బీహార్ పాఠశాల గ్రంధాలయాల్లొ అర్.ఎస్.ఎస్ పుస్తకాలు -జె.డి(యు) రెబెల్స్


తనను తాను అసలైన సెక్యులరిస్టుగా చెప్పుకునే నితీష్ కుమార్ బీహార్ పాఠశాలల కోసం ఆర్.ఎస్.ఎస్ సిద్ధాంతాలను బోధించే పుస్తకాలను కొనడానికి అనుమతించాడని జనతా దళ్ (యునైటెడ్) పార్టీ తిరుగుబాటు నాయకుడు ఒకరు ఆదివారం వెల్లడించాడు. మతన్మోదాన్ని, విద్వేషాలనూ రెచ్చగొట్టే ఈ పుస్తకాలను వెంటనే పాఠశాలల గ్రంధాలయాలనుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశాడు.

ప్రభుత్వ నిధులను ఖర్చు చేసి ఆర్.ఎస్.ఎస్ భావాల వ్యాప్తికి దోహదం చేసే పుస్తకాలను కొనుగోలు చేసి పాఠశాల పిల్లలకు అందుబాటులో ఉంచడం తగదని ఉపేంద్ర కుష్వహ అన్నాడు. జె.డి(యు) పార్టీలో తిరుగుబాటు చేసిన వారు “బీహార్ నవ నిర్మాణ్ మంచ్” పేరుతో కొత్త పార్టీని స్ధాపించారు.ఈ పార్టీకి ఉపేంద్ర కన్వీనర్ గా వ్యవహరిస్తున్నాడు. “ఇది చలా ప్రమాదకరమైనది. చాలా జాగ్రత్త ఉండవలసిన విషయం. ఎందుకంటే ఈ పుస్తకాలు కేవలం విద్వేషాన్నే ప్రభోధిస్తాయి” అని ఉపేంద్ర తెలిపాడు.

ఆర్.ఎస్.ఎస్ వ్యవస్ధాపకుడు కేశవ్ బలిరాం హెడ్గేవార్ రాసిన ‘హిందూత్వ’ తో పాటు ‘గోధ్రా-తప్పిపోయిన ఆగ్రహం’ (Godhra-The Missing Rage) లాంటి పుస్తకాలు మధ్య స్ధాయి ప్రభుత్వ పాఠశాలల గ్రంధాలయాల కోసం కొనుగోలు చేశారని ఉపేంద్ర పత్రికల సమావేశంలో తెలిపాడు. “తనను తాను సెక్యులర్ వాదిగా చెప్పుకునే నితీష్ కుమార్, ఆర్.ఎస్.ఎస్ సంస్ధ విద్యార్ధులకు సమీపంగా తీసుకెళ్ళడానికి సహాయపడడం నన్ను నిశ్ఛేష్టుడ్ని చేసింది” అని మాజీ రాజ్య సభ సభ్యుడు  ఉపేంద్ర కుశ్వహ తెలిపాడు. “రాష్ట్ర ప్రభుత్వం ఈ పుస్తకాలను వెంటనే తొలగించాలి” అని ఆయన డిమాండ్ చేశాడు.

బి.జె.పి మద్దతుతో తన ప్రభుత్వం సజావుగా నడవడం కోసం నితీష్ కుమార్, ఆర్.ఎస్.ఎస్ ముందు తలవంచుతున్నాడని ఉపేంద్ర ఆరోపించాడు. బీహార్ ఎన్నికల ప్రచారానికి నితీష్ కుమార్ బి.జె.పి తరపున నరేంద్ర మోడి రావడానికి అంగీకరించలేదు. బి.జె.పి పార్టీ, దాని నాయకులే స్వయంగా తామే అసలైన సెక్యులర్ పార్టీగా చెప్పుకుంటున్నపుడు ఆ పార్టీ మద్దతుతో ప్రభుత్వం నడుపుతున్న నితీష్ కుమార్ తనను తాను సెక్యులరిస్టుగా చెప్పుకోవడంలో తప్పు లేదు.

ఎటొచ్చీ ఆర్.ఎస్.ఎస్ భావజాల వ్యాప్తికి నితీష్ కుమార్ పరోక్షంగా దోహదపడడమే వింతైన విషయం. ఆ లెక్కన నరేంద్ర మోడి ఏం పాపం చేశాడని బీహార్ ఎన్నికల ప్రచారానికి ఆయనను అనుమతించలేదు? పుస్తకాలు సిద్ధాంతం అయితే నరేంద్ర మోడి ఆ సిద్ధాంత ఆచరణకు నిఖార్సయిన ప్రతీక. సిద్ధాంతాన్ని అనుమతించి ఆచరణను అనుమతించక పోవడం ఆత్మ వంచనతో పాటు పర వంచన కూడా.

వ్యాఖ్యానించండి