వరుసగా నాల్గవరోజు నష్టపోయిన భారత షేర్ మార్కెట్లు


భారత షేర్ మార్కెట్లు వరుసగా నాల్గవ రోజు కూడా నష్టపోయాయి. బి.ఎస్.ఇ సెన్సెక్స్ 12.32 పాయింట్లు (0.07 శాతం) నష్టపోయి 18197.20 వద్ద క్లోజ్ కాగా, నిఫ్టీ 5.75 పాయింట్లు (0.1 శాతం) నష్టపోయి 5482 వద్ద ముగిసింది. ఫండ్లు, మదుపుదారులు రియాల్టీ, మెటల్, ఆయిల్ & గ్యాస్, విద్యుత్ రంగాల షేర్లను అమ్మడంతో షేర్ మార్కెట్లు నష్టాలకు గురయ్యాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ నుండి అందుతున్న బలహీన సంకేతాలు, భారత దేశంలో ద్రవ్యోల్బణ కట్టడికి మరిన్ని సార్లు వడ్డీ రేట్లు పెంచనున్నారన్న వార్తలు షేర్ల పతనానికి దోహదం చేశాయి.

మార్కెట్ లీడర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.15 శాతం నష్టపోయింది. ఆయిల్ & గ్యాస్ రంగ నాయకుడు ఓ.ఎన్.జి.సి 2.89 శాతం నష్టపోయింది. ఈ వారంలో బి.ఎస్.ఇ మొత్తం 661 పాయింట్లు నష్టపోయింది. అమెరికా, యూరప్ ల అప్పు సంక్షోభాలపై ముసురుకున్న ఆందోళనలు షేర్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయితే ఆహార ద్రవ్యోల్బణం 20 నెలల కనిష్ట స్ధాయి 7.33 శాతానికి పడిపోవడంతో శుక్రవారం నష్టాలనుండి కొంతమేరకు మార్కెట్లు బైటపడ్డాయి.

బి.ఎస్.ఇ సూచికలో రియాల్టీ రంగం  అత్యధికంగా 2.09 శాతం నష్టపోగా, మెటల్ రంగం సూచిక 2 శాతం నష్టపోయింది. ఆయిల్ & గ్యాస్ రంగ సూచిక 2.18 శాతం, విద్యుత్ రంగ సూచిక 1.07 శాతం నష్టపోయింది. అయితే బ్యాంకింగ్ రంగం మాత్రం 0.53 శాతం లాభపడింది.

2011 సంవత్సరంలో భారత ఈక్విటీ మార్కెట్లు ప్రపంచంలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఒకటిగా ఉన్నాయి. షేర్ మార్కెట్లలోకి ఎఫ్.ఐ.ఐ ల రాక కూడా బాగా తగ్గిపోయింది. ఆర్.బి.ఐ వడ్డీ రేట్లు పెంచుతుండడంతొ రుణ లభ్యత కార్పొరేట్ కంపెనీలకు కొంత కఠినంగా మారింది. దానితో పెట్టుబడుల లభ్యత తగ్గిపోయి ఆర్ధిక కార్యకలాపాలలో తగ్గుదల నమోదవుతోంది. అది అంతిమంగా ఆర్ధిక వృధి (జిడిపి వృద్ధి) తగ్గడానికి దారి తీస్తొంది.

వ్యాఖ్యానించండి