అణువిద్యుత్ ప్లాంటుల నిర్మాణంపై పునరాలోచనలో చైనా


Kalpakkam nuclear reprocessing unit

చెన్నై దగ్గర ఉన్న కల్పక్కం న్యూక్లియర్ రీప్రాసెసింగ్ యూనిట్

జపాన్ లోని ఫుకుషిమా ‘దాయిచి’ అణువిద్యుత్ ప్లాంటు లో అణు రియాక్టర్లు పేలిపోయి పెద్ద ఎత్తున రేడియేషన్ విడుదల కావడం, రేడియేషన్ నియంత్రణకు జపాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమౌతుండడం, జపాన్ నుండి రేడియేషన్ ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తుండడం కారణాలతో పెద్ద ఎత్తున అణు విద్యుత్ ప్లాంటుల నిర్మాణం తలపెట్టిన చైనా పునరాలోచనలో పడింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అన్ని అణు విద్యుత్ ప్లాంటుల నిర్మాణాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అక్కడ భద్రతా వ్యవస్ధలను సమీక్షిస్తున్నట్లు తెలిపింది.

చైనా విద్యుత్ వినియోగంలో ప్రస్తుతం రెండు శాతం మాత్రమే 13 అణు ప్లాంటులలో ఉత్పత్తయ్యే అణు విద్యుత్ తీరుస్తోంది. నాలుగింట మూడు వంతుల విద్యుత్ ధర్మల్ కేంద్రాలు తీరుస్తున్నాయి. భూమి వేడెక్కుతున్న నేపధ్యంలో క్లీన్ ఎనర్జీని అందించే అణు విద్యుత్ పైన చైనా దృష్టి పెట్టింది. ప్రపంచంలో కొత్తగా నిర్మితమవుతున్న అణు ప్లాంటులలొ 40 శాతం చైనాలోనే నిర్మితమవుతున్నాయి. చైనాలో ఇప్పుడు 27 విద్యుత్ ప్లాంటుల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. వీటి నిర్మాణాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు చైనా ప్రధాని వెన్ జియా బావో ప్రకటించాడు. ‘జపాన్ పరిణామాల నేపధ్యంలో అణు ప్లాంటుల వద్ద భద్రతకే ఇప్పుడు ప్రధమ ప్రాధాన్యం ఇస్తున్నాము” అని ఆయన ప్రకటించాడు. ప్రపంచ అణు సంఘం ప్రకారం రానున్న కొద్ది సంవత్సరాల్లో చైనా 110 అణు విద్యుత్ కేంద్రాలు నిర్మించ తలపెట్టింది.

వాడిన ఇంధనాన్ని తిరిగివాడటానికి వీలుగా సరికొత్త రీ ప్రాసెసింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లుగా చైనా ఇటీవల తెలిపింది. ఇండియా కూడా దేశీయ రీ ప్రాసెసింగ్ టెక్నాలజీని అభివృద్ది చేసింది. అయితే 2008 నాటి అణు ఒప్పందం ద్వారా ఇండియా వినియోగానికి ఎన్.ఎస్.జీ (న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్) సరఫరా చేసిన యురేనియం ఇంధనాన్ని రీప్రాసెసింగ్ చేయకుండా నిషేధించింది. అంటే వాడిన అణు ఇంధనాన్ని భారత రీప్రాసెసింగ్ టెక్నాలజీ ద్వారా తిరిగి ఉపయోగించకుండా నిషేధించారు. దానితో ఇండియా అభివృద్ధి చేసుకున్న రీ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఉపయోగం లేకుండాపోయింది.

అంతే కాకుండా ఇండియాలో ధోరియం మూలకం ఎక్కువగా దొరుకుంది. దానిని కూడా అణు విద్యుత్ ఉత్పత్తికి వినియోగించవచ్చు. అణు ఒప్పందం ద్వారా ఇండియాకు అమెరికా తదితర దేశాలు సరఫరా చేసే టెక్నాలజీ కేవలం యురేనియం నుండి విద్యుదుత్పత్తి చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంతిమంగా ఇండియా అణు విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే ఇంధనాన్ని ఎన్.ఎస్.జి దేశాలనుండి కొనుగోలు చేయాలి. ఆ ఇంధనాన్ని వాడేశాక మిగిలే “వాడేసిన ఇంధనం” తిరిగి దానిని అమ్మిన దేశానికే ఇచ్చేయాలి. తద్వారా ఇండియా రీ ప్రాసెసింగ్ టెక్నాలజీని వినియోగించుకునే అవకాశం కోల్పోతుంది. మన్మోహన్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందం ఫలితం ఇది.

జపాన్ ప్రమాదం జరిగాక అమెరికా నిపుణులు ఓ సదస్సులో మాట్లాడుతూ “జపాన్ ప్రమాదాన్ని చూసి ఇండియా అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. తన అణు విద్యుత్ పధకాలను ఇండియా కొనసాగించాలి” అని ఓ ఉచిత సలహా పడేశారు. ఇండియా వెనక్కి తగ్గితే అమెరికా అణు రియాక్టర్లు అమ్ముకునే అవకాశం పోతుంది. అమెరికా రియాక్టర్లు అమ్ముడు పోవడానికి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నప్పటికీ భయపడకుండా ఇండియా అణు విద్యుత్ కేంద్రాలు నిర్మించాలని వారు సలహా ఇస్తున్నారన్నమాట. ఇండియా ప్రభుత్వం కూడా అణు విద్యుత్ ఉత్పత్తిపై వెనక్కి తగ్గే ఆలోచనలేవీ లేవని ఎంచక్కా ప్రకటించింది. చైనా పాలకులకీ ఇండియా పాలకులకీ ఉన్న తేడా ఇది.

వ్యాఖ్యానించండి