కాంగ్రెస్ పార్టీ ఓ సర్కస్‌లా తయారయ్యింది -కాంగ్రెస్ నాయకుడు మణి శంకర్ అయ్యర్


కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రూపుల ఘర్షణ వీధికెక్కుతున్నట్లు కనిపిస్తోంది. రాహుల్, దిగ్విజయ్, సోనియాల పర్యవేక్షణలోని నెహ్రూ/ఇందిరా స్కూల్ ఆర్ధిక విధానాలకీ, మన్మోహన్, మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, పి.చిదంబరం, కపిల్ సిబాల్ తదితరుల అమెరికా/ఎల్.పి.జి (లిబరలైజేషన్, ప్రవేటైజేషన్, గ్లోబలైజేషన్) స్కూల్ ఆర్ధిక విధానాలకి ఘర్షణ, ఐక్యతలు కొనసాగుతున పరిస్ధితి అందరూ ఎరిగినదే. లోలోపలి సమావేశాల్లోనూ, మంత్రుల నియామకాలు, తొలగింపుల రూపంలోనూ వీరి ఘర్షణ వ్యక్తమవుతూ వస్తున్నది. ఐతే నెహ్రూ స్కూల్ సీనియర్ నాయకులను సుదీర్ఘకాలం పాటు పక్కనబెడుతుండడంతో వారు బహిరంగంగానే అమి తుమీ తేల్చుకోవడానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నెహ్రూవియన్ విధానాల సమర్ధకుడు, పెట్రోలియం శాఖ మంత్రిగా తొలగింపబడిన మణిశంకర్ అయ్యర్ నేరుగా సోనియా, ఆమె రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ లపైనే అసంతృప్తిని వెళ్లగక్కాడు. సోనియాపై విమర్శ ఎక్కుపెట్టడం అంటే కాంగ్రెస్ లో బ్లాస్ఫెమీ (దైవదూషణ) తో సమానమే. అటువంటిది ఒక సభలోనే అయ్యర్ కాంగ్రెస్‌ని సర్కస్‌తో పోల్చాడంటే పరిస్ధితి తీవ్రంగా ఉన్నట్లే భావించవచ్చునేమో?! కాంగ్రెస్‌లో జీవితం 24 అక్బర్ రోడ్‌లో (కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం) జరిగే మేళా లాంటిదేననీ, “ఎవరైనా కాంగ్రెస్‌లో చేరాలంటే వాళ్ళు ఆ సర్కస్‌లో చేరాల్సి ఉంటుంది” అని ఆయన చెణుకులు విసిరారు.ఢిల్లీలో జరిగిన ఓ ఫంక్షన్‌కి హాజరైన ఆయన అక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి వివరించే ప్రయత్నం చేశాడు.

“తమపని సాధించుకోగలిగినవారు 10, జనపధ్‌ని దర్శించుకుంటారు. తమ పని అవుతుందని నమ్మకం ఉన్నవారు 23, విల్లింగ్‌డన్ క్రెసెంట్ ని దర్శించుకుంటారు. మొదటిది సోనియా నివాసం కాగా, రెండవది ఆమె రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌‌ది. ఇక పూర్తిగా నమ్మకం కోల్పోయినవారు 24, అక్బర్ రోడ్డే గతి. ఒక టేబుల్, కుర్చీ ఉన్నవారి దగ్గరికి వెళ్తే వాళ్ళయినా సాయం చేస్తారని వారి ఆశ. కానీ వారికి తెలియని విషయం ఒకటుంది. అక్కడ లోపల కూర్చొని ఉన్న పదిమందిలో సగం మంది తామే ఉన్నత స్ధానాల్లోని పదవుల వైపు చూస్తూ ఉంటారు. ఇక పైన ఉన్న మిగతా ఐదుగురు ఏ క్షణంలోనైనా కిందికి పడిపోయే పరిస్ధితిలో ఉంటారు” అని కాంగ్రెస్ పార్టీలో పదవుల కోట్లాటను అభివర్ణించాడు. మణిశంకర్ అయ్యర్ కూడా ఆ కోట్లాటలో పాల్గొన్న అనుభవం ఉన్నందునే అంత విశ్వాసంతో కాంగ్రెస్ స్టోరీని వినిపించగలుగుతున్నాడు.

మణిశంకర్, నెహ్రూ, ఇందిర గాంధీల లెఫ్ట్ ఆఫ్ ది సెంటర్ భావాలకు, ఆర్దిక విధానాలకు ప్రసిద్ధుడు. అంటే కాంగ్రెస్‌లో పాతతరం భావాలున్నవాడని అర్ధం. ప్రధానంగా ప్రభుత్వరంగం ఆధిపత్యంలో ఉండాలన్నది వీరి అభిప్రాయం. సరళీకరణ, ప్రవేటీకరణ, గ్లోబలీకరణలు అవసరమే ఐనా హద్దులు దాటరాదని భావిస్తుంటారు. మన్మోహన్, అహ్లూవాలియా, చిదంబరం ల కూటమి నాయకత్వంలో అడ్డూ ఆపు లేకుండా సంస్కరణలతో పరుగులు పెడుతున్నారని వీరి అసంతృప్తి. ప్రభుత్వరంగం ద్వారా ప్రజలకు సహాయం చేద్దామని వీరు భావిస్తారనుకుంటే పొరబాటే. ప్రభుత్వరంగం పైన ఆధారపడి ఉన్న టాటా లాంటి పెట్టుబడిదారుల ప్రయోజనాలకు వీరు ప్రతినిధులు. అందుకని మరీ వేగంగా ప్రవేటీకరణ వైపు పరుగెడితే ప్రభుత్వరంగం ద్వారా సమకూడే పెట్టుబడులను రుణాలుగా పొందే పెట్టుబడిదారులకి అందుబాటులో ఉండే పెట్టుబడి నానాటికీ తగ్గిపోతోంది. ప్రభుత్వరంగంపై ఆధారపడిఉన్న పెట్టుబడిదారులనుండి వీరికి అందే కమీషన్లు వీరికి అందడం లేదు. అదీ వారి బాధ.

సంస్కరణలతో కూడిన ఆర్ధిక వ్యవస్ధ వలన భారత దేశం ఐక్యరాజ్యసమితి మానవ అభివృద్ధి సూచికలో గత 17 సంవత్సరాలుగా 134 వ స్ధానంలో ఉన్నదని ఈయన వాపోతున్నాడు. నూతన ఆర్ధిక విధానాలలో మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీ తనలాంటివారిని పూర్తిగా వదిలేసిందని నిట్టూర్చాడు మణిశంకర్. అయితే, ఎందుకైనా మంచిదనుకున్నాడో ఏమో, ఎన్ని ఉన్నా మన్మోహన్ వెనక పార్టీ అంతా సమీకృతమై ఉందని కూడా అన్నాడు. ఎన్నిరకాల భావాలున్నా కాంగ్రెగ్‌లో ఒదిగిపోతామని తేల్చేశాడు.

వ్యాఖ్యానించండి