసాగించడానికి అనుమతి ఇవ్వాలని అడగగలడా?’ అసాధ్యమే కదా. అలాగే ఇయాన్ బెల్ వచ్చి “నేను అది టీ బ్రేక్ అనుకున్నాను. అందుకనే మళ్ళీ వెనక్కి వెళ్లలేదు” అని చెబితే ఎలా అంగీకరించగలరు ఎవరైనా? అందుకే ధోనీ అంగీకరించలేదు. టీ బ్రేకో, లేక ఆట కోనసాగుతున్నదో తేడా తెలియనంత అమాయకత్వంలో ఆటగాళ్ళు ఉంటారని ఎవరైనా ఊహించ గలరా?
టెండూల్కర్ చెప్పిన తర్వాత ఇండియా టీం కెప్టెన్ ధోని అంగీకరించడం కూడా ధోనీ గొప్పతనాన్ని తెలియజేస్తుంది. టెండూల్కర్ చెప్పినంతనే కెప్టెన్ వినాలని రూలేమీ లేదు. అయినా ధోనీ విన్నాడంటే దానర్ధం ఒక క్రికెట్ జీనియస్‌ని ధోని గౌరవించినట్లు. ఒక్క ధోనీయే కాదు, మొత్తం ఇండియా టీం సభ్యులందరూ ఆ నిర్ణయాన్ని ఆమోదించారు. తమ జట్టులోని ఒక సీనియర్ ప్లేయర్‌ని గౌరవించే విషయంలో భారత జట్టు సభ్యులు ఆదర్శంగా నిలిచారు. ఇంగ్లండ్ జట్టు గానీ, ఆస్ట్రేలియా జట్టు గానీ ఉపఖండంలోని జట్టులతో ఆడే సమయాల్లొ ఆ దేశాల పత్రికలు ఈ విధమైన పైత్యాన్ని వెళ్లగక్కడం కొత్తేమీ కాదు. తమ పైత్యాన్ని మరొకసారి రుజువు చేసుకున్నారంతే.

