$15 బిలియన్ల వ్యాపార ఒప్పందాలకు చైనా, జర్మనీల అంగీకారం


యూరప్ పర్యటనలో ఉన్న చైనా ప్రధాని వెన్ జియాబావో, ఇంగ్లండులో మూడు రోజులు పర్యటించిన అనంతరం బుధవారం జర్మనీకి చేరుకున్నాడు. జర్మనీ పర్యటనలో 15 బిలియన్ డాలర్ల మేరకు వ్యాపార ఒప్పందాలపై ఇరు పక్షాలు సంతకాలు చేసారని బిబిసి తెలిపింది. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్, చైనా ప్రధాని వెన్ లు వ్యాపార ఒప్పందాలపై చర్చలు జరిపి అంగీకారానికి వచ్చారు. ద్వైపాక్షిక వ్యాపారం రానున్న 5 సంవత్సరాల్లో 200 బిలియన్ యూరోల (284 బిలియన్ డాలర్లు) మేరకు పెంచుకోవాలని ఇరు పక్షాలూ లక్ష్యంగా పెట్టుకున్నాయి.

యూరోపియన్ యూనియన్‌లో జర్మనీయే చైనాకు అతి పెద్ద వ్యాపార భాగస్వామి. ప్రపంచంలో చైనా, జర్మనీలు అతి పెద్ద ఎగుమతిదారులుగా ఉన్నాయి. ద్వైపాక్షిక వ్యాపార వృద్ధి పైనే ఇరువురూ దృష్టి కేంద్రీకరించామని వెన్ విలేఖరులకు తెలిపాడు. రెండు దేశాల మధ్య ఒప్పందాల్లో భాగంగా ఎయిర్ బస్ కంపెనీ, చైనా ఏవియేషన్ సప్లైస్ కంపెనీల మధ్య 88 ఎ320 విమానాలను సరఫరా చేయడానికి అంగీకారం కుదురించి. వీటి విలువ 7.5 బిలియన్ డాలర్లని తెలిపారు.

యూరోపియన్ యూనియన్ ఎదుర్కొంటున్న అప్పు సంక్షోభం పరిష్కారానికి చైనా చేతనైనంత సాయం చేస్తుందనీ యూరో సావరిన్ బాండ్లను వీలైనంత ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తుందనీ వెన్ తెలిపాడు. అవసరం మేరకు యూరోజోన్ దేశాల సావరిన్ అప్పు బాండ్లలో పెట్టుబడుల పెడతామని తెలిపాడు. ఏ దేశం బాండ్లు కొనుగోలు చేస్తున్నదీ వెన్ చెప్పలేదు. ప్రపంచంలో అత్యధికంగా 3 ట్రిలియన్ డాలర్లకు పైగా విదేశీమారక ద్రవ్య నిల్వలు ఉన్న చైనా, తన నిల్వలను వివిధీకరించడానికి ప్రయత్నిస్తానని ప్రకటిస్తున్నది. ఇప్పటికే తన మొత్తం విదేశీ మార్క ద్రవ్యంలో నాలుగో వంతు యూరోలలో నిలవ ఉంచినట్లుగా భావిస్తారు.

డాలర్ కు ప్రత్యామ్నాయంగా యూరో ఎదగడంలో చైనాకి ప్రయోజనాలు ఉన్నాయి. అమెరికా ఆర్ధిక వ్యవస్ధ సంక్షోభం నుండి కోలుకోక పోగా ఆర్ధిక వృద్ధి రేటు తగ్గిపోతుండడంతో దాని ప్రభావం చైనా విదేశీ మార్క ద్రవ్య నిలవలపై పడే ప్రమాదం ఉంది. డాలర్లలో చైనా విదేశీ మారక ద్రవ్యం నిల్వలు అధికంగా కొనసాగినంత కాలం అమెరికా ద్రవ్య విధానానికి చైనా బందీగా ఉండవలసి ఉంటుంది. అమెరికాలో సంభవించే ప్రతికూల పరిణామాలు చైనా డాలర్ పెట్టుబడులను ప్రమాదంలో పడవేయవచ్చు. అందుకనే చైనా యూరో శక్తివంతమైన కరెన్సీగా ఎదిగితే యూరోలలో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నది.  సంక్షోభం అనంతరం జర్మనీ త్వరగా కోలుకుని ఆర్ధిక వృద్ధిని నమోదు చేస్తున్నది.

హంగేరీ లాంటి తూర్పు యూరప్ దేశాలకు కూడా చైనా పెట్టుబడులను తరలించి తన ప్రాబల్యాన్ని విస్తరించుకుంటున్నది.

వ్యాఖ్యానించండి