
తమిళనాడులో కుల పెద్దల ఆధిపత్యానికి లొంగిపోయి ప్రేమించి పెళ్లి చేసుకున్న దళిత యువకుడు ఇలవరసన్ తో నివసించేది లేదని కోర్టు మెట్లపై నిలబడి ప్రకటించి భర్తను ఆత్మహత్య వైపుకి నెట్టిన యువతి పిరికితనాన్ని చూశాం. మిర్యాలగూడ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణయ్ ని తన తండ్రే కిరాయి గూండాలతో కిరాతకంగా హత్య చేయించాక పుట్టింటితో తెగతెంపులు చేసుకుని భర్త కుటుంబంతోనే జీవితం గడుపుతున్న అమృత ప్రేమ ధైర్యాన్ని చూస్తున్నాం. మహారాష్ట్ర, నాందేడ్ లో తన ప్రేమికుడిని తండ్రి, సోదరులే నమ్మించి కాల్చి చంపిన తర్వాత కూడా ప్రేమికుడి శవాన్ని పెళ్లాడి తల్లి దండ్రులు, సోదరుల కుల తత్వాన్ని గేలి చేస్తున్న మరో యువతి ఆంచల్ సాహసాన్ని ఇప్పుడు తెలుసుకుంటున్నాం.
దుర్ఘటన జరిగింది మహారాష్ట్రలో అయినప్పటికీ పరువు హత్యకు పాల్పడి కూతురు / సోదరి జీవితాన్ని స్వయంగా నాశనం చేసిన కుటుంబం కూడా తెలుగు కుటుంబం కావటం బట్టి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెచ్చుకున్న పేరు ఆంధ్ర ప్రదేశ్ కు సరిపడదని భావించవలసి వస్తున్నది. అభివృద్ధి ఫలాలు చిట్టచివరి వ్యక్తికి అందడంతో పాటు సామాజిక, రాజకీయ, ఆర్ధిక రంగాలు అన్నింటా కుల, మత, ప్రాంత, జాతి, తెగ, జెండర్ భేదాలకు అంతీతంగా అందినప్పుడే అది నిజమైన అభివృద్ధి అవుతుందన్న నిపుణుల సూత్రీకరణను ఇక్కడ జ్ఞప్తి చేసుకోవాలి.
అసలేం జరిగింది?
ఏం జరిగిందో కంటికి ధారగా కుమిలి పోతున్న సాహసిక యువతి 19 యేళ్ళ ఆంచల్ మామిద్వార్ మాటల్లో తెలుసుకోవటమే ఉత్తమం (టైమ్స్ ఆఫ్ ఇండియా నుండి):
“నేను సాక్షం (హత్యకు గురైన యువకుడు) ను అక్టోబర్ 2022 లో మొదట కలిశాను. మా మొదటి సమావేశం తోనే నా జీవితం మలుపు తిరిగింది. అదేదో సరదాగా, అనుకోకుండా జరిగిన కలయిక కాదు. మాకది లవ్ ఎట్ ఫస్ట్ సైట్! మా మనసులు వెంటనే కలిసిపోయాయి. తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు వెతుక్కుని మా నెంబర్లు షేర్ చేసుకున్నాం. నెలలోనే మేము సీరియస్ రిలేషన్షిప్ లో మునిగిపోయాం. మేము ఒకే లోకాలిటీలో నివశిస్తున్నాం. పదో క్లాస్ పాసయ్యాక ఒకే కోచింగ్ క్లాస్ లో చదువుతున్నాం. దానితో మేము కలుసుకోవటం తేలిక అయింది. కానీ మా కుటుంబాల నుండి మా ప్రేమ సంబంధాన్ని రహస్యంగా ఉంచాలన్న సంగతి నాకు మొదటి నుండీ తెలుసు.
“పదో క్లాస్ కి ముందు చదువు నిమిత్తం సాక్షం, లాతూర్ లోని అహ్మద్ నగర్ లో ఉండేవాడు. కాబట్టి గతంలో అతనెవరో నాకు తెలియదు. మా కుటుంబంలో ఒక ఆడ పిల్ల ప్రేమలో పడింది అంటే కట్టుబాట్లను అతిక్రమించినట్లే. అది కూడా వేరే మతం లోని వేరే కులానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడటటం అంటే ఇక చెప్పనవసరం లేదు. సాక్షం కుటుంబం అంబేద్కరైట్ బుద్ధిస్టు మతస్థులు. ఒక తక్కువ కులం వాడిగా మావాళ్లు అతడిని హీనంగా చూస్తారని నాకు తెలుసు.
“మేము పద్మశాలి హిందువులం. (పద్మశాలీలు ప్రధానంగా నేత పని వాళ్ళు. వీళ్ళు ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర లలో నివసిస్తున్నారు).
“మా రిలేషన్ గురించి మొట్ట మొదట మా తమ్ముడు పసి గట్టాడు. ఆ క్షణం నుండి నేను వాళ్ళకి కూతురుగా, సోదరిగా కనపడడం ఆగిపోయింది. కంట్రోల్ లో ఉంచవలసిన, శిక్షించ వలసిన ఒక వస్తువుగా నేను మారిపోయాను. నా చదువు రెండు సంవత్సరాల పాటు ఆపేశారు. నన్ను ఇంటికే పరిమితం చేశారు. వాళ్ళు అనుమతి ఇస్తే తప్ప బైటికి కదలడానికి వీలు లేదు. అది కూడా నిరంతరం నా పైన నిఘా పెట్టేవాళ్లు. ప్రతి రోజూ నన్ను హింసించటం మొదలు పెట్టారు. ఒక్కోసారి రోజుకు అనేకసార్లు నా పైన దాడి చేసి కొట్టేవాళ్లు.
“మా తమ్ముడు నన్ను జాలి, కనికరం లేకుండా చావబాదేవాడు. నా శరీరాన్ని, విల్ పవర్ ని బద్దలు కొట్టడమే తన లక్ష్యం అన్నట్టుగా కొట్టేవాడు. అప్పుడప్పుడు మా అన్నయ్య కూడా వాడితో జత కలిసేవాడు. వాళ్ళ అదుపాజ్ఞల్ని నేను ప్రతిఘటించినప్పుడల్లా మా అమ్మ కూడా నన్ను కొట్టేది. ఇంటి పనంతా నేనే చేసేదాన్ని. కుటుంబం అంతటికీ నేనే వడ్డించి అన్నం పెట్టేదాన్ని. అంతా అయ్యాక వాళ్ళ కోపాగ్నుల్ని నేను తినే దెబ్బల ద్వారా చల్లార్చవలసి వచ్చేది. మా నాన్న నన్ను ఎప్పుడూ కొట్టలేదు. కానీ ఆ గదిలోనే ఉండేవాడు, తన బాధ్యత ఏమిటో మరిచినట్లుగా ఉండేవాడు. నా పైన జరిగే అలవి మాలిన హింసను ఆమోదిస్తున్నట్లుగా ఉండిపోయేవాడు.

“సాక్షం కు వ్యతిరేకంగా తప్పుడు పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్) కేసు బనాయించటానికి ప్రయత్నం జరిగింది. నన్ను పోలీసు స్టేషన్ కు ఈడ్చుకెళ్లి ఫిర్యాదు చెయ్యమని బలవంత పెట్టారు. తద్వారా సాక్ష్యం ని జైలుకి పంపాలని చూశారు. సాక్ష్యంతో నా రిలేషన్ పరస్పర ఆమోదంతో కూడినదని అక్కడ ఉన్న ఒక మహిళా పోలీసు అధికారి వాళ్ళకి నచ్చజెప్పటానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళు తమ ప్రయత్నాల్ని మానుకోలేదు.
“చివరికి నా పేరుతోనే సాక్ష్యం కి వ్యతిరేకంగా పోక్సో కేసు నమోదు చేయించారు. అయితే నాకు 18 యేళ్ళు నిండాక నా అంతట నేను అదే ఇట్వారా పోలీసు స్టేషన్ కి వెళ్ళి నేను సాక్షం ను ప్రేమిస్తున్నానని, కాబట్టి అతనిపై పెట్టిన పోక్సో కేసు ని ఉపసంహరించుకుంటున్నానని చెబుతూ స్టేట్మెంట్ రాసిచ్చాను. అలా చెయ్యటం ద్వారా నేను నా సమస్తాన్ని ప్రమాదంలో పడేసినట్లయింది.
“మేము విడిపోక పోవటంతో మా పైన ఉన్న శతృత్వం రూపాన్ని మార్చుకున్నారు. సాక్ష్యం తో తాము స్నేహం చేస్తున్నట్లు నటించటం మొదలు పెట్టారు. నాతో సాక్షం రిలేషన్ ని తాము ఆమోదించినట్లు అతనికి నచ్చజెప్పారు. అంబేడ్కర్ జయంతి రోజున మా నాన్న అతనితో కలిసి డ్యాన్స్ కూడా చేశాడు. ఆ డ్యాన్స్ వీడియో వైరల్ అయింది కూడా. ఆ ఈవెంట్ కి మేమంతా కలిసి వెళ్లాము. మా రిలేషన్ ని ఆమోదిస్తున్నట్లు చూపేందుకు చేసిన ఆ ప్రదర్శన నాకు అత్యంత భయం గొలిపే సంఘటన. ఎందుకంటే ఆ ప్రదర్శన వెనుక ఏ పధకం దాగి ఉందో మాకు అప్పటికి తెలియదు.
“సాక్ష్యం వాళ్ళని గుడ్డిగా నమ్మాడు. నాకు మాత్రం అనుమానంగానే ఉంది. మా కుటుంబం గురించి నాకు బాగా తెలుసు. సాక్ష్యంతో బ్రతిమాలుతూ చెప్పాను, వాళ్ళ ఇష్టం, ఆమోదం అంతా ట్రాప్ అని, వాళ్ళని నమ్మొద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. కానీ సాక్షం వాళ్ళ నటనని నమ్మి వాళ్ళతో కలిసిపోయాడు. చివరికి తాని హిందూయిజం లోకి మారతానని కూడా వాళ్ళతో చెప్పాడు. అలాగైతే వాళ్ళు తనని ఆమోదిస్తారని నమ్మాడు.
“సాక్షం గురించి దురుద్దేశంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. అతని పైన క్రిమినల్ కేసులు ఉన్నాయని అతను చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాలు పంచుకున్నాడని… ఇలా ప్రచారం చేస్తున్నారు. అతనిపైన కేసులు ఉన్న మాట నిజమే కానీ అవన్నీ మా కుటుంబం మోపిన తప్పుడు కేసులే. మహారాష్ట్ర ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ (ఎంపిడిఏ) చట్టం కింద కూడా కేసులు పెట్టారు. నిజానికి సాక్ష్యం పైన తప్పుడు కేసులు పెట్టిన మా తల్లిదండ్రులే చట్ట విరుద్ధమైన, క్రిమినల్ కార్యకలాపాల్లో ఉన్నారు.
“ఇంగ్లీష్ మీడియం చదువు కోసం అతని తల్లిదండ్రులు లాతూర్ పంపించారు. అతనికి నేర ప్రపంచానికి అసలు సంబంధమే లేదు. మా తల్లిదండ్రులకు మాత్రం నేర ప్రపంచంతో సంబంధాలు ఉన్నమాట వాస్తవం. పోలీసులకు కూడా ఈ సంగతి తెలుసు. మా పేరెంట్స్ నుండి లంచాలు తీసుకుని మిన్నకుండి పోయారు. మా ఇంట్లో ఏం జరుగుతున్నదో వాళ్ళకి అంతా తెలుసు. వాళ్ళకి అంతా తెలుసు కాబట్టే ఇప్పటికీ కూడా నాకు భద్రత ఉన్నట్లు నమ్మకం కలగడం లేదు. ముఖ్యంగా మా తమ్ముడికి బెయిల్ వస్తే గనక నా భద్రతకు పెద్ద ప్రమాదం ఉన్నట్లే.
సాక్షం వయసు 25 సం అని పోలీసు రికార్డుల్లో నమోదు చేశారు. అది నిజం కాదు. మేము ఇద్దరం 2006 లోనే పుట్టాం. డిసెంబర్ 1 తేదీ నాటికి అతనికి 20 నిండుతుంది. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. అందరు యువతి యువకుల మల్లే మేము కూడా అందమైన కలలు కనటం మొదలు పెట్టాం. చాలా ఉత్సుకతతో, మూర్ఖత్వంతో కూడిన నమ్మకంతో భవిష్యత్తు రోజుల కోసం ఎదురు చూస్తున్నాం. 12 వ క్లాస్ లో నేను 67% మార్కులు సంపాదించాను. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వాలని నా కోరిక. అధికారం మనుషుల్ని ఎట్లా నాశనం చేస్తుందో నేను చూశాను. నా కోరిక ఎట్లా ఉన్నా, సాక్ష్యంతో రిలేషన్ గురించి తెలిశాక, సీనియర్ కాలేజీ విద్య (బిఎస్సి) చదవటానికి మా కుటుంబం ఒప్పుకోలేదు. నేను నా చదువు పూర్తి చేసి వ్యవస్థలో ప్రవేశించి దానిని మార్చటానికి ప్రయత్నించాలని భావిస్తున్నాను.”
ఇది ఆంచల్ మాటల్లో సాక్ష్యం, ఆంచల్ ల ప్రేమ కధ. ఆంచల్ తల్లిదండ్రులు, సోదరులు తమ కూతురు/సోదరి ని వంచించి ఆమె భవిష్యత్తుని స్వయంగా తమ చేతులతో కాలరాచిన కధ కూడా ఇది. నిందితులు అందరికీ మరణ శిక్ష విధించాలని ఆంచల్ డిమాండ్ చేస్తున్నది. హత్య కావించబడ్డ తన ప్రేమికుడి శవాన్ని పెళ్లాడి తద్వారా వెనుకబడిన, సమాజంలో కొనసాగటానికి ఎంత మాత్రం వీలు లేని అసమాన కుల సెంటిమెంట్ల పైన ప్రగతిశీలమైన కులాతీత, మతాతీత ప్రేమ భావజాలమే విజయం సాధించిందని ఆంచల్ సంకేతాత్మకంగా ఐనా సరే చాటి చెబుతున్నది.
ఎలా చంపారు?
ఆంచల్ ఇంకా ఇలా చెప్పింది.
“హత్య జరిగిన రోజు పోలీసు స్టేషన్ జరిగిన వ్యవహారంతో ఈ వ్యవస్థాగత సంస్థల పైన నాకు ఉన్న నమ్మకాన్ని నాశనం అయిపోయింది. మా తమ్ముడు నన్ను పోలీసు స్టేషన్ కి తీసుకెళ్లి సాక్షం పైన ఇంకో ఫిర్యాదు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నేను నిరాకరించడంతో నా ఫోన్ ని పోలీసుల ముందే నేలకేసి కొట్టి పగలగొట్టాడు.
“అతన్ని నిర్బంధించటానికి బదులు పోలీసులు తమని దిస్ట్రబ్ చెయ్యొద్దంటూ వాడికి చెబుతూ ఒక మాట అన్నారు. ఆ మాటలు ఇప్పటికీ నా చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి. ‘ఈ విషయాన్ని ఒకేసారి శాశ్వతంగా ఎందుకు ముగించవు?’ అని వాడితో అన్నారు. ‘అయితే సాక్షం ని చంపి ఆ తర్వాతే మీ దగ్గరికి వస్తాను’ అని అరుస్తూ అతను అక్కడి నుండి వెళ్ళాడు. ఇదంతా పోలీసుల ముందే జరిగింది.

నేను వాళ్ళ సహాయం కోరిన ప్రతిసారీ ‘ఏమ్మా నువ్వు మాకు చెప్పే లవ్ లో పడ్డావా ఏంటి? ఇది నీకు, నీ కుటుంబానికి, ఆ అబ్బాయికి మధ్య వ్యవహారం. సహాయం చేయాలంటూ మా దగ్గరికి రావద్దు’ అని వాళ్ళు విసుక్కునేవారు. సిసిటివి ఫుటేజీ చూస్తే వాస్తవం వెల్లడి అవుతుంది.
హత్య గురించి ఆంచల్ ఇలా తెలియజేసింది.
“తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే ఒక టీ స్టాల్ దగ్గర కలుద్దామని మా తమ్ముడు సాక్ష్యంకి చెప్పాడు. ఆ తర్వాత మా నాన్న, అన్న, తమ్ముడు ఇంటి నుండి బైటికి వచ్చారు. ఆ తర్వాత మా తల్లిదండ్రులు, సోదరులు, బాబాయి, నేను… అందరినీ పర్భానీ జిల్లాలోని మన్వాత్ కి తీసుకెళ్లారు. మా బాబాయి ఫ్రెండ్ కారులో, దైవ దర్శనం అని చెబుతూ తీసుకెళ్లారు. ఆ రాత్రికి మా అమ్మ వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో బస చేశాము.
“మేము మన్వాత్ వెళ్ళేసరికి అప్పటికే పోలీసులు అక్కడికి వచ్చి ఉన్నారు. మా తల్లి దండ్రులు, సోదరుల్ని వాళ్ళు అరెస్ట్ చేశారు. మా తమ్ముడి వద్ద చట్ట విరుద్ధంగా తుపాకి ఉన్నందున అరెస్ట్ చేస్తున్నట్లు నాకు చెప్పారు. ఆ తర్వాత ఉదయం పేపర్ చూసే వరకు సాక్షం ని చంపేసిన సంగతి నాకు తెలియలేదు.
“ఆ తర్వాత రోజు పోలీసు స్టేషన్ దగ్గర సాక్ష్యం అమ్మా నాన్నల్ని చూశాక స్పృహ కోల్పోయాను. నన్ను ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. నేను వాళ్ళతోటే కలిసి జీవిస్తానని నేను సాక్ష్యం వాళ్ళ అమ్మతో చెప్పాను. నేను ప్రేమించిన వ్యక్తిని చంపేసి నా జీవితాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళ దగ్గరికి నేను తిరిగి వెళ్లలేను.
“ఎలాంటి కదలిక లేకుండా, చల్లగా, తన యౌవనాన్ని అంతటినీ పెళ్లగించబడ్డ సాక్షం విగత దేశాన్ని చూసినప్పుడు నా కుటుంబం ఏం చేసిందో నాకు తెలిసి వచ్చింది. మేము ఇద్దరం ప్రేమించుకున్నాం కాబట్టి, నా పైన వాళ్ళు నియంత్రణ కోల్పోయామన్న పంతంతో, వాళ్ళు అతన్ని చంపేశారు. ఈ హత్యని రెండు గ్యాంగుల మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిజాన్ని నీరుగార్చటానికి ఉద్దేశించిన అబద్ధం అది. సాక్ష్యం హత్యకు పోలీసులకు కూడా సమాన బాధ్యత ఉన్నది. పోలీసు అధికారుల పాత్ర పైన విచారణ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. వాళ్ళ పేర్లను నేను మీడియాకి, సీనియర్ అధికారులకి ఇచ్చాను కూడా.
“నేనింకా చిన్నదాన్ని. నేను ఏమవుతానో నాకు తెలియదు. కానీ నాకు ఏం కావాలో నాకు తెలుసు. నాకు న్యాయం కావాలి. సాక్ష్యం హత్యకు బాధ్యతను నిర్ధారించాలి. ఇది రెండు గ్రూపుల మధ్య తగాదా కాదన్న నిజానికి గుర్తింపు కావాలి. అతన్ని చంపేసి తాము గెలిచామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు సమస్తం కోల్పోయారు. చావులో కూడా సాక్షం తన గౌరవాన్ని కోల్పోలేదు. మా ప్రేమ గెలిచింది” అని ఆంచల్ అనే 19 సంవత్సరాల నవ యవ్వన యువతి ఈ దేశంలో వేల యేళ్లుగా పాతుకుపోయి అత్యంత సహజమైన యౌవన ప్రాయపు ప్రేమలో పడిన పాపానికి అత్యంత కిరాతకంగా ప్రాణాలను నులిమేస్తున్న కులతత్వానికి ఎదురు నిలిచింది.
పోలీసులు ఆంచల్ తండ్రి గజానన్ (45), ఆంచల్ అన్న హిమేష్, తమ్ముడు సాహిల్, తల్లి జయశ్రీ, ఇంకా నలుగురు ఇతరులను అరెస్ట్ చేశారు. ఆంచల్ తమ్ముడు సాహిల్ మైనర్ అయినందున అతన్ని బాల నేరస్థుల శిక్షణాలయానికి పంపారు. నిందితుల పైన బిఎన్ఎస్ 2023 కింద హత్య, అల్లర్లు, చట్టవిరుద్ధ సమావేశం సెక్షన్ల కింద నేరం మోపారు. అలాగే ఎస్.సి/ఎస్.టి అత్యాచారాల నిరోధాక చట్టం మరియు ఆయుధ చట్టం ల ప్రకారం కూడా కేసులు నమోదు చేశారు.
భారతదేశంలో కులం కాని వాడిని, అందులోనూ నీచ కులాలుగా ముద్ర వేసిన ఎస్.సి, ఎస్.టి కులాలకు చెందిన యువకులను ప్రేమించినందుకు ఆ యువకులను అత్యంత కిరాతకంగా చంపేయటం ఇది మొదలూ కాదు, చివరా కాబోదు.
అయితే కుల దురహంకార హత్యలు, దళితులపై దాడి చేసి కొట్టడం మరియు చంపటం, చివరికి దళిత యువకుడు వివాహం సందర్భంగా గుర్రం పై ఊరేగినందుకు కూడా దళిత కాలనీలపై దాడులు చెయ్యటం ఇటీవల దశాబ్ద కాలంలో పెరిగిపోవటం యాదృచ్ఛికం కాదు.
అంబేడ్కర్ నాయకత్వం లోని రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ రచించగా భారత రాజ్యాంగ పరిషత్ రోజుల తరబడి చర్చించి ఆమోదించిన రాజ్యాంగాన్ని మార్చాలని నేటి పాలకపార్టీ పెద్దలు అవకాశం వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉన్నారు. ఆర్ఎస్ఎస్ కి చెందిన అత్యున్నత అధికారి ఒకరు ఇటీవల బహిరంగం గానే ముందుకు వచ్చి రాజ్యాంగ పీఠిక నుంధి ‘లౌకిక, సామ్యవాద’ పదాలను తొలగించాలని కోరిన సంగతి దేశం ముందు ఉన్నది.
ముఖ్యంగా గమనించవలసిన అంశం అంబేడ్కర్ విరచిత రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ సంస్థ ఆ నాడే అంగీకరించలేదు. అందుకు ముఖ్య కారణం భారత రాజ్యాంగం సైంటిఫిక్ టెంపర్ ని బోధిస్తూ సకల అసమానతలను రూపు మాపి సమానాత్వాన్ని దేశంలో నెలకొల్పాలన్న లక్ష్యాన్ని కేవలం మాట మాత్రంగానే ప్రకటించటమే.
ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ప్రకారం మనుషులు అంతా సామానులు కాదు. రాజ్యాంగంగా మార్చాలని వారు ప్రబోధిస్తున్న మనుస్మృతి ముఖ్యంగా స్త్రీలు, నిమ్న కులాల పట్ల అత్యంత పాశవిక మైన నీతి సూత్రాలను ప్రభోదించింది. మానవ సమాజం సాధించిన నాగరిక సమానతా విలువలు వేటినీ మను స్మృతి అంగీకరించదు. అంగీకరించకపోగా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఒకటి రెండు కులాలకు లేదా వర్ణాలకు అగ్ర పీఠం కల్పించి వారికే ఇతర కులాలు, ముఖ్యంగా బడుగు, బలహీన, నిమ్న కులాలు అలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవలు చేసుకుని బ్రతకాలని శాసించింది. ఆ మను స్మృతిని భారత రాజ్యాంగంగా మార్చాలని ఆర్ఎస్ఎస్ పెద్దలు సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉన్నారు.
అటువంటి ఆర్ఎస్ఎస్ కి చెందిన బిజెపి పార్టీ పాలనలో రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతూ పాత, బూజు పట్టిన మత సంబంధమైన అసమానతలకు అగ్ర పీఠం వేయాలని తద్వారా స్వర్ణ యుగంగా చెప్పుకునే చీకటి యుగమైన గుప్తుల కాలానికి పునః ప్రతిష్ట చేయాలని కోరుతూ ఆ వైపుగా స్థిరంగా అడుగులు వేస్తున్నారు. పుక్కిటి పురాణ గాధల్ని సైన్స్ ఆవిష్కరణలుగా నమ్మ బలుకుతూ శాస్త్ర, సాంకేతిక రంగంలో చేయాల్సిన పరిశోధనా, అభివృద్ధి లను పక్కన పెట్టేశారు.
ఫలితంగా సమాజంలో సహజంగానే అప్పుడప్పుడూ తల ఎత్తుతూ నిద్రాణంగా పడి ఉన్న కుల, మత, జెండర్ ల అసమాన విలువలు కొత్త శక్తిని పుంజుకుని భారత సమాజం పైకి దుముకుతున్నాయి. వీటిని నిరోధించి, పరిమార్చే లక్ష్యం ఆర్ఎస్ఎస్-బిజెపి ప్రభుత్వాలకు లేకపోగా వాటిని మరింత ప్రోత్సహించే లక్ష్యాన్నే కలిగి ఉన్నది. పదుల యేళ్ళ కాంగ్రెస్ పాలనలో ఆర్ఎస్ఎస్ విలువలకు సందర్భానుసారంగా మద్దతు లభించగా బిజెపి పాలనలో నిరంతర మద్దతు లభిస్తున్నది. తత్ఫలితంగా రానున్న భవిష్యత్తులో మరింతమంది ఆంచల్ లు మతతత్వ కులతత్వ వెనుకబాటు భావనలకు బలి కానున్నారు. ఈ పరిస్ధితిని ఆంచల్ లాంటి యౌవనులే సరికొత్త ప్రగతిశీల భావాలతో ఎదుర్కొన వలసి ఉన్నది.