మసీదు-మందిరం తీర్పుని సస్పెండ్ చేసిన సుప్రీం కోర్టు


A mosque in Ayodhya

అయోధ్యలో ఓ మసీదు వద్ద పారా మిలట్రీ కాపలా -రాయిటర్స్ ఫొటో

వివాదాస్పద బాబ్రీ మసీదు, రామ జన్మ భూమి స్ధలాన్ని మూడు భాగాలు చేసి పంచిన అలహాబాద్ హై కోర్టు తీర్పును సుప్రీం కోర్టు సస్పెన్షన్‌లో ఉంచింది. మూడు భాగాలుగా పంచడం వెనక హై కోర్టు ఇచ్చిన కారణాలను ఇద్దరు సభ్యులు గల సుప్రీం బెంచ్ ప్రశ్నించింది. బాబరు నిర్మించాడని చెబుతున్న మసీదును ఒక హిందూ దేవాలయాన్ని కూల్చి నిర్మించినట్లుగా ఆరోపిస్తూ 1992 డిసెంబరు 6 తేదీన హిందూ మత సంస్ధలకు చెందిన కార్యకర్తలు కూల్చివేశిన విషయం విదితమే. హిందువులు, ముస్లింలు, ఒక హిందూ ట్రస్టు ల మధ్య సమానంగా విభజించాలని అలహాబాద్ హై కోర్టు తీర్పునిచ్చింది.

దాదాపు అరవై సంవత్సరాల తర్వాత వివాదాస్పద స్ధలంపై ఎవరికి హక్కు ఉన్నదన్న విషయంపై గత సంవత్సరం ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. సెప్టెంబరు 2010 లో తీర్పు వెలువరించినపుడు మత ఘర్షణలు జరుగుతాయన్న భయంతో దాదాపు రెండు లక్షల మంది పోలీసులు, పారా మిలట్రీ పోలిసులను ప్రభుత్వం అలహాబాద్‌లో మొహరించింది. పత్రికలు, టీవీ ఛానెళ్ళ సహకారంతో ప్రభుత్వాలు ప్రజలను సంమయనం పాటించాలని కోరుతూ ప్రచారం చేయడంతో ఘర్షణలేవీ జరగలేదు. ప్రభుత్వాలు తలచుకుంటే మత ఘర్షణలను సమర్ధవంతంగా నివారించవచ్చని ఈ అంశం నిరూపించింది.

“ఈ రూలింగు వింతగా, ఆశ్చర్యకరంగా ఉంది. వివాదాస్పద ప్రాంతాన్ని విభజించాలని ఎవరూ కోరలేదు. ఎవరూ కొరని కొత్త పరిహారాన్ని అలహాబాద్ హై కోర్టు ఇచ్చింది” అని బెంచిలోని ప్రిసైడింగ్ జడ్జి అఫ్తాబ్ ఆలం వ్యాఖ్యానించాడు. వివాదాస్పద స్ధలం వద్ద యధాతధ స్ధితి కొనసాగాలని ఏ గ్రూపూ స్ధలంలో నిర్మాణ కార్యకలాపాలను చేపట్టకుండా నిషేధం కొనసాగాలనీ సుప్రీం కోర్టు బెంచి ఆదేశించింది. విభజనను సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్‌ను విచారిస్తున్న బెంచి విచారణ మొదటి రోజున ఈ ఆదేశాలు జారీచేసింది. వివాదాస్పద స్ధలంలోనే రాముడు జన్మించాడని హిందువులు విశ్వసిస్తున్నారన్న వాదనను అలహాబాద్ హైకోర్టు ఆమోదించడం తీర్పులోని మరో వివాదాంశం. భారతీయ శిక్షాస్మృతిలో ఉన్న సెక్షన్‌లపై ఆధారపడకుండా మత విశ్వాసాలపై ఆధారపడి తీర్పునివ్వడం బహుశా ఇదే మొదటిసారేమో.

హిందూ జాతీయవాద పార్టీగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ బాబ్రీ మసీదును కూల్చి రాముడికి గుడి నిర్మించాలని డిమాండ్ చేస్తూ రధయాత్రం నిర్వహించాడు. రధయాత్ర మార్గంలో మత ఘర్ధణలు చెలరేగాయి. అ తర్వాత రామశిలలు, శిలాన్యాస్ లాంటి కార్యక్రమాలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్ధ ఆధ్వర్యంలోని వివిధ హిందూ సంస్ధలు అనేక కార్యక్రమాలను నిర్వహించాయి. అయితే భాబ్రీ మసీదు కూల్చివేతపై కోర్టులో విచారణ జరుగుతున్నపుడు అద్వానీ తానక్కడ లేనని బుకాయించడం, ఇతర నాయకులు కూడా మసీదు కూల్చివేత తో సంబంధం లేదని చెప్పడం ఓ విచిత్రం పరిణామం.

రామజన్మ భూమి వివాదం కేవలం రాజకీయ లబ్ది కోసమే బిజెపి లేవనెత్తిన విషయం కోర్టులో వారి సాక్ష్యాలు స్పష్టం చేశాయి. బిజెపి నాయకత్వంలోని ఎన్.డి.ఎ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినా వారి ఆధ్వర్యంలో రామ మందిర నిర్మాణానికి పూనుకోక పోవడం అందుకు మరో దృష్టాంతం. ఓట్ల కోసం మత తత్వాలను వినియోగించుకోవడం ఒక్క బిజేపితోనే ప్రారంభం కాలేదు. మసీదు తలుపులను తెరవడం ద్వారా రాజీవ్ గాంధీ ప్రభుత్వం మతం కార్డు అధారంగా ఓట్లు పొందటానికి ప్రయత్నించింది. ఆ తర్వాత షాబానో కేసు తీర్పులో ముస్లిం మత ఛాందసుల డిమాండ్ల మేరకు చట్టాన్ని తెచ్చి ముస్లిం మతకార్డును వినియోగించుకోవడానికి కూడా రాజీవ్ గాంధీ ప్రయత్నించాడు. మసీదు కూల్చివేత సమయంలో అప్పటి కేంద్రంలోని పి.వి. నరసింహారావు ప్రభుత్వం కూడా పరోక్షంగా సహకరించింది. సెక్యులరిస్టు పార్టీగా కాంగ్రెస్ పార్టీని పరిగణించడమే ఈ దేశంలోని దౌర్భాగ్యం. బి.జె.పి బహిరంగంగా హిందూ మతోన్మాదానికి మద్దతుదారుగా నిలవగా, కాంగ్రెస్ పరోక్షంగా హిందూ, ముస్లిం రెండు మతాలను వినియోగించుకుంది. ఈ రెండు పార్టీల మత రాజకీయాలే ఇండియాలో అనేక మతఘర్షణలకు కారణంగా నిలిచాయి.

వ్యాఖ్యానించండి