2011-12 ఆర్ధిక సంవత్సరానికి నూతన బడ్జెట్ రూపొందించడంలో భాగంగా భారత ప్రభుత్వం శుక్ర వారం ఆర్ధిక సర్వే వివరాలను వెల్లడించింది. కొత్త బడ్జెట్ ప్రకటించటానికి రెండు మూడు రోజుల ముందు ఆర్ధిక సర్వే ఫలితాలను ప్రకటిస్తారు. ఈ సర్వేలు సాధారణంగా పారిశ్రామిక ఉత్పత్తి, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, జి.డి.పి పెరుగుదల, కరెంట్ ఎకౌంట్, ఎగుమతులు దిగుమతులు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ (చెల్లింపుల సమతూకం) మొదలైన వాటి ప్రస్తుత పరిస్ధితి వాటి మెరుగుదలకు తీసుకోవలసిన చర్యల పట్ల కేంద్రీకరిస్తుంది. వ్యవసాయం పైన కూడా కేంద్రీకరిస్తుంది కానీ ఆ రంగం నుండి ఇప్పుడు చెప్పుకున్న మెరుగుదలకు ఏ విధంగా సహకరిస్తుంది అన్న దాని పైనే కేంద్రీకరించి ఆ రంగంలో ఉన్న ప్రజల బాగోగులను మాత్రం గాలికి వదిలేస్తుంది.
ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్స్ – ఎఫ్.డి.ఐ) అప్పుడే తగ్గుముఖం పట్టాయని ఆర్ధిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. 2009-10 ఆర్ధిక సంవత్సరంలో 33.1 బిలియన్ డాలర్ల (1,52,260 లక్షల్ కోట్లు) ఎఫ్.డి.ఐలు భారత దేశానికి తరలి రాగా నవంబరు 2010 నాటికి కేవలం 19 బిలియన్ డాలర్లు (87,400 లక్షల కోట్లు) మాత్రమే వచ్చాయని ఆర్దిక సర్వే హెచ్చరించింది. ఈ ధోరణిని అరికట్టి ఎఫ్.డి.ఐలు పెరిగేందుకు తగిన చర్యలను తీసుకోవాలని సూచించింది. భారత దేశ ఆర్ధిక వృద్ధి ఊపును కొనసాగించడానికి ప్రభుత్వం సంస్కరణలను మరింత వేగవంతం చేయాల్సి ఉందని సర్వే పేర్కొంది.
ఆహార సరుకుల ధరలు పెరుగుతుండటం పైన కూడా సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. అధిక ధరలు ద్రవ్యోల్బణం పెరగడానికి దోహద పడుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరగడం వలన విదేశీ పెట్టుబడులు తగ్గుతున్నాయి. అదే ప్రభుత్వ ఆందోళన. అధిక ధరలు ప్రజల నడ్డి విరుస్తున్నాయనేది పెద్ద విషయం కాదు. దాదాపు రెండున్నర సంవత్సరాలనుండి ధరలు చుక్కల్లో ఉన్నా వర్షాలు రాకపోవటం వలన దరలు పెరిగాయనీ వర్షాలు వస్తే ధరలు తగ్గుతాయని ఒకటిన్నర సంవత్సరం గడిపారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి. అప్పుడే రెండు పంటలు కూడా తీశారు. ధరలు ఇంకా పెరిగాయి తప్ప తగ్గలేదు. ఇప్పుడు సరఫరా సంబంధిత ఆటంకాల వల్ల ధరలు తగ్గడం లేదు. ప్రజా పంపిణే వ్యవస్ధను పటిష్టం చేస్తున్నాం. (ఈ అంశంపై ఇక్కడ చర్చించుకున్నాం) ఇక తగ్గుతాయి, అంటున్నారు. అదెంత దూరం ఉందో తెలీదు. అప్పటి వరకు మంచి కారణం మాత్రం మాన పాలకులకు దొరికింది. ద్రవ్యోల్బణం తగ్గించడానికి వ్యవసాయ ఉత్పత్తి పెంచాలని సర్వే కోరింది. మరో హరిత విప్లవం కోసం ప్రయత్నించాలని సూచించింది.
ఆర్ధిక వృద్ధికి ఏ మాత్రం నష్టం జరగకుండా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే చర్యలు చేపట్టాలని గురువారం ప్రధాన మంత్రి అన్నారు. జి.డి.పి పెరుగుదల రేటు చైనా లాగా రెండంకెలకు చేరుకోవాలని ప్రధాని గారి ప్రగాఢ ఆకాంక్ష. ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలంటే ద్రవ్య చలామణిని తగ్గించాలి. అందుకు వడ్డీ రేట్లు పెంచాలి. వడ్డీ రేటు పెంచితే విదేశీ పెట్టుబడుల రాక తగ్గుతుంది. దానితో పాటు అప్పు కూడా ఖరీదవుతుంది. దాని ప్రభావం మళ్ళీ జి.డి.పి వృద్ధి రేటుపై పడుతుంది. కనుక ద్రవ్యోల్బణం అదుపా, లేక జి.డి.పి వృద్ధి రేటా? ఏది ప్రధానం? జి.డి.పి పై దృష్టి పెట్టి ధరల్ని వదిలేస్తే, ఈ సంవత్సరం నాలుగైదు రాష్ట్రాల ఎన్నికలున్నాయి. అధిక ధరలు ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టడం ఖాయం. అందుకనే ప్రధాని ఇప్పుడు ద్రవ్యోల్బణ అదుపే తక్షణ కార్యక్రమం అంటున్నాడు. ఆర్.బి.ఐ కూడా ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలని మొదటినుండి చెప్తోంది. చెప్పటమే కాక ఏడు సార్లు వడ్డీ రేటు కూడా పెంచింది. అయినా అది తగ్గ లేదు. బి.జె.పి హయాంలో ఆర్ధిక మంత్రిగా చేసిన యశ్వంత్ సిన్హా, నాల్రోజుల క్రితం. ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలంటే జి.డి.పి వృద్ధిని త్యాగం చెయ్యక తప్పదు అని ప్రభుత్వానికి ఉచిత సలహా పడేశాడు. ప్రతిపక్షంలో ఉన్నాడు కనక అంత ధైర్యంగా ఆ మాట అనగలిగాడు గాని అధికారంలో ఉంటే ఆయన పరిస్ధితీ అంతే.
పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు కూడా తగ్గి పోతోంది. ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో (జూన్ 2010 వరకు) పారిశ్రామిక వృద్ధి అధికంగా నమోదు కావటంతో చంకలు గుద్దుకున్నారు. ఆ తర్వాత మూడు నెలల్లో (సెప్టెంబరు 2010 వరకు) అది బాగా తగ్గి పోయింది. డిసెంబరుతో ముగిసే క్వార్టర్ లో కూడా పారిశ్రామిక ఉత్పత్తి కూడా తగ్గిపోయినట్లు ప్రభుత్వ లెక్కలు తెలిపాయి. ఏప్రిల్ 2010 నెలలో పారిశ్రామిక వృద్ధి 16.5 శాతం నమోదు కాగా డిసెంబరు 2010 వచ్చేసరికి కేవలం 1.60 శాతమే నమోదు చేసింది. పారిశ్రామిక ఉత్పత్తి వాటా మొత్తం జి.డి.పిలో సాపేక్షికంగా తక్కువే అయినప్పటికీ ద్రవ్యోల్బణం పై అది పడేసే ప్రభావం ఎక్కువే. ఎందుకంటే ఆర్.బి.ఐ వడ్డీ రేట్లకీ, వినియోగదారుల డిమాండ్ కీ చాలా త్వరగా స్పందిస్తుంది. వాటిలో ఏ మార్పులు జరిగినా ఐ.ఐ.పి (పారిశ్రామిక ఉత్పత్తి సూచిక – ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్) తీవ్రంగా స్పందించి ద్రవ్యోల్బణం పై ప్రభావం చూపిస్తుంది.
అరబ్ దేశాల్లో ప్రజాందోళన వలన ముడి చమురు ధర పెరిగి ద్రవ్యోల్బాణాన్ని పైకి నెడుతున్న సంగతి విదితమే. పెరిగిన చమురు ధరల్ని ప్రజల మీదికి నెట్టడమా, లేక సబ్సిడీ కింద భరించడమా అన్న డైలమాలో ప్రభుత్వం ఉంది. ప్రజల మీదికి నెడదామంటే రాష్ట్రాల ఎన్నికలు భయపెడుతున్నాయి. భరిద్దామంటే ప్రభుత్వ ఖర్చు పెరిగి సరళీకరణ లేటవుతోందని బహుళజాతి సంస్ధలు నిలదీస్తాయి. కోశాగరలోటు కూడా పెరుగుతుంది. ఆయిల్ రేట్లు పెరగడం వలన ప్రపంచంలో చాలా దేశాల్లో షేర్ మార్కెట్లు అధోగమనంలో ఉన్నాయి.
భారత దేశ ఆర్ధిక వ్యవస్ధ 8 నుండి 10 శాతం వృద్ధి రేటుతో బ్రహ్మాండమైన ఊర్ధ్వ స్ధాయి చక్ర భ్రమణంలో వెలిగి పోతోందని ఆర్ధిక సర్వే పేర్కొంది. ఇది ఎన్.డి.ఏ అధికారంలో ఉన్నప్పుడు ప్రవచించిన “ఇండియా షైనింగ్” నినాదం లాంటి బాపతే. ప్రజల నిజమైన పరిస్ధితులు గమనించకుండా అంకెలు చూసి గొప్పై పోవటమే. ద్రవ్యోల్బణం, కరెంటు ఖాతా లోటు, కోశాగార లోటు, వ్యవసాయ రంగం వృద్ధిలో స్తంభన, పారిశ్రామిక వృద్ధిలో తగ్గుదల, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల తగ్గుదల ఇవన్నీ సమస్యలేనని సర్వే పరోక్షంగా అంగీకరించింది.
ప్రపంచ వ్యాపితంగా అబివృద్ధి చెందిన దేశాల్లో ఆర్ధిక వృద్ధి అంతంతమాత్రంగా ఉండటంతో విదేశీ డిమాండ్ తగ్గి ఇండియా ఎగుమతులకు విఘాతం కలుగుతోంది. బైట దేశాలు బాగుంటే మన ఎగుమతులకు డిమాండ్ ఉంటుంది. లేకుంటే ఎగుమతులు తగ్గి వాణిజ్య లోటు పెరుగుతోంది. దాని వలన కరెంట్ ఖాతా లోటు కూడా పెరుగుతుంది. అది చెల్లింపుల సమతూకాన్ని దెబ్బ తీస్తుంది. చెల్లింపుల సమతూకం దెబ్బ తింటే విదేశీ పెట్టుబడులు దేశం నుండి వేగంగా వెళ్ళిపోతాయి. చెల్లింపుల సమతూకం దెబ్బ తినటం వల్లనే 1990లో ఇండియా ఐ.ఎం.ఎఫ్ అప్పుకోసం పరిగెత్తింది. అప్పటినుండే సరళీకరణ, ప్రైవేటీకరణలు ఊపందుకున్న సంగతి పాఠకులకు గుర్తుండే ఉంటుంది. సెప్టెంబరుతో మిగిసిన మూడునెలల్లో కరెంటు ఖాతా లోటు 15.8 బిలియన్ డాలర్లకు పెరిగిందని ప్రభుత్వ లెక్కలు చెపుతున్నాయి. దీని పట్ల కూడా ఆర్ధిక సర్వే హెచ్చరించింది.
మార్చి 2010 చివరన 2.9 శాతం ఉన్న కరెంటు ఖాతా లోటు మార్చి 2011 చివరికి 4 శాతానికి పెరిగే అవకాశం ఉందని అమెరికా లోని వాల్ స్ట్రీట్ లో ప్రఖ్యాత ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు అయిన ‘గోల్డ్ మేన్ సాచ్” పేర్కొన్నదని రాయిటర్స్ సంస్ధ శుక్రవారం తెలిపింది. ఇది ఇండియాలోని మార్కెట్ ఆర్ధిక వేత్తలకు దుర్వార్తే. మార్చి 2012 చివరికల్లా (రానున్న ఆర్ధిక సంవత్సరం చివరికి) కరెంటు ఖాతా లోటు 4.3 శాతానికి పెరుగుతుందని ఆర్ధిక సర్వే చెప్పింది. కరెంటు ఖాతా లోటుని స్వల్ప కాలిక పెట్టుబడులతో భర్తీ చేస్తున్నారని సర్వే హెచ్చరించింది. స్వల్పకాలిక పెట్టుబడులు కొద్ది కాలంలోనే ఉపసంహరించుకుంటారు గనక మళ్ళీ లోటు యధాస్ధితికి వస్తుందనేది సర్వే హెచ్చరిక సారాంశం. అది చాలదన్నట్లుగా వాణిజ్య లోటు పెరగనున్నదని వాణిజ్య మంత్రిత్వ శాఖ గత బుధవారం వెల్లడించింది. వాణిజ్యలోటు కూడా కరెంటు ఖాతా లోటును పెంచి చెల్లింపుల సమతూకాన్ని పెంచుతుంది.
ఆర్ధిక సర్వే అంతిమంగా విదేశీ పెట్టుబడులు పెరగడానికి తద్వారా జిడిపి ని పెరగాడానికి ఏయే అడ్డంకులు ఉన్నాయి, వాటిని తొలగించుకోవటం ఎలా అన్న విషయంపై కేంద్రీకరించింది తప్ప నిరుద్యోగం, దారిద్ర్యం, అవినీతి, పేదరికం, వ్యవసాయానికి సాగునీరు తదితర ప్రజా సమస్యల పట్ల ఆందోళన ఏమాత్రం వ్యక్తం చేయలేదు. పైగా విదేశీ సంస్ధలు ఇక్కడ పరిశ్రమలు స్ధాపించడానికి భూ సేకరణ కష్టమైపోతున్నదనీ, పర్యావరణ చట్టాలు ఆటంకంగా ఉన్నాయనీ వాపోయింది తప్ప భూములు ప్రజలకు ఎంత ముఖ్యమో గుర్తించ లేదు. ప్రజల చేతుల్లో ఉన్న భూముల్ని లాక్కోవటానికి సమస్యలున్నాయని హెచ్చరించింది. ఈ సర్వే ఉన్నోడికి దోచిపెట్టటానికి తప్ప, ప్రజల బాగోగులు చూసి వారి సమస్యలను పరిష్కరించేది కాదు.
