వరుసగా తొమ్మిదో రోజూ నష్టపోయిన ఇండియా షేర్ మార్కెట్


BSE-Sensex-Downభారత ప్రధాన షేర్ మార్కెట్ సూచికలు వరుసగా తొమ్మిదో రోజూ నష్టాలను చవి చూశాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్.బి.ఐ వడ్డీరేట్లు పెంచడం, వడ్డీ రేట్ల పెంపుదల లాభాల తగ్గుదలకు దారీతీస్తుందన్న భయాలూ, వీటితో పాటు ఆయిల ధరలు అన్నీ కలిసి ఇండియా మార్కెట్లలొ షేర్ల అమ్మకాల వత్తిడి పెరగడానికి దారి తీశాయి. ద్రవ్య సంస్ధలు, టెక్నాలజీ షేర్లు ఎక్కువగా నష్యపోయాయి. ఎయిర్ టెల్ షేరు 3.2 శాతం నష్టపోయింది. ఎయిర్ టెల్ కి చెందిన ఆఫ్రికా వ్యాపారం నష్టాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మార్కెట్ అంచనాలకంటే ఎక్కువగా లాభాల్లో తగ్గుదల నమోదు చేయడం వలన ఎయిర్ టెల్ షేరు అమ్మకాల ఒత్తిడికి గురయ్యింది.

పై కారణాలతో పాటు స్వల్పకాలిక మదుపుదారులు షేర్ మార్కెట్ మరింత పడిపోతుందన్న భయాలతో అమ్మకాలకు దిగడంతో షేర్లు నష్టపోయాయని విశ్లేషకులు భావిస్తున్నారు.30 షేర్ల సెన్సెక్స్ 258.78 పాయింట్లు (1.4 శాతం) నష్టపోయి 18210.58 వద్ద క్లోజయ్యింది. 50 షేర్ల నిఫ్టీ 77.3 పాయింట్లు (1.4 శాతం) నష్టపోయి 5459.85 వద్ద క్లోజయ్యింది. 2011 సంవత్సరంలో ప్రపంచంలోని ప్రధన షేర్ మార్కెట్లలొ ఇండియా మార్కెట్లు అధికంగా నష్టపోయాయి. ఇండియా పోటీ ఇస్తుందని చెప్పే చైనా మార్కెట్లు మాత్రం లాభాల్లోనే ఉన్నాయి.

అమెరికాలో ఆర్ధిక వృద్ధి నూతన సంవత్సరంలోని మొదటి అర్ధ భాగంలో మరింత నెమ్మదిస్తున్నది. ఈ నెమ్మది అభివృద్ధిని గత సంవత్సరమే అంచనా వేశారు. జిడిపి వృద్ధి నెమ్మది కాకుండా వేగవంతం చేయడానికి అమెరికా ఫెడరల్ రిజర్వు క్వాంటిటేటివ్ ఈజింగ్ – 2 (క్యూ.ఇ – 2) పేరుతో 600 బిలియన్ డాలర్లను మార్కెట్లోకి విడుదల చేయడానికి నిర్ణయించింది. విడుదల చేసింది కూడా. మిగిలిన భాగాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ జిడిపి వృద్ధి నెమ్మదించకుండా అడ్డుకోలేక పొయారు. అమెరికా ఆర్ధిక వృద్ధి ప్రభావం ప్రపంచ మార్కెట్లన్నింటిపైన అనివార్యంగా పడుతుంది.

ఈ ఆర్ధిక సంక్షోభ పరిస్ధితుల నేపధ్యంలో ఇప్పటికే రెండు యుద్ధాల్లో ఉన్న అమెరికా, లిబియాలో జోక్యానికి కూడా ఉవ్విళ్ళూరుతున్నందున సంక్షోభం మరింత తీవ్రం కానున్నది. సంక్షోభం నుండి బైట పడ్డానికే ప్రపంచ వనరులపై గుత్తాధిపత్యానికై యుద్ధాలు చేస్తున్న అమెరికా వాటివల్ల మరింత సంక్షోభంలో కూరుకు పోతున్న సంగతిని పట్టించుకోవడం లేదు. ఆర్ధిక సంక్షోభానికి సంబంధించిన ఆందోళనలు వాల్‌స్ట్రీట్ కంపెనీలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అమెరికా వినిమయ సంస్కృతిపై ఆధారపడిన ఇండియా, చైనాల ఎగుమతులు సమీప భవిష్యత్తులో ఎగుమతుల తగ్గుదలను ఎదుర్కోక తగ్గదు. ఆ పరిస్ధితికి విరుగుడుగా చైనా దేశీయ మార్కేట్‌ను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటోంది. ఇండియా దానికి భిన్నంగా సరళీకరణ విధానాలను తీవ్రం చేస్తుండంతో దాని ఆర్ధిక వృద్ధి ప్రమాదంలొ పడనుంది.

వ్యాఖ్యానించండి