ఫుకుషిమా అణు రియాక్టర్ల వద్ద మరింత పెరిగిన అణు ధార్మికత


Victims' relatives weep at burial

మూకుమ్మడి సమాధుల వద్ద విలపిస్తున్న చనిపోయినవారి బంధువులు

మానవ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్రమాదంగా పేరు తెచ్చుకున్న జపాన అణు ప్రమాదం మరింత తీవ్రమవుతోంది. దైచి అణు విద్యుత్ కర్మాగారం లోని రియాక్టర్ల నీటిలో రేడియేషన్ మామూలు స్ధాయి కంటే 10 మిలియన్ల రెట్లు రేడియేషన్ నమోదైనట్లు అణు కర్మాగారాల ఆపరేటర్ ‘టోక్యో ఎలెక్ట్రిక్ పవర్ కంపెని (టెప్కో) తెలిపింది. ప్రమాద సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలపకుండా దాపరికంతో వ్యవహరిస్తున్నందుకు టెప్కో పై విమర్శలు వస్తున్నాయి. కర్మాగారంలో రియాక్టర్లను చల్లబరచడానికి ప్రయత్నిస్తున్న వర్కర్లకు సరైన దుస్తులు ఇవ్వలేదని కూడా తెలుస్తోంది. ఫలితంగా కార్మికులు రేడియేషన్ బారిన పడి కాలిన గాయాలకు గురయ్యారు.

రియాక్టర్లను చల్లబరచడానికి జల్లుతున్న సముద్రపు నీటిలొని ఉప్పు వలన కర్మాగారం లోని పరికరాలు కోతకు గురవుతున్నాయన్న భయాలు వ్యక్తం కావడంతో సముద్రపు నీటిని పంపింగ్ చేయడం ఆపేశారు. చల్లబరచడానికి ఇప్పుడు శుభ్రపరిచిన నీటిని వాడుతున్నారు. అమెరికా 500,000 గ్యాలన్ల శుభ్ర పరిచిన నీటిని పంపింది. రెండో రియాక్టరు వద్ద నీటిలో రేడియేషన్ పది మిలియన్ రెట్లు పెరగిన తర్వాత అక్కడ పని చేస్తున్న కార్మికులను అక్కడ నుండి పంపించారు. రేడియేషన్ ఉన్నట్లుండి అంత ఎక్కువ పెరగడానికి కారణం ఇంకా తెలియలేదు. శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నట్లు టెప్కో తెలిపింది. అంతర్జాతీయ అణు ఇంధన ఏజన్సీ ఫుకుషిమా వద్ద అణు ప్రమాదం మరిన్ని నెలలపాటు కొనసాగవచ్చని హెచ్చరించింది.

కేసియం తో పాటు ఇతర పదార్ధాల నిల్వలు రియాక్టర్ నీటిలో అధిక స్ధాయిలో కనుగొన్నామని టెప్కో ప్రతినిధి తెలిపాడు. సాధారణంగా ఈ పదార్ధాలు రియాక్టర్ నీటిలో ఉండకూడదని ఆయన తెలిపాడు. ఇంధన కడ్డీలు నాశనం అవుతుండడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పాడు. ఇంధన కడ్డీలు కరిగిపోకుండా ఉండటానికే వర్కర్లు ఇన్ని రోజులుగా నీటిని వివిధ పద్దతుల్లో జల్లుతున్నారు. కడ్డీలు కరగడం మొదలైతే రేడియేషన్ మరింత పెరిగుతుంది. ప్రమాద స్ధాయిని అరికట్టే అవకాశాలు సైతం తగ్గిపోవచ్చు.

ఇదిలా ఉండగా కర్మాగారం చుట్టూ ఉన్న గాలిలో రేడియేషన్ స్ధాయి తగ్గినట్లు జపాన్ ప్రభుత్వం తెలిపింది. సముద్రంలో అయోడిన్ రేడెయేషన్ స్ధాయి పెరిగి వారం గడిచినందున ఇక అది కొనసాగే అవకాశం లేదని ప్రభుత్వం తెలిపింది. అయోడిన్ ధాతువుకు ఉన్న సగం జీవిత లక్షణమే దానికి కారణమని తెలిపింది. భూకంపం, అ తర్వాత వచ్చిన సునామీల్లో మరణించిన వారి సంఖ్య 10,000 దాటి పోయింది. మరో 17,440 మంది జాడ గల్లంతయ్యింది. వాలంటీర్లు ఇంకా శవాలని వెలికితీస్తూనే ఉన్నారు. శవాల వెలికితీత సజావుగా సాగడానికి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. శవాలను మూకుమ్మడిగా పూడ్చిపెట్టల్సిన అవసరం తలెత్తింది. పునరావాస శిబిరాలతో పాటు సునామీ తాకిడికి గురయిన ప్రాంతాలకు మిలట్రీ ఆహారం, నీరు లను సరఫరా చేస్తోంది. అనేక మంది ప్రజలు ఇంకా తాత్కాలిక పునరావాస శిబిరాల్లోనే నివసిస్తున్నారు.

చైనా, సింగపూర్, హాంకాంగ్ తదితర ఆసియా దేశాలు జపాన్ నుండి సరుకులను దిగుమతి చేసుకోవడం ఆపేశాయి. కొన్ని సరుకులలో రేడియేషన్ కనుగొనడంతో ముందు జాగ్రత్త చర్యగా సరుకుల దిగుమతి ఆపారు. కూరగాయలు, సముద్ర ఆహార ఉత్పత్తులు, నీరు ఆ సరుకుల్లో ఉన్నాయి. యూరోపియన్ యూనియన్, అమెరికా, రష్యా లు కూడా అసియా దేశాలను అనుసరించాయి. పునర్నిర్మాణ ఖర్చు 309 బిలియన్ డాలర్లు ఉంటుందని జపాన్ ప్రభుత్వం అంచనా వేసింది.

వ్యాఖ్యానించండి