క్రికెట్ ఇండియా కొత్త కోచ్ “డంకన్ ఫ్లెచర్”


Duncan Fletcher

ఇండియా క్రికెట్ కొత్త కోచ్ "డంకన్ ఫ్లెచర్"

మూడు సంవత్సరాల పాటు ఇండియా క్రికెట్ టీం కి కోచింగ్ బాధ్యతలు నిర్వహించీన్ గ్యారీ కిర్‌స్టెన్ తన కాంట్రాక్టు పొడిగించడానికి నిరాకరించడంతో బిసిసీఐ కొత్త కోచ్ ని నియమించింది. గతంలో జింబాబ్వే క్రికెట్ టీంకి కెప్టెన్ గానూ, ఇంగ్లండ్ కు కోచ్ గానూ పని చేసిన డంకన్ ఫ్లెచర్ ను కొత్త కోచ్ గా నియమిస్తున్నట్లు బిసిసీఐ బుధవారం ప్రకటించింది. 2005లో ఇంగ్లండు టీంకి కోచ్ గా ఉండగా ఇంగ్లండు యాషెస్ సిరీస్ గెలుచుకుంది. ఫ్లెచర్ రెండేళ్ళ కాలానికి కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు.

ఇండియా టీం సభ్యులు కిర్‌స్టెన్ ను కొనసాగవలసిందిగా కోరినప్పటికీ ఆయన కొనసాగడానికి ఇష్టపడలేదు. తన కుటుంబంతో గడపడానికే నిర్ణయించుకున్నానని అయన తెలిపాడు. గ్యారీ కోచ్‌గా ఉండగానే ఇండియా టెస్టు టీంలలో నెంబర్. 1 స్ధానం సంపాదించడంతో పాటు పదో వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. దాదాపు ఇండియా క్రికెట్ ఆటగాళ్ళంతా గ్యారీ కొనసాగాలని కోరడం విశేషం.

62 సంవత్సరాల ఫ్లెచర్ వెస్టిండీస్ టూర్ కి అందుబాటులో ఉండకపోవచ్చని బిసిసీఐ తెలిపింది. అప్పటికే కొన్ని పనులు నిర్ధారణ అయి ఉన్నందున ఆయన వెస్టిండీస్ టూర్ కి అందుబాటులో ఉండడని తెలిపింది. భారత జట్టు వచ్చే జూన్‌లో వెస్టిండీస్ పర్యటించనుంది. అక్కడ ఒక ట్వంటీ20, 5 వండేలు, 3 టెస్టు మ్యాచ్‌లు ఇండియా ఆడుతుందని బిసిసీఐ సెక్రటరీ ఎన్.శ్రీనివాసన్ పత్రికలకు తెలిపాడు. 2007 ప్రపంచ్ కప్ తర్వాత ఫ్లెచర్ ఇంగ్లండు కోచ్‌గా పదవీ విరమణ చేసి సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ లకు బ్యాటింగ్ సలహాదారుగా వ్యవహరించాడు.

వెస్టిండీస్ టూర్ తర్వాత జులై నెలలో ఇండియా క్రికెట్ టీము ఇంగ్లండు పర్యటించనుంది. ఇంగ్లండులో ఒక ట్వంటీ20, 5 వండేలు, 4 టెస్టు మ్యాచ్‌లు ఆడుతుంది. ఇంగ్లండు టూర్ నాటికి డంకన్ ఫ్లెచర్ ఇండియా టీంకి అందుబాటులో ఉంటాడని శ్రీనివాసన్ తెలిపాడు. ఎరిక్ సైమన్స్ బౌలింగ్ కోచ్ గా కొనసాగుతాడు. ఇదిలా ఉండగా ప్రపంచ కప్ గెలుచుకున్న ఇండియా టీం సభ్యులకు బోనస్‌ను ముందుగా ప్రకటించినట్లు రూ.10 మిలియన్లు కాకుండా రూ.20 మిలియన్లు చెల్లించడానికి నిర్ణయించామని బిసిసిఐ ప్రకటించింది.

వ్యాఖ్యానించండి