అమెరికా లోనూ వినాశనానికి దగ్గరైన అణువిద్యుత్ కర్మాగారాలు


Protest against Vermont Nuclear Power Plant

వెర్మోంట్ విద్యుత్ ప్లాంటును మూసేయాలని ఫిబ్రవరి 24, 2010 న ఆందోళన చేస్తున్న ప్రజలు

జపాన్లో మార్చి 11 తేదీన సంభవించిన అతి పెద్ద భూకంపం, అది సృష్టించిన సునామీల దెబ్బకు ఫుకుషిమాలో గల దైచి అణు విద్యుత్ ప్లాంటులో అణు రియాక్టర్లు పేలిపోవడంతో అక్కడ ప్రజలు, ప్రభుత్వం నరక యాతనలు పడటం చూస్తూనే ఉన్నాము. చెర్నోబిల్ అణు ప్రమాదం తర్వాత, ఆ స్ధాయిలో తలెత్తిన అణు ముప్పును ఎలా ఎదుర్కోవాలో తెలియక జపాన్ ప్రభుత్వం నిస్సహాయ స్ధితిలో పడిపోయింది. జపాన్ ప్రభుత్వం అణు ప్రమాదం వలన తలెత్తిన ప్రమాదకర పరిణామాలను అరికట్టడంలో విఫలం అయ్యిందనీ, భూకంపం, సునామీల అనంతరం ఏర్పడిన అణు ముప్పు పరిస్ధితులకు సరైన రీతిలొ స్పందించలేక పోయిందనీ అమెరికా ప్రకటించింది. అక్కడితో ఆగకుండా దైచి ప్లాంటును అమెరికాకు అప్పజెప్పాలని కోరింది. తనకు అప్పజెపితే త్వరలోనే మామూలు స్ధితికి తెస్తామనీ ప్రకటించింది. అమెరికా ప్రకటనను జపాన్ ప్రభుత్వం తప్పు పట్టింది, అది వేరే విషయం.

జపాన్ ప్రభుత్వం సరిగా స్పందించలేక పోయిందని చెబుతున్న అమెరికా తమ ‘వెర్మోంట్’ రాష్ట్రంలోని అణు కర్మాగారంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తున్న ఆందోళనను పట్టించుకోవడం లేదు. అక్కడ ఉన్న “వెర్మోంట్ యాంకీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్” నలభై ఏళ్ళనాటిది. దాని జీవిత కాలం 2012 లో ముగుస్తున్నందున వెర్మోంట్ రాష్ట్ర సెనేట్ దానిని 2012లో మూసివేయాలని కూడా ఓటింగ్ ద్వారా ఫిబ్రవరి  24, 2010న నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని పట్టించుకోకుండా యు.ఎస్.న్యూక్లియర్ రెగ్యులేటర్ కమిషన్ (అమెరికా అణు నియంత్రణా కమిషన్) వెర్మోంట్ లోని అణు కర్మాగారాన్ని మరో ఇరవై సంవత్సరాలు కొనసాగించడానికి యజమాన్యానికి అనుమతి ఇచ్చింది. జపాన్ భూకంపానికి సరిగ్గా ఒక రోజు ముందు ఈ అనుమతి ఇవ్వడం గమనార్హం.

వెర్మోంట్ యాంకీ అణు విద్యుత్ కర్మాగారంలో ట్రిటియం ను అణు ఇంధనంగా వాడుతున్నారు. ఈ కర్మగారం నుండి అనేక సార్లు ఇంధనం లీక్ అయ్యిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. వెర్మోంట్ అణు ప్లాంటు, జపాన్ లో ప్రమాదానికి గురయిన దాయిచి ప్లాంటు ఏ స్ధితిలో ఉన్నదో దాదాపు అదే స్ధితిలో ఉందని వెర్మోట్ రాష్ట్ర గవర్నరు ‘పీటర్ షుమ్లిన్,’ “డెమొక్రసీ నౌ” టీవీ చానెల్ తో చెప్పాడు. అణు కర్మాగారాన్ని ‘ఎంటర్జీ లూసియానా’ అనే కంపెనీ నడుపుతున్నదనీ ఆ కంపెనీ పైన మాకసలు నమ్మకం లేదనీ గవర్నరు చెప్పాడు. జపాన్లో దాయిచి ప్లాంటుకు వయసు నిండిపోయిందనీ దానిలాగే ఇక్కడ మారాష్ట్రంలోని కర్మాగారం ముదలై ఇప్పటికి 38 సంవత్సరాలు నిండాయనీ దానిని ఇంకా కొనసాగించడం ప్రమాదకరమనీ తెలిపాడు. ఇప్పటికే అనేక సార్లు ట్రిటియం ఇంధనం రేడియో ధార్మికత లీకయ్యిందనీ, మా ఆందోళనను రెగ్యులేటరీ కమిషన్ పట్టించుకుంటుందని ఆశిస్తున్నామనీ గవర్నర్ అన్నాడు.

వెర్మోంట్ ప్లాంటు మూసివేయాలని రాష్ట్ర ప్రజలు నాలుగు సంవత్సరాలనుండి ఆందోళనలు చేస్తున్నారు. గ్రీన్ పీస్ లాంటి సంస్ధలు సైతం అనేక సార్లు ఆందోళనలు నిర్వహించింది. 2007 సంవత్సరంలో రియాక్టర్ లో ఇంధనం నింపుతున్నపుడు రేడియేషన్ లీకయ్యింది. అమెరికా ప్రభుత్వం నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువగా రేడియేషన్ అప్పుడు రికార్డయ్యింది. అప్పుడే పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనలు చేశారు. జులై 2008 లో రియాక్టరును చల్ల బరిచే వ్యవస్ధ నిమిషానికి 60 గ్యాలన్ల నీటిని లీకుల ద్వారా వదిలి పెట్టి ఆందోళనకు గురిచేసింది. ఇలాంటివి జరిగినప్పుడల్లా యాజమాన్యం తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతు వచ్చింది. అణు వ్యర్ధాలు ప్రత్యేక పాత్రల్లో ఉంచినా పాత్రల సామర్ధ్యాన్ని ఎప్పుడూ పరీక్షించిన పాపాన పోలేదు. ప్లాంటుకి సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర సెనేట్ కి ఇచ్చినప్పుడు చాలా వివరాలు ఇవ్వకుండా తొక్కిపెట్టింది. దానితో ప్లాంటు అధికారులను అనేకసార్లు సెనేట్ అభిశంసించడం, సెలవులో పొమ్మని ఆదేశించడం జరిగింది.

రాష్ట్ర సెనేటు 26 – 4 ఓటుతో ప్లాంటును మూసివేయాలని నిర్ణయించినా యాజమాన్యం మరో ఇరవై సంవత్సరాలు కొనసాగించడానికి అనుమతి కోరడం పట్ల అసహనం వ్యక్తం చేశాడు. అమెరికాలో మూసివేతకు దగ్గరైన న్యూక్లియర్ ప్లాంటులు 104 ఉన్నాయి. వాటిలో 60 ప్లాంటుల యాజమాన్యాలు కొనసాగించడానికి అనుమతి కోరితే అందరికీ రెగ్యులేటరీ కమిషన్ అనుమతి ఇచ్చింది. తాము ఎట్టి పరిస్ధితుల్లోనూ అణు కర్మాగారం కొనసాగింపుకు అంగీకరించేది లేదని పీటర్ తెలిపాడు. వెర్మోంట్ యాంకీ న్యూక్లియర్ పవర్ ప్లాంటు కనెక్టికట్ నది ఒడ్డున ఉంది. ఈ ప్లాంటు నుండి లీకవుతున్న అణు ఇంధనం భూమిలో ఇంకుతోంది. మొదట్లో లీకు విషయం బైటికి పొక్కకుండా ఉండటానికి ఎంటర్జీ ప్రయత్నించింది. స్వఛ్ఛంద సంస్ధలు బైట పెట్టాక అంగీకరించక తప్పలేదు. అంతే కాకుండా వాడిన ఇంధనాన్ని నది దగ్గర నిలవ చేశారు. ప్లాంటు కాలపరిమితి ముగిశాక దాన్ని అలానే వదిలేసి పోవడం కుదరదు.

అణు వ్యర్ధం వలన రేడియేషన్ వ్యాపించకుండా ఉండటానికి 60 సంవత్సరాల పాటు తొలగింపు కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుంది. దానికి అవసరమైన నిధుల కోసం ప్రతి సంవత్సరం డబ్బు జమ చేయాల్సి ఉండగా ఎంటర్జీ లూసియానా అధికభాగం జమ చేయలేదు. దానితో ప్రజలపైన పన్నులు వేసి రాబట్టబోతున్నారు. ముందు అణు వ్యర్ధాన్ని ఎలా వదిలించుకోవాలో ఆలోచిస్తే తర్వాత కర్మాగారం కొనసాగింపు విషయం ఆలోచించ వచ్చని వెర్మోంట్ గవర్నరు భావిస్తున్నాడు. అణు వ్యర్ధాల తొలగింపును పట్టించుకోవట్లేదని గవర్నరు ఆక్షేపించాడు.

వ్యాఖ్యానించండి