లిబియా తిరుగుబాటు ప్రతినిధితో హిల్లరీ సమావేశం, నో-ఫ్లై జోన్ ఆమోదం?


నాటో కూటమి లిబియా గగనతలాన్ని “నిషిద్ధ గగనతలం” గా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పారిస్ లో జి-8 గ్రూపు దేశాల మంత్రుల సమావేశం జరిగింది. లిబియా భూభాగంపై ఉన్న గగనతలాన్ని “నిషిద్ధ గగనతలం” గా ప్రకటించే విషయాన్ని చర్చించడం కోసం జి-8 దేశాల మంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా లిబియా తిరుగుబాటు ప్రభుత్వ ప్రతినిధి “మహమ్మద్ జెబ్రిల్” హిల్లరీ క్లింటన్ ను కలిశాడు. 45 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశం వివరాలు ఏవీ తెలియలేదు. జి-8 సమావేశం కూడా ఇతమిద్ధంగా ఏమీ తేల్చలేదు.

అరబ్ లీగ్, నో-ఫ్లై జోన్ అమలు చేయడానికి మద్దతు తెలిపినప్పటికీ, విదేశీ సైనిక జోక్యానికి మాత్రం నిరాకరించింది. దీని అర్ధం ఏమిటో అమెరికా తెలుసుకోగోరుతున్నది. వాస్తవానికి అమెరికాకి అరబ్ లీగ్ ఉద్దేశ్యం అర్ధం కాక కాదు. విదేశీ సైనిక జోక్యం నిరాకరించినట్లయితే పశ్చిమ దేశాలు లిబియా తిరుగుబాటుదారులకు ఎందుకు సహాయం చేయాలన్నదే అమెరికా అంతరార్ధం. అరబ్ లీగ్ గానీ, లిబియా తిరుగుబాటుదారులు గానీ విదేశీ జోక్యానికి వ్యతిరేకం అన్న షరతును విధించకుండా ఉంటేనే నో-ఫ్లై జోన్ అమలుకు నాటో ముందుకు రావచ్చు.

అయితే నో-వ్లై జోన్ విధివిధానలపై మరింత చర్చ జరిగి ఎక్కడో ఒక చోట అమెరికాకూ, లిబియా తిరుగుబాటు దారులకూ అంగీకారం కుదిరితే తప్ప నాటో జోక్యం చేసుకునే అవకాశం లేదని చెప్పవచ్చు. గడ్డాఫీ బలగాల యుద్ధవిమానాలకు సమాధానం ఇవ్వలేని స్ధితిలో ఉండి, ఒక్కో పట్టణాన్నీ చేజార్చుకుంటున్న తిరుగుబాటుదారులు బేషరతుగానో లేదా సైనిక జోక్యానికి పాక్షిక అంగీకారంతోనో అమెరికాతో ఒప్పందం కుదుర్చికునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుగుబాటు దారులు అంతకు మించి మరో ప్రత్యామ్నాయం లేని పరిస్ధితుల్లో ఉన్నారు.

వ్యాఖ్యానించండి