రంగనాయకమ్మ గారు – జానకి విముక్తి – మార్క్సిజం


(పుస్తకం బ్లాగ్ లో జానకి విముక్తి నవల పైన సమీక్ష రాశారు. సమీక్షపైన అర్ధవంతమైన చర్చ జరుగుతోంది. అక్కడా కామెంటు రాయడం మొదలుపెట్టి అది కాస్తా ఎక్కువ కావడంతో ఇక్కడ నా బ్లాగ్ లో పోస్టుగా రాస్తున్నా.)

“ఒక మంచి డాక్టర్ కావాలంటే ముందు వారు మార్క్సిస్టు అయి ఉండాలి. ఒక మంచి తండ్రి కావాలంటే ముందు మార్కిస్టు అయి ఉండాలి. …” అని రంగనాయకమ్మగారు తన ‘పెట్టుబడి పరిచయం’ పుస్తకం వెనక అట్టమీద రాస్తారు. మార్క్సిజాన్ని చదివితేనే ఎవరైనా ఒక మంచి “_____” (ఖాళీలొ మనుషుల లక్ష్యాలు ఏవైనా పెట్టుకోవచ్చు) అవుతారని రంగనాయకమ్మ చెప్పదలుచుకున్నారు. అయితే ఇక్కడ ఆవిడ చెప్పేది ఒక శాసనంలాగా, తప్పనిసరి షరతు లాగా ధ్వనిస్తుంది. మార్క్సిజంతో పరిచయం లేనివారికి అది చాలా అభ్యంతరకరంగా తోచడం సహజం. అందువలనే మార్క్సిజం లేకపోతే ఇక ప్రపంచమే లేదా, అది లేకపోతే ప్రపంచం బతకదా? అనే ప్రశ్నలు కూడా సహజంగానే ఉద్భవిస్తాయి.

వాస్తవానికి మార్క్సిజం గొప్పతనం గురించి చెప్పడానికి మాత్రమే ఆవిడ అలా రాశారని గమనించాలి. మార్క్సిజంతో పరిచయం లేకపోయినా అభ్యుదయంగా ఆలోచించేవారూ, మంచి భర్తగా, మంచి భార్యగా, మంచి డాక్టర్ గా, ఇంకా మంచి “___”గా ఉన్నవారు, ఉంటున్నవారు చాలామంది ఉన్నారు. ఆ అభ్యుదయ భావాలు, మంచితనానికి మార్క్సిజానికి సంబంధించిన అవగాహన కూడా తోడయితే అటువంటి మంచివారూ, అభ్యుదయ కాముకులూ తన కుటుంబమూ, స్నేహితులతో పాటు సమాజానికి కూడా మరింత ప్రతిభావంతంగా ఉపయోగపడతారని రంగనాయకమ్మగారు (ఆ మాట కొస్తే మార్క్సిజం చదివినవారు ఎవరైనా సరే) చెప్పదలుచుకున్నారని గమనించాలి.

మార్క్సిజం తెలిసి ఉంటే వివిధ రకాల మనుషులు లేదా వృత్తుల్లో ఉన్నవాళ్ళు సమాజానిక మరింత సమర్ధవంతంగా ఉపయోగపడతారని ఇక్కడ రంగనాయకమ్మగారి భావన తప్ప మార్క్సిజంపై అవగాహన లేకపోతే ఏమవుతారు అన్న ప్రశ్నకు ఆవిడ చెప్పినదాంట్లో సమాధానం వెతకరాదని గమనించాలి. అంటే మార్క్సిజంపై ఆవిడ చెప్పే విషయాలు ఒకవైపునుండి చూసినప్పుడే అవిడ సరిగ్గా అర్ధమవుతారు. రెండో చివరనుండి చూస్తే వచ్చే అర్ధాలు ఆవిడ ఉద్దేశ్యంలో లేవని గమనించాలి. అంటే… మార్క్సిజం తెలిస్తే… మనుషులెలా ఉంటారో చెప్పింది తప్ప, మార్క్సిజం తెలియక పోతే గనక ఖచ్చితంగా అది తెలిసినవారికి వ్యతిరేకంగా ఉంటారని ఆవిడ ఉద్దేశ్యం కాదు.

“ఒక మంచి డాక్టరు కావాలంటే ముందు అతను/ఆమె మార్క్సిజం తెలుసుకొని ఉండాలి” అంటే, “మార్క్సిజం తెలియకపోతే చెడ్డ డాక్టర్ అవుతాడు” అని అర్ధం చేసుకుంటే అది తప్పని గమనించాలి.

మార్క్సిజం అనగానే చాలామందికి సుత్తీ కొడవలి, ఎర్రజెండా, పోరాటాలు, తుపాకి గొట్టం… ఇలాంటివే కనపడతాయి. కాని అవన్నీ వాస్తవానికి కొన్ని కోణాల్లో కనిపించే సంకేతాత్మక (సింబాలిక్) వస్తువులే తప్ప అవే మార్క్సిజం కాదు.

మార్క్సిజం అనేది ఒక సామాజిక శాస్త్రం, ఒక ఆర్ధిక శాస్త్రం. ఒక రాజకీయ శాస్త్రం కూడా. తత్వ శాస్త్రంలో సమస్త శాస్త్రాలూ ఇమిడి ఉంటాయని తెలిస్తే మార్క్సిజం ఒక తత్వ శాస్త్రం. అప్పటివరకూ తత్వ శాస్త్రం అంటే పండితులు మేధావులూ మాత్రమే చర్చించుకునే శాస్త్రం అని భావిస్తున్న దశలో మార్క్సిజం మొదటి సారిగా తత్వశాస్త్రాన్ని సామాన్య ప్రజల చెంతకు తెచ్చింది. సమాజం ఎలా ఉందో అప్పటివరకూ తత్వశాస్త్ర పండితులు చెబితే ఉన్న సమాజాన్ని సమస్త ప్రజా బాహుళ్యాలకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో మార్క్సిస్టు తత్వశాస్త్రం చెప్పింది. అందుకనే అదింకా సజీవంగా నిలిచి ఉంది. అది సమాజం గురించి వివరిస్తుంది. సమాజంలో వివిధ వర్గాల ప్రజల మధ్య సంబంధాలను విశ్లేషిస్తుంది. సామాజిక సంబంధాలు ఆర్ధిక, రాజకీయ వ్యవస్ధలతో ఎలా ఆధారపడి ఉన్నాయో వివరిస్తుంది. సామాజిక సంబంధాలు సరిగా ఉన్నాయో లేదో చర్చిస్తుంది. సరిగా లేని సంబంధాలను ఎలా మార్చుకోవచ్చొ చెబుతుంది. మార్చుకోవడానికి అవసరమైన సైద్ధాంతిక ఉపకరణాలను అందిస్తుంది.

సామాజిక సంబంధాలను సరిగా అర్ధం చేసుకున్న డాక్టరు సమాజం అనుభవిస్తున్న సంపదలన్నీ శ్రమ ద్వారానే సృష్టించబడ్డాయని గ్రహిస్తాడు. సంపదలు సృష్టించే శ్రామికుడు శ్రమకు తగిన ఫలితం లేక పేదవాడిగా మిగిలాడని గ్రహిస్తాడు. అందువలన డబ్బులేని కూలీలు, కార్మికులు నిజానికి గౌరవనీయులనీ, అతని శ్రమే ప్రపంచ సంపదలకు మూలాధారమనీ గ్రహింపుతో పేద, గొప్ప తేడాలను నిరసిస్తాడు. పేదవారికి తక్కువ ఖర్చుతో, అసలు డబ్బులు కూడా లేకుండా వైద్యం చేయడానికి ముందుకు వస్తాడు. జార్ఘండ్ లో బినాయక్ సేన్ అలాంటి వైద్యుడే. అతని వైద్య జీవితమంతా గిరిజలుల జీవితాలకే అంకితం. తన వైద్య వృత్తిని డబ్బు కోసం కాకుండా మనుషుల కోసం, అందునా శ్రమ చేసే మనుషుల కోసం అంకితం చేశాడు. ఎ.పి ప్రభుత్వం ఎం.బి.బి.ఎస్ చదివిన వాళ్ళు తప్పనిసరిగా రెండు సంవత్సరాలు గ్రామాల్లో పనిచేయాలని నిబంధన తేబోతే జూ.డాలు సమ్మెకు దిగడం గమనిస్తే మంచి డాక్టరు, అందునా మార్క్సిజం తెలిసిన డాక్టరు ప్రాముఖ్యత అర్ధం అవుతుంది.

రంగనాయకమ్మగారు వ్యక్తిగత జీవితాలు సామాజిక వ్యవస్ధలతో ముడిపడి ఉన్న విషయాన్ని ప్రతి అంశంలోనూ చెబుతారు. కనుక వ్యక్తిగత బాగోగులు సమాజం బాగోగులతో ముడిపడి ఉన్న సంగతిని మనముందు ఉంచడానికి ప్రయత్నిస్తారు. మార్క్సిజం సమాజం బాగోగులను గురించే పట్టించుకున్న శాస్త్రం. అందువలనే జానకి విముక్తిని సమాజం విముక్తిని ప్రతిపాదించే మార్క్సిజంతో ముడిపెట్టి నిజమైన విముక్తి ఎలా వస్తుందో చెప్పడానికి ప్రయత్నించారు.

ఇక్కడ మార్క్సిజం గాల్లోంచి వచ్చింది కాదని గమనించాలి. సమాజాన్నీ, సామాజిక సంబంధాలనీ, సామాజికార్ధిక సంబంధాలనూ, రాజకీయార్ధిక సంబంధాలనీ తన జీవితకాలంలో అధ్యయనం చేసిన మార్క్సు “ఇదిగో, సమాజం, ప్రకృతి ఫలానా నియమాల ప్రకారం నడుస్తోంది. కొద్దిమంది స్వార్ధపరులు ఆర్ధిక వనరులను గుప్పిట్లో పెట్టుకుని మొత్తం సామాజిక గమనాన్ని తలకిందులుగా నడిచేలా శాసిస్తున్నారు” అని ఉన్న విషయాన్ని వీవరిస్తూ తాను గ్రహించిన సామాజిక నియమాల వెలుగులోనే తలకిందులుగా నడుస్తున్న సమాజాన్ని యధాస్ధానానికి ఎలా తెచ్చుకోవాలో ఒక మార్గాన్ని చూపించాడు. ఆ మార్గంలోనే సామాజిక, రాజకీయ, ఆర్ధిక అపసవ్యతలను ఎలా సవరించుకోవచ్చునో వివరించాడు. సైన్సు సూత్రాలు విశ్వజనీనమైనట్లే మార్క్సిస్టు శాస్త్రం కూడా విశ్వజనీనమైనది. ఒక జాతి, మతం, ప్రాంతం, దేశం అన్న పరిమితులతో నిమిత్తం లేకుండా మానవ సమాజాలన్నింటి గమనాన్ని మార్క్సిజం వివరిస్తుంది గనక అన్ని దేశాలకూ, అన్ని సమాజాలకూ, అన్ని ప్రాంతాలకూ అది పరిష్కారాన్ని సూచిస్తుంది.

అయితే మార్క్సిజం గురించి పరిచయం లేనివారికి మార్క్సిజానికీ, సమాజానికి ఉన్న సంబంధంతో గూడా పరిచయం ఉండదు. వారు మార్క్సిజం గొప్పతనాన్ని ఒప్పుకోమని శాసించలేము. మార్క్సిజం ఫలానా చెబుతుంది అని ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా చెబుతుంటారు. అలా చెబుతున్న చోట మార్క్సిజం నిజానికి ఏం చెబుతుందో చెప్పడానికి ప్రయత్నించవచ్చు. వారు చెబుతున్నది నిజమని నమ్ముతున్నవారికి మాత్రమే మార్క్సిజం ఏం చెబుతుందో చెప్పగలం కానీ, మార్క్సిజంపై గుడ్డి ద్వేషంతో అదేం చెబుతుందో కూడా తెలియకుండా అది ఫలానానే చెబుతుందని వాదించేవారికి మార్క్సిజం గురించి బోధించాలని చూడటం వృధా ప్రయాస.

నిజానికి రంగనాయకమ్మగారు జానకి విముక్తి నవలను అంత ప్రతిభావంతంగా రాయడానికి కారణం ఏమిటి? ఆవిడ అధ్యయనం చేసిన మార్క్సిజమే దానికి కారణం. ఆచరణ, అధ్యయనాలతో సంపాదించిన జ్ఞానం ద్వారనే జానకి విముక్తి ని ఆకట్టుకునేలా, చదివిన మహిళల్లో అత్యదికులు నవలలో ఏదో ఒక చోట “ఇది నా జీవితమే” అని భావించేలా రాయగలిగిందని గమనిస్తే ఆవిడ మార్క్సిజం గురించి ఆ నవలలో చెప్పడానికి ఎందుకు తాపత్రయపడిందీ అర్ధం అయ్యే అవకాశం ఉంది.

(అవసరాన్ని బట్టి ఈ పోస్టును మరింత అర్ధవంతంగా మార్చడానికి కొన్ని మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉంది. -విశేఖర్)

15 thoughts on “రంగనాయకమ్మ గారు – జానకి విముక్తి – మార్క్సిజం

 1. మార్క్సిజం ఒక సిద్దాంతం గా చదువుకోవటానికి, ఇలా ఉంటే బాగుండును అనుకోవటానికి మాత్రమె పనికి వస్తుంది. ఆచరణకు అసాధ్యం.కారణం, ఆ సిద్ధంతాలన్నీ కూడా మానవ ప్రవృత్తికి వ్యతిరేకం. ఈ విషయం దశాబ్దాలపాటు కమ్యూనిస్టు పాలనలో మగ్గిన యూరోపులోని అనేక దేశాల ప్రజలు తెలుసుకుని ఆ ఇజాన్ని ఆవతల పారేసి, బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. ఇది 1990 లలో జరిగిన మార్పు. ఇక కథల్లో ఇజాల్ని ఇరికించి వ్రాయటం అనేది మన తెలుగు సాహిత్యంలో బాగా ఎక్కువయ్యింది. సాహిత్యం పేరుతొ కమ్యూనిస్టు పార్టీ విధానాలను “ప్రచారం” చేసుకోవటానికి, ఈ కథలు, నవలలను ఒక మీడియంగా వాడుకోవటం జరిగింది. అసలు, కొంతకాలం, రచయిత అంటే మార్క్సిస్టు భావజాల కథలే వ్రాయాలి అన్నంతవరకూ ఈ మార్కిస్టు ప్రభావం సమాజం మీద పడి ఆ తరువాత్తరువాత అదీ తొలగిపోయింది.

 2. విశేఖర్ గారూ,
  చాలా సంయమనంతో రాశారు మీరు! ఇలాంటి సంయమనం చాలా అరుదుగూఅ కనిపిస్తున్న రోజుల్లో!:-))

  జానకి విముక్తి నిస్సందేహంగా ఒక మంచి నవల! అందులో జానకి ప్రగతి కి మార్క్సిజం తోత్పడి ఉండొచ్చు. మార్క్సిజం తెలీక ముందు కూడా అందులో సత్యం చాలా మంచి వాడు, సహృదయుడు,అభ్యుదయ వాదీ!మీరు మీ టపాలో రాసిన మార్క్సిజంతో పరిచయం లేకపోయినా అభ్యుదయంగా ఆలోచించేవారూ, మంచి భర్తగా, మంచి భార్యగా, మంచి డాక్టర్ గా, ఇంకా మంచి “___”గా ఉన్నవారు, ఉంటున్నవారు చాలామంది ఉన్నారు…………నేను ఇంతవరకే ఇష్టపడుతున్నాను. నమ్ముతాను కూడా!

  మార్క్సిజం మనుషులని ఒక్కసారిగా మరింత గొప్పవాళ్లను చేస్తుందంటే నమ్మలేను. నాకెదురుపడ్డ (మా బాబాయిలు, ఇంకా కొందరు బంధులువు మార్సిస్టులే)మార్క్సిస్టులంతా అలాగే ఉన్నారు. ఇప్పుడు వెంటనే ఒక బాణం వచ్చి పడుతుంది.”నీకెదురు పడ్డవాళ్ళు అలా ఉంటే మార్క్సిస్టులంతా చెడ్డవళ్ళు కాదు” అని! కానీ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోడం మానవ సహజం కదా!

  జానకి విముక్తి నవల్లో జానకి విముక్తికి మార్క్స్జిజం సహాయపడ్డట్టు చూపించాలని రచయిత్రి అనుకున్నారు. రచయిత్రి మార్క్సిస్టు కాబట్టి, నవల్లోని ఇతర పాత్రలన్నీ మార్క్సిస్టు పాత్రలే కాబట్టి ఇహ అది అనివార్యం! కానీ అది నవల్లో మరీ ఎక్కువై పోయిందని మామూలు పాఠకులకు అనిపించిందా లేదా? ఒక మార్క్సిస్టుగా కాక, మామూలు పాఠకుడిగా చెప్పండి మీరు.

  సత్యం కి వచ్చే కల కూడా వెంకట్రావు ని “ప్రజాకోర్టు” లో విచారించి షూట్ చేసి పడేసినట్టు వస్తుంది తప్ప వాడిని మామూలుగా ఏ పోలీసు కేసో పెట్టి కోర్టుకీడ్చినట్టు, శిక్ష పడ్డట్టు రాదు. స్టడీ సర్కిల్ వాళ్ళ చర్చలు వాటిలో (ఎప్పటికీ ఎక్కడా సాధ్యం కాని) సమిష్టి వంట శాలల కబుర్లూ, సమిష్టి భోజన శాలల కబుర్లూ,కార్ఖానాలు, ఫాక్టరీలు…ఇవే! ఏడాదిన్నర పసివాడికి “ఎగురుచుంది ఎర్ర జెండా” అని పాటలు నేర్పడం..ఇవన్నీ పాఠకుడిని జానకి ప్రగతి ని గ్రహించడం కంటే “మార్క్సిజం” వైపు మళ్ళేలా చేయడానికన్నట్టు తోచింది నాకు. అంటే రంగనాయకమ్మ గారి జానకి విముక్తి చదవాలి అంటే “మార్క్సిజం పాఠాలు” బోనస్ అన్నమాట. ఈ మాట అంటే “ఇది మామూలు కమర్షియల్ నవల కాదు.ఒక ప్రయోజనంతో రాసిన నవల” అని జవాబు సిద్ధంగా ఉంటుంది.

  ఇప్పుడు మళ్ళీ ఎవరైనా వచ్చి “నీ చైతన్యం, అవగాహన ఇంతలో ఏడ్చాయి” అని చీవాట్లేస్తారేమో చూడాలి.:-))

  “ఇది నా జీవితమే” అని పాఠకురాళ్ళు ఎంతోమంది అనుకోగలిగారంటే దానికి కారణం రంగనాయకమ్మ గారు ప్రతిభావంతంగా రాయడమే కాదు,సమాజం నిండా జానకిలు ఉండటమే!ఈ జానకిలందరూ కూడా తమ సమస్యలను వ్యక్తిగతంగా భావించి వాటిలోంచి బయటపడాలని ఆశిస్తారే గానీ పుస్తకం సైట్లో ప్రసాద్ గారు రాసినట్టు “సమాజంలోని మార్పులన్నీ పూర్తయ్యేదాకా” ఏదో ఒక తాత్కాలిక పరిష్కారం తో సరిపెట్టుకుందామనీ,చివరికి మార్క్సిజం సహకారంతో స్త్రీల జీవితాలు ఒక పది వేల యేళ్ళ తర్వాత(అప్పటికి సమాజంలో మార్పులన్నీ పూర్తవుతాయని అనుకుంటే) బాగుపడి సుఖ శాంతులతో ఉంటాయనీ తృప్తి పడరు.

  అలాగే శివరామ ప్రసాద్ గారి వ్యాఖ్యతో నేను కొంత వరకూ ఏకీభవిస్తున్నాను. మార్క్సిజం గొప్ప సామాజిక శాస్త్రమైతే కావొచ్చునేమో……మార్క్సిస్టు సిద్ధాంతాలు మానవ ప్రవృత్తికి వ్యతిరేకమైనా కాకపోయినా, ఆచరణకు సాధ్యం కానప్పుడు అది ఎంత గొప్ప శాస్త్రమైనా లాభం లేదు.

  దీనికి గుడ్డి ద్వేషం అని మీరు పేరు పెడతానంటే నాకేం అభ్యంతరం లేదండోయ్!

 3. సుజాత గారికి
  మీరు రాసిన క్రమంలో స్పందిస్తాను (అవసరమైన చోట)
  అవును ఎవరైనా చేయగలిగింది అదే. తమకు ఇష్టమైనంతవరకే స్వీకరిస్తారు. నమ్ముతారు కూడా. తమ ఆలోచనా పరిధిలో తర్కించుకుని ‘ఇది బాలేదు’ అనిపిస్తే ఇంకొంతమంది చర్చకు దిగుతారు. ఎక్కువమంది వదిలేస్తారు. నా అభిప్రాయంలో చర్చకు దిగినవారిని మీ పరిధి ఇంతే. అందుకే రంగనాయకమ్మగారు రాసింది అర్ధం కాలేదు అని సరైన పద్ధతిలో చెప్పకుండా ఎద్దేవా చేస్తే అది పద్ధతికి విరుద్ధం. చేతనైతే మనకు తెలిసి నమ్ముతున్న విషయాన్ని తెలియజెప్పి ఒప్పించడానికి ప్రయత్నించాలి తప్ప వెటకారం చేస్తే అసలు విషయం పైనే వ్యతిరేకత వస్తుంది. మార్క్సిజం తెలుసు అనుకుంటున్నవారు చాలామంది ఇలా చేస్తున్నారు. అది సవరించుకోవలసిన విషయం.

  లేదు. మార్క్సిజం ఒక్కసారిగా ఎవర్నీ మరింత గొప్పవాళ్ళను చేయడం అసాధ్యం. ముందు మార్క్సిజం అర్ధం చేసుకోవాలి. అర్ధం చేసుకుంటున్న క్రమంలోనే సమాజానికీ మార్క్సిజానికీ ఉన్న సాపత్యాన్ని అర్ధం చేసుకోగలగాలి. ముఖ్యంగా సామాజిక సంబంధాల విషయంలో మార్క్సిజం చెబుతున్నది వాస్తవమా, కాదా అన్న విషయంలో ఒక అంగీకారానికి రావాలి. అపుడు మాత్రమే మార్క్సిజం మనుషుల్ని మార్చగలుగుతుంది. అయితే మార్క్సిజం అర్ధం అయిన తర్వాతే మార్పు మొదలవుతుందని కాదిక్కడ. మార్క్సిజం అర్ధం చేసుకుంటున్న క్రమంలో నెమ్మదిగా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇది నిజాయితీ పరుల విషయంలోనే వాస్తవం అన్నది ముఖ్యంగా గమనించాలి.

  ఎందుకంటే, మార్క్సిస్టులం అని తమను తాము చెప్పుకునే వారు రకరకాలుగా ఉంటారు. పైన నిజాయితీపరులు కొందరైతే, మార్క్సిజాన్ని కొంతవరకే అర్ధం చేసుకుని తమకది పూర్తిగా తెలుసనుకునే వారు చాలమంది ఉన్నారు. అలా కొంతవరకే తెలుసుకున్నవారు అసలు తెలియని చాలామంది ముందు తెలిసీ తెలియని జ్ఞానాన్ని ప్రదర్సిస్తారు. వీరికి సహజంగా కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి. ఆ ప్రశ్నలకు జవాబు చెప్పలేని స్ధితిలో ఉంటారు. ‘జవాబు చెప్పలేను, నేనంతగా అర్ధం చేసుకోలేదు’ అని చెప్పడానికి బదులు తమకు తెలిసిన పరిధిలోనే సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అది వాస్తవానికి మార్క్సిజంతో సంబంధం లేనిదై ఉండవచ్చు. వీరి వలన మార్క్సిజం అసలు తెలియని వారికి అర్ధ సత్యాలు, పూర్తి అసత్యాలు అంది మార్క్సిజం పైనే వ్యతిరేకత ఏర్పడ్డానికి కారణమవుతోంది.

  ఉదాహరణకి రంగనాయకమ్మగారి నవల వెనక అట్ట మీది విషయాన్నే తీసుకుందాం. “అవును, ఆవిడ చెప్పింది ముమ్మాటికీ కరెక్టే. మంచి డాక్టరు కావాలంటే అతను మార్క్సిస్టు కావాల్సిందే. మార్క్సిజం అంత గొప్పది మరి. మార్క్సిజం గురించి మీకేమీ తెలియదు” అని చెప్పేస్తే అవతలి వారు అంతే కటువుగా తమకు కరెక్టనుకున్న దాన్ని చెప్పేస్తారు. దాంతో పాటు మార్క్సిజం పట్ల కూడా ఆటోమేటిక్ గా కొంత నెగిటివ్ ఆలోచన వారిలో నాటుకుంటుంది. అలాంటివారు మరో నలుగురు ఎదురైతే చాలు. మార్క్సిజంపై పూర్తి వ్యతిరేకత పెంచుకోవడానికి.

  కొంతమంది మార్క్సిజం పూర్తిగా, లేదా తగినంతగా అర్ధం చేసుకున్నా, వారి వ్యక్తిగత లోపాల వలన, అసమర్ధత వలన మర్క్సిజంపై తప్పు అభిప్రాయాలు ఏర్పడ్డానికి కారణమవుతారు.

  ఇకపోతే మార్క్సిస్టు పార్టీలుగా, కమ్యూనిస్టు పార్టీలుగా ఉన్న సంస్ధల్లో పని చేస్తున్నవారు. అలా చెప్పుకుంటున్న పార్టీలన్నీ కమ్యూనిస్టు పార్టీలు కాదని గమనించాలి. కమ్యూనిస్టు సిద్ధాంతాలు వల్లిస్తూ, జీవితంలో ఏ క్షణంలో కూడా అది చెప్పే అంశాల్ని పాటించకుండానే వీరు కమ్యూనిస్టులు చెలామణి అవుతుంటారు. ఇప్పుడు ప్రధాన స్రవంతిలో ఉన్న పార్టీలేవీ మార్క్సిజం చెప్పిన సూత్రాలేవీ పాటించడం లేదు. కనీసం పాటించడానికి కూడా ప్రయత్నించడం లేదు. వారి వలన ఇండియాలో మార్క్సిజానికి రావలసినంత చెడ్డపేరు వచ్చింది.

  మేము/నేను కమ్యూనిస్టులం అని చెప్పుకునే వారంతా కమ్యూనిస్టులు కాదు. మార్క్సిజం అనేది ఒక ఆచరణీయ సిద్ధాంతం. దాన్ని ఆచరించడానికి నిజాయితీ, నిబద్ధత ఉండాలి. దానికోసం పని చేయాలి. తాము కమ్యూనిస్టులమని చెప్పుకున్నా, చెప్పుకోకపోయినా ఆ సూత్రాల ప్రకారం నిజాయితీగా పనిచేస్తున్నవారు తప్పని సరిగా సమాజం నుండి ప్రశంసలు పొందుతారు. అందులో అనుమానం లేదు.

  కాని కమ్యూనిస్టులం/మార్క్సిస్టులం అని చెప్పుకుంటున్నవారు పాటించేదంతా కమ్యూనిజం కాదని గ్రహించడానికి జనం దగ్గర ఉపకరణాలేవీ లేవు. అందువలన కమ్యూనిస్టులమని చెప్పుకుంటున్నవారు చేసిందే మార్క్సిజంగా చెలామణి అవుతోంది. పుస్తకాలు (ఏవైనా సరే) చదివి జ్ఞానం పొందిన వారు సహజంగా మేధావులుగా చెలామణి అవుతుంటారు. కాని జ్ఞానం పొందటంతో పాటు దాన్ని సమాజానికి ఉపయోగం లో పెట్టగలిగిన వారే నిజమైన మేధావి అని చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మావో అంటాడు. నేను దాన్ని సంపూర్ణంగా నమ్ముతాను. మార్క్సిజం కూడా అంతే. మార్క్సిజం చదివి అర్ధం చేసుకోని, అది నచ్చి నమ్మడంతోనే మార్క్సిస్టులు/కమ్యూనిస్టులు ఐపోరని నా అభిప్రాయం. నమ్మినవారు ఆచరించడానికీ, పదిమందికీ ఉపయోగపెట్టడానికీ ఏదోమేరకు ప్రయత్నించాలి. అప్పుడే వారు మార్క్సిస్టులు/కమ్యూనిస్టులుగా చెప్పుకోవడానికి అర్హులు.

  నేనంటున్నది “నీకెదురు పడ్డవాళ్ళు అలా ఉంటే మార్క్సిస్టులంతా చెడ్డవాళ్ళు కాదు” అని కాదు. “గుండు చేయించుకుంటున్న వారంత భక్తులు కానట్టే, మార్క్సిస్టులుగా చెలామణి అవుతున్నవారంతా మార్క్సిస్టులు కాదు. అదే కాకుండా చెడ్డవాళ్ళెవరూ మార్క్సిస్టులు అసలే కాదు” అని. నాకు తెలిసి రంగనాకయమ్మ గారిని తీవ్రంగా అభిమానిస్తూ నిజ జీవితంలో గూండాయిజం చేస్తూ, లిటిగెంట్ గా డబ్బు సంపాదిస్తున్నవారు ఉన్నారు. మార్క్సిజం తరపున అతను చేసే వాదన కూడా గూండాయిజం తో చేస్తుంటాడు. అటువంటి వారు అసలు మార్క్సిస్టులు కానే కారు. మీరన్నట్లు అనుభవాలనుండే ఎవరైనా ఏ విషయంపైనైనా ఒక నిర్ణయానికి వస్తారు. అయితే ఇది మార్క్సిజం, ఇది మార్క్సిజం కాదు అని విడమరిచి చెప్పే పరిస్ధితి ఇప్పుడు సమాజంలో లేదు. కమ్యూనిస్టులుగా ఉన్నవారు సైతం అలా వివరించేందుకు ఉదాహరణలు గా లేరు. అందువలన మార్క్సిస్టులుగా అనుకుంటున్న నిజాయితీపరులు ఓపిగ్గా పనిచేయడమే చేయగలిగింది.

  ఓ సిద్ధాంతం గొప్పదని చెప్పినంతలోనే గొప్పదైపోదు. అది ఆచరణలో రుజువైతేనే గొప్పదవుతుంది. మార్క్సిజం-లెనినిజం అలా ఆచరణలో రష్యా, చైనాల్లో రుజువైంది. కాని కొంతకాలమే. అది కూడా చాలా లోపాలతో అమలయ్యింది. లోపాలు సవరించుకుని సరైన పద్ధతిలో అమలు చేసేలోపే ఆ దేశాల్లొ రాజకీయ మార్పులు సంభవించాయి. రష్యాలో స్టాలిన్ మరణం తర్వాత, చైనాలో మావో మరణం తర్వాత సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం ఆగిపోయి పెట్టుబడిదారీ వ్యవస్ధవైపుకి వెనక్కి ప్రయాణం కట్టారు. ఇప్పుడు చైనాలో ఉన్నది కమ్యూనిస్టు పార్టీ కాదు, సోషలిస్టు వ్యవస్ధా కాదు. ఆ ముసుగులో ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్ధ మాత్రమే. చైనా ప్రజల్లో ఇంకా మావో పట్ల అభిమానం పోలేదు. అందువలన రష్యాలాగా కమ్యూనిజాన్ని బహిరంగంగా త్యజించడానికి వెనకాడుతున్నారు.

  సత్యం ప్రజాకోర్టులో విచారించే కదా శిక్ష వేసేది. కేసు, కోర్టు అన్నీ “ప్రజా కోర్టు” అన్నదాన్లోనే వచ్చేశాయి. ఇప్పుడు మావోయిస్టులు అనుసరిస్తున ప్రజాకోర్టులు మార్క్సిస్టు సిద్ధాంతంతో సంబంధం లేనివి. అవి మార్క్సిజం అని వారు నమ్మినా, చెప్పినా అవి మాత్రం మార్క్సిజం కానే కావు. అలా ఏకపక్షంగా చంపేయమని ఎవరూ చెప్పలేదు. చైనాలో విప్లవం వచ్చాక గూడా భూస్వాముల భూములు వశం చేసుకోవడం పార్టీ గైడెన్స్ లో జరిగిన చోట వెనువెంటనే మొరటుగా జరగలేదు. భూస్వామిలో క్రమంగా మార్పు రావడానికి కొన్ని సంవత్సరాలు వేచి చూసిన ఉదాహరణలు ఉన్నాయి. దానితో పాటు స్ధానిక నాయకులకు అవగాహన లేని చోట మొరటుగా లాక్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రారంభ దశల్లో అప్పటికీ సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణానికి సంబంధించిన అనుభవం లేనందున రష్యా, చైనాల్లో చాలా తప్పులు దొర్లాయి. అవి ఉద్దేశ్య పూర్వకంగా జరగలేదని గమనించాలి.
  “మార్క్సిజం వైపు మళ్ళేలా చేయడం” నేరం కాదు కదా సుజాత గారూ. అది మంచిది. వెలుగునిస్తుంది అని నమ్మి రంగనాయకమ్మ గారు ఆ ప్రయత్నం చేశారు. మీకు కావలసినంత మీరు తీసుకున్నారు. మార్క్సిజంతో కలిపి జానకి విముక్తిని స్వీకరించిన వారు (నాకు తెలిసి తక్కువేననుకోండి) కూడా ఉన్నారని గమనించండి. మార్క్సిజం గ్రహించకపోయినా, తనకు అర్ధం అయిన మేరకు తన జీవితాన్ని బాగుచేసుకోవడానికి ప్రయత్నించిన వారూ ఒకరిద్దరు నాకు తెలుసు. జానకి విముక్తి చదివి అర్జెంటుగా మార్క్సిస్టులు కావాలని రంగనాయకమ్మ గారు కూడా అనుకుని ఉండరు. మార్క్సిజం గురించిన పరిచయం ఇవ్వడం ద్వారా ఆ ఇజం గురించి ఆలోచించేలా ప్రేరేపించడానికి ఓ ప్రయత్నం చేస్తే తప్పు కాదు కదా!

  అవును. బోనస్సే. మార్క్సిజం పై ఆసక్తి పెంచగలిగితే అది బోనస్సే. అసక్తి కలిగించకపోయినా నష్టం లేదు. జానకి విముక్తితో మార్క్సిజంతో సంబంధం లేకుండా ప్రేరేపణ పొందగలిగనా ఉపయోగమే. పది రూపాయల వలన కొంత ఉపయోగం. ఇరవై రూపాయల వలన మరింత ఉపయోగం. మార్క్సిజంపై ఆసక్తి పెంచగలిగితే జానకి విముక్తి ఉపయోగపు విలువ అనేక రెట్లు పెరుగుతుంది. అదే రంగనాయకమ్మ గారి ప్రయత్నం. దాన్లో తప్పులేదని అనుకుంటున్నాను.

  శివరామ కృష్ట గారు “మార్క్సిజం ‘ఇలా ఉంటే బాగుండును’ అనుకోవడానికి పనికొస్తుంది” అన్నారు కదా. అదే నాకు సంతోషం. మార్క్సిజం మంచి చెబుతుంది అని ఆయన రూఢి పరిచారు. అయితే ఆచరణీయమా కాదా అన్నదగ్గరే ఆయన, మీరు విభేదిస్తున్నారు. ఆ అంశం నిజానికి సాపేక్షికం. చైనా, రష్యా విప్లవాల గురించి చదివితే మీ అభిప్రాయం మారవచ్చునేమో. ఆ విప్లవాల గురించి మీరు చదివి ఉండరని నేనిలా అంటున్నా. చదివి కూడా మీకు అలాగే అనిపిస్తే అది చర్చనీయాంశం. మానవ ప్రవృత్తి అని శివరాం గారు చెప్పింది కూడా సాపేక్షమైనదే. గతంలో బానిస, భూస్వామ్య సమాజాల్లో మానవ ప్రవృత్తిగా కనిపించింది ఇప్పుడు మానవ ప్రవృత్తికి వ్యతిరేకంగా మారింది. బానిస సమాజంలో బలహీనుల్ని బానిసలుగా చేసుకోవచ్చు. కాని ఇప్పుడు వెట్టి చాకిరి చట్ట విరుద్ధం. అలానె మార్క్సిజం ప్రతిపాదించే సిద్ధాంతాలు మానవ ప్రవృత్తికి వ్యతిరేకం అని శివరాం అంటున్నారు గాని, అవి మానవ సమాజానికి అత్యవసరం అని చెబుతున్నావారూ ఉన్నారు కదా? సమాజాన్ని మనం అర్ధం చేసుకున్న దృక్పధాన్ని బట్టే ఏ అంశానాన్నైనా చూస్తాం. మార్క్సిజాన్ని కూడా అలానే చూసి ప్రకృతా, వికృతా అన్నది తేల్చేసుకుంటాం. కానీ మానవ సమాజానికి ఏది మంచిది అన్న ప్రశ్నకు విశ్వజనీనన మైన సమాధానం ఎల్లప్పుడూ ఉంటుంది. దాన్ని చూడగలగడమే ఇక్కడ కావలసింది.

  లేదు. గుడ్డి ద్వేషం అనుకోవడం లేదు. ఎందుకంటే మీ మాటల్లో నాకు ద్వేషం కనిపించడం లేదు. మీకు ఎదురైన అనుభవాల నేపధ్యంలో మీరు కొన్ని అభిప్రాయాలకి వచ్చారని నాకర్ధం అయింది. ఆ అభిప్రయాలు కూడా మార్క్సిజంపై ద్వేషంతో ఉన్నట్లు నాకనిపించడం లేదు. మీరు పైన రాసినంత వరకు మార్క్సిజంపై మీ అభిప్రాయాలు తటస్ధంగా ఉన్నాయని నాకనిపిస్తోంది.

  అవుని మీరన్నది కరెక్టు. సమాజంలో జానకిలు చాలామంది ఉన్నారు కనకనే ఆ నవల అంత పాపులర్ అయింది. అందులో అనుమానం లేదు. అయితే సంఘంలో స్త్రీలపై ఉన్న కుటుంబ హింస, అణచివేతలను సరైన దృక్పధంతో చూడగలిగినప్పుడే అంత ప్రతిభావంతంగా ఆకట్టుకునేలా రాయగలరు. రంగనాయకమ్మగారికి అటువంటి దృక్పధాన్ని మార్క్సిజం ఇచ్చిందని గమనించాలి. ఈ విషయం వెంటనే ఒప్పేసుకొమ్మని నేను కోరడం లేదు. నేనెందుకు (నేనంటే నేనే మీరు కాదు) ఇంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాను అని మీరొక (ఇక్కడ మీరే) ప్రశ్న వేసుకుని దానికి సమాధానాం కోసం ప్రయత్నిస్తే బాగుంటుందని నా సూచన.

  చాలా రాశానేమో. అన్యధా భావించవలదు.

 4. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జీవన విధానాన్ని పెట్టుబడీదారీ విధానం అని ఒక పేరు పెట్టేసి (అది ఎవరూ ప్రతిపాదించింది కాదు, సహజంగా పరిణామపూర్వకంగా వచ్చినది) దానిలో ఉన్న చెడ్డ లక్షణాలు అన్నిటికీ విరుగుడు కమ్యూనిజం మాత్రమె అనుకోవటం, అది కూడా మానవ పరిణామ క్రమంలో కాకుండా, లైబ్రరీలలో కూచుని వ్రాసిన సిద్ధాతం గురించి అలా అనుకోవటం ఏమంత శ్రేయస్కరం కాని విషయం. బానిసత్వం, కూడా మానవ ప్రవృత్తికి వ్ర్యతిరేకమే. కాని అది పోగొట్టటానికి మొత్తం మొత్తం సమాజానికే ముప్పు తెచ్చే సిద్ధాంతాలు అక్కర్లేదు. ఎప్పటికైనా ఏ సిద్ధంతమైనా సమాజంలోని వ్యక్తీ స్వాతంత్ర్యానికి ముప్పు కలిగించినప్పుడు అది తిరస్కరించబడుతుంది.

  ఇక ఒక విషయాన్ని గుడ్డిగా ద్వేషించటం లేదా గుడ్డిగా సమర్ధించటం దగ్గరకు వస్తే, కమ్యూనిజానికి నిజమైన శత్రువులు దానిని గుడ్డిగా సమర్ధించే వాళ్ళే. వాళ్ళు పిడివాదాలు చేసి, మిగిలిన వాళ్లకు అదంటే వైముఖ్యం కలిగించారు.ఈ పిడివాదాలు అనేకం. అందులో ఈ ఇజాన్ని సాహిత్యంలో జొప్పించటం కూడా ఒకటి. ఆ విధంగా సాహిత్యంలో ఇజాలను తీసుకువచ్చి సాహిత్య చరిత్రలో అదొక సంఘటనగా చేసారు.

 5. శివరాం గారూ, పెట్టుబడిదారీ విధానం సహజంగా పరిణామ క్రమంలో వచ్చిందని మార్క్సు చెప్పాడే కాని ఒకరు సృష్టించిందనీ, పధకం ప్రకారం ఏర్పాటు చేశారనీ చెప్పలేదు నాకు తెలిసినంతవరకూ. అదిమ కమ్యూనిస్టు సమాజం, బానిస సమాజం, భూస్వామ్య (ఫ్యూడల్) సమాజం, పెట్టుబడిదారీ సమాజం ఒక దాని తర్వాత ఒకటి పరిణామ క్రమంలో ఎలా ఏర్పడిందీ మార్క్సు వివరించాడు. పెట్టుబడిదారీ సమాజం అనివార్యంగా సోషలిస్టు సమాజంగా ఎలా పరిణామం చెందుతుందీ వివరించాడు. ఈ పరిణామం అనివార్యం. ఒకరి ఇస్టాయిస్టాలతో సంబంధం లేదని వివరించాడు. ఈ సమాజం మరింత అభివృద్ధి చెందిన సమాజంగా మార్పు చెందుతుందా లేదా అన్నది ప్రశ్న కాదు. ఎప్పుడు మారుతుంది అన్నదే ప్రశ్న. ఇప్పటి సమాజం ఎలాగే కొనసాగుతుంది అని అంటే అదీ పిడివాదమే అని గమనించాలి. అలాకాక మరింత అభివృద్ధి చెందుతుందని గ్రహిస్తె ఏ రూపం తీసుకుంటుందో చెప్పగలగాలి. మార్క్సు ఆ కొత్త రూపం సోషలిస్టు సమాజం అని చెప్పాడు. మీకు ఇంకేదైనా సమాజం వస్తుందని అవగాహన ఉన్నదా? లేక సమాజ అభివృద్ధి ఇక్కడితో ఆగిపోతుందని అభిప్రాయామా? శివరాం గారూ?

  లైబ్రరీలో కూచుని వ్రాసిన సిద్ధాంతం అని మీరు చెపుతున్నది పూర్తిగా అవాస్తవం. మార్క్సు స్వయంగా అనేక కష్టాలను అనుభవించాడు. అతన్ని యూరప్ దేశాలు ఒక చోట ఉండనివ్వకుండా బహిష్కరించాయి. చివరి దశలోనే ఇంగ్లండు వెళ్లాడు. తన జీవిత కాలంలో అనేక కార్మిక ఉచ్యమాల్లొ పాల్గొన్నాడు. పారిస్ కమ్యూన్ ని అతి దగ్గరనుండి పరిశీలించాడు. మార్క్సు తన సిద్ధాంతం ఎలా రూపొందిందీ, దానికి అనేక సైంటిఫిక్ ఆవిష్కరణలు ఎలా తోడ్పడిందీ కూడా వివరించాడు. ఇంగ్లండ్లొ అభివృద్ధి చెందిన పెట్టుబడీదారీ విధానాన్ని పరిశీలించి రాసిన పుస్తకం “దాస్ కేపిటల్”. మార్క్సిజం మొత్తం సమాజానికి ముప్పు తెచ్చేది అని మీరు ఎలా నిర్ధారించుకున్నారో తెలియజేయగలరా శివరాం గారూ.

  వ్యక్తి స్వాతంత్రాన్ని మార్క్సిజం తిరస్కరిస్తుందని చెప్పేది ప్రచారమే తప్ప అందులో వాస్తవం లేదు. ఇతరుల అభిప్రాయాలు చదివి ఒక అభిప్రాయం ఏర్పరుచుకునే బదులు అదేం చెబుతుందో స్వయంగా చదివి గ్రహించగలరని నా విజ్ఞప్తి. ఒక వేళ చదివే ఆ అభిప్రాయానికి మీరు వచ్చినట్లయితే మీరు చదివిన పుస్తకాలు ఏవో చెప్పండి. మీకు అర్ధం అయ్యిందే నిజం ఐతే, అది నాకూ ఉపయోగపడుతుందేమో.

  మార్క్సిజం పిడివాదం కాదని నా అవగాహన. పిడివాదం అంటే ఎల్లప్పుడూ ఒకే సూత్రాలతో అభివృద్ధి చెందకుండా ఉండేది అని నిర్వచనం అయితే, మార్క్సిజం పిడివాదం కాదు. పెట్టుబడిదారీ వ్యవస్ధ గురించి మార్క్సు, ఎంగెల్సులు రాశారు. సమాజంలో మనిషి అభివృద్ధి, రాజ్యం అభివృద్ధి ల గురించి ఏంగెల్సు రాశారు. మార్క్సు కాలంలో పెట్టుబడిదారీ దేశాలు ద్రవ్య పెట్టుబడిని ఎగుమతి చేసి ఇతర దేశాల ఆర్ధిక వనరులను దోచుకోవడం మొదలు కాలేదు. అందుకే మార్క్సు సామ్రాజ్యవాదం గురించి పూర్తిగా రాయలేదు. మార్క్సిజం సూత్రాల అధారంగా దాన్ని మరింత అభివృద్ధి చేస్తూ లెనిన్ సామ్రాజ్యవాద వ్యవస్ధ ఆవిర్భావాన్ని వివరించాడు. అది లెనినిజం అయ్యింది. అప్పటివరకూ మార్క్సిజం-లెనినిజం పెట్టుబడిదారీ వ్యవస్ధల్లో సోషలిస్టు విప్లవం గురించి చర్చించింది. కానీ పెట్టుబడిదారీ వ్యవస్ధ పూర్తిగా అభివృద్ధి చెందకుండా ఇంకా భూస్వామ్య వ్యవస్ధలు కొనసాగుతున్న మూడో ప్రపంచ దేశాల్లో సోషలిస్టు వ్యవస్ధను స్ధాపించే విషయంపై మావో ధాట్ చర్చిస్తుంది. అది మార్క్సిజం-లెనినిజం లపై అధారపడి చేసిన విశ్లేషణ + ఆచరణీయ అవగాహన.

  కనుక మార్క్సిజం, లెనిన్ కాలానికి మార్క్సిజం-లెనినిజం గా అభివృద్ధి చెందగా, చైనాలో మావో కాలానికి మార్క్సిజం-లెనినిజం-మావో ధాట్ గా అభివృద్ధి చెందింది. అంటే మార్క్సు చెప్పిన సిద్ధాంతం అభివృద్ధి అతనితోనే ఆగిపోలేదు. అది మారుతున్న వ్యవస్ధల లక్షణాలకు అనుగుణంగా శాస్త్రీయంగా అభివృద్ధి చెందిందని గ్రహించాలి. ఈ మార్పులు గ్రహించక పోతే మార్క్సిజం గురించి తెలియనట్లే. పోతే సాహిత్యంలో ఇజాలను జొప్పించడం కూడా సాహిత్య ప్రక్రియగా గుర్తించాలి. ఎటువంటి ఇజం లేకుండా ఏ సాహిత్య ప్రక్రియా ఉండదు. కాకుంటే ఒకానొక సాహిత్య రచనలో ఉన్న ఇజాన్ని మనం చూడగలుగుతున్నామా లేదా అన్నది ప్రశ్న.

 6. మానవ జీవన విధానం సహజంగా పరిణామ క్రమంలో మార్పు చెందుతూ, అభివృద్ది చెందినది.మీరు చెప్పే కమ్యూనిజం ఏ విధంగా పరిణామ క్రమంలో వచ్చింది? ఆయనెవరో కష్టాలు పడ్డాడు, వెలేశారు, ఇంగ్లాండ్ వెళ్లి తనకు తోచిన విధానాలు వ్రాసాడు, మరొకాయన తన దేశంలో అధికారంలోకి రావటానికి ఆ విధానాలు వాడుకున్నాడు. అధికారంలోకి వచ్చాడు, మరొక పెద్ద దేశంలో కూడా మరొకాయన దాదాపు అవేవిదానాలను వాడుకుని అధికారంలోకి వచ్చి మరణించేవరకూ ఆ దెస అధినేతగా ఉన్నాడు. ఆ మనిషి మరణించగానే అధికారంకోసం కుమ్ములాటలు, ఆ తరువాత వచ్చినవారు ప్రజలో వచ్చిన మార్పులకు అనుగుణంగా మారటం చరిత్రలో భాగం. మొత్తం మీద ఈ కమ్యూనిస్టు భావజాల బీజాలు వేసినది ఒక నలుగురైదుగురు. మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, మావో నలుగురో ఐదుగురో ఒక సిద్దాంతం ప్రతిపాదించినంత మాత్రాన ప్రపంచం మొత్తానికి అది అనుసరణీయం ఎలా అవుతుంది.

  సమాజం ఒక విధంగా మనుగడ సాగిస్తుండగా, కమ్యూనిజమనీ విప్లవం అనీ ఆ మనుగాడనే పెళ్ళగించి మరొక కొత్త పోకడలోకి పోదాం పదండి అని కొంతమంది అనుకుని ఆ కొంతమంది అందరి మీద ఆ అభిప్రాయాన్ని రుద్ది, వీలుకాకపోతే బలవంతంగా రుద్ది, తుపాకీ గొట్టంద్వారా అయినా సరే అధికారం చేపట్టి తమ ఆలోచన విధానం ప్రకారం అందరూ ఉండి తీరాలి అనుకోవటం సమాజానికి ముప్పు కాక మేలు చేసే ఆలోచనా?

  ఇక నా అభిప్రాయాలు ఏవో పుస్తకాలు చదివి ప్రభావితం చెంది వ్రాసినవి కాదు, సహజంగా, ప్రపంచంలో జరిగే సంఘటనలు,జరుగుతున్నా చరిత్ర చూసి ఏర్పడినవి.

  “…ఈ మార్పులు గ్రహించక పోతే మార్క్సిజం గురించి తెలియనట్లే…” మీకు తెలిసినదే అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా మీరు అర్ధం చేసుకున్నట్లే మిగిలిన వాళ్ళు కూడా అర్ధం చేసుకు తీరాలని అనుకోవటమే తప్పు. ఇక అలా కాకపొతే ఆ విషయం గురించి తెలియనట్టే అని ఒక అభిప్రాయానకి రావటం పొరబాటు.

  సాహిత్యం అనేది, ఒక వ్యక్తీ తోనే మొదలవుతుంది. పార్టీతో కాదు. పార్టీ భావజాలాన్ని ప్రచారం చేసుకోవటానికి సాహిత్య ప్రక్రియలను వాడుకోవటం జరిగింది కాని అలా వాడుకోవటం మరొక సాహితీ ప్రక్రియ అయ్యే అవకాశం ఉన్నది అనే నేను అనుకోను. మీరు అనుకుంటే అది మీ అభిప్రాయం. ఈ విషయంలో తప్పనిసరిగా ఒక్కటే అభిప్రాయం ఉండి తీరాలని లేకపోతె సాహిత్యం గురించి అసలు ఏమీ తెలియదని అని నేను ఎప్పటికీ అనుకోను.

 7. $విశేఖర్ గారు

  తొలుత ఈ టపా రంగనాయకమ్మ నవల గురించి కావడంతో రా.నా విషయ౦ లేని విషవృక్షాలు,వలయాలు లాంటి వాటి మీద అయిష్ట౦తో తొంగిచూడలేదు. ఇప్పుడు కేవలం మీ వ్యాఖ్యలు నన్ను ఇక్కడికి లాక్కోచ్చాయి. అద్భుతమైన వివరణలు లేదా సమాధానాలు ఇచ్చారు. వాటిని ఓపికగా రాసి ఇక్కడ పంచుకున్న మీకు సర్వదా కృతజ్ఞతలు. మీ మాటల్లో వాస్తవాలు తప్ప ఎక్కడా ద్వేషభావం కనిపించలేదు.

  మార్క్సిజం మీద వ్యాఖ్యాని౦చే౦తటి అర్హత, అనుభవం నాకు లేవు కానీ ఒక్కమాట మాత్రం చెప్పగలను.

  మనిషికి తాను మాత్రమే సుఖంగా ఉండాలి అని అనుకునే రోజులు ఇవి. ఏదో ఈ రోజుకి దినం గడిస్తే చాలు ఎలాంటి గొడవా లేకుండా అనే తీరు ఎక్కువయింది..ఈ భావం/తీరు పశ్చిమదేశాలనుంచి దిగుమతి అయింది. పోరాటాల్లేకుండా మార్క్సిజం లేదు, రాదు అనేది నా అభిప్రాయం. మరి పోరాడేదేవరు? ఇంట్లో ఇడ్లీల్లో చికెన్ తింటూ తన అభిరుచి గురించి టి.వీలకి, పేపర్లకి చెప్పే ఇప్పటి కమ్మ్యూనిస్ట్లా?

  సరే ఎలాగూ నేటి మార్క్సిజం అలాంటి కమ్మ్యూనిస్ట్ల మూలాన మూర్ఖంగా తయారై పారిశ్రామీకీకరణకు, పెట్టుబడిదారులకు వ్యతిరేకం అనే అభిప్రాయం ప్రజల్లో వచ్చింది. పైన మీరూ ఒప్పుకున్నారు కూడా. మిగలినదేశాలు వదిలేయండి. మన సంగతి చూద్దాం. మనది గత యాభై సంవత్సరాల పైన అభివృద్ధి చెందుతూనే ఉన్నదేశం. ఇప్పుడున్న సిద్దా౦తాలు ఉంటే ఇంకో యాభై అయినా ఇంతే అని నేను బాండ్ పేపర్ సంతకం చేసి మరీ ఘ౦టాపధంగగా చెప్పగలను.

  మార్క్సిజం మీద ఉన్న చెడు అభిప్రాయాన్ని పోగొట్టడానికి కృషి చేసేకన్నా చక్కగా ఇంకో సిద్దాంతం ప్రతిపాదిస్తే ఎలావుటుంది అంటాను? కర్షకులు, శ్రామికులకు చేయూతనిచ్చి పైకి తేవడమే ప్రధమలక్ష్యం లేదా ఉద్దేశ్యం అయితే మార్క్సిజం అన్న పేరు వదిలేసి మరో విధంగా పోరాటం మొదలుపెట్టవచ్చు కదా?

  ఒక సూచన: మీరు ఈ టపాలో రాసిన వ్యాఖ్యలను టపాలుగా మలిస్తే చాలా బావుంటు౦దని నా అభిప్రాయం.

  ధన్యవాదాలు.

 8. లైబ్రరీలో కూచుని రాశాడని మీరన్నారు కదండీ. దానికి సమాధానంగా “మార్క్సు కూర్చుని రాసింది కాదు. సమాజాన్ని పరిశీలించి, స్వయంగా రాజకీయ ప్రక్రియల్లో పాల్గొని రాశాడు” అని రాశాను. అది కాదని మీరంటే, అది మీ అభిప్రాయం. తోచినవి రాయలేదు, అధ్యయనం చేసి రాశాడు అన్నది నా సొంత అభిప్రాయం కాదు. ఆ విషయాన్ని చాలామంది ప్రముఖులు చెప్పారు, రాశారు. అధికారంలోకి రావడానికి మార్క్సిజం ఎవరికీ ఉపయోగపడదు. మార్క్సిజం చెప్పేది ప్రజలందరికీ అనుకూలంగా సమాజాన్ని మార్చుకోవడానికి ఏం చేయవచ్చు, అని. రష్యాలో ప్రజలంతా కలిసి తిరుగుబాటు చేస్తేనే విప్లవం వచ్చిందని చరిత్రే చెబుతోంది. మరో పెద్ద దేశంలో కూడా అధికారంలోకి రావడానికి మార్క్సిజాన్ని వాడుకోలేదు. ముప్ఫై సంవత్సరాల పాటు చైనా ప్రజలు అక్కడి కమ్యూనిస్టు పార్టీ అధ్వర్యంలో అనేక కష్టాలు పడ్డారు. జపాన్ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడారు. జపాన్ ఆక్రమణపై పోరాడ్డానికి బదులు అక్కడి ప్రభుత్వం జపాన్‌తోనే కుమ్మక్కై కమ్యూనిస్టు పార్టీని, ప్రజల్నీ ఊచకోత కోసినా దానిపై కూడా పోరాడి ప్రజలు విప్లవం సాధించారు. ఇది కూడా చరిత్ర చెబుతున్నదే. కొందరు వ్యక్తులు అధికారం కోసం ప్రయత్నం చేస్తే విప్లవాలు రావు. ప్రజలంతా మూకుమ్మడిగా ప్రయత్నిస్తేనే విప్లవాలు సాధ్యం. ఇది నా అభిప్రాయం కాదనీ, సామాజిక శాస్త్రవేత్తలు, చరిత్రకారులు చెప్పిందేనని గమనించగలరు.

  మీరు చెప్పిన నలుగురో, ఐదుగురో చెప్పినంతమాత్రానే ప్రపంచం మొత్తం అనుసరించాల్సిందే అని నాకు తెలిసి ఎవరూ కమేండ్ చేయలేదు. అలా కమేండ్ చేసేవారు మార్క్సిజాన్ని అర్ధం చేసుకోలేదని నేను అర్ధం చేసుకున్నంత మేరకు చెప్పగలను. నేను అర్ధం చేసుకున్నదానికి విరుద్ధంగా వివరించగల ఉదాహరణలు మీరు చెప్పగలిగితే గ్రహించడానికి ప్రయత్నిస్తాను. మార్క్సిజం-లెనిజిజం ఆచరణీయ సిద్దాంతమని నమ్మినందువలనే రష్యా, చైనా కమ్యూనిస్టు పార్టీలు ప్రజలను కూడగట్టి విప్లవాలను సాధ్యం చేయగలిగారు.

  నేను మార్క్సిజాన్ని నమ్ముతున్నాను. కానీ మీపైన రుద్దగలనా శివరాంగారూ? నా వల్లగాదు. ఒక సిద్ధాంతాన్ని ఒక దేశంలోని ప్రజాసమూహంపై రుద్దడం సాధ్యం కాదని నా అభిప్రాయం. సాగుతున్న మనుగడలొ పొట్ట నిండక, పూట గడవక ప్రజలు తిరుగుబాట్లకు పూనుకున్నారు. అపుడున్న వ్యవస్ధలో అంతా బాగున్నట్లయితే మంచి సమాజం కోసం ప్రయత్నించాల్సిన అవసరం లేదేమో కదా. కంటికి కనపడేవన్నీ నిజాలే అని భావిస్తే ఇప్పటికీ సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉండే వాడేమో?

  ‘దాస్ కేపిటల్’ ఇది పెట్టుబడిదారీ సమాజ ఆర్ధిక సూత్రాల గురించి వివరిస్తుంది. “డైఎలక్టికల్ మెటీరియలిజం’ సమాజం, ప్రకృతి గమనాలను శాస్త్రీయంగా సూత్రబద్ధంగా వివరించే తత్వ శాస్త్రం. ‘హిస్టారికల్ మెటీరియలిజం’ మానవ సమాజ పరిణామ క్రమాన్ని వివరించే శాస్త్రం. ఈ మూడు గ్రంధాలు మార్క్సిజం అంటారు. ఇవి చదివిన తర్వాతనే మార్క్సిజం గురించి నాకు అవగాహన వచ్చింది. అలా మార్క్సిజం గురించి తెలుసుకున్నాను గనక మార్క్సిజం కానిదేదో చెప్పగలుగుతున్నాను తప్ప నేను భావించినవాటిని మీపై రుద్దడానికి నేను పయత్నం చేయడం లేదని విన్నవించుకుంటున్నాను. నేను మార్క్సిజం గురించి మీరు చెప్పినదానిలో వాస్తవం ఉందో లేదో చెప్పేను తప్ప మీకు తెలిసిందంతా తప్పేననీ, నాకు తెలిసిందంతా రైటేననీ చెప్పడం లేదని గమనించగలరు.

  సాహిత్యం ఒక వ్యక్తితో మొదలవుతుందన్న అభిప్రాయంతో నేను విభేదిస్తున్నాను. సమాజం లేకుండా, దాని గురించిన గ్రహింపు లేకుండా, సమాజం గురించిన ఒక అవగాహన లేకుండా సాహిత్యం పుడుతుందని నేను భావించడం లేదు. ఇది నా అభిప్రాయం మాత్రమే. నా అభిప్రాయంతో విభేదించే హక్కు మీకుంది. ఒక సాహితి ప్రక్రియలో ఇజం చొప్పిస్తే మరో సాహితీ ప్రక్రియ పుడుతుందో లేదో నాకు తెలియదు. కాని ఏ ఇజమూ లేకుండా ఏ సాహిత్యం ఉండదని నా అభిప్రాయం. దాన్ని నమ్మమని మిమ్మల్ని నేను కోరడం లేదు. బలవంతపెట్టనూ లేను. సాహిత్యం తెలుసా లేదా అని నేను చెప్పలేదనుకుంటా. మార్క్సిజంలో మీరన్నది ఉందా లేదా అనే చెప్పాను.

 9. కమ్యూనిస్టులు గా చెప్పుకుంటున్నటువంటి వారు దాన్ని ఆచరించనందున దానిగురించిన సరైన అవగాహన అందకుండా పోతోంది. ఎల్లకాలం ఇదే పరిస్ధితి ఉండదేమో రాజేష్ గారూ.

  అవును, ఇప్పుడున్న విధానాలు సమస్యలను సృష్టిస్తున్నాయి తప్ప పరిష్కరించడం లేదు. అందుకే ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తున్నారు. అటువంటి ప్రత్యామ్నాలలొ సోషలిజం ఒకటి. అంతకంటే మెరుగైన ప్రత్యామ్నాయం ఎవరైనా చెప్పగలిగితే, చూపగలిగితే దాన్నీ ఆహ్వనించాల్సిందే. కానీ ఇప్పుడున్నదే చివరిది. ఇక ప్రత్యామ్నాయం లేదని పెట్టుబడిదారీ ఆర్ధిక వేత్తలు వాదిస్తారు. కాదు ప్రత్యామ్నాయం ఉంది అని సోషలిస్టు వ్యవస్ధను కాంక్షించే వారు నమ్ముతున్నారు. ఎవరు కరెక్టు అన్నది ఆచరణే నిరూపిస్తుంది.

  మార్క్సిజం కన్నా మెరుగైన సిద్ధాంతం చెప్పగలిగితే అంతకంటే కావలసింది ఏముంది? కాని మెరుగైంది అని పేరుపెట్టి పాతవాటినే వల్లించకుండా ఉంటే చాలు. మెరుగైన సమాజం ఎలా వస్తుంది అన్నదానికి ఇంకేమైనా మార్గాలు చూపిస్తే ఖచ్చితంగా ఆహ్వానించవలసిందే. ఇంకా అలాంటివి ఎవరూ చూపలేదు కనక ఎవరైనా చూపుతారని ఆశిద్దాం రాజేష్ గారూ. మీ సూచన అనుసరించేందుకు ప్రయత్నిస్తాను.

 10. “…అధికారంలోకి రావడానికి మార్క్సిజం ఎవరికీ ఉపయోగపడదు….”
  అలా ఐతే ఆ పేరు చెప్పుని రాజకీయ పార్టీలు దేనికి, ఎన్నికల్లో నుంచోవటం దేనికి. తమ ఇజం అలా ప్రచారం చేసుకుంటూ ఉంటే ఎప్పటికోప్పటికి ప్రజలు తమంతట తామే ఈ ఇజాన్ని ఎన్నుకునేవరకూ ఆగవచ్చుకదా, తుపాకీ గొట్టంద్వారా అధికారం నినాదాలు దేనికి?

  “…. మార్క్సిజం చెప్పేది ప్రజలందరికీ అనుకూలంగా సమాజాన్ని మార్చుకోవడానికి ఏం చేయవచ్చు….”

  అదే నిజమైతే ఈ పాటికి ప్రపంచం మొత్తం ఈ ఇజం వచ్చి ఉండాలి. ఆలా కాలేదు. పైగా వచ్చిన చోట (ఎలా వచ్చింది అనేది వివాదాస్పదమైన అంశం) కూడా పోయింది.

  “… రష్యాలో ప్రజలంతా కలిసి తిరుగుబాటు చేస్తేనే విప్లవం వచ్చిందని చరిత్రే చెబుతోంది….”
  అదే చరిత్ర అక్కడ ఈ విప్లవం పేరుతొ జరిగిన అక్రమాలు, గులాగ్ లు, సైబీరియా కాంపుల గురించి కూడా చెప్తున్నది. ప్రజలంతా కాదు అందులో నోరున్న కొందరూ, కండ బలమున్న కొందరూ కలిసి విప్లవం పేరిట కొన్నాళ్ళు రాజ్యాధికారాన్ని ఈ ఇజం పేరిట హస్తగతం చేసుకున్నారు. అంతే కాని అక్కడున్న ప్రజలందరూ ప్రేమించి, ఇష్టపడి ఈ ఇజాన్ని నెత్తిన పెట్టుకోలేదన్నది 1990 లలో చరిత్ర. ఈ ఇజం పేరిట అధికారంలోకి వచ్చిన వాళ్ళల్లో ఒక్క కృశ్చెవ్ తప్ప మరెవరన్న మరణించకుండా అధికారం వదిలారా? ప్రజలు వాళ్ళను ఎన్నుకున్నారా! రాచరికానికి దీనికి తేడా ఏమిటి. అక్కడ ఒక కుటుంబం పరిపాలన, ఇక్కడ ఒక పార్టీ పరిపాలన.

  “…మరో పెద్ద దేశంలో కూడా అధికారంలోకి రావడానికి మార్క్సిజాన్ని వాడుకోలేదు. ముప్ఫై సంవత్సరాల పాటు చైనా ప్రజలు అక్కడి కమ్యూనిస్టు పార్టీ అధ్వర్యంలో అనేక కష్టాలు పడ్డారు. జపాన్ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడారు….”

  అవును అప్పటి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ఇంతకన్నా మెరుగైన పరిపాలన ఈ ఇజం పేరిట ప్రజలకు చూపించి అధికారంలోకి రావటానికి వాడుకున్నారు. అలా వచ్చిన వ్యక్తీ అధికారం ప్రజల అభీష్టాన్ని ఎప్పుడన్నా చూరగోన్నాడా?

  శేఖర్ జీ మనం ఇలా ఎంతైనా వాదించుకోవచ్చు . నాకు ఈ కమ్యూనిజం, మార్క్సిజం వాదాలు నచ్చవు. మీకు నచ్చుతాయి. మీరు మీకు సరిపడే పాయింట్లు ఎత్తి చూపుతారు, నేను నాకు సరిపడే పాయింట్లు ఎత్తి చూపుతాను. కాబట్టి ఎప్పటికీ ఇది తెగదు.

  ఏది ఏమైనా, జానకి విముక్తి మొదటి భాగం లాగ మిగిలిన భాగాలు నడవలేదు అన్నది సత్యం. పార్టీ భావజాలం ఎక్కువైపోయి, చివరకు, సాహిత్య లక్షణం పోగొట్టుకుని, ఒక ఇజం ప్రచారం లాగ తయారయ్యింది . ఇది నా అభిప్రాయం.

 11. అవునంతే. మీ, నా అభిప్రాయాలు వేరు వేరు. కాని మనిద్దరి అభిప్రాయాలతో సంబంధం లేకుండా నిజం ఎప్పుడూ ఒకటే ఉంటుంది. దానికోసమే ఈ వెతుకులాట.

  మీక్కనిపించిన సత్యం, నాకు అసత్యంగా తోస్తోంది శివరాంగారూ. అలా విరుద్ధ భావాలు రావడానికి సమాజంలో ఉన్న వైరుధ్యాలే కారణం. సమాజంలో ఉన్న వైరుధ్యాలకు ఒక రకంగా మనం ప్రతినిధులం.

  నిజమైనదీ, సరైనదీ, వాస్తవమైనదీ, విశ్వజనీనమైనదీ ఒకటుంటుందని గమనిస్తే దానికోసం జరిగే అన్వేషణ, సమాజం బాగుకోసం నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రయత్నించాలని కోరుకుంటే… ఆ ప్రయత్నంలో ఇలా ఎన్నో చర్చలూ, లేదా (స్నేహపూర్వకమైన) వాదోపవాదాలూ, లేదా (భావాలమధ్య) సంఘర్షణ జరుగుతూ ఉండటం సహజమే కదా శివరాం గారూ! ఆరోగ్యకరంగా జరిగినంత వరకూ వాటిని ఆహ్వానిద్దాం.

 12. సామాన్యంగా మన బ్లాగుల్లో జరిగే చర్చలు చివరకు దూషణకు దిగటం పరిపాటి. మన చర్చ (వాదన కాదు)ఇలా స్నేహ పూర్వకంగా జరగటం సంతోషం.తప్పకుండా శేఖర్ గారూ చర్చలు జరిగి తీరాలి. సత్యం, అసత్యం అనేవి తేలాలి.

  ఏ ఇజమైనా ప్రజలు సుఖ శాంతులతో బతకటానికే కాని, ఒక ఇజమే అద్భుతమైనది అని నిరూపించటానికి కాదు అని నా గట్టి నమ్మకం.

  అందరికీ ఆమోదమైన మార్గమే ప్రపంచ వ్యాప్తంగా సమాజ నిర్వహణకు పనికి వస్తున్నది అన్న విషయం నిర్వివాదాంశం. అలా ఆమోదం పొందనివి కొన్నాళ్ళు అక్కడా ఇక్కడా కొద్దికాలం ఆచరణలోకి వచ్చినా, కాల ప్రవాహంలో కొట్టుకుని పోతాయి తప్ప నిలవలేవన్నది సత్యం.

  స్వస్థి

 13. Nonsense. నేనూ మార్క్సిస్టునే కాని ఇలాంటి ____(edit) వ్యాఖ్యలు లేక అభిప్రాయాలతో ఏకీభవించను. సహేతుకమైన ఏ వ్యక్తీకూడ దీన్ని ఆమోదించజాలడు. చాల మంచి డాక్టర్లను, ప్రజాసేవలో అనవరతం నిమగ్నమైనవాళ్లను అయితే మార్క్సిజంతో ఏకీభవించని వాళ్లను నేనెందరినో చూచాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s