రేప్ ప్రయత్నం నేరంపై స్ట్రాస్ కాన్ అరెస్టు ఐన తర్వాత ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టరు పోస్టుకి పోటీ ఏర్పడింది. ఇప్పటివరకూ అమెరికా ప్రపంచ బ్యాంకు అధిపతిని నియమించుకుంటే, యూరప్ ఐ.ఎం.ఎఫ్ అధిపతిని నియమించుకునేవి. ఇప్పుడు ఎమర్జింగ్ దేశాలైన చైనా, ఇండియా, దక్షీణాఫ్రికాలు పోటీ పడుతున్నాయి. ఫ్రాన్సు ఆర్ధిక మంత్రి క్రిస్టీన్ లాగార్డే ఈ పదవికి ఎన్నిక కావచ్చని అంచనా వేస్తుండగా ఆమెకు పోటీ ఎదురవుతోంది. ఇండియా ఆమె అభ్యర్ధిత్వానికి మద్దతు ఇవ్వలేదు. చైనా ఏమీ చెప్పడం లేదు. దక్షీణాఫ్రికా పోటీదారుడ్ని నిలిపి ఉపసంహరించుకుంది. తాజాగా ఇండోనేషియా, ఈజిప్టులు లాగార్డేకి మద్దతు పలికాయి. ఇజ్రాయెల్ సెంట్రల్ బ్యాంక్ ఛీఫ్ స్టాన్లీ ఫిషర్, మెక్సికో సెంట్రల్ బ్యాంక్ ఛీఫ్ అగస్టిన్ కార్‌స్టెన్స్ లు లాగార్డే తో పాటు బరిలో మిగిలారు. నామినేషన్లు శుక్రవారంతో ముగిసాయి. లాగార్డే కి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి.