25వ అణు విద్యుత్ కర్మాగారం నిర్మాణం ప్రారంభించిన ఇండియా


Rajasthan Atomic Power Station at Rawathhatta, near Kota

రాజస్ధాన్ అటామిక్ పవర్ స్టేషన్ దృశ్యం

ఫుకుషిమా అణు ప్రమాదం, అణు విద్యుత్ కర్మాగారాల భద్రత పట్ల అనేక సమాధానాలు దొరకని ప్రశ్నలను అనేకం లేవనెత్తినప్పటికీ భారత దేశం కొత్త అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం నుండి వెనక్కి తగ్గడం లేదు. ఫుకుషిమా దైచి అణు కర్మాగారం వద్ద మూడు అణు రియాక్టర్లలోని విద్యుత్ ప్రసార వ్యవస్ధ దెబ్బతినడంతో కూలింగ్ వ్యవస్ధ నాశనమై ఇంధన కడ్డీలు వేడెక్కి కరిగిపోయి, పెద్ద ఎత్తున పేలుళ్ళు సంభవించిన సంగతి విదితమే. ఈ కర్మాగారం నుండి విడుదలవుతున్న రేడియేషన్‌ను ఇంకా అరికట్టలేకపోయినప్పటికీ భారత ప్రభుత్వం దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ సాయంతో రెండు కొత్త అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.

“న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్” (ఎన్.పి.సి.ఐ.ఎల్) సంస్ధ ఆధ్వర్యంలో, రాజస్ధాన్ ఎటామిక్ పవర్ స్టేషన్ వద్ద ఏడవ రియాక్టర్ నిర్మాణానికి మంగళవారం శంకుస్ధాపన జరిగింది. 700 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదని భావిస్తున్న ఈ రియాక్టర్‌ను “ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్” (పి.హెచ్,డబ్ల్యు.ఆర్) మోడల్‌గా నిర్మిస్తున్నారు. ఎటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్ శ్రీకుమార్ బెనర్జీ, ఎన్.పి.సి.ఐ.ఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రేయన్స్ కుమార్ జైన్ లు కొత్త రియాక్టర్ కోసం మొదటి కాంక్రీటు మిశ్రమాన్ని పోయడం ద్వారా నిర్మాణాన్ని ప్రారంభించారు. బెనర్జీ కాంక్రీటును కలిపే మిషన్‌ను స్విచ్ ఆన్ చేశాడు. అనంతరం ఎం-45 గ్రేడు కాంక్రీటు, కొత్త రియాక్టర్ బిల్డింగ్‌కి చెందిన ఎమర్జెన్సీ కోర్ కూలింగ్ సిస్టం పునాదిలోకి ప్రవహించడం ప్రారంభం కావడంతో కొత్త రియాక్టర్ నిర్మాణం లాంఛనంగా ప్రారంభించినట్లయింది.

కాంక్రీటు వేడిని 19 డిగ్రీల్ ఉష్ణోగ్రత వద్ద ఉండేలా చూడడానికి అందులో ఐస్‌ను కూడా కలుపుతున్నారు. తక్కువ ఉష్ణోగ్రత వద్ద కాంక్రీటును కలపడం వలన నిర్మాణం అదనపు పటిష్టతను సాధిస్తుందని తెలుస్తోంది. 700 మెగా వాట్ల కెపాసిటీ గల ఈ రియాక్టర్ ను ఎన్.పి.సి.ఐ.ఎల్ శాస్త్రవేత్తలు డిజైన్ చేశారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా మొదటి అణు బాంబును పరీక్షించడంతో అమెరికా ఆధ్వర్యంలో న్యూక్లియర్ సప్లయర్ గ్రూపు దేశాలు ఇండియాపై అణు ఆంక్షలను విధించాయి. దాంతో ఇండియాకు శుద్ధి చేసిన ఇంధనాన్ని సరఫరా చేసేవారు కరువయ్యారు. ఈ నేపధ్యంలో భారత శాస్త్రవేత్తలు దేశీయంగా అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. వాడిన ఇంధనాన్ని తిరిగి వాడడం కోసం రిప్రాసెసింగ్ టెక్నాలజీని కూడా ఇండియా అభివృద్ధి చేసుకోగలిగింది. స్వంతగా అభివృద్ధి చేసుకోవలసి రావడంతో అది అంతిమంగా కొన్ని అంశాల్లో ఇతర దేశాలకన్నా మెరుగైన టెక్నాలజీని కూడా ఇండియా అభివృద్ధి చేసుకోగలిగింది.

ఎన్.పి.సి.ఐ.ఎల్ ప్రస్తుతం 4780 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది. అక్టోబరు 2009 లో కేంద్ర ప్రభుత్వం 700 మెగా వాట్ల సామర్ధ్యం కల 4 అణు రియాక్టర్ల నిర్మాణానికై 24,000 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఇవన్నీ పి.హెచ్.డబ్ల్యూ.ఆర్ రకానికి చెందినవే. అందులో రెండు కాక్రాపర్ వద్దా, మరో రెండు రాజస్ధాన్‌లోనే రావత్‌భాటా వద్దా నిర్మించాలని తలపెట్టారు. ఇదే కెపాసిటీతో, ఇదే మోడల్ తో మరొక నాలుగు మధ్య ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో నిర్మించడానికి నిర్ణయించారు. రెండు రియాక్టర్లు మధ్య ప్రదేశ్ లోని బర్గీలోనూ, మరో రెండు హర్యానాలోని ఫతేబాద్ లోనూ నిర్మించడానికి నిర్ణయించారు. ఇవికాక ప్రస్తుతం ఎన్.పి.సి.ఐ.ఎల్ నిర్మిస్తున్న అణు విద్యుత్ కేంద్రాలు కూడా ఉన్నాయి. 1000 మెగా వాట్ల వి.వి.ఇ.ఆర్ రకం విద్యుత్ ప్లాంటులు రెండు కుదంకులంలోనూ, 700 మెగా వాట్ల కెపాసిటీ గల పి.హెచ్.డబ్ల్యు.ఆర్ రకం విద్యుత్ ప్లాంట్లు రెందు గుజరాత్ లోని కాప్రకార్ వద్దా నిర్మిస్తున్నారు. కుదంకులంలోని యూనిట్ – 1, వచ్చే ఆగస్టులోనూ, రెండో యూనిట్ వచ్చే సంవత్సరం మే నెలలోనూ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తాయని తెలుస్తోంది. కాప్రకార్ లోని రెండు యూనిట్లు 2015 నుండి ఉత్పత్తి ప్రారంభిస్తాయి.

ఇరవై రియాక్టర్లు ప్రస్తుతం విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండగా మరొక ఐదు నిర్మాణంలో ఉన్నాయి. భారతీయ నభీకియా విద్యుత్ నిగం సంస్ధ కల్పక్కం వద్ద 500 మెగా వాట్ల సామర్ధ్యంతో ప్రొటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ను నిర్మిస్తున్నారు. 2016 కల్లా భారత అణు విద్యుత్ ఉత్పత్తి 9580 మెగా వాట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు.

వ్యాఖ్యానించండి