అమెరికా, ఐరోపాల జేబు సంస్ధ అయిన “అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధ” (ఐ.ఎ.ఇ.ఎ) సిరియా అణు విధానంపై ఏకాభిప్రాయానికి రాలేక పోయింది. భద్రతా సమితిలో వీటో అధికారం కలిగి ఉన్న చైనా, రష్యా లు సిరియా అంశాన్ని భద్రతా సమితికి నివేదించడానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. 35 దేశాల ఐ.ఎ.ఇ.ఎ బోర్డు 17 – 6 ఓట్ల తేడాతో తీర్మానాన్ని ఆమోదించింది. 12 దేశాలు ఓటింగ్ నుండి విరమించుకున్నాయి. ఇరాన్ విషయాన్ని ఐదు సంవత్సరాల క్రితం భద్రతా సమితికి నివేదించాక ఐ.ఎ.ఇ.ఎ మరోదేశ అణు విధానాన్ని భద్రతా సమితికి నివేదించడం ఇదే మొదటిసారి. సిరియా రహస్యంగా అణ్వాయుధం కోసం ప్రయత్నిస్తున్నదని అమెరికా యూరప్ దేశాలు ఆరోపిస్తున్నాయి. అవి ఇప్పటికే సిరియా, సిరియా అధ్యక్షుడి పైనా వాణిజ్య ఆంక్షలు విధించాయి.
సిరియాలోని దాయిర్ ఆల్‌జౌర్ కాంప్లెక్సులో అణ్వాయుధం నిర్మించడానికి ఇంధనం శుద్ధి చేస్తున్నదని ఆరోపిస్తూ 2007 లో ఇజ్రాయెల్ బాంబులు వేసి ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ చర్యను ప్రశ్నించిన వారు లేరు గానీ ధ్వంసం అయిన భవనంలో ఉత్తర కొరియా సహాయంతో యురేనియం శుద్ధి చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపిస్తూ నాలుగు సంవత్సరాల తర్వాత సిరియాపై వాణిజ్య ఆంక్షలకు సిద్ధపడటం పశ్చిమ దేశాల తెంపరితనాన్ని సూచిస్తోంది. అమెరికా గూఢచర్య సంస్ధలు ఆల్ జౌర్ లో బహుశా ప్లుటోనియం శుద్ధి చేస్తూ ఉండవచ్చని చెబుతున్నాయి.
సిరియాపైన ఏక పక్షంగా ఆరోపణలు చేసి ఆరోపణలు నిజం కాదని నిరోపించుకునే భారాన్ని సిరియాపైనే మోపాయి పశ్చిమ దేశాలు.