జపాన్ ప్రభుత్వం ఫుకుషిమా లోని దైచి అణు విద్యుత్ ప్లాంటులో పేలిపోయిన రియాక్టర్లను చల్లబరిచే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా మిలట్రీ హెలికాప్టర్ల ద్వారా సముద్రపు నీటిని ప్లాంటుపై జారవిడుస్తున్నది. ఈ ప్రక్రియను బుధవారం మొదలు పెట్టినప్పటికీ రేడియేషన్ స్ధాయి ఎక్కువగా ఉండటంతో విరమించుకున్నారు. హెలికాప్టర్లతో పాటు ప్లాంటు వద్ద వాటర్ కెనాన్ లను ఉపయోగించి నీళ్ళు వెదజల్లుతున్నారు. మొదట పోలిసులు ప్రయత్నించినా వారు రేడియేషన్ కి గురయ్యే ప్రమాదం ఉండడంతో వారిని వెనక్కి రప్పించారు. మిలట్రీ వద్ద వాహనాల లోపలే ఉంటూ నీటిని జల్లే ఏర్పాట్లు ఉండడంతో వాటర్ కెనాన్ లను కూడా మిలట్రీ చేపట్టింది.
హెలికాప్టరు ద్వారా నీటిని జల్లే ప్రయత్నం ఎంతవరకు ఉపయోగపడుతున్నదీ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హెలికాప్టర్లు అధిక పరిమాణంలో నీరు తెస్తున్నప్పటికీ గాలులు వేగంగా వీస్తుండడం వలన అవి వదులుతున్న నీరు రియాక్టర్లపై తక్కువగానే పడుతున్నట్లు చెబుతున్నారు. ఎక్కువ భాగం రియాక్టరు బయట పడుతున్నట్లుగా వీడియో దృశ్యంలో తెలుస్తున్నది.ఈలోపు రియాక్టర్లలో విద్యుత్ ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ విద్యుత్ ని రప్పించగలిగితే నీటి పంపింగ్ సులభమవుతుంది. నాలుగవ రియాక్టరులోని వాడిన ఇంధనం నిలువ ఉంచిన చోట నీరు క్రమక్రమంగా పడిపోతున్నది. నీటి స్ధాయి పడిపోతే ఇంధన కడ్డీలు కరిగిపోయి రేడియేషన్ మరింత తీవ్రమవుతుంది.
ఫ్రాన్సు తమ పౌరులను రప్పించడానికి రెండు విమానాలు పంపింది. జపాజ్ ప్రభుత్వం 30 కి.మీ పరిధిలో ఉన్నవారు ఖాళీ చేయడమో ఇళ్ళను వదిలి రాకుండా ఉండడమో చేయాలని కోరగా, అమెరికా 80 కి.మీ పరిధిలో ఉండవద్దని తన పౌరులను కోరింది. బ్రిటన్ అమెరికాను అనుసరించింది. జపాన్ ను వదిలి రాలేనివారు జపాన్ దక్షిణ భాగానికి వెళ్ళవలసిందిగా అమెరికా, బ్రిటన్ లు కోరాయి. ఇండియా ఐ.టి సంస్ధలు విప్రో, ఇన్ఫోసిస్ లు తమ ఉద్యోగులను వెనక్కి రప్పించాయి. ఎల్ & టి సంస్ధ కూడా వాటిని అనుసరించింది.
జపాన్ సునామీ బాధిత ప్రాంతాల్లో చెత్తను తొలగించడంతో చనిపోయినవారి కోసం వెతుకులాట వేగం పుంజుకుంది. ఇప్పటివరకు 5,400 మంది చనిపోయారని నిర్ధారించారు. ఇంకా 9,500 మంది జాడ తెలియడం లేదని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం 380,000 మంది పౌరులు పునరావాస శిబిరాల్లో రక్షణ పొందుతున్నారు. భూకంపం, సునామీలు చేసిన నష్టానికి తోడు ఎముకలు కొరికే చలి జపాన్ ఈశాన్య ప్రాంతాన్ని వణికిస్తోంది. ఆహార సరఫరా నిండుకుంటున్నది. కొత్త సరఫరాలు వస్తున్నాయని ప్రభుత్వం చెబుతున్నది.
