2000వ టెస్ట్ మ్యాచ్, 100వ మ్యాచ్, 100వ సెంచరీ


Sachin Tendulkarఇండియా క్రికెట్ జట్టు త్వరలో జరపనున్న ఇంగ్లండ్ టూర్‌లో భాగంగా జులై 21 నుండి 25 వరకూ ఇండియా, ఇంగ్లండ్ ల క్రికెట్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కి అనేక విధాలుగా ప్రాముఖ్యత ఉంది. ఇది మొత్తం ప్రపంచ క్రికెట్ టెస్టు క్రికెట్ జట్టుల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ లలోనే 2000 వ టెస్ట్ మ్యాచ్. అంతే కాకుండా ఇండియా, ఇంగ్లండు దేశాల మధ్య జరగనున్న 100 వ టెస్టు మ్యాచ్ కూడా ఇదే కావడం గమనార్హం.

అంతేనా! భారత క్రికెట్ ప్రేమికులకు ఆరాధ్యుడిగా కొలవబడుతున్న సచిన్ టెండూల్కర్ వన్ డే ఇంటర్నేషనల్ ఫార్మాట్ లో ఇప్పటికే 50 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. టెస్టు మ్యాచ్ లలో మాత్రం 50 వ సెంచరీ ఇంకా ఊరిస్తూనే ఉంది. సచిన్ టెండూల్కర్ 50 వ టెస్ట్ సెంచరీ చేస్తే చూడాలనీ, చూడకపోయినా 50 వ టెస్ట్ సెంచరీ చేశాడని చెప్తే వినాలనీ కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇంగ్లండు టూర్‌లో నైనా సచిన్ ఆ ఫీట్ సాధిస్తాడని భారతీయులు ఆకాంక్షిస్తున్నారు. ఆ సెంచరీ ఏదో ఇటువంటి చరిత్రాత్మక మ్యాచ్‌లో చేస్తే సంతోషిద్దామని ఏ భారతీయుడికి ఉండదూ?

సచిన్ ఇంగ్లండ్ టూర్‌లో మొదటి టెస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ చేస్తే అది ఒక చరిత్రాత్మక ఘటనగా మిగిలిపోతుంది. ప్రపంచంలోనే 2000 వ టెస్ట్ మ్యాచ్‌లో, ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే 100 వ టెస్ట్ మ్యాచ్‌లో, తన క్రికెట్ జీవితంలోని 100 వ సెంచరీ, 50 వ టెస్ట్ సెంచరీని సచిన్ టెండూల్కర్ చేస్తే అది నిశ్చయంగా చరిత్రాత్మక ఘటన అయి తీరుతుంది.

సచిన్‌కి ఇంతవరకూ క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్ మైదానంలో టెస్ట్ సెంచరీ చేసిన అదృష్టం దక్కలేదు. సచినే కాదు ‘ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’ ద్రావిడ్, విలక్షణ బ్యాట్స్‌మేన్ వి.వి.ఎస్.లక్ష్మణ్ కూడా లార్డ్స్ లో సెంచరీ చేయలేదు. సచిన్‌తో పాటు వీరిద్దరూ కూడా లార్డ్స్ లో సెంచరీ సాధిస్తే ప్రపంచంలో 2000 వ టెస్ట్ మ్యాచ్‌ని, ఇండియా, ఇంగ్లండ్ ల మధ్య జరిగే 100 వ టెస్ట్ మ్యాచ్‌ని గెలిచిందన్న ఖ్యాతి దేశానికి దక్కుతుంది.

ఈ సెంచరీల గొడవలో పడి ఒత్తిడికి గురై మ్యాచ్‌ని కోల్పోవద్దని మాజీ కెప్టెన్ వెంగ్ సర్కార్ హెచ్చరిస్తున్నాడు. అదీ నిజమే మరి!

వ్యాఖ్యానించండి