మూడో రియాక్టర్ పేలుడు, జపాన్ లో అత్యంత ప్రమాదకర స్ధాయికి చేరుకున్న అణు ధార్మికత


Blast in Fukushima Nuclear Plant

ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రంలో నెం.3 రియాక్టరు పేలుడు దృశ్యం

జపాన్ భూకంపం, సునామీల కారణంగా సోమవారం వరకు రియాక్టర్ నెం. 1, 3 లలో పేలుళ్ళు జరిగిన విషయం తెలిసిందే. మంగళవారం నెం. 2 రియాక్టరు కూడా పేలిపోయింది. దానితో పాటు భూకంపం రావడానికి చాలా రోజుల ముందే నిర్వహణ నిమిత్తం మూసివేసిన నెం.4 రియాక్టరులో కొద్ది సేపు మంటలు ఎగసిపడ్డాయి. నాల్గవ రియాక్టరు పనిలో లేనప్పటికీ వాడిన ఇంధన రాడ్లను అక్కడే ఉంచడం వలన అక్కడ కూడా అణు ధార్మికత వెలువడే ప్రమాదం తలెత్తింది. రెండో నెంబరు రియాక్టర్ పేలుడులో రియాక్టరులో ఇంధన రాడ్లు ఉండే మందపాటి లోహపాత్ర స్వల్పంగా నెర్రెలు ఇచ్చి దెబ్బతినడంతో అణుధార్మికత ప్రమాదం తీవ్ర స్ధాయికి చేరుకుంది.

ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంటు వద్ద గంటకు 400 మిల్లీ సీవర్టుల రేడియేషన్ (అణు ధార్మికత) నమోదు అయినట్లుగా ఐ.ఏ.ఇ.ఏ (అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధ) తెలిపింది. సంవత్సరానికి 100 మిల్లీ సీవర్టుల రేడియేషన్ విడుదల అయితే కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని ప్రపంచ అణు అసోసియేషన్ (వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్) తెలిపింది. రేడియేషన్ విడుదలపై సంవత్సరానికి ఉన్న చట్టబద్ధ పరిమితికంటే ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం వద్ద ఎనిమిది రెట్లు రేడియేషన్ గంటలోనే విడుదల అవుతున్నదని ఫుకుషిమా అణు కేంద్రాల ఆపరేటర్ ‘టోక్యో ఎలెక్ట్రిక్ పవర్ కంపెనీ’ తెలియజేసింది. అంటే రేడియేషన్ విడుదల ప్రమాదకర స్ధాయి కంటే అనేక రెట్లు పెరిగింది.

ప్లాంటుకి 30 కి.మీ పరిధిలో ప్రజలు ఖాళీ చేయాలని జపాన్ ప్రభుత్వం కోరింది. 20 కి.మీ పరిధిలోని వారిని ఇప్పటికే ఖాళీ చేయించారు. 20 నుండి 30 కి.మీ పరిధిలో ఉన్నవారు తలుపులన్నీ బిగించి లోపలే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉతికిన బట్టలను బయట కాకుండా లోపలే ఆరబెట్టుకోవాలని కోరింది. వెంటిలేటర్ ఫ్యాన్లను తిరగనీయవద్దనీ కోరింది. ఇళ్లను గాలి చొరనీయకుండా ఉంచాలని చెప్పింది. ఫుకుషిమాకి 250 కి.మీ దూరంలో ఉన్న టోక్యో నగరంలో రేడియేషన్ స్ధాయి సాధారణ స్ధాయి కంటే ఎక్కువగా నమోదయ్యింది. అయితే ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే స్ధాయిలో టోక్యోలో రేడియేషన్ లేదని అధికారులు తెలిపారు. టోక్యో వాసులు నిత్యావసర సరుకులు ఎక్కువగా కొని నిలవ ఉంచుకుంటున్నారు. కొన్ని షాపుల్లో సరుకులు అప్పుడే పూర్తిగా అమ్ముడు పోయాయి.

ఫుకుషిమా ప్లాంటు చుట్టూ 30 కి.మీ పరిధిలోని గగనతలాన్ని “నో-ఫ్లై జోన్” గా జపాజ్ ప్రభుత్వం ప్రకటించింది. విమానాలు రేడియేషన్ ను ఇతర ప్రాంతాలకు మోసుకుపోకుండా ఈ జాగ్రత్త తీసుకున్నారు. జపాన్ షేర్ మార్కెట్లు మంగళవారం కూడా పతనమయ్యాయి. సోమవారం 6 శాతం పైనే నష్టపోయిన టోక్యో స్టాక్ ఎక్ఛేంజి సూచిక ‘నిక్కీ,’ మంగళవారం 10.55 శాతం పడిపోయింది. దీని ప్రభావం ఆసియా మార్కెట్లన్నింటిపై పడింది. ఇండియా మార్కెట్ సెన్సెక్స్ సూచిక 272 పాయింట్లు (1.47 శాతం) నష్టపోగా, నిఫ్టీ 82 పాయింట్లు (1.48 శాతం) నష్టపోయింది.

ఆర్ధిక వ్యవస్ధ దెబ్బతినకుండా ఉండటానికి సోమవారం మార్కెట్లోకి 183 బిలియన్ డాలర్లు విడుదల చేసిన జపాన్ ప్రభుత్వం మంగళవారం 100 బిలియన్ డాలర్లు విడుదల చేసింది. జపాన్ ప్రధాని నవోటో కాన్ టెలివిజన్ లో మాట్లాడుతూ అణు ధార్మికత విడుదల మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉందని తెలిపాడు. “మనమిప్పుడు ప్రజల ఆరోగ్యానికి హాని చేసే రేడియేషన్ స్ధాయిని గురించి మాట్లాడుకుంటున్నాము” అని ఛీఫ్ కేబినెట్ సెక్రటరీ ప్రకటించాడు.

ఇదిలా ఉండగా భారత దేశంలోని అణు విద్యుత్ రియాక్టార్ల వద్ద భద్రతా పరిస్ధితిని సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. భారత అణు విద్యుత్ కేంద్రాల వద్ద ఎటువంటి ప్రమాద పరిస్ధితులు లేవని అంతా అదుపులోనే ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇండియా, టర్కీ లాంటి దేశాలు పదుల సంఖ్యలో అణు విద్యుత్ కేంద్రాలు నిర్మించడానికి ఉద్యుక్తులౌతున్న సమయంలో జపాన్ అణు విద్యుత్ కేంద్రాల వద్ద జరిగిన ప్రమాదం ఆయా దేశాల ప్రజలకు కర్తవ్య ప్రభోధం చేయగలదని ఆశించడంలో తప్పు లేదు.

వ్యాఖ్యానించండి