బహ్రెయిన్ లో ప్రజల నిరసనల సందర్భంగా హింసాత్మక సంఘటనలు చెలరేగటంపై ఇంగ్లండ్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాందోళనలతో వ్యవహరించేటప్పుడు శాంతియుత చర్యలకు పరిమితం కావలసిన అవసరాన్ని బహ్రెయిన్ ప్రభుత్వానికి నొక్కి చెప్పినట్లు ఇంగ్లండ్ ఫారెన్ సెక్రటరీ విలియం హేగ్ బ్రిటిష్ కామన్స్ సభలో సభ్యులకు తెలియ జేశాడు. అవసరమయితే తప్ప బహ్రెయిన్ ద్వీపానికి ప్రయాణం పెట్టుకోవద్దని హేగ్ బ్రిటన్ పౌరులకు సలహా ఇచ్చాడు.
బహ్రెయిన్ రాజధాని మనామాలోని “పెరల్ స్క్వేర్” లో గుడారాలు వేసుకొని ఉన్న ఆందోళనకారులపై పోలీసులు గురువారం తెల్లవారు ఝామున హెచ్చరిక లేకుండా విరుచుకు పడటంతో ముగ్గురు పౌరులు చనిపోగా వంద మందికి పైగా గాయపడి ఆసుపత్రిలో చేరారు. ఒకరి పరిస్ధితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. అతను కూడా చనిపోయినట్లు అనధికారికంగా తెలిసింది. నిరసనకారులపై హింసాత్మక చర్యలకు దిగడంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బహ్రెయిన్ అమెరికాకు మిత్ర దేశం. బహ్రెయిన్ భూభాగంపై అమెరికా సైనిక స్ధావరం కూడా ఉంది.
“అన్ని పక్షాలు సంయమనం పాటించాల్సిందిగా బ్రిటన్ ప్రభుత్వం కోరింది. ప్రజల నిరసన హక్కుని గౌరవించాలని హితవు పలికింది. రాజు హామీ ఇచ్చినట్లుగా నిరసనకారుల మృతిపై సమగ్ర విచారణను వెంటనే ప్రారంభించి తన చిత్తశుద్ధిని చూపాలని బ్రిటన్ కోరింది. విచారణ పరిధి కిందికి గురువారం మరణాలను కూడా
చేర్చాలని కోరింది. బహ్రెయిన్ లో వైరి వర్గాలుగా ఉన్న ఇరు మతస్ధుల మధ్య సద్భావనా వంతెన నిర్మించటానికి ఇదే సరయిన సమయమని తెలిపింది. బయటి దేశాలకు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల్లో కలుగ జేసుకొనే హక్కు లేదని బ్రిటన్ ప్రకటించండం గమనార్హం. బహ్రెయిన్ 1971లో బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందింది.
అరబ్ దేశాల్లో చెలరేగుతున్న ప్రజాందోళనల పట్ల పశ్చిమ దేశాలు ఆందోళనతో ఉన్నాయి. పశ్చిమ దేశాల కనుసన్నల్లో ఉండే ఈ దేశాల పాలకులు పదవీచ్యుతులైతే తర్వాత అధికారం చేపట్టేవారు తమ మాట వింటారో లేదో అన్నదే ఈ దేశాల ఆందోళన. అదే సమయంలో ప్రజల ఆందోళనలను వ్యతిరేకిస్తే ప్రజాస్వామ్యం పై తాము చేసే బోదనల బండారం బయట పడుతుందేమో నన్న భయం కూడా పీడిస్తోంది.
