
ఈ అమెరికా సైనికుడికి యుద్దంలో మరొకరిని చంపడం ఇదే మొదటిసారట. అందుకు గుర్తుగా తాను చంపిన బాలుని జుట్టుపట్టి పైకి లేపి చూపిస్తూ కెమెరాకి సంతోషంగా ఫోజు ఇస్తున్నాడు. ఆఫ్ఘనిస్ధాన్ లో ప్రతి గ్రామమూ ఓ గ్వాంటెనామో జైలు (thewe.cc నుండి)
లిబియా పౌరుల్ని చంపాడంటూ గడ్దాఫీపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ద్వారా అరెస్టు వారెంటు జారీ చేయించిన అమెరికా తదితర పశ్చిమ దేశాల నాటో కూటమి ఆఫ్ఘనిస్ధాన్‌లో పౌరులను చంపడం నిరాకటంకంగా కొనసాగిస్తూనే ఉంది. గత బుధవారం 18 మందినీ పొట్టన బెట్టుకున్న అమెరికా సేనలు ఆదివారం 14 మందిని చంపేశాయి. ఆదివారం చనిపోయినవారిలో ఇద్దరు స్త్రీలు కాగా మిగిలినవారంతా పిల్లలే. చనిపోయినవారిలో 2 సం.ల పసిపిల్లలు కూడా ఉండడం గమనార్హం. ఇవి మానవతకి వ్యతిరేకంగా జరిగిన నేరం. అంతర్జాతీయ చట్టాలకు పూర్తి వ్యతిరేకం ఈ చర్యకు పాల్పడినందుకు అమెరికా సేనల సర్వ సైన్యాధ్యక్షుడు బారక్ ఒబామా, నాటో దళాల పధిపతి మైక్ ముల్లెన్, అమెరికా డిఫెన్సు సెక్రటరీ రాబర్ట్ గేట్స్ లపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐ.సి.సి) అరెస్టు వారెంట్ జారీచేయాల్సి ఉంది. అయితే ఐ.సి.సి పశ్చిమదేశాల చేతుల్లో పనిముట్టు ఐనందున గడ్డాఫికి ఒక న్యాయం, ఒబామా-ముల్లెన్-గేట్స్ లకు మరొక న్యాయం అమలు చేస్తుంది.
హెల్మంద్ రాష్ట్రంలోని నవ్‌జాద్ జిల్లాలో ఆదివారం నాటి దాడి జరిగింది. మిలిటెంట్లు ఉన్నారని భావిస్తూ రెండు పౌరుల ఇళ్ళపై బాంబులు వేయడంతో పదిమంది పిల్లలు, ఇద్దరు స్త్రీలు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. సెరాకాలా గ్రామస్ధులు హెల్మండ్ రాష్ట్ర రాజధాని ‘లష్కర్ గహ్’కి వెళ్ళి ఎనిమిది మంది పిల్లల శవాలను తమ గ్రామానికి తెచ్చుకున్నారు. స్ధానిక గవర్నరు బంగళాకి తెచ్చి విలేఖరులకు చూపించారు. “వీరు తాలిబాన్ మిలిటెంట్లా?” అని ఏడుస్తూ ప్రశ్నించారు. అంతకుముందు ఆ ప్రాంతంలో జరిగిన కాల్పుల యుద్ధంలో ఒక నాటో సైనికుడు మరణించడంతో విమాన దాడులకు పురమాయించారని బిబిసి తెలిపింది.
అమెరికా, దాని మిత్ర రాజ్యాల కూటమి ఆఫ్ఘనిస్ధాన్ యుద్ధంలో తమ దాడుల్లో పదుల వేల సంఖ్యలో జరిగిన పౌరుల మరణాలను చెప్పకుండా దాచిపెట్టిన విషయం అమెరికా రాయబారులు రాసిన డిప్లొమేటిక్ కేబుల్స్ ద్వారా వెల్లడైన సంగతి తెలిసిందే. వేలమందిని చంపుతున్న పశ్చిమ దేశాల అధ్యక్ధులు ప్రధానులను ఐ.సి.సి లో విచారణ చేసి శిక్షించాలని ప్రపంచం డిమాండ్ చేయాలి.
బుధవారం ఈశాన్య మూలన ఉన్న నూరిస్తాన్ రాష్ట్రంలో నాటో సేనలు జరిపిన బాంబుదాడుల్లో ఆఫ్ఘన్ ప్రభుత్వ సైనికులే చనిపోయారు. వారితో పౌరులు కూడా చనిపోయారని ఆ రాష్ట్ర గవర్నరు ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధకు తెలిపాడు. 20 మంది ఆఫ్ఘన్ ప్రభుత్వ పోలీసులు 18 మంది పౌరులు నాటో బాంబు దాడుల్లో చనిపోయారని ఆయన తెలీపాడు. 30 మంది మిలిటెంట్లు కూడా చనిపోయారని బిబిసి చెబుతోంది. తమ పోలిసులు, పౌరులపై బాంబులేసి చంపడాన్ని ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ యధావిధిగా ఖండించాడు. బుధవారం నాటి పౌరుల మరణాలకు నాటో ఒక కధ తయారు చేసి పెట్ట్టుకుంది. మిలిటెంట్ల వద్ద మందుగుండు ఐపోవడంతో వారు సమీపంలో ఉన్న ఇళ్ళలోపలికి పరిగెత్తారట. ఆ ఇళ్ళపై నాటో విమానాలు బాంబులు వేయడంతో పౌరులు పోలీసులు చనిపోయారట. అంతకు ముందే అధికారులు ఆ ప్రాంతాన్ని తిరుగుబాటుదారుల నుండి వశం చేసుకున్నారట. వశం చేసుకున్నపుడు నాటో ఎందుకు దాడులు చేయవలసి వచ్చిందో, మిలిటెంట్లనుండి వశం చేసుకుంటే అక్కడ 30 మంది మిలిటెంట్లు ఇంకా ఎందుకున్నారో వివరణ లేదు.
యుద్ధాలతో తమ ఆర్ధిక సంక్షోభ పరిస్ధ్కారానికి ప్రయత్నిస్తున్న పశ్చిమ దేశాలు, తమ సమస్యలను పరిష్కరించుకోలేక పోగా తమ దేశాల్ని మరింత సంక్షోభం లోనికి నెడుతున్నారు. ఫలితంగా పశ్చీమ్ దేశాల ప్రజలు నిరుద్యోగులుగా, దరిద్రులుగా, బికారులుగా మారిపోతున్నారు. తమ బహుళజాతి సంస్ధలకు కాంట్రాక్టులు దక్కినంత కాలం తమ ప్రజలు ఏమైపోయినా వారికి ఫర్వాలేదు.