బహ్రెయిన్ ఆందోళనకారులపై ఉక్కుపాదం


 

Bahraini women

పోలీసుల దౌర్జన్యంపై బహ్రెయిన్ మహిళల నినాదాలు

మరిన్ని ప్రజాస్వామిక హక్కుల కోసం డిమాండ్  చేస్తున్న ఆందోళనకారులపై బహ్రెయిన్ ప్రభుత్వం కఠినంగా అణచివేస్తున్నది. టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీ ఛార్జి చేయటమే కాకుండా కాల్పులు కూడా జరపడంతో ముగ్గురు ఆందోళనకారులు చనిపోయారు. మరొకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వంద మందికి పైగా గాయపడ్డారు. హెచ్చరికలేమీ లేకుండా లాఠీ చార్జీ చేసి కాల్పులు జరిపినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. శాంతి బధ్రతల కోసం చర్యలు అనివార్యమయ్యాయనీ, చర్చల ద్వారా నచ్చ జెప్పటానికి అన్ని ద్వారాలు మూసుకు పోయిన తర్వాతనే లాఠి చార్జి, కాల్పులకు దిగవలసి వచ్చిందనీ పోలీసులు తెలిపారు. రాజు ఖలీఫా పౌరుల మృతి పట్ల విచారణ జరిపిస్తానని ప్రకటించాడు.

18వ శతాబ్దం నుండి బహ్రెయిన్ ను ఖలిఫా రాజ వంశస్ధులు పాలిస్తున్నారు. 1971లో బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందిన బహ్రెయిన్ లో మెజారిటీ ప్రజలు (75 శాతం) షియాలు కాగా రాజు సున్నీ మతస్ధుడు. తమపై వివక్ష చూపుతున్నారనీ, ప్రధానమైన అధికార స్ధానాలన్నీ సున్నీలవేననీ షియాల ఆరోపణ. బ్రిటిష్ వారి నిష్క్రమణ నుండీ బహ్రెయిన్ లో షియాలు సున్నీలు మధ్య ఘర్షణలు జరుగుతూ వస్తున్నాయని వార్తా సంస్ధలు తెలిపాయి.

రాజధాని మనమా లో తాజా ప్రదర్శనలు జరిగాయి. మనామా లోని పెరల్ స్క్వేర్ లో ఈ ప్రదర్శనలు కేంద్రీకృతమయ్యాయి. గత మంగళ వారం (ఫిబ్రవరి 15) నుండీ చాలా మంది ప్రదర్శకులు కుటుంబాలతో సహా శిబిరాలు ఏర్పాటు చేసుకుని పెరల్ స్క్వేర్ వద్ద ఉంటున్నారు. వేలాదిగా ఉన్న ప్రదర్శకులను పెరల్ స్క్వేర్ నుండి ఖాళీ చేయించడానికి గురువారం సుర్యోదయానికి ముందే పోలీసులు చర్యలు ప్రారంభించారు. నిద్రలో ఉన్న ఆందోళనకారులపై హెచ్చరికలు లేకుండా మొదట టియర్ గ్యాస్, తర్వాత లాఠీ చార్జీ, అనంతరం కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. హెచ్చరికలు లేకుండా పోలీసులు విరుచుకు పడటంతో ప్రజలు ఏం జరుగుతోందో తెలియని అయోమయంతో చెల్లాచెదురయ్యారు. చాలా మంది పిల్లలు వారి తల్లిదండ్రుల నుండి వేరు పడినట్లు ఆందోళనకారులు తెలిపారు.

 

Bahrain police

ఉదయాన్నే విరుచుకు పడ్డ బహ్రెయిన్ పోలీసులు

వందమందికి పైగా గాయాలవటంతో అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద కూడా పోలీసులు కఠిన నిర్బంధాన్ని అమలు చేశారు. లోపలివారు బైటకు, బైటివారు లోపలికి వెళ్ళకుండా కట్టడి చేశారు. తీవ్ర గాయల పాలైన వారికి రక్త దానం చేయడానికి లోపలికి వెళ్ళాలన్నా కూడా పోలీసులు అనుమతి ఇవ్వ లేదని కొంత మంది ఆందోళనకారులు మీడియాకు తెలిపారు. వీధుల్లో పదుల సంఖ్యలో సైనిక ట్యాంకులు కూడా మొహరించారు. ఆందోళనకారుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే ఈజిప్టులో ముబారక్ కు పట్టిన గతే తనకూ పడుతుందని రాజు హమద్ ఖలీఫా పోలీసులను ఉసి కొల్పినట్లు భావించవచ్చు.

ప్రస్తుత రాజు షేక్ హమద్ బిన్ ఈసా ఆల్ ఖలీఫా 1996 లో అమీర్ గా అధికారానికి వచ్చాడు. ఈయన వచ్చాక కొన్ని ప్రజాస్వామిక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. రాజకీయ ఖైదీలను విడిచి పెట్టడం, ప్రవాసంలో ఉన్నవారు దేశానికి తిరిగి రావడానికి అనుమతి ఇవ్వడం, విచారణ లేకుండా మూడు సంవత్సరాల వరకు నిర్బంధం లోకి తీసుకునే చట్టాన్ని రద్ధు చేయటం మొదలయిన చర్యలు చేపట్టాడు. అప్పటినుండీ షియాలు, సున్నీల మధ్య ఘర్షణల తీవ్రత తగ్గాయి. అయితే షియాలలో అసంతృప్తి మాత్రం తగ్గలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా నిరసన తెలియ జేస్తూ వచ్చారు.

ప్రస్తుతం ఆందోళనకారుల ప్రధాన డిమాండ్లు:

  • రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలి
  • మరిన్ని ఉద్యోగాలు కల్పింఛాలి, ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి
  • ప్రజలకు ప్రాతినిధ్యం వహించే శక్తివంతమైన పార్లమెంటు ఏర్పాటు చేయాలి
  • ప్రజల చేత రాయబడిన రాజ్యాంగాన్ని తేవాలి.
  • కొత్త కేబినెట్ లో ఇప్పటి ప్రధాన మంత్రి “షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ ఆల్-ఖలీఫా” కు చోటు ఉండ కూడదు.

ప్రజల ఆందోళనలు ఎలా ఉన్నప్పటికీ వారి డిమాండ్లు నెరవేరే పరిస్ధితి కనిపించడం లేదు. అమెరికా యధావిధిగా ఆందోళనకారుల పట్ల సానుభూతి కురిపిస్తూ ప్రకటన జారీ చేసింది. పౌరుల సార్వత్రిక హక్కులను, నిరసన తెలియజేసే హక్కును గౌరవించాలనీ కోరింది. హింస చెలరేగడం పట్ల ఆందోళన వ్యక్త చేసింది. బహ్రెయిన్ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని తెలుపుతూ అన్ని పక్షాలూ సంయమనం పాటించాలని హితవు పలికింది.

అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన పదకొండు రోజుల్లోనే నోబెల్ శాంతి బహుమతి పొందిన బారక్ ఒబామా హింస గురించి ఆందోళన వ్యక్తం చేయటం సహజంగా కనిపించవచ్చు. కానీ అదే ఒబామా అధ్యక్ష పదవిని చేపట్టిన కొద్ది కాలానికే ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికుల సంఖ్యను మరో ముప్ఫై వేలు పెంచి, మానవ రహిత డ్రోన్ విమానాలతో పౌరుల ఆవాసాలపై మరిన్ని బాంబుదాడులు జరిపించి వేలాదిమంది అర్ధంతరంగా చనిపోవాటానికి కారణమయ్యాడనీ, నోబెల్ శాంతి బహుమతి స్వీకరిస్తూ “శాంతి కావాలంటే యుద్ధం తప్పనిసరి” అని బోధించాడని తెలిసినప్పుడు, హింస పట్ల ఆయన ఆందోళన ఒఠ్ఠి బూటకమని ఇట్టే అర్ధమవుతుంది.

వ్యాఖ్యానించండి