ఈ అనుమానాలు ఆధార రహితమేమీ కాదు. నియంత ముబారక్ కు సుదీర్ఘ కాలం పాటు విధేయుడుగా ఉన్న మార్షల్ మహమ్మద్ హుస్సేన్ తంతావి మిలట్రీ కౌన్సిల్ కు అధిపతిగా ఉండి ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్నాడు. ముబారక్ నియంతృత్వాన్ని కాపాడుతూ వచ్చిన సైన్యానికి అతడు నాయకత్వం వహిస్తున్నాడు. ముబారక్ చేతిలో ప్రధాన అస్త్రమయిన “స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ” చట్టాన్ని ఇంతవరకు సైన్యం రద్దు చేయలేదు. ప్రజాస్వామ్య వ్యవస్ధ నెలకొల్పే వైపుగా తీసుకునే చర్యలను సైనిక ప్రభుత్వం ఇంతవరకూ ప్రకటించ లేదు. అలా ప్రకటించే వరకూ తాహ్రిరి స్క్వేర్ నుండి కదిలేది లేదన్న ఆందోళనకారులను కొంతమందిని సైన్యం బలవంతంగా తరలించి మిగిలిన వారిని అరెస్టు చేసింది.
ఇవన్నీ సైనిక ప్రభుత్వ ఉద్దేశాల పట్ల బలమైన అనుమనాలను కలిగిస్తున్నాయి. అదీ కాక సైనిక ప్రభుత్వానికి అమెరికా అండ ఉన్న సంగతి అర్ధం అవుతూనే ఉంది. తన అదుపులో ఉన్న సైనిక ప్రభుత్వం స్ధానంలో రేపు ఎవరు అధికారం చేపడతారో తెలియని ఎన్నికల ప్రభుత్వానికి అమెరికా ఒప్పుకుంటుందా అన్నది ఒక సమస్య. అమెరికా ఇంతవరకూ ఈజిప్టులో ఎన్నికలు జరగాలన్న అభిప్రాయం ఏమీ వ్యక్తం చేయలేదు. ముబారక్ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలన్నది తప్ప తర్వాత ఏం జరగాలన్నది అమెరికా సూచించలేదు.
ఆందోళనకారుల మన్ననలందుకొని ప్రజాస్వామిక ప్రభుత్వానికి నాయకత్వ వహించాలని ఈజిప్టు ప్రజలు కోరుకున్న వ్యక్తులు ఇప్పుడు సైన్యానికే మద్దతు పలకడం ప్రజల ఆకాంక్షలకు ఆశనిపాతమే. ప్రఖ్యాత ఇంటర్నెట్ సంస్ధ గూగుల్ లో కార్య నిర్వాహక అధికారిగా పని చేస్తున్న “వాయెల్ ఘోనిం” నిరసనకారుల్లో కొందరి మద్దతు పొందాడు. పశ్చిమ దేశాల మద్దతును కూడా ఇతను సంపాదించాడు. కానీ ఇప్పుడు ఈయన అనూహ్యంగా సైనిక ప్రభుత్వానికి మద్దతు తెలియ జేస్తూ ఇంటర్నెట్ లో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాడు. “ఆందోళనకారులు ఇళ్ళకు పోయి సైనిక ప్రభుత్వానికి సహకరించాల”ని ఈయన ట్విట్టర్ అనే ఇంటర్నెట్ సైట్ లో రాసుకున్నాడు.
ఆందోళనకారుల్లో ప్రధానంగా రెండు ఆలోచనా స్రవంతులు ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకటి సైన్యానికి అప్పజెపితే అదే ప్రజాస్వామ్యం తెస్తుందనేవారు కాగా రెండోది ప్రజాస్వామ్యం అనేది సమాజం లోని అట్టడుగు వర్గాల మద్దతుతో ఏర్పడాలనేవారి ఆలోచన. వారికి “అహ్మద్ మహేర్” నాయకుడుగా తెలుస్తోంది. ఆయన “ఏప్రిల్ 6 ఉద్యమం” అనే సంస్ధకు నాయకుడు. దీని కింద ఎల్-బరాదీ నేతృత్వంలోని యువకులు, ముస్లిం బ్రదర్ హుడ్ కి చేందిన యువకులు కూటమిగా ఉన్నారు. “ఫిబ్రవరి 18 నాటికి తమ డిమాండ్లు నెరవేర్చనట్లయితే మళ్ళీ ఉద్యమం ప్రారంభిస్తామని సైనిక ప్రభుత్వానికి తెలిపామ”ని మహేర్ సోమవారం పత్రికలకు తెలిపాడు.
అట్టడుగు వర్గాలు అనగానే సోషలిస్టు తరహా అని భావించనవసరం లేదు. వారి మద్దతు ఉన్నపుడు ప్రభుత్వంలో స్ధిరత్వం ఉంటుందన్నది వారి ఆలోచన కావచ్చు. మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలను వారి నుండి ఎదుర్కొనే అవసరం రాకపోవచ్చనే ఆశ కూడా అందులో ఉండవచ్చు. ఏదేమయినా సైనిక ప్రభుత్వం కంటే ప్రజాస్వామ్యం గా చెప్పుకునే వ్యవస్ధలో సాపేక్షికంగా కొంత రాజకీయ స్వేచ్ఛ ఉండే అంశమే ఆకర్షణ కలిగించేది. ఇప్పటి వరకు నియంతృత్వంలో ఉన్న ఈజిప్టు స్వేచ్ఛా పిపాసులకు నామ మాత్రపు స్వేచ్ఛ కూడా గొప్పగా కనిపించవచ్చు.
ఫిబ్రవరి 18 తేదీ లోగా ప్రజాస్వామ్యం నెలకొనడానికి తగిన చర్యలను ప్రకటించి ప్రారంభించాలని సైనిక ప్రభుత్వానికి తెలపటంతో పాటు ఆ తేదీన విజయోత్సవ దినంగా జరపాలని కూడా ఆందోళనకారులు పిలుపునిచ్చారు. ఇది పెద్దగా ప్రాచుర్యం పొందినట్లు కనిపించడం లేదు. 18 తర్వాత జరిగే పరిణామాలను బట్టి ఈజిప్టు తిరుగుబాటు ఇంకా సజీవంగా ఉన్నదీ లేనిదీ తెలుస్తుంది.