2జి కుంభకోణంలో రాలిపడిన రెండో తల, కేంద్ర టెక్స్‌టైల్స్ మంత్రి దయానిధి మారన్ రాజీనామా


Dayanidhi Maran

Dayanidhi Maran

2జి స్పెక్ట్రం కుంభకోణంలో రెండో తలకాయ రాలిపడింది. బుధవారం సుప్రీం కోర్టుకి సి.బి.ఐ సమర్పించిన స్టేటస్ రిపోర్ట్ లో కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖా మంత్రి దయానిధి మారన్ పాత్రపై వివరాలు పొందుపరిచిన సంగతి విదితమే. చెన్నైకి చెందిన శివరామ కృష్టన్, తన ఎయిర్ సెల్ కంపెనీ లోని మెజారిటీ షేర్లను మలేషియాకి చెందిన మేక్సిస్ కంపెనీకి అమ్మేలా ఒత్తిడి చేశాడనీ, తద్వారా మేక్సిస్ కంపెనీ చేత తన కుటుంబానికి చెందిన సన్ టి.వి లో 600 కోట్ల పెట్టుబడి రూపంలో మంత్రి లబ్ది పొందాడనీ సి.బి.ఐ తన తాజా నివేదికలో తెలిపింది. దయానిధి మారన్‌పై కేసు దాఖలు చేస్తున్నదీ లేనిదీ మరో పది రోజులలోపల తేల్చేస్తామని సి.బి.ఐ బుధవారం పేర్కొంది.

బుధవారం కోర్టులో సమర్పించబడిన నివేదికలో ఆరోపణలు ఎదుర్కొన్న దయానిధి మారన్ గురువారం ఉదయమే “తన పని ఐపోయిందని” సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుగు వార్తా ఛానెళ్ళ తెలిపాయి. గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశానికి అధికారిక వాహనంలో వచ్చిన దయానిధి మారన్ తిరిగి వెళ్ళేటప్పుడు సొంతవాహనంలో వెళ్ళాడని తెలుగు వార్తా ఛానెళ్ళు చెబుతున్నాయి. ఆయన తన టెక్స్‌టైల్స్ శాఖా మంత్రి పదవికి రాజీనామా సమర్పిస్తూ ప్రధానమంత్రికి లేఖ అందించి వెళ్ళాడని తెలుస్తోంది. అయితే కేబినెట్ సమావేశానికి అందరిలాగే దయానిధి హాజరయ్యాడని సమాచార శాఖా మంత్రి అంబికా సోని చెప్పగా, కేబినెట్ సమావేశంలో దయానిధి రాజీనామా ఏమీ ఇవ్వలేదని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది.

ఇదిలా ఉండగా, దయానిధి మారన్ రాజినామాతో ఖాళీ అయన మంత్రిపదవికి తిరిగి డి.ఎం.కె పార్టీ నుండే మంత్రిగా నియమించాలని డి.ఎం.కె అధ్యక్షుడు కరుణానిధి డిమాండ్ చేశాడని వార్తా ఛానెళ్ళు చెబుతున్నాయి. బుధవారం సి.బి.ఐ సమర్పించిన నివేదికపై వ్యాఖ్యానించవలసిందిగా కరుణానిధిని పత్రికలు కోరగా, ఆయన నిరాకరించాడు. “దయానిధి విషయంలో నేను వ్యాఖ్యానించేదేముంది? ఏమీ లేదు” అని తిరస్కరించాడు. గతంలో శ్రీలంక తమిళుల కోసం కరుణానిధి చేసిన నిరాహార దీక్ష కేవలం తమిళనాడు దృష్టిని తన కుటుంబ వ్యవహారాల్లో తలెత్తిన విభేధాలనుండి మరల్చడానికేనని అమెరికా రాయబారి వ్యాఖ్యానించినట్లుగా వీకీలీక్స్ ద్వారా వెల్లడి కావడం గమనార్హం.

వ్యాఖ్యానించండి