ఈజిప్టులో అమెరికా దాగుడు మూతలు


ముప్ఫై ఏళ్ళనుండి పాలిస్తూ తమకు కనీస హక్కులు కల్పించని ముబారక్ దిగిపోవాలని ఈజిప్టు ప్రజలు గత పన్నెండు రోజిలుగా ఆందోళన చేస్తుండగా అమెరికా కల్లోలంలో తమకు ఏ విధంగా లాభం చేకూరుతుందా అని అమెరికా, యూరోపియన్ యూనియన్ గోతికాడ గుంటనక్కల్లా చూస్తున్నాయి.

Muslim Brotherhood Leader Mohammed Badie
Muslim Brotherhood Leader Mohammed Badie

అధికారారం అప్పగించడానికి శాంతియుత ప్రక్రియను ప్రారంభించాలని ప్రకటనలిస్తూ వస్తున్న అమెరికా తన మరో ముఖాన్ని చూపించింది. అమెరికా తరఫున ప్రత్యేక దూతగా వచ్చిన ఫ్రాంక్ విజ్నర్ అధికారం అప్పగించే ప్రక్రియ పూర్తయ్యే వరకు ముబారకే అధ్యక్షుడుగా ఉండాలని ప్రకటించి పరిశీలకులను ఆశ్చర్యపరిచాడు.

“అధికారం అప్పగించడానికి వెంటనే శాంతియుత ప్రక్రియ ప్రారంభించాలన్న” అమెరికా ప్రకటనకు అర్ధం ముబారక్ వెంటనే దిగిపొమ్మన్న ప్రజల డిమాండ్ ను సమర్ధిన్నట్లా లేదా అని పత్రికలు, పరిశీలకులు అర్ధం చేసుకోలేక సతమవుతూ వచ్చాయి. విజ్నర్ ప్రకటనతో ముబారక్ దిగి పోవాలనే అమెరికా భావిస్తున్నంతలోనే అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ ప్రధినిధి ఫిలిఫ్ క్రౌలీ “అబ్బే అది ఫిలిఫ్ సొంత అభిప్రాయమే తప్ప అమెరికా అభిప్రాయం కాదని ప్రకటించటంతో అమెరికా మళ్ళీ చాటుకి వెళ్ళినట్లయ్యింది.

గత శుక్రవారం నిష్క్రమణ దినం జరుగుతుండగా జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ శాంతియుత పదవీ అప్పగింత ప్రక్రియ జరుగుతుండగా ముబారక్ కాకుండా మరొక కొత్తవ్యక్తికి అధికారం అప్పగిస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని వ్యాఖ్యానించింది. దాంతో ముబారక్ వెంటనే దిగిపోవటం అంత శ్రేయస్కరం కాదని యూరప్ భావిస్తున్నట్లు అర్ధమయ్యింది. కాని అమెరికా పాలసీయే ఇంకా అంతుబట్టటం లేదు.

అమెరికాయే ఎటూ తేల్చుకోలేక పోతున్నదా? లేక అమెరికా అధికారుల్లో భిన్నాభిప్రాయాలు తలెత్తాయా? లేక అదొక ఎతుగడగా అమెరికా అమలు చేస్తున్నదా? ఏమై ఉండొచ్చు?

ఇదిలా ఉండగా ఆందోళనకారుల సంఖ్య తాహ్రిరి కూడలిలో తగ్గిపోయినప్పటికీ ఇంకా చాలా మంది అక్కడే ఉండి పోయారు. ముబారక్ రాజీనామా చేసే వరకూ అక్కడే ఉంటామని చెప్తున్నారు. మరొక వైపు ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న పార్టీలతో చర్చలు జరపటానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. చర్చలకు ఆల్-బరాదీ వర్గంతో పాటు నిషేధిత ముస్లిం బ్రదర్ హుడ్ సంస్థ కూడా పాల్గొంటుందని వార్తలు తెలుపుతున్నాయి. చర్చలకు ఒప్పుకుంటే ముస్లిం బ్రదర్ హుడ్ ను రాజకీయ పార్టీగా గుర్తిస్తామని ముబారక్ నాలుగు రోజుల క్రితం ఎర వేసిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు.

వ్యాఖ్యానించండి