తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేస్తూ ఆ ప్రాంతంలో ఉద్యమాలు సాగుతున్నందున రాష్ట్రానికి రావలసిన పెట్టుబడులు వెనక్కి పోతున్నాయని గత సంవత్సరం నుండి ఆరోపణలు వస్తున్నాయి. నిరంతరం ఎదో ఒక ఆందోళన జరుగుతున్నందున రవాణా సౌకర్యం దెబ్బతిని కంపెనీల కార్యకలాపాలు దెబ్బతింటున్నాయని వార్తా సంస్ధలు కూడా రాస్తున్నాయి. వివిధ అంతర్జాతీయ సంస్ధల సిబ్బంది తమ తమ కార్యాలయాలకు చేరుకోవడంలో విఫలమవుతున్నందున నష్టం జరుగుతున్నదని అవి తెలుపుతున్నాయి. ముఖ్యంగా హైద్రాబాద్ బ్రాండ్ నేమ్ అంతర్జాతీయంగా మారుమోగుతున్న సందర్భంలో తెలంగాణ కోసం ఆందోళనలు అంతర్జాతీయ పెట్టుబడుదారులు ఇక్కడ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలన్నా, లేదా కొత్తగా కంపెనీలు పెట్టాలన్నా వెనకడుగు వేస్తుండడంతో సదరు బ్రాండ్ నేమ్ కి ఉన్న పలుకుబడి మెల్లగా క్షీణిస్తున్నదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఒక వేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అక్కడ ఏర్పడే ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు, అంతర్జాతీయ ప్రవేటు కంపెనీలకు అనుకూలంగా ఉంటుందో లేదోనన్న అనుమానాలను కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ డిమాండ్ పై ఆందోళనలు ఉధృతమైనప్పుడల్లా అంతర్జాతీయ వార్తా సంస్ధలు సదరు ఆందోళనలను తమ బులెటిన్ లలో క్రమం తప్పకుండా కవర్ చేస్తున్నాయి. ఆందోళన ఉధృతమైనప్పుడు ప్రత్యేక కధనాలు వెలువరిస్తున్నాయి. బిబిసి, రాయిటర్స్, ఎ.ఎఫ్.పి, ఐ.ఎ.ఎన్.ఎస్ తదితర అంతర్జాతీయ వార్తా సంస్ధలతో పాటు వాషింగ్టన్ పోస్ట్, వాల్‌స్ట్రీట్ జర్నల్, ది గార్డియన్ లాంటి వార్తా పత్రికలు కూడా తెలంగాణ ఉద్యమంపై వార్తలను ప్రచురిస్తున్నాయి. భారత దేశంలోని ఒక రాష్ట్రంలో, ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమాల పట్ల అంతర్జాతీయ వార్తా సంస్ధలు, పత్రికలు చూపుతున్న ఆసక్తి వెనక హైద్రాబాద్ నగర భవిష్యత్తు గురించిన ఆలోచనే ప్రధాన పాత్ర వహిస్తున్నదని మొట్టమొదట గుర్తించాలి. ప్రస్తుతం ఢిల్లీలో సాగుతున్న చర్చలు కూడా ప్రధానంగా హైద్రాబాద్ పైనే కేంద్రీకృతమై ఉన్నాయని పత్రికలు రాస్తున్నాయి.
భారత దేశంలో బెంగుళూరు తర్వాత హైద్రాబాద్ నగరం ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ రంగానికి ప్రఖ్యాతి పొందింది. మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఐ.టి సంస్ధలు హైద్రాబాద్‌లో తమ ప్రధాన కార్యాలయాలని ఏర్పాటు చేసుకున్నాయి. ఇన్ఫోసిస్, మహీంద్ర సత్యం, విప్రో లాంటి అంతర్జాతీయంగా ఖ్యాతి పొందిన భారతీయ ఐ.టి కంపెనీలకు కూడా హైద్రాబాద్ ప్రధాన స్ధావరంగా వెలుగుందుతోంది. అదీ కాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నగరం నిండా ఫ్లై ఓవర్లు, వెడల్పాటి రోడ్లు, పార్కులు, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు తదితర సౌకర్యాలు విస్తృతంగా అభివృద్ధి ఐనాయి. తద్వారా అంతర్జాతీయ స్ధాయి జీవన విధానానికి తగిన ఏర్పాట్లు హైద్రాబాద్ లో అభివృద్ధి చెందాయి. బిల్ గేట్స్ లాంటి ఐ.టి కుబేరులతో స్నేహ సంబంధాలు, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ లాంటి వారితో వేదిక పంచుకోవడం, ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు లకు నమ్మకమైన పాలకుడిగా మెలగడం ద్వారా చంద్రబాబు నాయుడు హైద్రాబాద్ బ్రాండ్ విలువను పెంచడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇవన్నీ అంతర్జాతీయ పెట్టుబడులదారుల దృష్టిలో పెట్టుబడుల గమ్యంగా హైద్రాబాద్ ఆకర్షించింది.
ఈ పరిస్ధితి కొనసాగుతుండగా అకస్మాత్తుగా ఊడిపడిన తెలంగాణ డిమాండ్ ప్రపంచ వ్యాపార వాణిజ్య సంస్ధలను ఒకింత ఆందోళనకు గురిచేసిందనే చెప్పాలి. తెలంగాణ డిమాండు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కొత్త కానప్పటికీ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు, ఎం.ఎన్.సి లకు, ఐ.టి పరిశ్రమకు తలవని తలంపుగా ఊడిపడిన పరిణామంగానే కనిపించింది. దీనిని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ని వ్యతిరేకించేవారు భూతద్దంలో పెట్టి చూపించడంతో అదో పెద్ద సమస్యలాగా ముందుకొచ్చింది. నిజానికి వివిధ రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ పెట్టుబడిదారులలోనూ, కంపెనీలలోను వార్తా సంస్ధలు చేసిన సర్వేలు తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌పై వారికి ఆందోళన లేదనీ, వారి ఆందోళన అంతా ఈ సమస్య ఎటూ తెగక కొనసాగుతుండడం పైనే అనీ భావిస్తున్నట్లు వెల్లడించాయి. గత సంవత్సరం టి.వి9 జరిపిన సర్వే తీసుకుంటే అందులో రియల్ ఎస్టేట్ సంస్ధలు, ఐ.టి సంస్ధల అధిపతులు వ్యక్తం చేసిన ఆందోళనంతా త్వరగా సమస్య కావడం లేదన్నదానిపైనే. అనిశ్చిత పరిస్ధితి వలన వ్యాపార నిర్ణయాలను కూడా అనిశ్చితిలో పడేస్తున్నాయని వారి ప్రధాన అభిప్రాయంగా వ్యక్తం అయ్యింది.
రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింటుందా అన్న ప్రశ్నకు ఆ రంగంలోని సంస్ధలు, వ్యాపారంలో లాభనష్టాలు వస్తూ పోతుంటాయనీ, హైద్రాబాద్‌లో కొంతమేరకు నష్టపోయినా సీమాంధ్ర రాష్ట్రానికి ఏర్పడే కొత్త రాజధాని వద్ద రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరిగి అభివృద్ధి చెందుతుందనీ, ఆ విధంగా మొత్తంగా చూసినపుడు తేడా ఉండదనీ అభిప్రాయం వ్యక్తం చేశాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో వ్యాపార సంస్ధల ఆందోళనవలన రియల్ ఎస్టేట్ డిమాండ్ కొంత తగ్గుముఖం పట్టినా, తర్వాత పుంజుకుంటుందనీ కాకుంటే త్వరగా అటో ఇటో పరిష్కారం కావడమే వ్యాపారాలకు అవసరమనీ వారు వివరించారు. విభజన జరిగితే కొన్ని నిర్ణయాలు, జరగకపోతే వాటికి భిన్నమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందనీ, కానీ ఎటూ తేలక ఆందోళనలు కొనసాగుతూ, ప్రభుత్వాలు ఏ నిర్ణయమూ తీసుకోకపోతే ఏ నిర్ణయమూ తీసుకోలేని పరిస్ధితి ఏర్పడుతున్నదనీ వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణ సమస్యకు పరిష్కారం అనిశ్చితిలో ఉన్నంతకాలం హైద్రాబాద్‌పై ఆధారపడిన వ్యాపారాలు, పెట్టుబడుల రాక కూడా అనిశ్చితిలో కొనసాగుతాయనీ, వేచి చూడడానికి తగిన సమయం లేనివారు, వేచి చూడ్డానికి ఇష్టపడనివారు తమ పెట్టుబడులను ఇతర ప్రాంతాలకు తరలిస్తారనీ, సమస్య పరిష్కారం ఐతే పెట్టుబడులు, వ్యాపారాల పరిస్ధితి మామూలు స్ధాయికి వస్తుందనీ వివిధ సంస్ధలు తెలిపాయి.
శ్రీకృష్ట కమిటీ పేర్కొన్నట్లుగా వార్తా పత్రికలు, వార్తా ఛానెళ్ళూ అత్యధికం తెలంగాణేతర ప్రాంతాల వారి ఆధీనంలో ఉన్నందువలన తెలంగాణ డిమాండ్ కు ప్రజలలో ఉన్నంత ఆదరణ వార్తా సంస్ధలలో ప్రతిఫలించడం లేదని చెప్పవచ్చు. అంతర్జాతీయ వార్తా సంస్ధలు గానీ, దేశీయ వార్తా సంస్ధలు గానీ వివిధ వార్తల కోసం పరస్పరం ఒకరిపై ఒకరు ఆధారపడతాయి. భారత దేశ వార్తల కోసం అంతర్జాతీయ వార్తా సంస్ధలు భారత దేశ వార్తా సంస్ధలపై ఆధారపడటం సహజం. అలాగే భారత సంస్ధలు అంతర్జాతీయ వార్తల కోసం ఆయా ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన అంతర్జాతీయ సంస్ధలపైన ఆధారపడతాయి. తమ విలేఖరులను కూడా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నియమించుకున్నప్పటికీ తమ సొంత ప్రాంతాలు దేశాల్లో నియమించుకున్నంత విస్తృతంగా సిబ్బందిని అవి నియమించవు. ఉదాహరణకు బిబిసి. ఎ.ఎఫ్.పి, రాయిటర్స్ లాంటి విదేశీ కార్పొరేట్ వార్తా సంస్ధలు ఇండియాలో ప్రధాన నగరాల్లో మాత్రమే ప్రతినిధులని నియమించుకుంటాయి. వారి దృష్టికి రాని వార్తలపైనా, లేదా తెలంగాణ లాంటి ప్రధాన ప్రజా సమస్యలపైనా ఇన్‌పుట్ కోసం అవి స్ధానిక సంస్ధలపైనె అధారపడతాయి. వార్తలవరకు కవర్ చేయగలిగినప్పటకీ, ఆ వార్తల నేపధ్యాలూ, లోతైన అంశాల కోసం స్ధానిక సంస్ధలపైనె ఆధారపడతాయి. ఈ కారణాల వలన తెలంగాణ లాంటి ముఖ్య సమస్యల విషయంలో ఆ సమస్యల నేపధ్యం, ప్రజాపునాది, విస్తరణ, మూలకారణాలు తదితర అంశాల కోసం స్ధానిక వార్తా సంస్ధలు, వ్యక్తుల విశ్లేషణను అవి స్వీకరిస్తాయి.
ఈ నేపధ్యంలో ఆంద్ర ప్రదేశ్ లో మెజారిటీ పత్రికలు ఛానెళ్ళూ సీమాంధ్ర వ్యాపారస్ధులు, పెట్టుబడుదారుల చేతిలో ఉన్నందున వారి విశ్లేషణలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రతికూలంగానె ప్రధానంగా ఉంటున్నాయి. వీరి వద్దనుండె ఇన్‌పుట్ తీసుకుంటున్న అంతర్జాతీయ వార్తా సంస్ధలు సైతం తమ విశ్లేషణలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగానే వ్యక్తం చేస్తున్నాయి. ఉదాహరణకి రాయిటర్స్ వార్తా సంస్ధ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అక్కడ అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు అంతర్జాతీయ పెట్టుబడులకు ప్రతికూలంగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. “కొత్త రాష్ట్రం వ్యాపారాలు ప్రాధామ్య అంశంగా పరిగణించకపోవచ్చని కొంతమంది పెట్టుబడిదారులు ఆందోళనలో ఉన్నారు. దానివలన హైద్రాబాదు బహుళజాతి సంస్ధలకు తక్కువ ఆకర్షణీయ గమ్యంగా మారుతుందని భావిస్తున్నారు. కొత్త రాష్ట్రం ఎలాంటి కార్మిక చట్టాలను, పన్నుల విధానాన్ని రూపిందించుకుంటుందోనన్న ఆందోళన కూడా వారు వ్యక్తం చేస్తున్నారు,” అని రాయిటర్స్ రాసింది.
తెలంగాణ డిమాండ్ కు మావోయిస్టు పార్టీ మద్దతు ప్రకటించడం, ఉద్యమంలో సైతం నగ్జలైట్లు ప్రవేశించారంటూ వార్తా కధనాలు ప్రచురితం కావడం, ఆ వార్తలు సీమాంధ్ర ధనిక పెట్టుబడిదారుల విశ్లేషణల్లో అధికంగా ప్రచారం పొందటంతో అవే విశ్లేషణలు అంతర్జాతీయ కార్పొరేట్ వార్తా సంస్ధలకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. అదీ కాక సామాజిక తెలంగాణ అంటూ కొద్దిమంది చేస్తున్న ప్రచారాన్ని కూడా సీమాంద్ర ధనికులు బాగా వినియోగించుకోగలిగారు. తెలంగాణ ఉద్యమం విజయవంతం కావడానికి ప్రజల మద్దతు అవసరం. అందువలన ప్రజల ప్రయోజనాలు పట్టని బూర్జువా, భూస్వామ్య పార్టీలు కూడా సామాజిక తెలంగాణకు మద్దతు ఇస్తున్నట్లు నటిస్తున్నాయి. అంతిమంగా ఇవన్నీ బైటినుండి చూసేవారికి తెలంగాణ వస్తే అది ప్రవేటు పెట్టుబడులకు ప్రతికూలం అనే ముద్ర పడేందుకు దోహదం చేస్తున్నాయి.
నిజానికి భారత దేశం అంతా అంతర్జాతీయ ప్రవేటు పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉంటే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉండదనే చెప్పాల్సి ఉంటుంది. తెలంగాణ వస్తే గిస్తే గనక అక్కడ మళ్ళీ ఈ కాంగ్రెస్, తెదేపా, బిజెపి, టి.ఆర్.ఎస్ లే ప్రధాన పార్టీలుగా ఉంటాయి. వీటిలో ఏదో ఒక పార్టీగానీ, లేదా పార్టీల కూటమిగానీ అధికారంలోకి వస్తుంది. ఈ పార్టీలు అంతర్జాతీయ పెట్టుబడులకు పూర్తి అనుకూలమనీ, అందుకోసం ప్రజలపైన పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించడానికి కూడా వెనకాడవనీ స్పష్తంగా అనేక సార్లు నిరూపించుకున్నాయి కూడా. ఎన్నికల సమయాల్లోనూ, ఉద్యమాల సమయాల్లోనూ ఈ రాజకీయ పార్టీలు వినిపించే ఆదర్శాలు, వాగ్దానాలు అధికారంలోకి వచ్చాక పూర్తిగా ఉల్లంఘిస్తాయని కూడా అనేక సార్లు రుజువైంది. ఇక సామాజిక తెలంగాణను ఇవి తెస్తాయంటే నమ్మడం వెర్రిబాగులతనం తప్ప మరొకటి కాదు.
టి.ఆర్.ఎస్ పార్టీలో ఉన్నవారంతా కాంగ్రెస్, టి.డి.పి, బి.జె.పి పార్టీలనుండి వలస వచ్చినవారే. ఆ పార్టీ వ్యవస్ధాపకుడే టి.డి.పిలో మాజీ ప్రముఖుడు. వీళ్ళ ప్రయోజనాలు ప్రజలకు అనుకూలంగా ఉండటమనేది కలలో మాట! టి.ఆర్.ఎస్ అధినాయకులు అధికారంలోకి రాకుండానే తెలంగాణ పేరు చెప్పి వసూళ్ళు చేసుకున్నవారే నన్నది బహిరంగ రహస్యం. వారు రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజానుకూల విధానాలను అనుసరించే ఛాన్సే లేదు. ఇతర విప్లవ పార్టీలేవైనా తెలంగాణ ఉద్యమంలో బలం పుంజుకుని అధికారంలోకి వచ్చే బలం సాధిస్తే తప్ప సామాజిక తెలంగాణ ఉత్తి వాగాడంబరంగానే మిగిలి పోతుంది. రాయిటర్స్ కధనంలోని మరో అభిప్రాయం చూస్తే “రియల్ ఎస్టేట్, మౌలిక సౌకర్యాల కల్పనా కంపెనీలు మొదలైన కంపెనీలన్నీ రాజకీయ సంబంధాలపై ఆధారపడి తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకున్నారు. తెలంగాణలో రాజకీయాలు మారినట్లయితే వీరి వ్యాపారాలు దెబ్బతింటాయని భయపడుతున్నారు” అని రాసింది. వ్యాపారాల అభివృద్ధి కోసం రాజకీయ సంబంధాలపైనే ఆధారపడ్డారన్న అభిప్రాయం నిజమే. అయితే కొత్తగా వచ్చే రాష్ట్రంలో కూడా ఇవే రాజకీయ పార్టీలు ఉంటాయి తప్ప కొత్త పార్టీలు ఉద్భవించే అవకాశాలేవీ లేవన్న సంగతిని ఇక్కడ విస్మరించినట్లు కనిపిస్తోంది.
పైన చెప్పినట్లు కాంగ్రెస్, టి.డి.పి, బి.జె.పి, టి.ఆర్.ఎస్, సి.పి.ఐ, సి.పి.ఎం పార్టీలు తప్ప మరేవైనా తెలంగాణలో అధికారంలోకి వస్తాయా అని ప్రశ్నించుకుంటే లేదనే సమాధానం వస్తుంది. భారత దేశంలో ఉన్న సాంప్రదాయక పార్టీలన్నీ కూడా, సోకాల్డ్ వామ పక్షాలతో సహా, ఇప్పటికే నూతన ఆర్ధిక విధానాల పట్ల, సరళీకరణ, ప్రవేటికరణ, ప్రపంచీకరణ విధానాల పట్లా తమ విధేయతను ప్రకటించుకున్నాయి. ఇక పెట్టుబడులకూ, వ్యాపారాలకు ప్రోత్సాహం దొరకనిదెక్కడ? కొత్తగా ప్రజానుకూల పార్టీ అధికారంలోకి వస్తే మంచిదే, కాని అందుకు అవకాశాలు ఈషణ్మాత్రమైనా కనిపించనపుడు ఆ విషయంపై ఊహాగానాలు చేయడం దేన్ని సూచిస్తుంది? అటువంటి ప్రచారం ఒకటి చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకులు సృష్టించడమే లక్ష్యంగా కనిపిస్తోంది తప్ప అవి వాస్తవాలు కాదనే సూచిస్తోంది. తెలంగాణ రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రానికి వేరే బడ్జెట్ ఉంటుంది. అక్కడి పాలకులు బడ్జెట్ కేటాయింపుల్లో సిమాంధ్ర పెట్టుబడిదారులకు బదులు తెలంగాణ పెట్టుబడుదారులకు ప్రాధాన్యత ఇస్తారు. ఇదే సీమాంద్ర పెట్టుబడుదారుల భయం తప్ప, అసలు పెట్టుబడిదారులకే ప్రతికూల వాతావరణం ఉంటుందనడం బూటకపు ప్రచారం.
అంతర్జాతీయ వార్తా సంస్ధలు ఇంకా కొన్ని ప్రాధమిక విషయాల్లో చాలా తప్పుడు దృక్పధాన్ని కలిగి ఉన్నాయి. రాయిటర్స్‌తో పాటు కొన్ని ఇతర అంతర్జాతీయ కార్పొరేట్ సంస్ధలు మరీ ఘోరమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. “తెలంగాణ రాష్ట్రానికి సొంతగా చాలా తక్కువ వనరులు ఉన్నందువలన పెట్టుబడులకు అనుకూలంగా ఉండాలన్నా, నిధూల కోసం కేంద్రంపై ఆధారపడకుండా ఉండాలన్నా అది తన ఆర్ధిక వ్యవస్ధను అంతర్జాతీయ పెట్టుబడుల కోసం తలుపులు బార్లా తెరిచి ఉంచక తప్పదు” అని రాయిటర్స్ రాసింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు నూతన ఆర్ధిక విధానాలు అనుసరించక తప్పదు అని ముందే కొత్త రాష్ట్రంలోని విధానాలను ప్రభావితం చేయడానికి రాయిటర్స్ చేస్తున్న ప్రయత్నం కనిపిస్తోంది. అయితే ఇక్కడ చర్చాంశం అది కాదు. “తెలంగాణ రాష్ట్రానికి చాలా తక్కువ వనరులు ఉన్నందువలన…” అన్న అవగాహనే ఇక్కడ చర్చాంశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రంలో వనరులు తక్కువగా ఉంటాయి అన్న అభిప్రాయానికి రాయిటర్స్ వార్తా సంస్ధ వచ్చేసిందని దీనిద్వారా స్పష్టమవుతోంది. కాని ఇందులో వాస్తవం ఉందా?
తెలంగాణ, సీమాంధ్రలుగా ఆంధ్రప్రదేశ్ విడిపోతే ఏ రాష్ట్రంలో ఎక్కువ వనరులు ఉంటాయి? తెలంగాణలో తక్కువగా ఉంటాయని రాయిటర్స్ అంటోంది. కాని వాస్తవానికి సీమాంధ్ర లోనే తక్కువ వనరులు ఉంటాయి. విస్తీర్ణం, జనాభా దృష్ట్యా సీమాంధ్ర ముందున్నా, వనరుల విషయంలో మాత్రం తెలంగాణే ముందుంటుంది. తెలంగాణలో వనరులు ఉన్నందువల్లనే సీమాంధ్ర పెట్టుబడిదారుల పెట్టుబడులనీ హైద్రాబాద్, దాని చుట్టూ ప్రధానంగానూ, ఇతర తెలంగాణ జిల్లాల్లో కూడా హైవేల పొడవునా కేంద్రీకృతమై ఉన్నాయి. సీమాంధ్రలోనే వనరులు ఎక్కువగా ఉన్నట్లయితే సీమాంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణకి, హైద్రాబాద్‌కీ వెళ్ళి పెట్టుబడులు పెట్టవలసిన అవసరమే వచ్చేది కాదు. రెవిన్యూ కోసం ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు జిల్లాల్లోని నీటి ప్రాజెక్టులను బ్రిటిష్ వాళ్ళూ నిర్మించడం వలన అక్కడ వ్యవసాయం అబివృద్ధి చెంది భూస్వాములు, పెత్తందారులు బాగా డబ్బు సంపాదించారు.
డబ్బు పోగుపడ్డాక అది లాభాలు ఎక్కడ వస్తాయా అని వెతుకుంది. సీమాంధ్రలో ఖనిజాలు, తదితర వనరులున్నట్లయితే వారు అక్కడే పెట్టుబడులు పెట్టే వారు. కాని ఖనిజ వనరులు తెలంగాణలో అధికంగా ఉన్నందున, అభివృద్ధి చెందిన హైద్రాబాద్ కూడా ఉన్నందున అక్కడికి వెళ్ళీ పెట్టుబడులు పెట్టి మరింతగా డబ్బు సంపాదించి శత, సహస్ర కోటీశ్వరులుగా మారారు. వారే పొగాకు, మిర్చి, వరి, పత్తి వ్యాపారాలన్నింటినీ వశం చేసుకున్నారు. ఆ వ్యాపారాల్లో వచ్చిన లాభాల్ని తెలంగాణలోని ఖనిజ వనరులపై ఆధారపడిన ఇతర పరిశ్రమలకు తరలించి మరింతగా పెట్టుబడిని పోగేసుకున్నారు. వారే ఇన్నాళ్ళూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తూ వచ్చారు. వారికే బ్యాంకుల అప్పుల్లో సింహభాగం, వారికే బడ్జెట్ కేటాయింపులు, వారే పరిశ్రమల అధిపతులు, వారే విదేశీ పరిశ్రమలకు భాగస్వాములు… ఇలా ఇప్పటివరకూ కొనసాగింది.
తెలంగాణ ప్రాంతం నుండి అభివృద్ధి చెందిన పెట్టుబడిదారులు చాలా తక్కువగా కనిపించడం అందరూ అంగీకరించే అంశం. నూతన ఆర్ధిక విధానాల ద్వారా గత పదిహేను, ఇరవై సంవత్సరాల్లో తెలంగాణనుండి ధనిక వర్గం అభివృద్ధి చెందడం ప్రారంభం అయింది. కానీ వీరు ఒక దశకు చేరుకున్నాక మరింత ధనికులుగా మారడానికీ, నూతన ఆర్ధిక విధానాల ఫలితాలను పూర్తిగా పొందడానికీ సీమాంద్ర పెట్టుబడిదారుల ఆధిపత్యం ఆటంకంగా పరిణమించింది. తెలంగాణ ప్రజా ప్రతినిధులుగా కూడా వీరే ఉండటం, బడ్జెట్ కేటాయింపుల్లో తమ వ్యాపారాలకు పెద్దగా అనుకూలత సాధించలేక పోవడంతో ప్రత్యేక రాష్ట్ర అవసరం గుర్తుకు వచ్చింది. తెలంగాణ సముద్ర మట్టానికి ఎత్తుగా ఉన్నందున నీటి పారుదల అభివృద్ధి చేయలేదు. ఎత్తిపోతల పధకాలు వచ్చేసరికి సీమాంధ్ర పెట్టుబడుదారుల అధిపత్యం స్ధిరపడినందున తెలంగాణలో అటువంటి ప్రాజెక్టులకు వారు మోకాలడ్డడం ప్రారంభించారు.
సీమాంధ్ర నీటి ప్రాజెక్టులవలన వ్యవసాయం అభివృద్ధి చెంది ధనికులు తయారవడంతో పాటు వారితో పాటు చిన్న చిన్న కమతాల వాళ్ళు కూడా లబ్ది పొంది మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతిగా అభివృద్ధి సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ పెట్టుబడిదారులు ఏర్పాటు చేసుకునే సౌకర్యాలు అనివార్యంగా అక్కడ ఉన్న ఇతర వర్గాల ప్రజానికానికి కూడా ఏదో మేరకు లబ్ది చేకూరుతుంది. కనీసం కొన్ని ప్రాంతాల్లోనైనా నీటి సౌకర్యం ఏర్పడడం, ఉద్యోగాల్లో సింహభాగం వశం కావడం తదితర చిన్న చిన్న అనుకూల మార్పులు సంభవిస్తాయి. తెలంగాణ పెట్టుబడిదారులతో పాటు తెలంగాణలోని ఇతర సెక్షన్లు కూడా లబ్ది పొందే అవకాశం ఉన్నందునే ప్రజల గురించి ఆలోచించే వారు కూడా తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇవ్వవలసిన అగత్యం ఏర్పడింది తప్ప తెలంగాణ ఏర్పాటుతోనే తెలంగాణ ప్రజలందరి సమస్యలు పరిష్కారం అవుతాయని కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ అక్కడ కూడా సామాన్య ప్రజల ప్రధాన సమస్యలు కొనసాగుతాయి. వాటి పరిష్కారం కోసం వారు ఆందోళనలు చేయక తప్పదు. ప్రభుత్వాలతో ఘర్షణ పడకా తప్పదు.
ఇక హైద్రాబాద్ అభివృద్ధి సాధించడం మావల్లనే, మేమే రాజధానిని అభివృద్ధి చేశాం అంటున్న వారి వాదన పూర్తిగా అర్ధ రహితం. పెట్టుబడుదారుల పెట్టుబడి, లాభాలు ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడికి పరుగులు పెడుతుంది. సీమాంధ్రలోనే అన్ని వనరులు ఉన్నట్లయితే వారి పెట్టుబడి కూడా అక్కడివరకే పరిమితమై ఉండేది. అక్కడి ప్రాంతాలే అబివృద్ధిని సాధించేవి. రాజధాని కాబట్టి దానిని అభివృద్ధి చెద్దాం అని ఎవరి పెట్టుబడీ భావించదు. అది పెట్టుబడి లక్షణం కానే కాదు. పెట్టుబడికి అభివృద్ధి, ప్రాంతం, జనం బాగోగులు ఇవేవీ పట్టవు. పట్టినట్టయితే సీమాంధ్రుల పెట్టుబడి తమ ప్రాంతంవారిని వదిలిపెట్టి తెలంగాణ వారిని ఉద్ధరించడానికి ఎందుకు వెళ్తుంది? తెలంగాణలో ఖనిజ వనరులు ఉండడం వలన, వారి పెట్టుబడి లాభాల కోసం తెలంగాణ వెళ్ళీంది. పెట్టుబడిదారులు వెళ్ళీనచోట ప్రభుత్వాలు రవాణా సౌకర్యాల్లాంటి మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేస్తాయి. పెట్టుబడిదారులే ప్రభుత్వాలను అందుకు పురమాయిస్తారు. అది అనివార్యమైన పరిణామం. డబ్బు, మరింత డబ్బుని లాభంగా సంపాదించడానికి చూస్తుంది తప్ప కలహండి, రాయలసీమ లాంటి దరిద్రం తాండవిస్తున్న చోటికి వెళ్ళి పరిశ్రమలు స్ధాపించి వారి దరిద్రాన్ని పారద్రోలడానికి కృషి చేస్తుందని చెప్పడానికి ప్రపంచం మొత్తం వెతికినా ఒక్కటంటే ఒక్క ఉదాహరణకూడా ఎవరూ చూపలేరు.
ఈ వాస్తవాలను ప్రధాన వార్తా పత్రికలు, ఛానెళ్ళూ విస్మరించడంతో వారితో సమీప సంబంధాలు ఏర్పరుచుకున్న విదేశీ పెట్టుబడి వార్తా సంస్ధలు సైతం అదే విస్మరణలో ఉన్నాయి. దానితో అవి కూడా సీమాంధ్ర పెట్టుబడిదారుల అభిప్రాయాలను, విశ్లేషణలనే అంతిమంగా స్వీకరిస్తున్నాయి. ప్రస్తుత పరిస్ధితి ఇక వెనక్కి వెళ్ళలేని స్ధితికి చేరుకుందన్నది నిర్వివాదాంశం. అణచివేతకు గురైనవారు ఎప్పుడో ఒకప్పుడు ఉద్యమబాట పడతారు. అలాగే ఇన్నాళ్ళూ విస్మరనకు గురైనందునే తెలంగాణ ఉద్యమం ఇన్నాళ్ళూ మనగలిగిందని గ్రహించాల్సిన అవసరం ఉంది. సీమాంధ్ర రాష్ట్రం ఏర్పడినట్లయితే మరొక కొత్త ప్రాంతం రాజధానిగా అభివృద్ధి చెందే అవకాశం వస్తుంది. హైద్రాబాద్ వద్దనే కేంద్రీకృతమైన అభివృద్ధి వికేంద్రీకరణ చెందే అమూల్యమైన అవకాశం ఉంది. ఇది సీమాంధ్ర ప్రజలకు పూర్తిగా అనుకూలంగా ఉండే అంశం. సీమాంద్ర పెట్టుబడిదారులు బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన విషయాల్లో నష్టపోవచ్చు గానీ సీమాంధ్ర ప్రజలకు ఏ నష్టమూ లేకపోగా సీమాంధ్ర ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం వస్తుంది. కనుక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీమాంధ్ర ప్రజలు ఆహ్వానించాలి. సీమాంధ్ర పెట్టుబడిదారుల నష్టాలను నెత్తిన వేసుకోవడాన్ని కట్టిపెట్టాలి. ఎడతెగని సమస్యకు సీమాంధ్ర ప్రజల సానుకూలత ఖచ్చితంగా పరిష్కారం చూపెడుతుంది.

హైదరాబాద్ రాజధాని కాబట్టే, తెలుగు సమాజం లో ని క్రీమీ లేయర్ అక్కడికి చేరుకుంది. ఈ మానవ వనరుల వలననే ప్రభుత్వాలు పెట్టుబడులను ఆకర్షించాయి. తెలంగాణా ఖనిజ వనరుల వలన ఆంధ్ర పెట్టుబడి దారులు ఎంత బాగుపడ్డరో సంఖ్యలతో సహా చెబితే బాగుండేది. ఖనిజ వనరులు సీమ లోనూ, కొన్ని కోస్తా జిల్లాలలోనూ కూడా బాగానే ఉన్నాయి.
పెట్టుబడి అంటేనే, దోపిడీ..ఈ దోపిడీ కి బై ప్రొడక్ట్ గా కొన్ని ఉద్యోగాలు వస్తాయి. పెట్టుబడి దారులలో మీ పెట్టుబడిదారులూ, మా పెట్టుబడిదారులు ఉండరు. మీ/మా మన మనసులోనే ఉంటుంది. తెలంగాన పెట్టుబడి దారులు తెలంగాణ ను ఉధ్ధరించాలి అనుకోరు.
పెట్టుబడి దారులు కూడా ప్రజలే. తెలంగాన పెట్టుబడి దారులు తెలంగాన వారి కి ముద్దైతే ఆంధ్ర పెట్టుబడిదారులు ఆంధ్ర వారికి ముద్దు. మామూలు జనాలలోనె కొంతమంది సంపాదించి పెట్టుబడిదారులౌతారు. కాబట్టీ ఆంధ్ర పెట్టుబడి దారులను ఆంధ్ర ప్రజలనుంచీ వేరు గా చూడనవసరం లేదు. ఆంధ్ర పెట్టుబడి దారులకు మీరు వ్యతిరేకమైతే ఆంధ్ర ప్రజలకు కూడా వ్యతిరేకమే! అలానే ఆంధ్ర రాజకీయ నాయకులను కూడా ఆంధ్ర ప్రజలు వోట్లు వేసి గెలిపించుకొన్నారు. ఆంధ్ర పాలకులను తిట్టినట్లైతే మొత్తం ఆంధ్ర ప్రజలను తిట్టినట్లే!
సమైక్యాంధ్ర నినాదం ఏ కొందరు పెట్టుబడిదారుల వలనో వచ్చిందనుకొంటే మీరు ఊహలలో బతుకుతున్నారు. దిసెంబర్ తొమ్మిది ప్రకటన తరువాత, ఆంధ్ర లో ఆటో వారి నుంచీ, కూలి వారినుంచీ అన్ని వర్గాలప్రజలూ ఈ ఉద్యమం లో పాల్గొన్నారు. దీనికి ముఖ్య కారణం, ఆంధ్ర ప్రజలకు కొత్తగా హైదరాబాద్ తో ఏర్పడిన అనుబంధం. దాదాపు ప్రతి కుటుంబం నుంచీ ఒకరన్నా హైదరాబాద్ లో ఉంటున్నారు. అలాంటి హైదరాబాద్ ని కోల్పోవటం అనే దానికి ప్రతిస్పందన గా ఉద్యమం జరిగింది..మళ్ళీ జరుగుతుంది.
“ఎడతెగని సమస్యకు సీమాంధ్ర ప్రజల సానుకూలత ఖచ్చితంగా పరిష్కారం చూపెడుతుంది.”
పెట్టుబడిదారులూ, నాయకులూ కూడా ప్రజలలో భాగమే! నాయకులు ప్రజల ప్రతినిధులు. వారిని మీరు దోపిడీ దారులూ, దొంగలూ అని ఉద్యమం మొదలుపెట్టారు. ఇప్పుడు వారి సానుకూలత మీకు ఎందుకు కావలసి వచ్చింది?
ఆంధ్ర పెట్టుబదీ దారులు పెట్టిన అనేక కంపెనీ ల లో తెలంగాణ వారు మంచి స్థాయి లో ఉద్యోగలు చేస్తుండటం నాకు తెలుసు. ప్రైవేట్ సెక్టార్ లో టాలెంట్ ఉన్నవాడిని కుల మతాలకు అతీతం గా ఆదరిస్తారనే విషయం తెలిసినదే! ఈ ఆదరించటం మన మీద ప్రేమ తో కాక, వారి లాభాలమీది ఆసక్తి తో! సత్యం కంప్యూటర్స్, రెడ్డీ లాబ్స్ వంటి వాటిలో ఉన్న తెలంగాన ఉద్యోగుల సంఖ్య తక్కువేమీ కాదు.
ఆంధ్ర పెట్టుబదీ దారులు పెట్టిన అనేక కంపెనీ ల లో తెలంగాణ వారు మంచి స్థాయి లో ఉద్యోగలు చేస్తుండటం నాకు తెలుసు. ప్రైవేట్ సెక్టార్ లో టాలెంట్ ఉన్నవాడిని కుల మతాలకు అతీతం గా ఆదరిస్తారనే విషయం తెలిసినదే! ఈ ఆదరించటం మన మీద ప్రేమ తో కాక, వారి లాభాలమీది ఆసక్తి తో! సత్యం కంప్యూటర్స్, రెడ్డీ లాబ్స్ వంటి వాటిలో ఉన్న తెలంగాన ఉద్యోగుల సంఖ్య తక్కువేమీ కాదు.
బొందలపాటి గారూ, నేరుగా మీ అభిప్రాయం చెప్పినందుకు అభినందనీయులు.
ఓం ప్రధమం, మీరు తెలుసుకోవలసింది నేను తెలంగాణవాడిని కాదు, ఆంధ్ర వాడినే.
తెలుగు సమాజం క్రీమీ లేయర్ అంతా హైద్రాబాద్ చేరుకుందనీ, ప్రతీ కుటుంబనుండి ఒకరు హైద్రాబాద్ లో ఉన్నారనీ మీ అభిప్రాయం సరైంది కాదని నా అభిప్రాయం. మీరీ అంచనాకి ఎలా రాగలిగారు? ఎందుకంటే మా గ్రామంలోని (తాడికొండ, గుంటూరు) మూడు వేల కుటుంబాలు గల ఒక పేటలో తొంభై తొమ్మిది శాతం ఎవర్నీ హైద్రాబాద్ పంపలేదు. కనీసం నలభై కి.మీ దూరంలో గల విజయవాడకి కూడా వారు వెళ్లలేదు. వారంత కూలి నాలి జనం. తలా ఒక ఎకరం, అరెకరం పొలం ఉన్నా, వంద సంవత్సరాలకు పైగా సాగు చేస్తున్నా, సాగర్ కాలవ పక్కనే పారుతున్నా, అగ్ర కులాల వారికి కూలీలు లేకుండా పోతారన్న ఒకే ఒక్క కారణంతో తమ భూములకి పట్టాలు పొందలేని జనం. భారత దేశంలోని ఏ ఊళ్ళోనైనా వీళ్ళే ఎక్కువ. అణవివేతకు గురవుతున్న వివిధ కులాల కింద ఉన్న వీరు నగరాలకి చేరుకున్నా అక్కడా కూలీలుగానో, కార్మికులు గానో బతకాల్సిందే. మా తమ్ముడు హైద్రాబాద్ లో పదేళ్ళు బతికి నెలకు నాలుగువేల కంటే ఎక్కువ సంపాదించలేక గ్రామానికి తిరిగొచ్చి ఆ కూలి పని గ్రామంలోనే చేసుకుంటున్నాడు.
మీ వ్యాఖ్యలో ఒక వైరుధ్యాన్ని గమనించారా? పెట్టుబడి అంటేనే దోపిడి అని కరెక్టుగా రాశారు. కాని తెలంగాణ పెట్టుబడిదారులు తెలంగాణవారికి, ఆంధ్ర పెట్టుబడిదారులు ఆంధ్ర వారికి ముద్దు అని జనరలైజ్ చేశారు. దోపిడిదారులని గుర్తించాక వారు ప్రజల్లో ఒకరిగా పరిగణింపబడటానికి అర్హులేనా? వాళ్ళు తమ ప్రయోజనాల కోసం అనేక మందిని దోపిడీ చేస్తున్నపుడు, అంటే వారు దోపిడీ చేస్తున్న వారి ప్రయోజనాలు, వారి ప్రయోజనాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని అర్ధం అయ్యాక దోపిడీ పీడితులనీ, దోపిడి చేసే వారిని ‘అందరూ ప్రజలే”నని ఒకే గాటన కట్టడం సబబేనా?
“మామూలు జనంలోనే కొంతమంది ఎక్కువ సంపాదించి పెట్టుబడుదారులు అవుతారు” అనడం కరెక్టయితే మిగతావారి కంటే వారెక్కువ ఎలా సంపాదిస్తారు? అది అందరికీ అందుబాటులో ఉంటే మిగతా వారి ఎక్కువ ఎందుకు సంపాదించలేకపోతారు? పెట్టుబడిదారులు అనడం అంటే వారి వద్ద తమ అవసరాలన్నీ తీర్చుకున్నాక ఇంకా పెట్టుబడి పెట్టగల డబ్బు మిగిలిందని అర్ధం. పెట్టుబడి పెట్టగల డబ్బంటే అది కోట్లలోనే ఉంటుంది. లక్షల మిగులు పెట్టుబడిగా పనికి రాదు. అది చిన్న షాపులు పెట్టుకుని కుటుంబ అవసరాలు గడుపుకోవడానికి పనికోస్తుందేమో గాని పెట్టుబడి అని పిలవడానికి సరిపోయిన మొత్తం కాదు. ఈ రోజుల్లో కొన్ని కోట్లు కూడా సరిపోదన్నది పక్కన బెడదాం.
చిన్న షాపులవారు కూడా పెట్టుబడి అనే అంటారు. ఆ పెట్టుబడి గురించి కాకుండా, ఆంధ్ర, తెలంగాణ పెట్టుబడిదారులు అని సంభోధించగల పెట్టుబడి గురించి ఇక్కడ ప్రస్తావించుకుంటున్నామని గమనించగలరు.
ఆంధ్ర, తెలంగాణ అనే కాదు. ఈ దేశంలో పెట్టుబడిదారులంతా ఒకే వర్గం. ఎందుకంటే వారు ఏ ప్రాంతంలో ఉన్నా వారి ప్రయోజనాలు ఒక్కటే ప్రభుత్వాలు అనుసరించే విధానాల ద్వారా లబ్ది పొందుతున్నది వీరే. మీరన్నట్లు బై ప్రొడక్టుగా వచ్చే ఉద్యోగాలు ఇతరులు పొందుతున్నారు. ఎగువ మధ్య తరగతి నుండి కూలీల వరకూ వీరు ఎంతో కొంత పెట్టుబడి దారుల శ్రమదోపిడీకి గురవుతున్నారు. అందువలన శ్రమ చేస్తున్న వారంతా వారి ఉమ్మడి ప్రయోజనాల రీత్యా ఒకే వర్గం. వీరి కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా విధానాలు రూపొందించరు. రూపొందిస్తే అవి వారికి వ్యతిరేకంగా వారి శ్రమల్ని పెట్టుబడిదారులు కొల్లగొట్టే విధానాల్నే రూపొందిస్తాయి. ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఇదే తంతు.
రేపు తెలంగాణ వచ్చినా ఇదే తంతు. అదే నా పోస్ట్ లో కూడా రాశాను. తెలంగాణ ఒక రాష్ట్రం గా ఉండటం, తెలుగు ఎ.పి గా ఏర్పడకముందు తెలంగాణ ప్రాంత ప్రయోజనాల రక్షణ కోసం కొన్ని ఒప్పందాలు కుదుర్చుకోవడం ఒక వాస్తవం. వాటిని అమలు చేయలేదన్నది కూడా వాస్తవమే. ఇలా కొన్ని కారణాల వలన, భాషలో ఉన్న కొన్ని తేడాల వలన, రెండొందలేళ్ళూ ఉర్దూ ఆధిపత్యంలో జీవించి తెలుగూ-ఉర్దూల సమ్మిళిత భాష యాసగా ఏర్పడి ఆ విధంగా భాషలో తేడాలు రావడం వలనా తెలంగాణ ప్రాంతం వారికి ఒక ప్రత్యేక అస్తిత్వం ఏర్పడింది. అంతే కాక స్వాతంత్ర్యం రాకముందు రెండొందలేళ్ళు ముస్లిం పాలనలో ప్రత్యేక దేశంగా ఉన్న ప్రాంతం అది. నా ఆర్టికల్ లో రాసినట్లు ఆర్ధిక అభివృద్ధిలో కూడా తేడాలుండటంతో కలిశాక కూడా ఏకీభావం రావడానికి అవన్నీ అడ్డంగా పనిచేశాయి. రెండొందలేళ్ళు వేరువేరుగా ఉన్న స్ధితి, తద్వారా తలెత్తిన సంస్కృతీ తేడాలు, ఆర్ధిక వృద్ధిలొ తేడాలు ఇవన్నీ తెలంగాణ వారిని వేరుగా నిలిపాయి. ఇది జీవన విధానంలోనే సంభవించిన తేడా. వివిధ తెగలు, జాతులు మధ్య తేడాల్లో జీవన విధానం, సంస్కృతి, భాష ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిల్లోనే తెలంగాణ, ఇతర ఎ.పి లో తేడాలొచ్చినందున ఆ వేరుతనం అలా నిలబడింది.
ఎ.పిగా కలిశాక, ఒప్పందాలను అమలు చేయడంలో శ్రద్ధ చూపినట్లయితే తేడాలు అంతా కాకున్నా, కొంతయినా సమసిపోయి ఉండేవి. అలా జరగలేదు. చెన్నారెడ్డి ఉద్యమం తర్వాతైనా జాగ్రత్త పడి ఉన్నట్లయితే కొంత కృషి జరిగినట్లయితే తేడాలన్ని పోకపోయినా, ఆ క్రమం మొదలై ఉండేది. అది చూపించి ఇంకా కృషి కొనసాగనివ్వండి అని చెప్పగల అవకాశం దొరికేది. కాని జరగలేదు. తెలంగాణలో నీటి పారుదల అభివృద్ధి కాలేదు. అది బాగా ప్రభావితం చేసిన తేడా. ఎత్తులో ఉందని చెప్పి వాయిదా వేశారు గానీ ఎత్తిపోతల ప్రాచుర్యంలోకి వచ్చాకయినా శ్రద్ధ చూపలేదు. సీమాంధ్రలో గోదావరి, కృష్ణలపై కట్టిన ప్రాజెక్టూలతో పోటీ చేసేవి తెలంగాణలో లేవు. శ్రీశైలం కూడా సగం ఆంధ్రం ప్రయోజనాలనే నెరవేరుస్తుంది. కొత్తగా కట్టనున్న పోలవరం గోదావరి ఎక్కువగా ప్రవహించే తెలంగాణకు కాకుండా తక్కువ ప్రవహించే కోస్తాంధ్ర ప్రయొజనాలు నెరవేర్చడానికే ఊపయోగపడుతుంది. కోస్తాంధ్ర వెంట హైడ్రో కార్బన్ పరిశ్రమలతో వాన్-పిక్ అనే కోస్తా కారిడార్ నిర్మించి దానికి నీటి సరఫరా కోసం పోలవరం రూపొందించారు. దాని వలన తెలంగాణకి ప్రయోజనం జరగదు. ప్రయోజనం జరిగే ప్రాజెక్టులు ఎ.పి ప్రభుత్వ దృష్టిలో లేవు. ఉన్నాయని చెప్పినా వాటికి నిధులు ఇవ్వడం లేదు. ఇవన్నీ తెలంగాణ వారికి మరింత అపనమ్మకం కలగడానికే దారి తీస్తున్నాయి.
పెట్టుబడిదారుల ప్రయోజనాలన్ని ఒకటే అయినా వారిలో కూడా అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి గ్రూపులు ఏర్పడతాయి. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమానికి ప్రధానంగా నాయకత్వం వహిస్తున్నది తెలంగాణ పెట్టుబడిదారులే. వీరు అవకాశాలు రాక నిజాం పాలనలో ఉండటం వలన బ్రిటిష్ కాలంలో ఆంధ్ర పెట్టుబడీదారుల్లా అభివృద్ధి చెందలేకపోయారు. ఇది అందరూ అంగీకరిస్తున్న వాస్తవం. తెలంగాణ సామాజిక ఆర్ధిక చరిత్రే దానికి సాక్ష్యం. స్వతంత్రం వచ్చాక అప్పటికే ఆంధ్ర పెట్టుబడిదారులు (ఆంధ్ర పెట్టుబడిదారులంటే ప్రత్యేకంగా ప్రస్తావించడం కాదిక్కడ. ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ వారి ప్రయోజనాల కోసం నిర్మించిన నీటి ప్రాజెక్టుల వలన అక్కడ ఉన్న భూస్వాములు లాంటి పెత్తందారులు సంపన్నులయ్యారు. బ్రిటిష్ వాడి విధానల ఫలితం అది. అలా సంపన్నులయిన భూస్వాములే పెట్టుబడిదారులుగా రూపాంతరం చెందారు.) బ్రిటిష్ వాడు వచ్చి ఇండియాలో ఉన్న భూస్వామ్య వ్యవస్ధని అలానే ఉంచి తన ప్రయోజనాల కోసం పైపైన కొన్ని మార్పులు చేశాడు. అలా భూస్వామ్య వ్యవస్ధ ప్రధానంగా అలానే కొనసాగి భూస్వాములు తమ సంపదని పట్నాల్లో పెట్టుబడిగా పెట్టి పెట్టుబడిదారులుగా కూడా వ్యవరించగలిగారు. ఇప్పటికీ దాదాపు ఎ.పి అంతా అదే పరిస్ధితి కొనసాగడం గమనించొచ్చు. పై పై మార్పులు మాత్రమే కాక ప్రజల మద్య ఉత్పత్తి సంబంధాలు ఎలా మారాయి, ఉత్పత్తి సాధనాలైన భూమి, పరిశ్రమలపైన ఎవరి ఆధిపత్యం ఉన్నదీ ఇవన్నీ లోతుగా పరిశీలిస్తే సమాజంలో జరిగిన మార్పులపై సరైన అవగాహనకి రాగలుగుతాం.
తెలంగాణ నిజాం భూస్వామ్య పాలనలో ఉండటం వలన, అంద్ర ప్రాంతంలో భూస్వాములు, పెట్టుబడుదారులుగా అభివృద్ధి చెందిన పరిణామం తెలంగాణలో జరగడానికి అవకాశం రాలేదు. వారు ఎంతో కొంత అభివృద్ధి చెందేనాటికి ఇతర ప్రాంతాల్లోని పెట్టుబడిదారులు భూస్వాములు అప్పటికే ఎ.పి ప్రభుత్వ వ్యవస్ధలో పలుకుబడి సంపాదించారు. పలుకుబడి అంటే… రాజకీయ పార్టీలకి వారే ఆధారం. రాజకీయ పార్టీలు వారి నిధులు అందుకుని ఆ డబ్బు ఖర్చు చేసి అధికారంలోకి వచ్చాక వారి ప్రయోజనాల కోసమే విధానాలు రూపొందిస్తాయి. గ్రామాలు ఎక్కువగా ఉన్న ఇండియాలో భూస్వాములు కూడా రాజకీయ పార్టీలకి ఫైనాన్సింగ్ అందించారు. సో, ప్రభుత్వాలు భూస్వాములకీ, పెట్టుబడిదారులకీ అనుకూల విధానలనే ప్రధానంగా రూపొందిస్తాయి. ప్రభుత్వంలో నాయకులుగా మెలిగే వారు కూడా భూస్వాములూ, పెట్టుబడుదారులే. వారు తమ వర్గం వారికి కాక ఎవరికి అనుకూలంగా ఉంటారు? ఆ విధంగా ప్రభుత్వంలోని అన్ని ప్రధాన అంగాల్లోన పలుకుబడి సంపాదించిన వాళ్ళు కొత్తగా పెట్టుబడుదారులను అభివృద్ధి కానివ్వరు. ఎందుకంటే వారు అభివృద్ధి ఐతే తమ వ్యాపారాలకే పోటీకి వస్తారు. ఎ.పి బడ్జెట్ లో వాళ్ళు వాటా కోసం ప్రయత్నిస్తారు. అంటే అప్పటికే ఉన్నవారు ప్రభుత్వం నుండి తమకు అందే బడ్జెట్ సపోర్ట్ లో కొంత కోల్పోవలసి వస్తుంది. కనుక సహజంగానే కొత్తవారిని వారు అడ్డు కుంటారు.
ఇక్కడ ఏమైంది చూడండి. అప్పటికే అభివృద్ధి చెంది పలుకుబడి పొందిన పెట్టుబడుదారుల్లో దాదాపు అంతా సీమాంధ్ర వారే ఉన్నారు. బ్రిటిస్ పాలనలో అందిన కొన్ని ఫలితాలు ఆ ప్రాంతం వారికి అలా కలిసి వచ్చినందున వారు ముందు వరసలో ఉండగలిగారు. దానితోపాటు కొత్తగా పెట్టుబడిదారులుగా ముందుకు వస్తున్నవారు కొత్తగా అవకాశాలు అంది పుచ్చుకున్న తెలంగాణ వారే అధికంగా ఉన్నారు. ఇప్పటికే అభివృద్ధి సాధించిన వారు, సీమాంధ్ర నుండి కొత్తగా అభివృద్ధి చెందుతున్నవారిని కూడా అడ్డుకుంటారని ఇక్కడ ముఖ్యంగా గమనించాలి. వారికి ప్రాంతాల తేడాలు ఉండవు. కానీ కొత్తగా అభివృద్ధి చెందిన పెట్టుబడుదారులు అధికంగా తెలంగాణ వారు కావడంతో, వారి ఎదుగుదలకు అడ్డుపడుతున్న వారు ప్రధానంగా సీమాంధ్ర వారు కావడంతో ఈ ప్రాంతీయ తేడాను తెలంగాణ వారు వినియోగించదలిచారు. నేనిక్కడ చెప్పదలుచుకున్నదేమంటే తెలంగాణ పెట్టుబడిదారులు కొత్తగా అభివృద్ధి చెందుతూ, తమ అభివృద్ధికి ఆటంకంగా కనిపిస్తున్న ఇతర ప్రాంతాల పెట్టుబడిదారుల అడ్డు తొలగించుకోవడానికి ప్రాంతీయ తేడాలను వినియోగించుకోదలిచారు. అంటే ఇక్కడ ప్రాంతాల వెనుకబాటుతనమే ప్రధానం కాదు. ప్రధానమైనది కొత్తగా అభివృద్ధిలోకి వస్తున్న పెట్టుబడుదారులకు ఎదురవుతున్న ఆటంకాలు ప్రధానం. ఆ ఆటంకాలను తొలగించడానికి వాళ్ళు ప్రాంతీయ విభేధాలను ఉపయోగించుకుంటున్నారు. ఆవిధంగా తెలంగాణ సమస్య ముందుకొచ్చింది. తెలంగాణ కేవలం ప్రజల సమస్యే అయితే దానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల మద్దతు ఉండేది కాదు. ఆ సమస్య తమ అభివృద్ధికి కూడా ఆటంకంగా ఉంటూ, తమ ఆటంకాలు తోలగడానికి ఒక గొప్ప మార్గంగా కనిపిస్తున్నందున దాన్లోకి వారు కూడా దుమికి తమ చేతుల్లోకి తీసుకున్నారు.
అయితే సంస్కృతి తేడాలు, నిజాం పాలన వలన ఏర్పడిన వెనుకబాటుతనం, భాషలో కొంత తేడా… ఇవన్నీ తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా తెలంగాణ రాష్ట్రం ఒక సమస్యగా మారింది. పెట్టుబడిదారి వర్గాలు ప్రచారం ఏమని చేస్తున్నాయి? తెలంగాణ వస్తే కంపెనీల్లో ఉద్యోగాలన్నీ మనవే అని. రాజధానిలో ఉద్యోగాలన్ని మనవే అని. ఆ ప్రచారం పూర్తి వాస్తవం కాదు. వారు తమ ప్రయోజనాలయిన ప్రత్యేక బడ్జెట్, ఆ బడ్జెట్ లో కేవలం తెలంగాణ సంపన్నులు మాత్రమే (సీమాంధ్ర సంపన్నుల బెడద లేకుండా) సింహ భాగం కొట్టేయగల అవకాశాలు మొదలైనవి మాత్రమే వారికి అనుకూలమైనవి. వాటి బైప్రొడక్టయిన ఉద్యోగాలు కూడా తెలంగాణ పెట్టుబదిదారుల చేతుల్లో ఉంటాయి గనక మేము తెలంగాణోళ్ళకే ఉద్యోగాలిస్తామని హామీ ఇస్తున్నారు. అందులో నిజమెంతో ఆచరణే చెప్పాలి. కానీ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక అక్కడి పెట్టుబడుదారుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేసే ఏర్పాట్లలో అక్కడి ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారు. అది అనివార్యం. ప్రధాన ఉత్పత్తిని తీసేటప్పుడు ఉప ఉత్పత్తులను మనం ఆపాలనుకున్నా ఆపలేము. ఆ విధంగా తెలంగాణ ప్రజలకు లబ్ది చేకూరుతుంది. తెలంగాణ రావడంవలన ప్రజల ప్రధాన సమస్యలేవీ పరిష్కారం కావని అవగాహన ఉండి, ఆ విధంగా వాదిస్తున్నవారు కూడా తెలంగాణ కు మద్దతు ఇవ్వడానికి ప్రధాన కారణం ఇదే.
అంతర్జాతీయ కంపెనీలు (స్వదేశీ, విదేశీ రెండూ) ఎలాగూ అన్ని ప్రాంతాలవారిని ఆదరిస్తాయి, వారి అవసరాన్ని బట్టి. కనుక తెలంగాణలో ఉద్యోగాలు దొరకవు అదొస్తే, అని సీమాంధ్రులు భావించడంలో వాస్తవం లేదు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో సంపన్న పెట్టుబడిదారులకు కాంట్రాక్టులు, బడ్జెట్ కేటాయింపులు, తమ కంపెనీలకి విద్యుత్, నీరు, రోడ్లు తదితర మౌలిక సొకర్యాలు తదితరాలు లభిస్తాయి. తెలంగాణ ప్రజలకు నీటి సౌకర్యాలు, స్ధానిక కోటాలో లభించే ఉద్యోగాలు, తెలంగాణ ఉద్యమ ఫలితంగా ప్రాంతీయ అభిమానంతో వచ్చే ఉద్యోగాలు, బడ్జెట్ కేటాయింపుల్లో అతి తక్కువ భాగం, ఉద్యమ నేపధ్యంలో పజా ప్రతినిధుల్ని డిమాండ్ చేయగల అవకాశం ఇవన్నీ లభిస్తాయి. కానీ ఇరు వైపులా సామాన్యప్రజానికి మౌలిక సమస్యలైన కూడు, గుడ్డ, నీడ అలానే కొనసాగుతాయి.
పోతే ఓట్లు వేసి గెలిపించుకుంటే వారు నిజంగా ప్రజల కోసం పనిచేస్తున్నారా? అసలు ప్రజా ప్రతినిధులు నిజంగా ప్రజాభిమానంతో గెలుస్తున్నవారెందరు? డబ్బులివ్వకుండా, తాగబోయకుండా, కులాల వారీగా ప్రభావితం చేయకుండా, రిగ్గింగ్ చేయకుండా ఒక్క ప్రజాప్రతినిధి ఐనా గెలుస్తాడంటారా? గెలిచిన వాడెవడైనా ఎన్నికల్లొ ఖర్చు చేసినదానికి అనేక రెట్లు సంపాదించకుండా ఉంటున్నారా? రాజకీయ పదవి అనేది ఈరోజుల్లో అక్రమ సంపాదనకు దగ్గరి మార్గం అందుకే పోటీ చేస్తున్నారు. గెలవడానికి ఏదైనా ఛేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రజా ప్రతినిధులని తమవారుగా సొంతం చేసుకోగల పరిస్ధితి ఇప్పుడు లేదు. గెలిచినవారు కేవలం పెట్టుబడిదారులు, భూస్వాముల కోసమే పని చేస్తున్నపుడు వారిక ప్రజల ప్రతినిధులుగా మిగలరు. ప్రజల్లో ఉన్న అనేక బలహీనతలు, వెనుకబాటుతనం, నిరక్షరాస్యత, కుల భావనలు ఇవన్నీ వారికి ఉపయోగపడుతున్నాయి తప్ప ప్రజలకు నష్టకరంగానే ఉన్నాయి.
తెలంగాణలో హైవేల వెంటా, హైద్రాబాద్ లోనూ, దాని చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలలో అత్యధిక భాగం ఆంధ్రవారివే. ఇది నేను కొత్తగా చెబుతున్నది కాదు. ఆంధ్ర పెట్టుబడుదారులు కూడా చెబుతున్నదే. “మా పెట్టుబడులన్నింటినీ హైద్రాబాద్, చాని చుట్టుపక్కలా పెట్టి తెలంగాణను అభివృద్ధి చేశాము. ఇప్పుడు పొమ్మంటే ఎలా? మేము చేసిన అభివృద్ధి అంతా మీకె చెందాలా? మేము కష్టపడి, రాజధాని అని హైద్రాబాద్ ని అభివృద్ధి చేస్తె ఇప్పుడు వెళ్ళమంటారా?” అడుగుతున్నదెవరు? గుంటూరు, గోదావరి జిల్లాల సంపన్నులే. వారే సీమాంద్ర తరపున ప్రతినిధులుగా మాట్లాడుతున్నారు. అవేవీ మీ దృష్టిని ఆకర్షించలేదా, బొందలపాటిగారూ? వారు చెబుతున్నది వాస్తవం. హైద్రాబాద్ చుట్టుపక్కల, లోపల, హైవేల వెంటా ఉన్న పెట్టుబడులన్నీ వారివే. తెలంగాణ ప్రాంతమే అభివృద్ధి చెందింది అని చెప్పడానికి మేధావులు ఇస్తున్న లెక్కలే మీరు కోరుతున్న లెక్కలు. కాకుంటే వారు చెబుతున్న అభివృద్ధి ప్రజలకు సంబంధించింది కాదు. పరిశ్రమలు, రోడ్లు, విమానాశ్రయాలు, పెద్ద పెద్ద హోటళ్ళు, సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట్ సంస్ధలు, ఫ్లై ఓవర్లు, సిమెంట్ రోడ్లు ఇవన్నీ అభివృద్ధికి ఆనవాళ్ళుగా వారు చెబుతున్నారు. ఆ ఆనవాళ్ళు వేటిలోనూ తెలంగాణకి చెందిన సామాన్య ప్రజానికానికి చోటు లేదు బొందలపాటిగారూ. కేవలం డబ్బున్నవారికే అక్కడ ప్రవేశం. అది పెట్టుబడిదారులకు ఉపయోగపడే అభివృద్ధి తప్ప సామాన్య జన జీవనంలో మార్పులు తెచ్చి అందరికీ సుఖజీవనం ప్రసాదించగల మార్పులు కావవి. రేపు తెలంగాణ వచ్చినా తెలంగాణ ప్రజలకు తెలంగాణ పెట్టుబడిదారుల అభివృద్ధిలో భాగస్వామ్యం లభించదు. కానీ ఆ పేరు చెప్పి రేపు నిలదీయగల అవకాశం ప్రజలకు అదనంగా లభిస్తుంది. ఇక బై ప్రొడక్టు లబ్ది గురించి ముందే చెప్పుకున్నాం.
మనం ఏ ప్రాంతంలో ఉంటే దానికి అనుకూలంగా ఆలోచించాలని కాకుండా వాస్తవాలెలా ఉన్నాయన్నది పరిశీలించి తదనుగుణంగా స్పందించగల శక్తి మనకు ఉండాలి. వాస్తవాలను తెలుసుకోవడానికి కొంత ఓపిక కూడా కావాలి. అధ్యయనం చెయ్యాలి. ఇవన్నీ ఉన్నపుడు ద్వేష రహితంగా చర్చించుకోగల పరిస్ధితి ఏర్పడుతుంది. వివరాల కోసం కొంచెం ఎక్కువ రాశాను. అన్యధా భావించవలదు.
ఎంతో ఓపికతో పొడవైన సమాధానం రాసినందుకు ధన్యవాదాలు శేఖర్ గారూ,
“ప్రతీ కుటుంబనుండి ఒకరు హైద్రాబాద్ లో ఉన్నారనీ మీ అభిప్రాయం సరైంది కాదని నా అభిప్రాయం”
మీరు దీనిని లిటరల్ గా తీసుకొన్నట్లున్నారు. నా ఉద్దేశం ఒకప్పటి కంటే ఇప్పుడు ఆంధ్ర లోని కుటుంబాలకు హైదరాబాద్ తో అనుబంధం పెరిగిందనే. ఎస్ సీ , ఎస్ టీ ప్రజానీకం నుంచీ కూడా హైదరాబాద్ లో ఐ టీ నుంచీ, వాచ్ మేన్ ల దాకా పని చేస్తున్న వారు చాలా మంది నాకు తెలుసు.
“కాని తెలంగాణ పెట్టుబడిదారులు తెలంగాణవారికి, ఆంధ్ర పెట్టుబడిదారులు ఆంధ్ర వారికి ముద్దు అని జనరలైజ్ చేశారు” నేను ఈ వాక్యం మీరు తెలంగాన వారు అనుకొని రాశాను…అవును..తెలంగాణ వారు తమను దోచే/దోయబోయే వారినే ఇప్పుడు నెత్తిన పెట్టుకొంటున్నారు..కాబట్టీ..వారికి “మీ పెట్టుబడి దారులు వేరు..మీ ప్రజలు వేరు..మీ పెట్టుబడి దారులను తిడితే మీరు బాధ పడకండి” అని చెప్పే అర్హత లేదు. ఎందుకంటే..ఏ “కే సీ ఆర్” నో తిడితే వారికి ఇంత బారు కోపం వస్తుంది..మా తెలంగాన ఆత్మ గౌరవం అంటారు. అది మిగిలిన వాళ్ళకు కూడా ఉంటుంది అని విస్మరిస్తారు.
“ప్రజల్లో ఉన్న అనేక బలహీనతలు, వెనుకబాటుతనం, నిరక్షరాస్యత, కుల భావనలు ఇవన్నీ వారికి ఉపయోగపడుతున్నాయి”
వీటి లో ప్రాంత భావన కూడా ఒకటి.
“హైద్రాబాద్ లోనూ, దాని చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలలో అత్యధిక భాగం ఆంధ్రవారివే…..”
ఆంధ్ర వారి పరిశ్రమలలో ఉద్యోగాలు చేస్తున్న అనేక మంది తెలంగాణ వారు ఉన్నారు. ఒక వేళ ఈ పరిశ్రమలు తెలంగాన వారివైతే, ఇప్పటి కన్నా ఏ కొంచెమో తెలంగాణ ఉద్యోగులు పెరుగుతారేమో..కానీ విపరీతం గా మాత్రం పెరగరు. ఇక్కడ “మీ పట్టుబడి దారులు పోయి మా ఎట్టుబడిదారులు రావాలి” అని పచ్చి ప్రాంతీయ వాదం వలననే అనిపిస్తుంది. తెలంగాణ పెట్టుబడి దారులు రావటం వలన ఒరిగేదేమీ ఉండదు.
“మనం ఏ ప్రాంతంలో ఉంటే దానికి అనుకూలంగా ఆలోచించాలని కాకుండా వాస్తవాలెలా ఉన్నాయన్నది పరిశీలించి తదనుగుణంగా స్పందించగల శక్తి మనకు ఉండాలి”
ఇది తెలంగాణ వారికి కూడా వర్తిస్తుంది కదా?ఆంధ్ర పెట్టుబడి దారులను తిట్టే మిష తో, ఆంధ్ర ప్రాంతీయులను అనని మాట లేదు. నా ప్రత్యక్ష అనుభవం లోనే ఒక తెలంగాన మనిషి, “నువ్వు హైదరాబాద్ లో ఎందుకుంటున్నవ్?” అని అడిగాడు. దానికి నేను “ఒక మరాఠీ అతనిని చూపించి, “ఇతను ఎందుకు ఉంటున్నాడొ, నేనూ అందుకే ఉంటున్నాను” అని చెప్పుకోవలసి వచ్చింది. తెలంగాణ వాదుల విద్వేషాన్ని మీరు ఇంకా ఎదుర్కొన్నట్లు లేదు. వారు నిష్పాక్షికం గా ఆలోచించినట్లైతే, తెలంగాణ రావటం వలన వారికి ఒరిగేదేమీ ఉండదు, ఒక రకమైన ప్రాంతీయ కుతి తీరిన తృప్తి తప్ప. ఇక చాలా రిస్కులు పొంచి ఉన్నాయి.
ఓపెన్ మైండ్ తో మాట్లాడే వారి తో మనమూ ఓపెన్ మైండ్ తో నే మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది. ముందే కంక్లూజన్స్ చేసుకొని వాటిని సమర్ధించుకొంటానికి మాట్లాడే వారి తో ఓపెన్ గా మాట్లాడితే, అలా ఓపెన్ గా ఉండటం మన బలహీనత అవుతుంది. వారు చివరికి మన్లని వాదనలో ఓడించి చంకలు గుద్దుకొంటారు. తెలంగాణా వాదులు మాట్లాడటానికి ముందు గానే అనేక అభిప్రాయాలను ఏర్పరచుకొని వాటిని సమర్ధించుకోవటానికి మాట్లాడుతారు. అలాంటి వారి తో అదే తరహా లోనే మాట్లాడ వలసి వస్తుంది. వారి తో ఓపెన్ గా మాట్లాడినా, వారు చివరికి నేం కాలింగ్ లోకి దిగుతారు. బందిపోటు దొంగ తో ధార్మిక వాదనలు చేసి అతనిని మార్చగలమా. మనం కూడా అతని లానే ఒక కత్తి పడితేనే అతను దారి లోకి వస్తాడు.
“…కోస్తాంధ్ర వెంట హైడ్రో కార్బన్ పరిశ్రమలతో వాన్-పిక్ అనే కోస్తా కారిడార్ నిర్మించి దానికి నీటి సరఫరా కోసం పోలవరం రూపొందించారు. ”
ఇది అర్ధ సత్యమేనేమో..మీరు లోతు గా పరిశీలించాలంటున్నరు కాబట్టీ చెబుతున్నాను.
“తెలుగు ఎ.పి గా ఏర్పడకముందు తెలంగాణ ప్రాంత ప్రయోజనాల రక్షణ కోసం కొన్ని ఒప్పందాలు కుదుర్చుకోవడం ఒక వాస్తవం. వాటిని అమలు చేయలేదన్నది కూడా వాస్తవమే.”
కొంత మాత్రమే వాస్తవం. ఇకపోతే ఏ పీ స్టేట్ లో తెలంగాణ వారికి కొన్ని విషయాలలో అన్యాయం జరిగితే, ఆంధ్ర వారికి కొన్ని విషయాలలో అన్యాయం జరిగింది. ప్రస్తుతం ప్రత్యేక తెలంగాన అంటున్నారు కాబట్టీ తెలంగాణ కి జరిగిన అన్యాయాలు లైం లైట్ లోకి వస్తున్నాయి.
..ఆంధ్ర కి జరిగిన అన్యాయాలలో, అక్కడ పరిశ్రమలను అభివృధ్ధి చేయక పోవటం, రాజధాని లోకూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేయనీయక పోవటం, ఐ ఐ టీ, ఆర్ ఈ సీ వంటి సంస్థలన్నీ తెలంగాణ లోనే పెట్టటం, ఇటువంటివి.. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం అంటూ ఒకటి వస్తే ఇలాంటి సవా లక్ష అన్యాయాలు రాజకీయ నాయకుల సహకారం తో వింత రంగులు వేసుకొని, పెద్ద భూతాలంత ఆకారం( వాటి అసలు ఆకారం చిన్నదైనా) లో బయట పడతాయి. మీరు స్టాక్ హోం సిండ్రోం కి తావిస్తున్నారేమో! అందరూ తెలంగాణ కి అన్యాయం జరిగిందనుకొంటున్నారు కాబట్టీ జరిగే ఉండాలి అనుకోవటం.
కోస్తా కారిడార్ కోసమే ప్రధానంగా పోలవరం రూపుదిద్దుకుందనడం పూర్తి వాస్తవమే. అనుమానం లేదు. ప్రస్తుతం కోస్తా కారిడార్ వెనక్కి పోయినట్లు కనిపిస్తోంది. అందుకే పోలవరం కూడా వెనక్కి వెళ్ళీంది. రాజశేఖరరెడ్డి ఉన్నట్లయితే వాన్‌పిక్ (వాడరేవు అండ్ నిజాంపట్నం పోర్ట్ & ఇండస్ట్రియల్ కాంప్లెక్స్) ఉధృతంగా సాగుతుండేది. వాన్‌పిక్ డాట్ ఒఆర్‌జి వెబ్‌సైట్ ఓసారి చూడండి. కొంత అర్ధమయ్యే అవకాశం ఉంది. పోలవరం వాన్‌పిక్ కోసమే అని అధికారికంగా చెప్పరు. గోదావరి నీరు కృష్టకి మళ్ళించి కోస్తా ప్రజల వినియోగం కోసం అని చెప్పారు కాని అది పైకి చెప్పేది. అసలు లక్ష్యం కోస్తా కారిడార్ వెంట విదేశీ పరిశ్రమలు వస్తే వాటి నీటి అవసరాల కోసం పోలవరాన్ని డిజైన్ చేశారు. తెలంగాణ ఉద్యమం, రాజకీయ అస్ధిరత, పక్క రాష్ట్రాల అభ్యంతరాల వలన ఆ ప్రాజెక్టు తాత్కాలికంగా వెనక్కి పోయింది. ఈ సమస్యలు సెటిలైతే మళ్లీ రంగం మీదికి వస్తుంది.
తెలంగాణ ఎ.పి లో కలిసి పోవడానికి ఇచ్చిన ఒప్పందాలను వేటినీ అమలు చేయలేదు. మీరు కొంత వాస్తవం అంటున్నారు గనక అమలైన ఒప్పందాల గురించి చెబితే తెలుసుకోవడానికి పనికొస్తుంది.
ఆంధ్రలో పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి కారణం ఇక్కడ అందుబాటులో ఖనిజ వనరులు లేకపోవడమే. మేజర్ ఖనిజ వనరులు తెలంగాణలో ఉన్నాయి. నా సమాధానంలో రాశాను, కోస్తాలో ఖనిజ వనరులు ఉన్నట్లయితే కోస్తా ధనికులు తెలంగాణకి వెళ్ళేవారు కాదని. పెట్టుబడిదారులు పెట్టుబడికి అనువైన చోటుకే వెళ్తారు. ఖనిజాల లభ్యత, రవాణా, జాతీయ అంతర్జాతీయ సంబంధాలకు అనువైన వాతావరణం… ఇలాంటివి. అవి తెలంగాణలో అధికంగా కనపడ్డాయి గనక అక్కడికి వెళ్ళారు. పెట్టుబడి లాభాల కోసం వెళ్ళి వాళ్ళని ఉద్ధరించడం కోసం వెళ్ళాం అంటున్నారు. రాజధానిలో ప్రభుత్వ ఉద్యోగాలు చేయనీక పోవడం ఎప్పుడు జరిగింది? ఇప్పుడు కె.సి.ఆర్ లాంటి వారి మాటలు కొలబద్ద కానే కాదు. నిజానికి కె.సి.ఆర్ పలుకుబడి ఆయనది కాదు. తెలంగాణ ప్రజల్లో ఉన్న ఆకాంక్ష ఆయన్ని కాపాడుతోంది. 2009 ఎన్నికల్లో ఆ పార్టీ బతుకేంటో అర్ధమైంది కదా. తెలంగాణ డిమాండ్ అంటే టి.ఆర్.ఎస్, కె.సి.ఆర్ అని భావించడం కరెక్టు కాదు. వారి వాగుడు వారినలా పత్రికల్లొ నిలుపుతోంది. పార్టీల్లో కూడా దానికంటే గొప్ప పార్టీ కనపడక వాళ్ళకి ఈ మధ్య ఓట్లు దక్కుతున్నాయి తప్ప అది వారి ప్రతిష్ట కాదు.
అన్యాయాల విషయానికి వస్తే అన్ని ప్రాంతాల వారికి కామన్ అయిన అన్యాయాలు చాలానే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం సందర్భంగా కామన్ అన్యాయాలు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. ఉద్యమాల సమయంలో అది సహజం. కాని తెలంగాణ ప్రాంతానికే పరిమితమైన కొన్ని అన్యాయాలు ఉన్నాయి. వాటిలో నీటి పారుదల సౌకర్యాలు ప్రధానం. నీళ్ళు అక్కడ పారుతున్నా ప్రాజెక్టులు లేక వినియోగించుకోలేక పోయారు. ఎత్తు ప్రాంతం కాబట్టి ప్రారంభంలొ ప్రాజెక్టుల నిర్మాణానికి ఆసక్తి చూపలేదు. తెలంగాణ వేరు రాష్ట్రంగా కొనసాగినట్లయితే ఏదో ఒక పద్దతిలో నీటి పారుదలకు ప్రయత్నించేవారు. ఉమ్మడిగా ఉండడంతో నీటి పారుదలకి అనువగా ఉన్న ప్రాంతంపైన కేంద్రీకరించడం జరిగింది. ఆ ప్రాజెక్టులు ఎ.పి ప్రాజెక్టులుగా పిలవబడ్డాయి. కేంద్ర దృష్టిలో అవి ఎ.పి ప్రాజెక్టులు. ఆ విధంగా తెలంగాణకి అన్యాయం జరిగింది. ఈ అన్యాయం కోస్తా ప్రజలందరి వలనా జరగలేదు. ఈ విషయాలన్ని మాట్లాడుకున్న పెద్ద మనుషులు ఆచరణలో పట్టించుకోక పోవడం వలన జరిగింది.
స్టాక్ హోం సిండ్రోం కోసం మీవైపు నుండి కూడా ఓసారి చూడండి. నేను తెలంగాణ, సీమాంధ్రల పైన కొన్ని పుస్తాకాలు చదివాను. ఒప్పందాలు చదివాను. వాటి అమలు తీరు తెన్నుల గురించి వివిధ రచయితలు రాసిన ఆర్టికల్స్, పుస్తకాలు చదివాను. ఉత్పత్తి సంబంధాలు ఎదుగుదల, విస్తృతి, ఉత్పత్తి సాధనాల యాజమాన్యం లాంటి అంశాల పైన కేంద్రీకరించి అధ్యయనం చేశాను. వాటి ఆధారంగానే సాపేక్షికంగా తెలంగాణకి అన్యాయం జరిగిందన్న అవగాహనకి వచ్చాను.
మీరు చెప్పిన వాంపిక్ సైట్ చూశాను. ఇంకా గూగుల్ చేసి చూశాను. కానీ వాంపిక్ కోసం మాత్రమే పోలవరం కడుతున్నారన్న ఆధారం నాకు కనపడలేదు.
“..కాని అది పైకి చెప్పేది. అసలు లక్ష్యం కోస్తా కారిడార్ వెంట విదేశీ పరిశ్రమలు వస్తే వాటి నీటి అవసరాల కోసం పోలవరాన్ని డిజైన్ చేశారు.”
మీకు అసలైన ఇన్సైడర్ సమాచారం ఎలా తెలిసింది. ఇది మీ గెస్ మాత్రమేనా. గెస్ చేయటం లో తప్పు లేదు. కాని “మన అభిప్రాయాలను బట్టీ, ఇంక్లినేషన్ ను బట్టీ మన గెస్ ఉంటుంది” అనేదాన్ని దృష్టి లో పెట్టుకోవాలి అనుకొంటా.
మొత్తానికి వాంపిక్ కోసమే పోలవరం అనేదాన్ని నేను తప్పు అని నిరూపించలేను. కాబట్టీ మీరు చెప్పింది అవాస్తవమనీ చెప్పలేను, వాస్తవము అనటానికి కూడా ఆధారాలు కనిపించటం లేదు.
“మీరు కొంత వాస్తవం అంటున్నారు గనక అమలైన ఒప్పందాల గురించి చెబితే తెలుసుకోవడానికి పనికొస్తుంది.”
నేను పెద్ద గా డాక్యుమెంట్లూ అవీ చదవలేదు గానీ శ్రీకృష్ణ రిపోర్ట్ లో కొన్ని ప్రాజెక్ట్లకు అన్యాయం జరిగిన మాట నిజమే అనీ, కొన్ని ప్రాజెక్ట్లూ, ఒప్పందాలు సరిగానే జరిగాయి లేక తరువాత సరిదిద్ద బడ్డాయి అనీ చదివినట్లు గుర్తు. ఇప్పుడు ఆ రిపోర్ట్ ని బయటకు తీసి చర్చించే ఓపిక లేదు. బాంబే అల్లర్ల గురించి రిపోర్ట్ ఇచ్చిన దగ్గరి నుంచీ నాకు శ్రీకృష్ణ అంటే పాజిటివ్ అభిప్రాయం ఉంది కాబట్టీ శ్రీకృష్ణ కమిటీ చెప్పినది కరక్ట్ అనుకొంటున్నాను.
“స్టాక్ హోం సిండ్రోం కోసం మీవైపు నుండి కూడా ఓసారి చూడండి. నేను తెలంగాణ, సీమాంధ్రల పైన కొన్ని పుస్తాకాలు చదివాను. ఒప్పందాలు చదివాను. వాటి అమలు తీరు తెన్నుల గురించి వివిధ రచయితలు రాసిన ఆర్టికల్స్, పుస్తకాలు చదివాను. ఉత్పత్తి సంబంధాలు ఎదుగుదల, విస్తృతి, ఉత్పత్తి సాధనాల యాజమాన్యం లాంటి అంశాల పైన కేంద్రీకరించి అధ్యయనం చేశాను. వాటి ఆధారంగానే “సాపేక్షికంగా” తెలంగాణకి అన్యాయం జరిగిందన్న అవగాహనకి వచ్చాను.”
ఏమైనా నేను సమైక్య వాదిని. దీని వలన నాకు వ్యక్తి గతం గా వచ్చేది ఏమీ లేదు. విడిపోతేనే నాకు వ్యక్తి గతం గా లాభం. కానీ ఇతర రాష్ట్రాలలో ఉండి, తమిళుల, కన్నడిగుల భాషా భావన చూసినాక, తెలుగు వారందరూ ఒకే రాష్ట్రం గా ఉండాలి అన్న బలమైన భావం కలుగుతుంది. అలానే తెలంగాన కి అన్యాయం “జరిగితే” మిగిలిన వారు అది మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలి. ముఖ్య మంత్రిని తెలంగాణ వాడిని చెయ్యండి, 100% కాబినెట్ లో తెలంగాన మంత్రులను పెట్టండి, ఆంధ్ర ప్రదేష్ కు తెలంగాణ అని పేరు పెట్టంది…కానీ తెలుగు వారంతా కలిసి ఉండాలి.
నిత్యం కొట్టుకొనే తెలుగు ప్రాంతాల వారిని చూస్తే, ఇతర భాషల వారి ముందు తల తీసినట్లు గా ఉంటుంది. తెలుగు వారు కొట్టుకొని కేంద్రానికి వెళ్ళి వాళ్ళని తగువు తీర్చమని అడిగేదేమిటి? ఎంత సిగ్గుచేటు? కేంద్రం వాడు విషయం నాంచుతున్నాడని నిందించటం ఏమిటి? ముందు మనం సరి గా ఉంటే, ఎవడో ముకర్జీ, పటేల్, సోనియమ్మ లు ఎందుకు సీన్ లోకి వస్తారు?
“స్టాక్ హోం సిండ్రోం కోసం మీవైపు నుండి కూడా ఓసారి చూడండి. నేను తెలంగాణ, సీమాంధ్రల పైన కొన్ని పుస్తాకాలు చదివాను. ఒప్పందాలు చదివాను. వాటి అమలు తీరు తెన్నుల గురించి వివిధ రచయితలు రాసిన ఆర్టికల్స్, పుస్తకాలు చదివాను. ఉత్పత్తి సంబంధాలు ఎదుగుదల, విస్తృతి, ఉత్పత్తి సాధనాల యాజమాన్యం లాంటి అంశాల పైన కేంద్రీకరించి అధ్యయనం చేశాను. వాటి ఆధారంగానే “సాపేక్షికంగా” తెలంగాణకి అన్యాయం జరిగిందన్న అవగాహనకి వచ్చాను.”
మీ పరిజ్ఞానాన్ని గౌరవిస్తాను. స్టాక్ హోం సిండ్రోం కి నేనూ అతీతుడిని కాదు. మీరు “సాపేక్షికం” గా తెలంగాన కి అన్యాయం జరిగింది అంటున్నారు కాబట్టీ మీతో నాకు పేచీ లేదు.
విశేఖర్ గారు, మీ తాటికొండలోనే కాదు, మా తుంబిగూడ (రాయగడ జిల్లాలో) నుంచి కూడా ఎవరూ రాజధాని నగరమైన భుబనేశ్వర్‌కి వలస వెళ్ళలేదు. వాళ్ళందరూ ఒకటీ, ఒకటిన్నరా ఎకరం భూములని దున్నుతున్న ఆదివాసీలు. ఆ గ్రామాన్ని రాయగడ మునిసిపాలిటీలో విలీనం చేసిన తరువాత వేరే ప్రాంతాల నుంచి ఒకరిద్దరు కోమట్లు ఆ గ్రామానికి వచ్చారు. ఆ గ్రామం విడిచి పట్టణానికి వెళ్ళింది మాత్రం మా కుటుంబం నుంచి ముగ్గురు. అది కూడా ఆంధ్రాకి వలస వచ్చారు కానీ ఆ రాష్ట్ర రాజధానికి మాత్రం వెళ్ళలేదు.
బొందలపాటి గారు, ఆర్థిక పరిస్థితి మారిన తరువాత ఎవరూ కులం గురించి పట్టించుకోరు. మాది ఆదివాసీ కుటుంబమే కానీ మేముంటున్నది విశాఖపట్నంలో, అది కూడా నెలకి తొమ్మిది వేలు అద్దె కట్టే ఇంటిలో. హైదరాబాద్ ఐటి కంపెనీలో పని చేసే దళితుడు కూడా లింగంపల్లి దగ్గర ఇంతే ఖరీదైన ఇంటిలో ఉంటాడు. ఐదు వందల రూపాయల అద్దె గుడిసెలో ఉండే పేద దళితుని పక్కన మిడిల్ క్లాస్ దళితుడు ఎవడూ కూర్చోడు. ఆర్థిక పరిస్థితి మారిన తరువాత ఎవరైనా కులానికి దూరంగా జరిగిపోతారు కనుక హైదరాబాద్ ఐటి కంపెనీలలో ఏయే కులాలవాళ్ళు ఉన్నారనేది అనవసర విషయమే. కేవలం వేలు లేదా లక్షల మందికి లాభం కలిగించే శక్తి ఉన్న ఐటి పరిశ్రమ వల్ల రాష్ట్ర పరిస్థితి మౌలికంగా ఏమీ మారదు.
telangaavadinayina naaku teleeni chaalaa vishayaalu telusukogaligaanu. samaykavadula badanu ardam chesuko galigaanu