కొత్త సంవత్సరంలో ఇజ్రాయెల్ సైనికులు తమ హంతక చర్యలను ప్రారంభించారు. గాజాతో ఉన్న సరిహద్దు వద్ద సముద్రపు గవ్వలను ఏరుకొంటున్న ముగ్గురు పాలస్తీనా యువకులను ఇజ్రాయిల్ సైనికులు అమానుషంగా కాల్చి చంపారు. సరిహద్దు వద్ద మానవ నిషిద్ద ప్రాంతంలో పాలస్తీనీయులు పేలుడు పదార్ధాలు ఉంచుతున్నందున ఇజ్రాయిల్ సైనికులు వారిపైన కాల్పులు జరిపారని ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది.
గాజాలో అధికారంలో ఉన్న ‘హమాస్’ పోరాట సంస్ధ మరణించిన వారు తమ కార్యకర్తలని ప్రకటించ లేదు. వారి కార్యకర్తలు ఏదైనా చర్య సందర్భంగా చనిపోతే “హమాస్” వెంటనే ప్రకటిస్తుంది. గాజాలో ఉన్న ఏ మిలిటెంట్ సంస్ధ ఐనా తమ సభ్యులు అలాంటి సంఘటనల్లో మరణిస్తే ప్రకటిస్తాయి. ఇప్పుడు అలా ప్రకటించనందున చనిపోయినవారు పౌరులుగా భావించవచ్చు. చనిపోయినవారి బంధువులు ‘వారు ఇరవైలలో ఉన్న యువకులనీ, నిరాయుధులైన పౌరులనీ, కేవలం గవ్వలు ఏరుకుంటున్నారనీ’ తెలియ జేశారు.
సరిహద్దుల వద్ద ఇజ్రాయెల్ ఏకపక్షంగా మానవ నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించింది. దీనికి ఐక్యరాజ్యసమితి లాంటి సంస్ధల గుర్తింపు ఏమీ లేదు. గాజా పౌరులెవరయినా పొరపాటున సరిహద్దు సమీపం లోకి వస్తున్నట్లు భావించినా ఇజ్రాయెల్ సైనికులు కాల్పులు జరుపుతారు. అదేమని అడిగేవారు లేరు. ఎవరన్నా అడిగినా ఇజ్రాయెల్ లెక్క చేయదు. తన చర్యలను ఎవరు విమర్శించినా వారిని అరబ్ పక్షపాతులని ఒక నింద వేసి తిట్లకు లంకించుకుంటుంది. అమెరికా మద్దతు దానికి పూర్తిగా ఉండటమే ఇజ్రాయెల్ అరాచకాలకు కారణం. అమెరికా ప్రపంచంలో “నెంబర్ వన్ రోగ్ స్టేట్” అయితే ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని “నెంబర్ టు రోగ్ స్టేట్” గా చెప్పవచ్చు. 2010 సంవత్సరంలో 50 మంది పాలస్తీనీయుల్ని ఇజ్రాయెల్ కాల్చి చంపింది. వారిలో 12 మంది నిరాయుధులైన పౌరులు.
గాజాలో హమాస్ సంస్ధ అంతర్జాతీయ పరిశీలకుల పర్యవేక్షణలో జరిగిన ఎన్నికల్లో నెగ్గి అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ ఇజ్రాయెల్, అమెరికాలు ఎన్నికలు రద్దు చేసినట్లుగా ప్రకటించాయి. హమాస్ అధికారం లోకి వచ్చినప్పటినుండి ఇజ్రాయెల్ గాజా ప్రాంతాన్ని అష్ట దిగ్బంధనం (బ్లాకేడ్) కావించి అక్కడి ప్రజలకు బయటినుండి సరుకులేవీ అందకుండా చేస్తున్నది. అమెరికా తప్ప ప్రపంచంలో అన్ని దేశాలూ ఈ బ్లాకేడ్ ను ఖండించి వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశాయి. కాని ముందే చెప్పినట్లు ఇజ్రాయెల్ లెక్క చేయలేదు. నైతిక విలువలు, నియమాలు, అంతర్జాతీయ సూత్రాలు ఇలాంటివాటిని ఏవీ ఇజ్రాయెల్ గుర్తించదు.
గాజాలో ప్రజలు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకున్న హమాస్ సంస్ధను అమెరికా, ఇజ్రాయెల్, యూరోపియన్ యూనియన్ (ఇ.యు) లు టెర్రరిస్టు సంస్ధగా పరిగణిస్తాయి. అమెరికా, ఇ.యు ల మాట విననందుకే అది టెర్రరిస్టు సంస్ధ అయ్యింది. అంతర్జాతీయ సమాజం గాజా ప్రజలపై ఇజ్రాయెల్ అమలు జరుపుతున్న అమానుష నిర్బంధాన్ని, అణచివేతను మూడు సంవత్సరాలనుండి మౌనంగా చూస్తూ ఉండటం ప్రపంచం ఇంకా నాగరికతను సంతరించుకోలేదని ఋజువు చేసేదిగా ఉంది.
