రేడియేషన్ నీటి లీకేజి పూడ్చిన జపాన్ ఇంజనీర్లు


Daichi nuclear plant

దైచి అణు విద్యుత్ కర్మాగారం

జపాన్ లోని ఫుకుషిమా దైచి అణు కర్మాగారంలో రెండో రియాక్టరుకు ఏర్పడిన పగులును పూడ్చామని టెప్కో (టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ) ఇంజనీర్లు తెలిపారు. “లీకేజిని అరికట్టామని చెబుతున్నా దానిని పరీక్షించాల్సి ఉంది. ఇంకా లీకేజీలేమన్నా ఉన్నాయేమో చూడాల్సి ఉంది” అని జపాజ్ ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ యుకియో ఎడానో పత్రికలతో మాట్లాడుతూ అన్నాడు. సోడియం సిలికేటుతో పాటు మరో రసాయన ఏజెంటును ఉపయోగించి లీకేజిని పూడ్చినట్లు ఇంజనీర్లు తెలిపారు.

15 సెం. మీ మేర ఏర్పడిన పగులు ద్వారా రెండో రియాక్టరు నుండి అధిక స్ధాయి రేడియేషన్ తో కలుషితమైన నీరు లీకయ్యి వారం రోజులనుండి భూమిలోకి ఇంకి పోతూ ఆందోళనకు గురిచేసింది. ఈ నీరు భూమితో పాటు దానిపైనున గాలినీ దగ్గర్లో ఉన్న సముద్ర నీటిని కూడా కలుషితం చేయడం ప్రారంభించింది. దానికి తోడు అప్పటివరకు లీకయిన తక్కువ రేడియేషన్ నీటితో స్టోరేజి వనరులు నిండిపోవడంతో తాజాగా విడుదలవుతున్న కలుషిత నీరు నిలవ చేయడానికి ఖాళీ కరువైంది. దానితో తక్కువ కలుషిత నీటిని జపాన్ సముద్రంలో కలపడం ప్రారంభించింది. తక్కువ కలుషితం అని చెబుతున్నప్పటికీ సముద్రంలో కలుపుతున్న కలుషిత నీటిలో చట్టబద్ద పరిమితికంటే వంద రెట్ట్లు రేడియేషన్ ఉండడంతో సముద్ర ఆహారం కలుషితం అయ్యే ప్రమాదం ఏర్పడింది.

రేడియేషన్ తో కలుషితమైన నీటిని సముద్రంలో కలపాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల చేపలవేట పై ఆధారపడ్డ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టబద్ధ పరిమితి కంటే రెట్టింపు స్ధాయిలో రేడియేషన్ చేపల్లో ఉన్నట్లు కనుగున్నారు. రేడియేషన్ భయంతో జపాన్ నుండి ఆహారం, కూరగాయలు దిగుమతి చేసుకోవడాన్ని చాలా దేశాలు నిషేధించాయి.

దైచి అణు కర్మాగారంలొని ఇతర రియాక్టర్లలో హైడ్రోజన్ పరిమాణం పెరుగుతుండడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. హైడ్రోజన్ పరిమాణం రియాక్టర్ల పరిమితికి మించి పెరగడంతో మూడు రియాక్టర్లలో ఇప్పటికే పేలుళ్ళు సంభవించాయి. హైడ్రోజన్ మళ్ళీ పెరుగుతుండడం వలన మరోసారి పేలుళ్ళు జరుగుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. నైట్రోజన్ ను రియాక్టర్ల లోనికి పంపించడం ద్వారా హైడ్రోజన్ పేలుళ్ళు జరగకుండా నివారించడానికి టెప్కో ఉద్యోగులు ప్రయత్నిస్తున్నారు.

వ్యాఖ్యానించండి