ఆఫ్రికా దేశం ‘ఐవరీ కోస్ట్’ను ఆక్రమించుకున్న ఫ్రెంచి సేనలు


Ivori coastఆఫ్రికా ఖండంలో బుల్లి దేశమైన ఐవరీ కోస్ట్ లో ఫ్రాన్సు పన్నాగాలు కొనసాగుతున్నాయి. తాజాగా 800 మంది ఫ్రెంచి సైనికులను ఐవరీ కోస్ట్ కి పంపింది. అక్కడి ప్రధాన నగరం అబిద్ జాన్ లోని ప్రధాన విమానాశ్రాయాన్ని తాజాగా పంపిన ఫ్రెంచి సేనలు ఆక్రమించుకున్నాయి. ఆఫ్రికా ఖండానికి పశ్చిమ తీరంలో ఉన్న ఐవరీ కోస్ట్ లో గత సంవత్సరం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికారంలో ఉన్న అధ్యక్షుడు లారెంట్ జిబాగ్బో ను అలస్సానే ఒట్టోరా ఓడించాడని ఐక్యరాజ్య సమితి చెబుతున్నది. కానీ జిబాగ్బో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగలేదని అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి నిరాకరిస్తున్నాడు. జిబాగ్బోను గద్దె దించడానికి ఐక్యరాజ్యసమితి, ఫ్రాన్సు కంకణం కట్టుకుని అందుకోసం శ్రమిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితిని అడ్డు పెట్టుకుని ఫ్రాన్సు ఐవరీ కోస్ట్ ను తన ఇష్టానుసారం వ్యవహరించే ఒట్టోరాకు అధికారం కట్టబెట్టాలని చూస్తోంది. కొన్ని నెలలనుండి సాగుతున్న ప్రతిస్టంబనను తనకు అనుకూలంగా ముగించడానికి ఫ్రాన్సు దేశం అప్పటికె ఉన్న తన సేనలకు తోడుగా మరో 800 మంది సైనికుల్ని పంపింది. వీరితో కలిసి ఐవరీ కోస్టులోని ఫ్రాన్సు మిలట్రీ స్ధావరంలో ఉన్న ఫ్రాన్సు సైనికుల సంఖ్య 1400 కు చేరుకుంది.

ఐవరీ కోస్టు అధ్యక్షుడు జిబాగ్బో, ఫ్రాన్సు తన సైనికులతో తమ దేశాన్ని ఆక్రమించుకుంటున్నాయని ప్రకటించాడు. ఫ్రాన్సు ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడవలసిందిగా ప్రజలను టెలివిజన్ ద్వారా కోరాడు. ప్రస్తుతం ప్రభుత్వ టెలివిజన్ కార్యాలయం జిబాగ్బో సేనల చేతిలో ఉంది. దాన్ని ఆక్రమించుకోవడానికి ఫ్రాన్సు, ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలొ ఒట్టోరా ప్రయత్నిస్తున్నాడు. ఐవరీ కోస్టు భవిష్యత్తును అక్కడి ప్రజలే నిర్ణయించుకోవాలన్న జ్గ్నానం లేకుండా ఫ్రాన్సు తన సైనికుల ద్వారా ఐవరీ కోస్టును దురాక్రమించి తన తొత్తు ప్రభుత్వాన్ని నిలపాలని ప్రయత్నిస్తోంది. ఐవరీ కోస్టు ప్రజలకు నరకాన్ని చూపిస్తోంది. అక్కడి సమస్యను పరిష్కరించుకోనీయకుండా అడ్డు పడుతోంది. జిబాగ్బోను పదవీచ్యుతుడిని చేయడానికి అంతిమ ప్రయత్నం ప్రారంభించనున్నట్లు ఒట్టోరా సలహాదారు చెప్పాడు. అందుకోసమే ఫ్రెంచి సేనల పెంపుదల జరిగిందని చెప్పుకోవచ్చు.

ఫ్రాన్సు ఐవరీ కోస్టులో నెలకొల్పిన అర్మీ క్యాంపులో 1500 మంది విదేశీయులు శరణార్ధులుగా ఉన్నారు. వారిలో 700 మంది ఫ్రెంచి జాతీయులు కాగా 600 మంది లెబనీయులు. మరో అరవై మంది వివిధ యూరోపియన్ దేశాల వారు. వీరిని ఖాళీ చేశే ఉద్దేశ్యం లేదని ఫ్రాన్సు ప్రకటించింది. 1994 నాటి రువాండా జాతి హత్యాకాండలాంటి ఘటనను ఐవరీ కోస్టులో పునరావృతం చేయడానికి ఫ్రాన్సు చూస్తున్నదని అధ్యక్షుడు జిబాగ్బో ఆరొపించాడు. రువాండాలో జరిగిన జాతి హత్యాకాండలో 800,000 మంది చనిపోయారు. ప్రధాన నగరం అబిద్ జాన్ లోని కీలక ప్రాంతాల కోసం ఇరుపక్షాల మధ్య శనివారం బీకరపోరు జరిగింది. నలుగురు సమితి సైనికులు గాయపడ్డారని బిబిసి తెలిపింది. అధ్యక్ష భవనం, ప్రభుత్వ టెలివిజన్ కార్యాలయం, ఆగ్బన్ మిలట్రీ స్ధావరం ఈ కీలక ప్రాంతాల్లో కొన్ని.

ఐవరీ కోస్టు పశ్చిమ ప్రాంతంలోని డ్యూకో లో వందలమంది శవాలను కనుగొన్నట్లు ఎన్జీవో సహాయ సంస్ధ కేరిటాస్, శనివారం తెలిపింది. వెయ్యి వరకు శవాలు ఉండవచ్చని తెలిపింది. మార్చి 27, 29 తేదీల మధ్య జరిగిన ఘర్షణలో వీరు చనిపోయినట్లు భావిస్తున్నారు. ఆతేదీల్లో ఈ ప్రాంతం ఒట్టోరా సైనికుల ఆధీనంలో ఉందని ఓ స్వచ్చంద సంస్ధ తెలిపింది. ఒట్టోరా సేనలు డ్యూకో ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలో అక్కడ మరణాలు సంభవించాయని ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఐక్యరాజ్య సమితి శాంతి సైనికులు అక్కడి కేధలిక్ మిషన్ లో పదిహేను వేలమందిని రక్షిస్తున్నాయని వార్తలు తెలుపుతున్నాయి. మరణాలకు భాద్యులెవరనేది ఖచ్చితంగా తెలియదని కేరిటాస్ తెలిపింది.

వ్యాఖ్యానించండి