అన్నివైపుల నుండి వస్తున్న ఒత్తిడులను ముబారక్ ఇంకా ప్రతిఘటిస్తూనే ఉన్నాడు. “ఈజిప్టు ఇంకా ప్రజాస్వామ్యానికి సిద్ధంగా లేదంటూ” ముబారక్ ప్రభుత్వం తరఫున చర్చల్లో పాల్గొంటున్న ఉపాధ్యక్షుడు ఒమర్ సులేమాన్ ప్రకటించండం పట్ల అమెరికా ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతిపక్షాలనూ, నిరసనలనూ ముప్ఫై సంవత్సరాలనుండీ అణచివేయటానికి ఉప్పయోగిస్తూ వస్తున్న ఎమెర్జెన్సీ చట్టాన్ని ఎత్తివేయాలన్న అమెరికా డిమాండ్ పట్ల విదేశాంగ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అమెరికా నమ్మకమైన మిత్రుడిగా ఉంటూ ప్రతికూల పరిస్ధితుల్లో ఎమర్జెన్సీ చట్టాన్ని ఎత్తివేయమనటం తనకు ఆశ్చర్యం కలిగిస్తున్నదని విదేశీ మంత్రి అన్నాడు. అమెరికాకి నమ్మిన బంటుగా ముబారక్ ప్రభుత్వం ఉండగలిగింది ఆ చట్టం వల్లనే కదా అన్నది ఆయన ఆశ్చర్యానికి కారణం కావచ్చు.
ఇంకోవైపు ఆందోళనకారులు బుధవారం తమ ఆందోళన కేంద్రాన్ని పార్లమెంటు వరకు విస్తరించారు. రానున్న రోజుల్లో పార్లమెంటును ఆక్రమించడానికి అవసరమైన ఏర్పాట్లను ఆందోళనకారులు చేసుకుంటున్నారా అన్నది పరిశీలించ వలసిన ఆంశం. అయితే శుక్రవారం ప్రభుత్వ రేడియో, టెలివిజన్ భవంతులను ఆక్రమించడానికి పధకం వేస్తున్నామని ఆందోళనకారులు తెలిపారు. వారు పార్లమెంటు చుట్టూ చెరినప్పటికీ తాహ్రిర్ స్క్వేర్ వద్ద ఇంకా పెద్ద సంఖ్యలో మిగిలే ఉన్నారు. రేడియో, టెలివిజన్ ప్రసార కేంద్రాలను ఆక్రమించుకున్నాక పార్లమెంటును కూడా ఆక్రమించుకున్నట్లయితే ముబారక్ రాజీనామా చేయక తప్పని పరిస్ధితి తలెత్తుతుందేమో పరిశీలించ వలసిన అంశం.
మరో వైపు అమెరికా ఎటువైపు దృఢంగా నిలబడాలో తేల్చుకోలేక సతమతమవుతున్న పరిస్ధితి కనిపిస్తోంది. తాను బలపరచిన పక్షం ఆ తర్వాత బలహీన పడితే దాని ప్రయోజనాలకు నష్టం రావచ్చు. ముబారక్ ని గట్టిగా సమర్ధిస్తే ఆందోళనకారుల ఉద్యమం తీవ్రమై ముబారక్ రాజీనామా చేయవచ్చు లేదా దేశమే వదలవచ్చు. పోనీ ఎల్ బరాదీ, ముస్లిం బ్రదర్ హుడ్ ల వైపు దృఢంగా నిలుద్దామంటే సైన్యం విరుచుకు పడి ఆందోళనలను అణచివేస్తే పరిస్ధితి మరింత అననుకూలంగా తయారవుతుంది.
పరిశీలించి చూస్తే సైన్యం పాత్ర కీలకంగా కనిపిస్తోంది. అందుకే కాబోలు, అమెరికా కొన్ని రోజులనుండి ఈజిప్టు సైన్యాన్ని పొగుడుతూ వస్తున్నది. సైన్యానికి ఇంకా తన సహాయాన్ని కొనసాగించటానికి అమెరికా దాని ఓర్పునే కారణంగా చూపిస్తున్నది. ఒక దశలో సైన్యం ఆందోళనకారులపై విరుచుకు పడుతుందేమో అని అనుమానం వచ్చినపుడు అమెరికా “ఆందోళన చేస్తున్నవారిపై దాడి చేస్తే సైన్యానికి అందిస్తున్న సాయాన్ని వెంటనే నిలిపేస్తా” నని అమెరికా ప్రకటించింది కూడా. మొత్తం మీద చూస్తే అమెరికా మద్దతు ఎల్ బరాదీకి దండిగా ఉన్నట్లు అర్ధం చేసుకోవచ్చు. అమెరికా, యూరప్ పత్రికలు ఎల్ బరాదీని కాబోయే ఈజిప్టు నాయకుడుగా ప్రచారం చేస్తున్న విషయం ఈ సందర్భంలో గమనార్హం.
ఈజిప్టు సైన్యం చాలా సంయమనం పాటిస్తున్నదని అంతర్జాతీయ పరిశీలకులు కూడా ప్రశంసిస్తున్నారు. ఆందోళనకారులు సైతం సైన్యం పట్ల కృతజ్నతతో, స్నేహ భావంతో ఉంటున్నారు. సైన్యం మొదటినుండీ ప్రధానంగా ప్రేక్షక పాత్ర వహిస్తూ వచ్చింది. డిపార్చర్ డే (నిష్క్రమణ దినం) రోజున ప్రదర్శనలు ముగిసాక “ఆందోళనకారులు ఇక కైరో ప్రజలకు ప్రశాంతతను ఇవ్వటానికి ఇళ్ళకు వెళ్ళాలని” ప్రకటించడం తప్ప ఎక్కువ కాలం ప్రజల పట్ల సంయనంతోనే ఉంటూ వచ్చింది. ఒక విధంగా ఆందోళనకారులకు రక్షణగా ఉంటున్నదా అన్న అనుమానం కూడా లేక పోలేదు.
ఈజిప్టు భవితవ్యం, దానితో పాటు మధ్య ప్రాచ్యంలో అమెరికా ప్రయోజనాల భవితవ్యం, అలాగే ఆ ప్రాంతంలో కొంత ఇజ్రాయెల్ భవితవ్యం కూడా ఈజిప్టు ఆందోళనకారులు, సైన్యం చేతుల్లోనే ఉన్నదని అర్ధం అవుతోంది. త్వరలో, అంటే బహుశా మరో వారం పది రోజుల్లో అది ఒక కొలిక్కి వస్తుందని భావించవచ్చునేమో!
