సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి గట్టి సవాలే విసిరింది. నల్ల డబ్బు వెలికి తీయడానికి కేంద్రం నియమించిన ‘హై లెవల్ కమిటీ’ (హెచ్.ఎల్.సి) పై పర్యవేక్షణకు “స్పెషల్ ఇన్‌వెష్టిగేషన్ టీం” (ఎస్.ఐ.టి – సిట్) ని ఏర్పాటు చేసింది. సుప్రీం నియమించిన సిట్ కు ఛైర్మన్‌గా రిటైరైన జస్టిస్ బి.పి.జీవన్ రెడ్డిని నియమించింది. డిప్యుటీ ఛైర్మన్ గా మరొక రిటైర్డ్ జస్టిస్ ఎం.బి.షా ను నియమించింది. ప్రభుత్వం నియమించిన హెచ్.ఎల్.సి ఇకనుండి సిట్ లో భాగంగా పనిచేస్తుంది. విదేశాల్లో దాచిన నల్లడబ్బు వెనక్కి తేవడానికి ఏం చేస్తున్నారని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించడంతో ప్రభుత్వం హెచ్.ఎల్.సి ని ఏర్పాటు చేసింది. అందులో వివిధ విభాగాల అధిపతులను సభ్యులుగా నియమించింది.
రెవిన్యూ సెక్రటరీ ఆధ్వర్యంలో నడిచే హెచ్.ఎల్.సిలో సి.బి.ఐ డైరెక్టర్, ఐ.బి (ఇంటెలిజెన్స్ బ్యూరో) అధిపతి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి), డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్, డైరెక్టర్ ఆఫ్ ఫారెన్ ఇంటెలిజెన్స్ ఆఫీస్, జాయింట్ సెక్రటరీ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ లు సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ ఇకనుండి సిట్ లో భాగంగా కొనసాగుతుంది. జస్టిస్ బి. సుదర్శన రెడ్డి, జస్టిస్ ఎస్.ఎస్ నిజ్జార్ లతో కూడిన సుప్రీం బెంచి ఈ నిర్ణయం ప్రకటించింది. నల్లడబ్బుకి సంబంధించి ప్రభుత్వం, ఇతర అధికార సంస్ధలు షోకాజ్ నోటీసులు ఇచ్చిన వారందరి పేర్లనూ వెల్లడించాలని కూడా బెంచి ఆదేశించింది. ఐతే, విదేశీ బ్యాంకుల్లొ డబ్బు దాచిన వారిపైన ఇంకా దర్యాప్తు నిర్వహించనట్లయితే అటువంటి వారి పేర్లను వెల్లడించనవసరం లేదని బెంచి తన ఆదేశాల్లో పేర్కొంది. లీఛ్‌టెన్‌స్టీన్ బ్యాంకులో నల్లడబ్బు డిపాజిట్ చేసినవారికి కూడా ఈ మినయాయింపు వర్తిస్తుంది.
ప్రముఖ సుప్రీం కోర్టు లాయర్ రాం జెఠ్మలాని తదితరులు నల్లడబ్బుని వెనక్కి తెప్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శకాలు జారీ చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ సుప్రీం కోర్టు ‘సిట్’ ను నియమిస్తూ ఆదేశాలిచ్చింది. ‘సిట్’ నియామకంపై నోటిఫికేషన్ ఇవ్వాలనీ, ప్రభుత్వ యంత్రాంగం దానికి సహకరించాలనీ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు జారి చేస్తూ కోర్టు ప్రభుత్వంపై కఠినమైన వ్యాఖ్యలు చేసింది. విదేశీ బ్యాంకులకు చట్టవిరుద్ధంగా దేశం డబ్బుని తరలించిన వారిపై సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని కేంద్రాన్ని తప్పు పట్టింది. నల్లడబ్బు అనే లక్షణం దేశానికి అత్యంత ప్రమాదికారిగా పేర్కొంటూ, విదేశాల్లో దాచిపెట్టిన డబ్బు పరిమాణం దేశం యుక్క “బలహీనతకూ,” “మెతకదనానికీ” కొలబద్దలాంటిదని చెప్పింది. నల్లడబ్బు ప్రభుత్వం వైపునుండి చూస్తే తీవ్రలోపమనీ, దేశం యొక్క అంతర్గత, బాహ్య భద్రతలకు అది తీవ్ర ప్రభావం కలిగిస్తుందనీ వివరించింది.
“ప్రభుత్వం తీసుకున్న చర్యలపై మేము తీవ్ర స్ధాయిలోనే రిజర్వేషన్లు కలిగిఉండవలసి ఉంది… పరిశోధన పూర్తిగా ఆగిపోయిందని స్పష్టంగా తెలుస్తోంది. కోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే అది ముందుకు కదిలింది. ఈ కోర్టు గట్టిగా పట్టుబట్టడం వలనే సరైన పరిశోధన నిర్వహించబడింది” అని పూనే గుర్రపుశాల యజమాని హసన్ ఆలీ కేసును ప్రస్తావిస్తూ బెంచి అభిప్రాయపడింది. “కానీ, ఇంకా చాలా చేయవలసి ఉంది” అని చెబుతూ, ఈ కేసులో కోర్టు మరింతగా జోక్యం చేసుకోవలసిన అవసరం తలెత్తిందని పేర్కొంది. నల్లడబ్బుకి సంబంధించిన అన్ని కేసులనూ సిట్ స్వాధీనం చేసుకుని తనకు ఎప్పటికప్పుడు స్టేటస్ రిపోర్టులను సమర్పించాలని సిట్ ను ఆదేశిస్తూ, సుప్రీం కోర్టు “నిరంతరం కోర్టు జోక్యం అవసరమని మేము భావిస్తున్నాం” అని పేర్కొంది. అలాగే నల్లడబ్బుకి సంబంధించిన కేసులపై సమగ్ర చర్యల పధకం (comprehensive action plan) సమర్పించాలని సిట్ ను కోర్టు కోరింది.
తన రాజ్యాంగ భాధ్యతలను నిర్వహించడానికి గతంలోని కేసుల విషయంలో కూడా కోర్టు ఇటువంటి ఆదేశాలను ఇచ్చిందని కోర్టు, సిట్ నియామకాన్ని సమర్ధించుకుంటూ తెలిపింది. కోర్టుకు అందుబాటులో ఉన్న వనరులు తక్కువగా ఉన్నందున ప్రతిరోజూ పరిశోధనలను పర్యవేక్షించడం సాధ్యం కాదని సుప్రీం బెంచి తెలిపింది. నల్లడబ్బు అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని చెబుతూ అటువంటి డబ్బును వెనక్కి రప్పించి, విదేశాలకు డబ్బు తరలించినవారిని శిక్షించే ప్రధాన భాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపింది. పన్నుల వసూలు సంబంధిత అధికారులపై ఉన్న రాజ్యాంగపరమైన బాధ్యత అనీ, లెక్కకురాని డబ్బు విదేశాలకు తరలి వెళ్ళడం ప్రభుత్వ అధికార సంస్ధల అసమర్ధతకు నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొంది. “ఇటువంటి అసమర్ధతలు పాలనా రాహిత్యం యొక్క కేంద్ర భాగాన్ని ఆక్రమిస్తాయి” అని చెబుతూ, విదేశాలకు వెళ్ళే డబ్బు దేశానికి పెద్ద ఎత్తున నష్టం చేయవచ్చనీ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అది వినియోగం కావచ్చనీ హెచ్చరించింది.
ప్రభుత్వం నియమించిన హై లెవల్ కమిటీ పని విధానాన్ని మే 12 నాటి హియరింగ్ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. హసన్ ఆలీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఇ.డి దాఖలు చేసిన ఛార్జి షీటును హై లెవల్ కమిటీ ముందుకి తీసుకురాకపోవడం పట్ల కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నల్లడబ్బు విషయంలో ప్రభుత్వ పని విధానంపై పర్యవేక్షణకు సిట్ ఏర్పాటును నిరోధించడానికే ప్రభుత్వం నియమించుకున్న హై లెవల్ కమిటీ ముందుకి కూడా ఇ.డి ఛార్జి షీటు తేవకపోవడమేంటని ప్రశ్నించింది.
ఈ పరిణామాలన్నింటి నేపధ్యంలోనే సుప్రీం కోర్టు చివరికి సిట్ నియామకాన్ని ప్రకటించింది. ప్రభుత్వం వల్ల నల్లడబ్బు వెనక్కి రావడం అటుంచి కనీసం విచారణ కూడా జరగదని సుప్రిం కోర్టు గుర్తించిందన్నమాట!

