గురువారం సాయంత్రం ముబారక్ దిగిపోనున్నాడని చాలా మంది ఊహించినప్పటికీ ఆయన సెప్టెంబరు వరకూ దిగేది లేదని ప్రకటించాడు. కొన్ని అధికారాలు ఉపాధ్యక్షునికి అప్పగిస్తానని ప్రకటించాడు. కానీ ఏ అధికారాలనేది స్పష్టం కాలేదు. బయటివారి ఒత్తిళ్ళను, నిర్దేశాలను తాను లెక్క చేయనని కూడా ముబారక్ ప్రకటించాడు. సైన్యం “పరిస్ధితులు కుదుట పడ్డాక ఎమర్జెన్సీని తప్పకుండా ఎత్తివేస్తామని ప్రకటించింది. మామూలు పరిస్ధితులు ఏర్పడటానికి సహకరించాలని మరోసారి కోరింది.
అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ముబారక్ ప్రకటనకు ఒకింత తీవ్రంగా స్పందింఛాడు. “అధికారం అప్పగింత జరుగుతుందని ఈజిప్టు ప్రజలకు హామీ ఇవ్వబడింది. కాని ఈ అప్పగింత వెంటనే జరుగుతుందో లేదో స్పష్టం కాలేదు. అది అర్ధవంతంగా, అవసరమైనంతంగా ఉండేదీ లేనిదీ కూడా స్పష్టం కాలేదు. ప్రజాస్వామ్యం దిశగా ఈజిప్టు ప్రభుత్వం విశ్వసనీయమైన, దృడమైన, అనుమానాలకు ఆస్కారం లేని మార్గాన్ని ప్రజల ముందు ఉంచాల్సి ఉంది. కాని ప్రజలు ఇంకా ఆ అవకాశాన్ని పొందినట్లుగా కనిపించడం లేదు.” అని ఒబామా ప్రకటించాడు. అధికారం అప్పగించే దిశగా ముబారక్ ఒక ప్రకటన చేస్తాడని బహుశా అమెరికా కూడా అంచనా వేసినట్లున్నది.
అన్ని పక్షాలు సంయమనం పాటించాలని ఒబామా కోరాడు. ఈజిప్టు ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు బలగాలతో, అణచివేతతో సమాధానం ఇవ్వకూడదని తన ప్రకటనలొ పేర్కొన్నాడు. ఈజిప్టు ఆందోళనలు ప్రారంభమయ్యాక అమెరికా ఇంత తీవ్రంగా స్పందించటం ఇదే మొదటిసారని బిబిసి రాసింది. ముబారక్ ప్రకటన అమెరికాకు సంతృప్తి కలిగించలేదనటానికి ఈ ప్రకటన సంకేతమని బిబిసి విలేఖరి పేర్కొన్నాడు. మధ్య ప్రాచ్యంలో నమ్మకమైన మిత్రుడుగా ఉన్న ముబారక్ ప్రభుత్వానికి అమెరికా సంవత్సరానికి 1.3 బిలియన్ డాలర్లు (దాదాపు 6,000 కోట్ల రూపాయలకు సమానం) సాయంగా ఇస్తున్నది.
