పగుళ్ళిచ్చిన జపాన్ అణు రియాక్టర్, అణు ధార్మికత కట్టడికి చర్యలకై వెతుకులాట


fukushima arial viewభూకంపం, సునామీలతో దెబ్బతిన్న ఫుకుషిమా దైచి అణు కర్మాగారంలో ఒక రియాక్టర్ పగుళ్ళిచ్చి ఉండడాన్ని శనివారం కనుగొన్నారు. చీలిక 20 సెంటీ మీటర్ల మేర ఉందని కర్మాగారం ఆపరేటర్ టెప్కో (టోక్యో ఎలెక్ట్రిక్ పవర్ కంపెనీ) తెలిపింది. ఇప్పటికి కనుగొన్నది ఒక్క పగులేననీ ఇంకా ఉండే అవకాశాలను తోసిపుచ్చలేమని తెలిపింది. గత వారం రోజులుగా కర్మాగారం వద్ద సముద్రపు నీరు బాగా కలుషితమై, చుట్టుపక్కల వాతావరణంలో కూడా అణు ధార్మికత అధిక స్ధాయిలో ఉండడంతో దానికి కారణం కోసం వెతుకులాడుతున్నారు. రెండో నెంబరు అణు రియాక్టరుకు ఒక చోట ఇరవై సెంటీ మీటర్ల మేర పగులిచ్చిందనీ దాన్నుండి రేడియేషన్ తో నిండిఉన్న నీరు లీక అవుతున్నదనీ టెప్కో తెలిపింది. ఇది అండర్ గ్రౌండ్ లో ఉన్న పైపు ద్వారా కూడా లీకవుతూ భూమి లోపలికి ఇంకుతుండడంతో నేల కూడా కలుషితమవుతోంది.

ప్రమాదం సంభవించాక మొదటిసారిగా జపాన్ ప్రధాని నవోటో కాన్ ఈశాన్య జపాన్ ని సందర్శించాడు. సునామీ తర్వాత రోజు ప్రధాని ఏరియల్ సర్వే జరిపినప్పటికీ కాలి నడకతో సందర్శించడం ఇదే మొదటిసారి. పునరావాస శిబిరాలను సందర్శించినప్పటికీ ఫుకుషిమా అణు ప్లాంటు చుట్టూ ప్రజల్ని ఖాళీ చేసిన 20 కి.మీ పరిధి లోపలికి మాత్రం ప్రధాని వెళ్ళలేదు. సునామీ సంభవించి ఇన్ని రోజుల తర్వాత ప్రధాని రావడం పట్ల పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నవారు అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇప్పుడు రోడ్లను శుభ్రం చేశాక ప్రధాని వచ్చాడు. రోడ్లు కనబడక శిధిలాలన్నీ వ్యాపించి ఉన్నపుడు ప్రధాని వచ్చి చూస్తే నష్టం చూసే అవకాశం ఉండేది” అని వారు వ్యాఖ్యానించారు.

అణు ధార్మికత రోజులు గడిచేకొద్దీ పెరిగిపోతోంది. దాన్ని కట్టడి చేయడాని అందుబాటులో ఉన్న మార్గాలన్నింటినీ ఇప్పటికే వినియోగించేశారు. కొత్త మార్గాలకోసం వెతుకులాడుకోవాల్సిన పరిస్ధితిలో అణు ప్లాంటు అధికారులు పడిపోయారు. రియాక్టర్ల వద్ద గాలిలో గంటకు 1000 మిల్లీ సీవర్టూల రేడియేషన్ రికార్డవుతోంది. దానితో రియాక్టరు వద్ద పని చేయడానికి కష్టతరంగా మారింది. రియాక్టర్ పగులున పూడ్చటం ఇప్పుడు సవాలుగా మారింది. పగుళ్ళిచ్చిన రియాక్టర్ లోపలికి కాంక్రీటు పంపి తద్వారా పగులును పూడ్చడానికి ప్రయత్నిస్తున్నామని టెప్కో తెలుపుతోంది. ఆ పరిష్కారం పని చేస్తుందో లేదో తెలియదు. అది ఎంతవరకు పని చేస్తుందో తెలియదు.

రెండో నెంబరు రియాక్టర్ లోని కోర్ లో ఒక ఇంధన కడ్డీ 70 శాతం, మరొకటి 30 శాతం ధ్వంసం అయిందని అమెరికా ఎనర్జీ సెక్రటరీ శుక్రవారం చెప్పాడు. అది అంచనా మాత్రమేనని ఆయన చెప్పాడు. రియాక్టర్ వద్ద రేడియేషన్ తీవ్రంగా ఉండడంతో సరైన అంచనా వేయడం కష్టంగా ఉందని వారు తెలిపారు. జపాన్ నిపుణులు ఈ అంచనాపై వ్యాఖ్యానించడానికి నిరాకరించినట్లు బిబిసి తెలిపింది. జపాన్ ప్రభుత్వం కోరడంతో అమెరికా నిపుణులు, మిలట్రీ సిబ్బంది రేడియేషన్ కట్టడి చేయడానికి సహకారం అందిస్తున్నారు.

భూకంపం, సునామీ ల్లో ఇప్పటివరకు 11,500 చనిపోయినట్లు ధృవీకరించారు. మరో 16,500 జాడ గల్లంతయినట్లు కూడా ధృవీకరించారు. చనిపోయిన వారి పార్ధివ శరీరాలకోసం వెతుకులాట ఇంకా కొనసాగుతోంది. ఫుకుషిమా అణు కర్మాగారం చుట్టూ ఖాళీ చేసిన ప్రాంతాన్ని ఇంక శోధించలేదు. రేడియేషన్ భయాల వలన ఆ ప్రాంతం జోలికి పోలేదు. వెయ్యిమంది వరకు ఆ ప్రాంతంలో చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. జపాన్, అమెరికా లకు చెందిన 100 మిలట్రీ విమానాలు, 65 నౌకలు, 24,000 మంది మిలట్రీ సిబ్బంది పార్ధివ శరీరాల కోసం గాలిస్తున్నారు. అమెరికాతో పాటు ఫ్రాన్సు సహకారాన్ని కూడా జపాన్ ప్రభుత్వం కోరింది.

వ్యాఖ్యానించండి