ప్రపంచంలో మనందరి మధ్య మసలే గొప్ప గొప్ప నాయకులు, దార్శనికులు, స్ఫూర్తి ప్రదాతలైన మానవులు… వీళ్ళందరికీ తమ సమయం ఎప్పుడు ముగుస్తుందో ముందే తెలుస్తుంది. వాళ్ళకి సంకోచించటం అన్నది తెలియదు. వాళ్ళకి భయంతో దాక్కోవటం అనేది ఎరుగరు. తుఫాను కంటికి సరిగ్గా మధ్యలో నిలబడతారు. గొప్ప సాహసంతో, దృఢ నిశ్చయంతో తమను చంపడానికి వచ్చిన వారికి ఎదుటే నిలబడి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తమ శత్రువుకు గానీ, అమరత్వానికి గానీ భయపడరు. వాళ్ళు అమరత్వాన్ని గాఢంగా ఆలింగనం చేసుకుంటారు. దేవుడే వాళ్ళ త్యాగాన్ని స్వయంగా గౌరవిస్తాడు.
నిజంగా భయపడేది ఎవరంటే అత్యంత క్రూరమైన పధక రచనలో అత్యున్నత స్థాయిని చేరుకున్నవాడే! కానీ చివరికి ఖాళీ చేతులతో మిగిలేవాడు, భవిష్యత్తులో ప్రయోజనం లేని డొల్ల విజయంతో మిగిలే వాడు, ఏ విశ్వ నరులు విధించిన లక్ష్మణ రేఖనైతే వాడు దాటి ఘోరమైన తప్పు చేశాడో ఆ ప్రపంచ ప్రజల చేతుల్లో ఏ ముక్కకు ఆ ముక్కగా చీల్చబడ్డ వాడు… వాడే చివరికి భయ విహ్వలుడై నిలబడతాడు.
ముస్లిం ప్రపంచానికి అంతటికీ…, ఈ యుద్ధం నిజంగా ఎందుకు జరుగుతున్నదో అర్ధం చేసుకున్న ఈ ప్రపంచ ప్రజలందరికీ నా హృదయ పూర్వకమైన సంతాపం తెలియజేస్తున్నాను. మరింత మెరుగైన ప్రపంచం వైపు మనల్ని నడిపిస్తూ, మనందరిని ఐక్యం చేస్తూ, మనకి మరింత బలాన్ని సమకూర్చుతూ, మన మధ్య నుండి అంతర్ధానమై అమరత్వాన్ని ఆయన మనకు కానుకగా అందించాడు.
——–వెనెస్సా బీలే (బ్రిటిష్ పౌరురాలు, బ్రిటిష్ రాయబారి హెరాల్డ్ బీలే కూతురు, జర్నలిస్టు, బ్లాగర్, పాలస్తీనా ప్రజల హక్కుల పోరాడుతున్న క్రియాశీల కార్యకర్త)

1989 నుండి 2026 ఫిబ్రవరి 28 తేదీన యూదు జాత్యహంకార ఇజ్రాయెల్, లెక్క లేనన్ని యుద్ధాలతో ప్రపంచ ప్రజలను పీడించుకు తింటున్న సామ్రాజ్యవాద పెత్తందారు అమెరికా దేశాల మిసైల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయితొల్లా ఆలీ హొస్సేనీ ఖమెనీ హత్యగావించ బడ్డాడు అని వార్తా సంస్థలు ప్రకటించినప్పుడు మొదట నేను నమ్మలేదు. ఇరాన్ దేశానికి అత్యున్నతమైన నాయకుడైన ఆలీ ఖమేనీని హత్యకు గురి అయ్యే విధంగా ఇరాన్ దేశ రక్షణ వ్యవస్థ ఎందుకు ఉంచుతుంది. ఇజ్రాయెల్-అమెరికా ల దాడి మొదలు కాకముందే ఎక్కడైనా రహస్య బంకర్ లో అప్పటికే దాచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసే ఉంటారు అని గట్టిగా నమ్మాను.
అదీ కాక యుద్ధాల సమయాల్లో నిజం ఏమిటో వెల్లడి కాక ముందే పచ్చి అబద్ధాలను ప్రచారంలో పెట్టటంలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఆరి తేరి ఉన్నాయి. ఎలాంటి సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధాలు చెప్పటం, నిన్న చెప్పింది, అసలు చెప్పనే లేదని ఈ రోజు బొంకటం, అంతర్జాతీయ ఒప్పందాలను నిస్సిగ్గుగా ఉల్లంఘించటం… ఇలా సవాలక్షా పాపాలను అది కూడా దేవుడి పేరుతో చేసెయ్యటం ఈ రెండు దేశాలకు వెన్నతో పెట్టిన విద్య, ఈ విద్యను పషిమా ఐరోపా దేశాలు కూడా నేర్చి దశాబ్దాలే గడిచాయి.
అందుకే ఆలీ హొస్సేనీ హత్యకు గురైనాడన్న వార్తను నమ్మలేదు. కానీ ఇరాన్ ప్రభుత్వం స్వయంగా ప్రకటించిన తర్వాత నమ్మక తప్పలేదు.
ఆయన ఎలా హత్య కావించబడటం ఎలా ఎందుకు జరిగిందో వెనెస్సా బీలే తన సబ్ స్టాక్ బ్లాగ్ లో రాసిన నివాళి వాక్యాల ద్వారా మనకు తెలిసిపోతుంది. దాడులు జరిగేటప్పుడు సాధారణంగా దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులను ఆ దేశ సీక్రెట్ సర్వీస్ వ్యవస్థలు ఆగమేఘాల మీద రహస్య బంకర్ లోకి తరలిస్తాయి. వారిని డజన్లు లేదా వందల కొద్దీ సుశిక్షితులైన సాయుధ గార్డులను కాపలా పెడతాయి.
కానీ ఇరాన్ సుప్రీం లీడర్ ఇజ్రాయెల్, అమెరికా దేశాలు మిసైళ్ళు, బాంబులతో దాడులు మొదలు పెట్టాక కూడా ఆలీ ఖమేనీ తన కార్యలయం లోనే యధావిధిగా విధులు నిర్వర్తిస్తూ ఉండిపోయాడు. అందుకే ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు ఆయన కార్యాలయం పైన చేసిన మిసైల్ దాడిలో చనిపోయాడు.
ఆయనే కాదు, ఇరాన్ ప్రభుత్వం లోని దాదాపు 40 కి పైగా మంత్రులు, అధికారులు అమెరికా-ఇజ్రాయెల్ మిసైల్ దాడుల్లో చనిపోయారని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ హత్యలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సగర్వంగా ప్రకటిస్తూ విలేఖరుల సమావేశంలో ప్రకటిస్తూ అంతలోనే సమావేశాన్ని రద్దు చేసుకుని అంతలోనే హడావుడిగా వెళ్లిపోయాడు. ఎందుకంటే పశ్చిమాసియా ప్రాంతంతో పాటు చైనా, రష్యాలను కూడా నిరంతరం కాపలా కాస్తూ ఖతార్ దేశంలో అమెరికా ప్రతిష్టించిన అత్యాధునిక భారీ రాడార్ ను మిసైల్ దాడిలో ఇరాన్ నాశనం చేసిందన్న వార్త ఆయనకు అప్పుడే అందింది. ఆ వార్త అమెరికాకి ఆశనిపాతం లాంటిది. భారీ షాక్ కు అమెరికా సైనిక వ్యవస్థను గురి చేసిన వార్త అది!