బహ్రెయిన్ కి తమ సైనికులను పంపిన గల్ఫ్ దేశాలు


బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇస్సా అల్-ఖలీఫా వినతి మేరకు గల్ఫ్ దేశాలు తమ సైనికులను బహ్రెయిన్ కు పంపాయి. గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (జి.సి.సి) సభ్య దేశాల ఒప్పందం మేరకు ఈ సైనికుల తరలింపు జరిగింది.

బహ్రెయిన్ రాజు నేతృత్వంలోని ప్రభుత్వం దిగిపోవాలంటూ నెలన్నర పైగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. షియా గ్రూపుకి చెందిన ప్రతిపక్షాలు వారికి నాయకత్వం వహిస్తున్నాయి. రాజు చర్చలకు ఆహ్వానించినప్పటికీ వారు నిరాకరించారు.

ఆదివారం, మార్చి 13 తేదీన నిరసనకారులపై పోలీసులు జరిగిపిన కాల్పుల్లో ఏడుగురు చనిపోయారు. తదనంతరం బహ్రెయిన్ రాజు జి.సి.సి లోని సహచార దేశాలను సైనిక సాయం అందించాల్సిందిగా కోరాడు.సౌదీ అరేబియా, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఒమన్, ఖతార్… ఈ ఆరు దేశాలు జి.సి.సి లో సభ్యులు.

ఇతర దేశాలనుండి సైనికులు బహ్రెయిన్ లో అడుగు పెడితే అది దురాక్రమణ కిందికి వస్తుందని ప్రతిపక్షాలు ప్రకటించినప్పటికీ సౌదీ అరేబియా తో సహా మిగతా గల్ఫ్ దేశాల నుండి సైనికులు బహ్రెయిన్ కు చేరుకున్నారు. వెయ్యి మంది సైనికులను పంపినట్లు సౌదీ అరేబియా తెలిపింది.

బహ్రెయిన్ లో డెబ్భై శాతం మంది షియా మతానికి చెందినప్పటికీ రాజు మాత్రం సున్నీ మతస్ధుడు. ప్రభుత్వ ఉద్యోగాలలో, ఇళ్ళ కేటాయింపులో షియా మతస్దులపై ప్రభుత్వం వివిక్ష చూపుతున్నదని షియా మతస్ధులు చాలా కాలం నుండి ఆరోపిస్తున్నారు.

వ్యాఖ్యానించండి