$2 బిలియన్లు నష్టమైనా ఎగుమతుదారులపై పన్నుల రద్దుకు నిర్ణయించిన ప్రభుత్వం


Anand-sharma2

ప్రభుత్వానికి నష్టాలు వస్తున్నప్పటికీ ఎగుమతిదారులకు ఇస్తున్న టాక్స్ బ్రేక్ కొనసాగించడానికే భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వానికి నష్టాలు వస్తున్నందున ఎగుమతిదారులపై విధించిన పన్ను రద్దు స్కీంను కొనగాగించకూడదని నిర్ణయించింది. ఐతే ఎగుమతిదారులైన భారత బిలియనీర్లు తీవ్రంగా అభ్యంతర పెట్టడంతో వారి ఒత్తిడికి తల ఒగ్గిన ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఆర్ధిక మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని తిరగదోడి ఎగుమతిదారులను సంతృప్తి పరిచింది.

ప్రభుత్వం ఎగుమతులను ప్రోత్సహించడానికి “డ్యూటీ ఎన్‌టైటిల్‌మెంట్ పాస్ బుక్” (డి.ఇ.పి.బి) స్కీమును అమలు చేస్తోంది. ఆ స్కీము ఈ నెలాఖరుకు (జూన్ 30) ముగింపుకు వస్తుంది. ఈ స్కీము ద్వారా ఎగుమతులను ప్రోత్సహించి తద్వారా వాణిజ్య మిగులు సాధించడానికీ లేదా కనీసం వాణిజ్య లోటు తగ్గించుకోవడమైనా సాధించాలని ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే ఈ స్కీము వలన ఆశించిన ఫలితం రాకపోగా ప్రభుత్వానికి 1.8 బిలియన్ డాలర్లు (80 బిలియన్ రూపాయలు లేదా రు.8,000 కోట్లు) నష్టం వస్తోందని తేలింది. దాంతో ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ జూన్ 30 తో స్కీముకి ముగింపు పలకుతామని ప్రకటించాడు.

అయితే వాణిజ్య శాఖ అధికారులు ఎగుమతి వ్యాపారుల ప్రభావంలో ఉండడంతో వారు ప్రభుత్వ నిర్ణయంపై సణుగుడు మొదలు పెట్టారు. రద్దు చేసిన స్కీము స్ధానంలో దానికి ప్రత్యామ్నాయం ఏదైనా ఏర్పాటు చేయాలని వాదించారు. మొత్తంగా స్కీమ్ రద్దు చేస్తే ఎగుమతులను పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యానికి గండి పడుతుందని వాదించారు. ఎగుమతుల లక్ష్యాన్ని పెంచడం అనేది కేవల ఎగుమతుల్ని పెంచడానికే కాదు. తద్వారా వాణిజ్యలోటు తగ్గించుకోవడం అంతిమ లక్ష్యం. అది నెరవేరకపోగా ఎనిమిదివేల కోట్లు నష్టం వస్తున్నపుడు అటువంటి స్కీము రద్దు చేయడమే ఉత్తమం.

కాని అధికారులతో పాటు వాణిజ్య శాఖా మంత్రి, మార్కెట్ ఆర్ధిక విధానాల మిత్రుడూ అయిన ఆనంద్ శర్మ (అమెరికా ఇస్టపడే మంత్రుల్లో ఈయన ఒకడు) కూడా అదే చెప్పడంతో ప్రణబ్ ముఖర్జీ స్కీము రద్ధు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. ఎగుమతులను ప్రోత్సహించేందుకు మరొక ప్రత్యామ్నాయాన్ని ఏర్పరచే వరకూ ఈ స్కీము అమల్లో ఉంటుందని ఆయన ప్రకటించాడు. ఈ స్కీము కింద యధా ప్రకారం ఎగుమతిదారులు, దిగుమతి సరఫరాలపై చెల్లించే పన్నులని ప్రభుత్వం తిరిగి వారికి చెల్లిస్తుంది.

ధాన్యానికి గిట్టుబాటు ధర పెంచాలన్నా, ప్రభుత్వోద్యోగులకి సహజంగా నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన కరువు భత్యం విడుదల చేయాలన్నా, లేదా రైతులకి విత్తనాలపైనా, ఎరువులపైనా ఇచ్చే సబ్సిడీల్ని పదో, ఇరవయ్యో రూపాయలు పెంచాలన్నా ప్రభుత్వం సవా లక్షా సాకులు చెబుతుంది. ఆర్ధిక వ్యవస్ధ పరిస్ధితి బాగా లేదంటూ బీద అరుపులు అరుస్తుంది. దేశం కోసం ప్రజలు త్యాగాలు చేయడానికి సిద్ధం కావాలని నీతి బోధలు చేస్తుంది. కంపెనీలు, కార్పొరేట్లు, తదితర ధనికుల విషయంలో మాత్రం అవే నీతులు, అరుపులు మూగబోతాయి. దక్షిణ కొరియా బహుళజాతి కంపెనీ పోస్కో కోసం ఒడిషాలోని గ్రామాల ప్రజలపైన కెంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకంగా యుద్ధాన్నే ప్రకటించాయి. కంపెనీకి అవసరమైన భూమిని అటవి హక్కుల చట్టాన్ని, పర్యావరణ చట్టాల్నీ ఉల్లంఘించి మరీ విదేశీ కంపెనీకి కట్టబెట్టడానికి నిర్ణయించాయి. తమ భూములు ఇవ్వబోమని చెబుతున్న ప్రజలపైకి పాతిక ప్లాటూన్ల పోలీసుల్ని దింపాయి. ప్రజాస్వామిక ప్రభుత్వాలు ప్రజలకోసం పనిచేసే రోజు ఎప్పుడొస్తుందో కదా!

వ్యాఖ్యానించండి