లిబియాలో ఫిబ్రవరి 17 న ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శన కోసం పధకం


యెమెన్, బహ్రెయిన్, ఇరాన్ ల అనంతరం ఇప్పుడు లిబియాలో ప్రభుత్వ వ్యతిరేకులు నిరసన ప్రదర్శనలకు పిలుపినిచ్చారు. ఇంటర్నెట్ ద్వారా ప్రదర్శకులు ప్రధానంగా ఆర్గనైజ్ అవుతున్నారు. కానీ లిబియాలో ప్రభుత్వాన్ని కూల్చివేసే బలం ప్రభుత్వ వ్యతిరేకులకు లేదని పరిశీలకుల అభిప్రాయం. గురువారం, ఫిబ్రవరి 17న “ఆగ్రహ దినం” జరపాలని నిరసనకారులు నిర్ణయించుకోగా దానికి ఒక రోజు ముందే లిబియాలోని ఓడరేవు పట్టణమయిన బెంఘాజి లో లిబియా నాయకుడు “మహమ్మద్ గఢాఫి” వ్యతిరేక, అనుకూలుర మధ్య ఘర్షణలు చెలరేగాయి. కొద్ది మందికి గాయాలు తప్ప ఎవరికీ ఏమీ కాలేదని అనధికావర్గాల సమాచారం. ఘర్షణల గురించి అధికార సమాచారం ఏదీ లేదు.

బెంఘాజీ పట్టణంలో మానవ హక్కుల కార్యకర్త “ఫాతి తెర్బిల్”ను బుధవారం అరెస్టు చేయటంతో ఘర్షణలు ప్రారంభమయినట్లు సమాచారం. బెంఘాజీలోని “అబు సలీం” అనే జైలులో ఉన్నవారి తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఫాతి, జైలుకు నిప్పంటుకున్నదనీ, జైలు లోపలివారిని కాపాడాలని ప్రచారం చేస్తూ జనాల్ని కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నాడన్న పేరుతో అదన్ని భద్రతా దళాలు అరెస్టు చేశారని బిబిసి, రాయటర్స్ వార్తా సంస్ధలు తెలిపాయి. దానితో ఫాతిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 500 మంది వరకూ సిటీ సెంటర్ కు ప్రదర్శన నిర్వహించారని  రాయటర్స్ తెలిపింది. అయితే ప్రదర్శకులు వెయ్యి వరకు ఉన్నారని బిబిసి తెలిపింది.

ఈ లోపు ప్రభుత్వాన్ని సమర్ధిస్తూ, గడ్డాఫీ మద్దతుదారులు కూడా అదే చోటికి ప్రదర్శనగా రావటంతో ఘర్షణలు చెలరేగాయి. 38 మంది వరకు స్వల్ప గాయాలయ్యాయనీ ఆసుపత్రిలో చికిత్స చేసి డిశ్చార్జి చేశారని స్ధానిక వార్తా పత్రిక ద్వారా తెలిసింది. ప్రభుత్వ వ్యతిరేకులు పోలీసులపై రాళ్ళు రువ్వటంతో కొందరు పోలీసులకు కూడా గాయాలయ్యాయని తెలుస్తోంది. ప్రజలు ఏ అభిప్రాయం చెప్పాలన్నా చివరికి ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలన్నా దానికి ఏర్పాటు చేసిన మార్గాల ద్వారా తెలపవచ్చని ప్రభుత్వం ఒక ప్రకటనలో కోరింది.

బెంఘాజీలో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు సాధారణమేనని రాయిటర్స్ సంస్ధ తెలిపింది. 1996లో అక్కడ జైలులో జరిగిన అల్లర్ల సందర్భంగా వెయ్యిమంది పోలీసు కాల్పుల్లో చనిపోయిన దగ్గర నుండి గడ్డాఫి వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతూ వస్తున్నాయి. దానికి ప్రతిగా గడ్డాఫీ అనుకూల ప్రదర్శనలు కూడా జరుగుతుంటాయి.

ఆయిల్ ను ఎగుమతి చేసే దేశాల్లో ఒకటైన లిబియాను మహమ్మద్ గడ్డాఫి 42 సంవత్సరాలనుండి పాలిస్తున్నాడు. అరబ్ దేశాల్లో పశ్చిమ దేశాల పెత్తనాన్ని వ్యతిరేకించే వాడుగా పేరు పొందాడు. అందువలన లిబియాను పశ్చిమ దేశాలు “రోగ్ స్టేట్స్” లో ఒకటిగా పరిగణిస్తాయి. లిబియా, సూడాన్, ఆఫ్ఘనిస్తాన్ లు దాదాపు ఒకే లైన్ లో ఉంటాయి. భూగ్రహాన్ని అడ్డంగా విభజించే ఊహాత్మక రేఖల్ని అక్షాంశాలు (Axis) అని పిలిచే సంగతి తెలిసిందే. అడ్డంగా ఒకే లైన్ లో ఉన్న ఈ మూడు దేశాలను కలిపి “ఏక్సిస్ ఆఫ్ ఈవిల్” (చెడ్డ అక్షం) గా ఒబామా ముందు అమెరికాకి అధ్యక్షుడుగా ఉన్న జార్జి బుష్ పేరు పెట్టాడు. అమెరికా మాట వినకపోవడమే ఈ మూడు దేశాల చెడ్డ లక్షణం.

పశ్చిమ దేశాల వ్యతిరేకి అయిన గడ్డాఫీని చంపటానికి అమెరికా చాలా ప్రయత్నాలు చేసింది. నేరుగా గడ్డాఫీ నివసించే అధ్యక్ష భవనం పైనే బాంబు దాడి జరిపింది. అటువంటి లిబియాలో కూడా ప్రభుత్వ వ్యతిరేకత చెలరేగితే పశ్చిమ దేశాలు బాగా సంతోషిస్తాయి. ఈ నేపధ్యంలో గురువారం నాటి ప్రదర్శనలు ఆసక్తికరంగా మారాయి.

వ్యాఖ్యానించండి