రాజ్యసభలో తెలంగాణ బిల్లుకు బి.జె.పి ఆటంకం?


Rajya_Sabha

‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు 2014’ బిల్లు బుధవారం (ఫిబ్రవరి 19) రాజ్యసభలో ప్రవేశించలేదు. ఇందుకు బి.జె.పి కారణంగా నిలిచింది. లోక్ సభలో బిల్లుకు ఒక్క సవరణ కూడా ప్రతిపాదించని బి.జె.పి రాజ్యసభలో మాత్రం 32 సవరణలు చేయాలంటూ బయలుదేరింది. దీనికి కాంగ్రెస్ ఒప్పుకోలేదు. ఫలితంగా తెలంగాణ బిల్లు లేకుండానే రాజ్య సభ వాయిదా పడింది.

లోక్ సభలో ఆమోదం పొందిన బిల్లుకు రాజ్యసభలో సవరణలు చేస్తే రాజ్యాంగ సూత్రాల రీత్యా సమస్య వస్తుంది.  రాజ్యసభలో బిల్లుకు కొత్త సవరణలు చేస్తే గనక ఆ బిల్లు మళ్ళీ లోక్ సభ ఆమోదం కోసం వెనక్కి రావాల్సి ఉంటుంది. ఈ సంగతి తెలిసి కూడా రాజ్యసభలో సవరణల కోసం బి.జె.పి పట్టు పడుతోందంటే ఏమిటి ఆ పార్టీ ఉద్దేశ్యం?

బి.జె.పి సవరణలు ప్రతిపాదించకుండా ఉండడానికి పాలక, ప్రతిపక్షాల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ చర్చలలో బి.జె.పి ప్రతినిధులు లొంగి రాలేదు. సవరణల విషయంలో ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి.

లోక్ సభలో ఆమోదించబడిన బిల్లు విషయంలో ‘ఏకాభిప్రాయం కోసం చర్చలు’ చేయడమే ఒక ప్రహసనం. ఎందుకంటే రాజ్యసభలో కొత్తగా సవరణలు చేయడం అంటే మళ్ళీ లోక్ సభలో గందరగోళంలోకి బిల్లును నెట్టడమే. తద్వారా లోక్ సభ ప్రసంగంలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ చేసిన ప్రసంగాన్ని ఆ పార్టీ నేతలే పూర్వపక్షం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇదెక్కడి తొండి రాజకీయం?

ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు అరుణ్ జైట్లీ, ఎం.వెంకయ్య నాయుడు తదితరులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రధాని కూడా రాజ్యసభ సభ్యుడే కావడం గమనార్హం. కానీ వీరి సమావేశం ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు.

బి.జె.పిని దారికి తెచ్చుకోవడానికి వీలుగా 5 యేళ్ళ పాటు విభజనానంతర ఆంధ్ర ప్రదేశ్ కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్నట్లు ఎ.బి.ఎన్ ఛానెల్ సమాచారం. అయితే దీనికి బి.జె.పి అంగీకరించకపోవచ్చని కూడా ఛానెల్ చెబుతోంది. ఖచ్చితంగా సవరణలు చేర్చితేనే బిల్లుకు ఆమోదం అని బి.జె.పి నేతలు తెగేసి చెబుతున్నట్లు సమాచారం.

లోక్ సభలో ఎటువంటి సవరణలు ప్రతిపాదించకుండా ఉండడం ద్వారా బి.జె.పి వ్యూహాత్మకంగానే వ్యవహరించినట్లు స్పష్టం అవుతోంది. కానీ దీన్ని వ్యూహం అనాలా లేక జెల్ల కొట్టడం అనాలా అన్నదే అనుమానం. లోక్ సభలో నిరభ్యంతరంగా సహకరించడం ద్వారా తెలంగాణ అభిమానం సంపాదించిన బి.జె.పి రాజ్యసభలో సవరణలకు పట్టుబట్టడం ద్వారా సీమాంధ్ర అభిమానం కూడా సంపాదించాలని తద్వారా లోక్ సభ ఎన్నికల్లో అక్కడ కూడా లబ్ది పొందాలని బి.జె.పి ఎత్తుగడ వేసినట్లు కనిపిస్తోంది.

బి.జె.పి ప్రతిపాదిస్తున్న సవరణల్లో ముఖ్యమైనవి: విభజనానంతర ఆంధ్ర ప్రదేశ్ కు ఇప్పుడే రాజధాని ప్రకటించడం, కొత్త ఆంధ్ర ప్రదేశ్ రెవిన్యూ లోటు సమస్యను పరిష్కరించడం, ఆర్ధిక ప్యాకేజీలను బిల్లులోనే అవకాశం ఇవ్వడం. ఈ సవరణలు లోక్ సభలోనే బి.జె.పి ఎందుకు ప్రతిపాదించలేదు? అక్కడయితే తమ పార్టీకి తగిన ప్రతిష్ట దక్కదనా? అదే కారణం అయితే రాజకీయ ప్రయోజనాల కోసమే ఇన్నాళ్లూ విభజనను కాంగ్రెస్ నాన్చిందన్న విమర్శ చేయడానికి బి.జె.పికి ఇక అర్హత లేనట్లే కాదా?

4 thoughts on “రాజ్యసభలో తెలంగాణ బిల్లుకు బి.జె.పి ఆటంకం?

  1. మొన్న కోరనివారు…ఇవ్వాళ కోరడంలో అర్థం ఏమిటి?

    మొన్న లోకసభలోపల
    సవరణములు కోరనట్టి
    బీజేపీ నేడెందుకు
    కోరగ నుద్దేశమేమి?

    మద్దతు ద్వారా పొందిన
    ఘనతను తగ్గింపజేయు
    దుష్ట ప్రణాళిక నెవ్వరు
    సూచించిరి బిల్లుకిపుడు?

    తెరవెనుకను చంద్రబాబు,
    తెరముందట వెంకయ్యయు
    దౌత్యమ్మును నెరపుచుండ్రి,
    దౌష్ట్యమ్మును చేయుచుండ్రి!

    లోకసభను ఒకతీరుగ,
    రాజ్యసభను ఒకతీరుగ
    బీజేపీ యుండుటేల?
    మాటను మార్చంగనేల?

    బేషరతుగ మద్దతిచ్చి,
    షరతులిపుడు కోరనేల?
    చరిత్రహీనులుగా మీ
    రిప్పుడు నిలువంగనేల?

    సుహృద్భావమును బూనియు,
    బిల్లుకు మద్దతు దెలుపుడు!
    మునుపు మీరలిచ్చినట్టి
    మాటను నిలబెట్టుకొనుడు!!

    జై తెలంగాణ! జై జై తెలంగాణ!

    (నా తెలంగాణ కోటి రత్నాల వీణ…ratnaalaveena.blogspot.in)

    [విశేఖర్‍గారికి కృతజ్ఞతలతో]

  2. ఆటంకం కాదు ! ప్రజలలో తమ కారణంగానే తెలంగాణా రాష్ట్రావిర్భావం సానుకులమయ్యిందానే ప్రయత్నానికి రాజకీయ ఊపిరి పోస్తున్నారు. సోనియమ్మే కాదు ఈ పిన్నమ్మను కూడా మరువద్దనే ప్రవచనానికి బి.జే.పి. రాబోయే ఎన్నికల ప్రచారానికి రాజ్యసభను వేదికగా చేసుకుని ప్రధాన ప్రతిపక్షం పాలకపక్షంతో ఆడే చట్టసభలో నాటకం. బిల్లుకు చిల్లుపడే ప్రసక్తేలేదు. ఎటొచ్చి చిరుజల్లుకు ముందు కారుమబ్బుల అట్టహాసం జాస్తి. ప్రత్యేక నూతనరాష్ట్రోదయ వెలుగు కిరణాలను నల్లమబ్బులు అడ్డుకోలేవు.

వ్యాఖ్యానించండి