బుధవారం ఆయిల్ పట్టణమయిన బ్రెగాపై విమాన దాడులు నిర్వహించి గడ్డాఫీ బలగాలు కొన్ని గంటల పాటు స్వాధీన పరచుకున్నప్పటికీ తిరుగుబాటుదారులు ప్రతిదాడితో మళ్ళీ పట్టణాన్ని వశపరచుకున్న సంగతి విదితమే. బ్రెగా పట్టణాన్ని తిరిగి కైవశం చేసుకున్నామన్న ఆనందంలో తిరుగుబాటుదారులు ఉండగానే గడ్డాఫీ బలగాలు గురువారం మరొకసారి బ్రెగా పట్టణంపై విమానాలనుండి బాంబులు జారవిడిచారు. ఆయిల్ కంపినీకి పౌరుల ఆవాసాలకు మధ్య బాంబులు పడినట్లుగా తిరుగుబాటుదారులు తెలిపారు. బ్రెగాపై బాంబు దాడిలో ఎవరూ గాయపడలేదని తెలిసింది.
అయితే అజ్దాబియా పట్టణంపైన కూడా బాంబులు వేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అజ్దాబియా పట్టణం బ్రెగా పట్టణానికి తూర్పుగా మరింత లోపలికి ఉంది. అజ్దాబియాపై దాడుల గురించి వివరాలు తెలియ రాలేదు. బ్రెగాపై బుధవారం జరిగిన దాడిలో 14 మంది చనిపోయారు. బెంఘానియాలో ఉన్న తిరుగుబాటుదారులు పశ్చిమ ప్రాంతం వైపుకు పురోగమించే ప్రయత్నం చేసే అవకాశం ఉందని బిబిసి విలేఖరి తెలిపాడు. ఇరుపక్షాలూ ప్రత్యర్ధిపై నిర్ణయాత్మక దాడులకు పూనుకోక పోవడం వలన ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇరువురికీ అంతకు మించి శక్తి కొరవడిందన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా లిబియాకు ట్యునీషియాతో ఉన్న సరిహద్దు వద్ద పదుల వేల సంఖ్యలో సరిహద్దు దాటటానికి ప్రయత్నిస్తున్నారు. లిబియాలో జరుగుతున్న హింసాత్మక దాడులనుండి తప్పించుకోవడానికి తమ స్వదేశాలకు వెళ్ళడానికి వీరు ప్రయత్నిస్తున్నారు. బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయన్ తదితర దేశాలు వీరిని సరిహద్దు దాటించడానికి ఎమర్జెన్సీ సర్వీసులు నిర్వహిస్తున్నాయి. వాయు మార్గం ద్వారా సరిహద్దు దాటిస్తున్నట్లు తెలుస్తోంది. తిరుగుబాటు ప్రారంభమైనప్పటి నుండీ 75,000 మంది ట్యునీషియాకు తరలి పోయారనీ, ఇంకా 40,000 మంది ఎదురుచూస్తున్నారనీ ఐక్యరాజ్యసమితి తెలిపింది. “ప్రపంచ ఆహార కార్యక్రమం” (వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం) సంక్షోభంలో ఇరుక్కున్న 27 లక్షల మందికి సాయం అందించడానికి 38.7 మిలియన్ డాలర్ల సహాయం ప్రకటించింది.
మానవ జాతికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినందుకు గాను పది నుండి పదిహేను మంది వరకు లిబియా నాయకుల పేర్లను పరిశోధన నిమిత్తం ప్రకటించనున్నామని అంతర్జాతీయ న్యాయ స్ధానం ప్రకటించింది. లిబియా పౌరులపై గడ్డాఫీ కాల్పులు జరిపి వందల మందిని చంపినందుకు భద్రతా సమితి అంతర్జాతీయ న్యాయస్ధానానికి ఏకగ్రీవంగా నివేదించిన సంగతి తెలిసిందే. నెదర్లాండ్స్ సైనికులు ముగ్గురు సిర్టే పట్టణంలో ఇద్దరు పౌరులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా గడ్డాఫీ బలగాలు ముగ్గురినీ పట్టుకుని నిర్బంధించినట్లుగా ఆ దేశం ధృవీకరించింది.
వెనిజులా అధ్యక్షుడు హ్యుగో ఛావెజ్ శాంతి కోసం చేసిన ప్రతిపాదనను గడ్డాఫీ తిరస్కరించాడు. అయితే “అరబ్ లీగ్” సంస్ధ ఛావెజ్ ప్రతిపాదనను అధ్యయనం చేస్తున్నట్లు తెలిపింది.
