ఎం.పిలకు శుభవార్త: ఎం.పి లాడ్స్ నిధుల వినియోగంపై నిబంధనలు సడలించిన ప్రభుత్వం


భారత పార్లమెంటు సభ్యులకు ఓ శుభవార్త. తమ తమ నియోజకవర్గ ప్రాంతంలో అభివృద్ధి పనుల నిమిత్తం ఎం.పిలకు కేటాయించే నిధుల వినియోగంపై ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎం.పి. లాడ్స్ గా పిలిచే ఈ నిధులను ఖర్చు చేయడంలో ఇప్పటివరకు ఒకింత కఠినమైన నిబంధనలు ఉన్నాయి. దానితో చాలా మంది ఎం.పిలు వారికి కేటాయించిన నిధులను ప్రజలకోసం ఖర్చు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఆ నిధులన్ని గణనీయ మొత్తంలొ ప్రతి సంవత్సరం మిగిలిపోవడం రివాజుగా మారింది. కమీషన్లు వచ్చే చోట మాత్రమే అభివృద్ధి పనుల పేరుతో నిధులు ఖర్చు చేయడానికి ఎం.పిలు ఆసక్తి చూపడానికి అవకాశం ఉంది. అందుకు అవకాశం లేకుండా నిజంగానే అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయమని నిబంధనలతో కూడిన నిదులు ఇస్తే వారేమాత్రం ఆసక్తి చూపరని ఎం.పి. లాడ్స్ నిధుల ద్వారా అర్ధం అయింది.

ఏ రాజకీయ పార్టీకీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగిన మెజారిటీ రాకపోవడం, చిన్నా చితకా పార్టీలతో కూటమి కట్టి ప్రభుత్వాలు ఏర్పాటు చేయవలసి రావడంతో ప్రతి చిన్న పార్టీకీ, ప్రతి ఎం.పికీ విలువ అమాంతంగా పెరిగిపోయింది. ఎం.పిలను సంతృప్తిపరచని పక్షంలో రాజకీయ సంక్షోభాలు ఏర్పడే ప్రమాదం ముంచుకు వస్తోంది. ఈ నేపధ్యంలోనే ఎం.పిల కోసం వ్యక్తిగత ఖాతాలో అభివృద్ధి కోసం ఖర్చు చేయాలంటూ ఎం.పిలకు నిధులు కేటాయించడం ప్రారంభమయ్యింది. వీటిని Member of Parliament Local Area Development Scheme – MPLADS ఆని పిలుస్తున్నారు. క్రితం సంవత్సరం వరకు ఒక్కో ఎం.పికి రు.2 కోట్లు కేటాయించగా, 2011-12 సంవత్సరం నుండి దాన్ని రు.5 కోట్లకు పెంచారు. మారిన నిబంధనలు ఇలా ఉన్నాయి.

  • ఒక ఎం.పి తాను ఎన్నికయిన రాష్ట్రంలోనే కాకుండా, ఆ రాష్ట్రం బైట కూడా ఎం.పి లాడ్స్ నిధులను ఖర్చు చేయవచ్చు. అటువంటి ఒక్కో పనికి ఒక ఆర్ధిక సంవత్సరంలో ఖర్చు చేసే మొత్తం రు.10 లక్షలకు మించరారు. ఇప్పటివరకూ తాను ఎన్నకైన రాష్ట్రంలో మాత్రమే అభివృద్ధి పనుల కోసం ఖర్చుచేసే వీలుంది. ఈ సడలింపు ద్వారా జాతీయ సమైక్యతను పెంపొందించవచ్చని ప్రభుత్వం చెబుతోంది.
  • ఇప్పటివరకూ ఒక ఎం.పి లాడ్స్ నిధులను తాను ఎన్నికైన రాష్ట్రంలో విద్య, సాంస్కృతిక రంగాలకు మాత్రమే ఖర్చు చేసే వీలుంది. ప్రస్తుతం మరిన్ని రంగాలను ఎం.పి లాడ్స్ ఖర్చుకోసం అనుమతించారు.
  • నిధుల విడుదల నిబంధనలను కూడా సడలించారు. మంజూరైన పనికోసం జిల్లా అధికారి మొత్తం పనివిలువలో 75 శాతాన్ని మొదటి వాయిదాగా విడుదల చేయవచ్చు. అయితే పనిని అమలు చేసే ఏజన్సీ ప్రభుత్వ ఏజన్సీ అయి ఉండాలి. పని జరుగుతున్న క్రమంలో ప్రగతి చూశాక మిగిలిన 25 శాతం నిధుల్ని విడుదల చేయాలి. ఇప్పటివరకూ ఇది రెండు సమాన వాయిదాలలో మాత్రమే (50 శాతం) విడుదల చేయాలన్న నిబంధన ఉంది.
  • అలాగే పని విలువ మొత్తం రు.2 లక్షలు అయి ఉండి అమలు చేసేది ప్రభుత్వ ఏజన్సీ ఐతే మొత్తం డబ్బుని ఒకే వాయిదాలో విడుదల చేయవచ్చు.
  • అమలు ఏజన్సీ ప్రవేటు ఏజన్సీ అయితే గరిష్ట పరిమితి రు.10 లక్షలకు లోబడి, మొదటి వాటాగా 60 శాతం జిల్లా అధికారి విడుదల చేయవచ్చు. మిగిలిన దాన్ని ఎం.పి ఇష్టాన్ని బట్టి ఒకటి లేదా రెండు వాయిదాలుగా చెల్లించవచ్చు. అంటే ప్రవేటు వినియోగం కోసం కూడా ఎం.పి నిధులను ఖర్చు చెయ్యొచ్చన్నమాట.
  • ఇప్పటివరకూ ప్రభుత్వ ఆసుపత్రులకు ఎం.పిలు తమ నిధులనుండి అంబులెన్సులు గానీ శవాన్నీ తీసుకెళ్ళే వాహనాన్ని గాని కొనడానికి మంజూరు చేయవచు. మారిన నిభంధన ప్రవేటు ఆసుపత్రులకు కూడా ఆ సౌకర్యాన్ని విస్తరించారు. అయితే ఆ వాహనాల వినియోగంలో కొన్ని నిబంధనలు ఉంటాయని చెబుతున్నారు.
  • కొత్త నిబంధన ప్రకారం, ట్రస్టులకు లేదా కమ్యూనిటీ సంక్షేమం కోసం ఏర్పడిన సొసైటీలకు లేదా ప్రజావసరాలకూ ఎం.పి ఒక ఆర్ధిక సంవత్సరంలో 50 లక్షల వరకూ ఖర్చు చేయవచ్చు.
  • ఏ ప్రాజెక్టుకైనా ఎం.పి లాడ్స్ కింద చేపట్టే ప్రాజెక్టుకు కేటాయించే సొమ్ము రు.1 లక్షకు తగ్గకూడదు. చేతి పంపులు, సోలార్ ఎలక్ట్రిక్ లేంపులు, ఛౌపల్స్, పరికరాలు/ ఉపకరణాలు/ కంప్యూటర్లు తదితర అవసరాల కోసం ఈ నిబంధనను సడలించవచ్చు.


1993 లో ప్రారంభమైన ఎం.పి లాడ్స్ స్కీము ఎం.పిలు తమ నియోజక వర్గ ప్రజలు చేసే విజ్ఞప్తులను స్వీకరించి పరిష్కరించడానికి ఉద్దేశించారు. తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఉద్దేశించారు. అభివృద్ధి పధకాలలో భాగంగా మామూలు పద్ధతుల్లో చేపట్టలేని పనులు కమ్యూనిటీ ప్రయోజనాల కోసం ఉపయోగపెట్టడానికి ఈ స్కీము ప్రవేశ పెట్టారు. రాను రానూ నిబంధనలు సడలిస్తూ వస్తున్నారు. ఎం.పి అంటెనే ఒక నియోజకవర్గానికే సంబంధించిన వాడు. అలాంటిది వారి నిధుల్ని నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రం మొత్తం ఎక్కడైనా ఖర్చు చేసుకోవచ్చని అవకాశం ఇవ్వడం, ఇప్పుడు దాన్ని దేశం మొత్తానికి విస్తరించడం అంటె ఎం.పిలలొ అవినీతిని ప్రోత్సహించడమే. ఖర్చు పరిమితులను పెంచుకుంటూ పోవడం కూడా ఆ కోవలోనిదే. ఇప్పటికే ఎం.పి లాడ్స్ అంటేనే ఎం.పిల స్వంతానికి ఇచ్చిన డబ్బు అని బహిరంగ అవినీతికి అనుమతించడమనీ ఆరోపణలు వచ్చాయి. అవేమీ పట్టించుకోకుండా నిబంధనలు సడలించడం ఎందుకని?

మంత్రులు, పలుకుబడి గల ఎం.పిలు ప్రభుత్వాలు మంజూరు చేసే వివిధ కాంట్రాక్టుల్లొ కమీషన్లు వసూలు చేయడం మామూలు విషయమే. ఆ విధంగా అవినీతితో డబ్బు సంపాదించే అవకాశం ఒక్క మంత్రులకూ, పలుకుబడిగలిగిన వారికి మాత్రమే ఉండడం ఇతర ఎం.పిలకు కన్ను కుట్టే అంశమే. వారిని కూడా సంతృప్తి పరచనట్లయితే వివిధ బిల్లుల ఆమోదంలో గైర్హాజరు కావడం, సహకరించక పోవడం జరుగుతుంది. ఫలితమే ఈ ఎం.పి లాడ్స్. తాము ఉన్నత స్ధాయిలో పాల్పడే అవినీతి సజావుగా కొనసాగడానికి జూనియర్ పార్ట్నర్లకు కూడా వారి స్ధాయిలో అవినీతికి పాల్పడడానికి అవకాశం ఇవ్వడానికే ఈ స్కీము ఉపయోగపడుతోంది. ప్రభుత్వంలొ ఉన్నత స్ధానాల్లొ ఉన్న ఎం.పిల నియోజకవర్గ నిధులు ప్రతిఏటా మురిగి పోవడమే అందుకు నిదర్శనం.

వ్యాఖ్యానించండి