గాజా స్ట్రిప్‌: రక్తం ఓడుతున్న అరబ్బుల గాయం -పార్ట్ 2


Gaza people are forced to migrate throught the Gaza strip due to continous bombing by Israel military

—–మాతృక అక్టోబర్ నెల సంచిక నుండి (రచన: సుమన)

పార్ట్ 1 తరువాత భాగం…….

బాల్ఫర్‌ డిక్లరేషన్‌

పశ్చిమాసియా చరిత్రలో బాల్ఫర్‌ డిక్లరేషన్‌ అత్యంత ప్రాముఖ్యత కలిగినది. వాస్తవానికి ప్రాధాన్యతగానీ, చట్టబద్ధత గానీ లేని ఒక చిన్న లేఖ బాల్ఫర్‌ డిక్లరేషన్‌కి పునాది. దీనిపై బ్రిటిష్‌ పార్లమెంటులో చర్చ కూడా జరిగింది లేదు. అయినప్పటికీ దీని ద్వారా జరిగిన పరిణామాలు అంతిమంగా ఇజ్రాయెల్‌ సృష్టికి దారి తీశాయి. నవంబర్‌ 2, 1917 తేదీన బ్రిటిష్‌ ఫారిన్‌ సెక్రటరీ (మన విదేశాంగ మంత్రికి సమానం) ఆర్థర్‌ బాల్ఫర్‌, బ్రిటన్‌లోని యూదులకు నాయకుడుగా భావిస్తున్న లార్డ్‌ లియొనెల్‌ వాల్టర్‌ రోత్‌ షీల్డ్స్‌కు ఒక లేఖ రాశాడు. లేఖ సారాంశం:

‘పాలస్తీనాలో ప్రస్తుతం ఉన్న యూదేతర మతాల ప్రజల పౌర మరియు మతపరమైన హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా, ఇతర మరే దేశంలోనైనా సరే నివసిస్తున్న యూదు ప్రజలు అనుభవిస్తున్న హక్కులు మరియు రాజకీయ స్థితిగతులకు ఎలాంటి హాని కలగకుండా ఉండాలన్న స్పష్టమైన అవగాహనతో పాలస్తీనాలో యూదు ప్రజలకు సొంత జాతీయ దేశాన్ని (నేషనల్‌ హోమ్‌) ఏర్పాటు చేసేందుకు, ఆ దిశలో వీలైనన్ని ప్రయత్నాలన్నీ చేసేందుకు హిజ్‌ మెజెస్టీ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది.’

ఈ లేఖను అనంతరం ‘మ్యాండెట్‌ ఫర్‌ పాలస్తీనా’ పత్రం (నానాజాతి సమితి, పాలస్తీనా మరియు అప్పటి ట్రాన్స్‌ జోర్డాన్‌ ప్రాంతాలపై పెత్తనాన్ని అప్పగిస్తూ ఆమోదించిన ఒప్పంద పత్రం. అప్పటి అగ్ర రాజ్యం గ్రేట్‌ బ్రిటన్‌ కనుక ఆ దేశం ఏది చెబితే అదే నానాజాతి సమితి చేసే చట్టం)లో నిబంధనలుగా చేర్చింది. బాల్ఫర్‌ డిక్లరేషన్‌ పూర్తి పాఠంగా వెలువడే ముందు జరిగిన కుట్రల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అసలు యూదులకు ఒక సొంత దేశాన్ని సృష్టించాల్సిన అవసరం ద గ్రేట్‌ బ్రిటన్‌ తన నెత్తిపైన ఎందుకు వేసుకున్నదో తెలుసుకోవాలి.

యుకెలోని ‘ద నేషనల్‌ ఆర్కైవ్స్‌ ఆఫ్‌ ద యుకె’ లో పొందు పరిచిన వేల డాక్యుమెంట్లను అధ్యయనం చేసిన బృందం ఒకటి బాల్ఫర్‌ ప్రాజెక్టు పేరుతో 2016లో ఒక నివేదికను వెలువరించింది. బ్రిటిష్‌ రాజకీయాల్లో లబ్ద ప్రతిష్టులైన అనేక మంది నాయకులు, ప్రధానమంత్రులతో సహా, జియోనిస్టులకు మద్దతుగా కృషి చేసి, చర్చోపచర్చలు జరిపి బాల్ఫర్‌ డిక్లరేషన్‌కు రూపం ఇవ్వటం వెనుక ప్రధానంగా యూదు ధనికవర్గం చేసిన కుట్ర పూరిత కృషి ఉన్నది. నిజానికి ఆనాటి బ్రిటిష్‌ సామ్రాజ్యమే జియోనిజం నమ్మిన సంస్థగా చేసిన కృషి డిక్లరేషన్‌ వెనుక ఉన్నది.

19వ శతాబ్దం నుండి ఐరోపా దేశాల్లో నివసిస్తున్న యూదు ధనిక వర్గం యూదుల కోసం పాలస్తీనాలో సొంత దేశాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో తలెత్తిన భావజాలమే జియోనిజం. జుడాయిజం ప్రకారం దేవుడు ఈజిప్టులో నివసిస్తున్న యూదులకు, జోర్డాన్‌ నది-మధ్యధరా సముద్రం మధ్య భూభాగాన్ని సొంత దేశంగా ఇస్తానని వాగ్దానం చేశాడు. పాలస్తీనా భూభాగం పైన యూదుల చారిత్రక హక్కు, పాలస్తీనా అరబ్బుల చారిత్రక హక్కు కంటే అత్యధిక ప్రాధాన్యత కలిగి వున్నదని జియోనిజం యొక్క ప్రధాన వాదన. ఈ వాదనకు చారిత్రక పునాది ఏమీ లేదు, కేవలం హీబ్రూ బైబిల్‌ (బైబిల్‌ పాత నిబంధన) కథలు తప్ప.

ఆనాటి యూదు ధనికవర్గం మొదటి ప్రపంచ యుద్ధం ఫలితం తమకు అనుకూలంగా ఉండేట్లు ప్రభావితం చేసేందుకు తీవ్రంగా కృషి చేశారని బాల్ఫర్‌ ప్రాజెక్టు నివేదిక వెల్లడి చేసింది. వారి డబ్బు, పలుకుబడి ఉపయోగించి రష్యా, అమెరికా, జర్మనీలను తమ వైపు తిప్పుకునేందుకు కృషి చేశారు. ఈ నేపధ్యంలో అంతర్జాతీయంగా ఉన్న యూదు ప్రజల దృష్టిని తమ వైపు ఆకర్షించుకోవటం తమ సామ్రాజ్యవాద ప్రయోజనాలకు ఉపకరిస్తుందని బ్రిటన్‌ నమ్మింది. యూదులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే తమ ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని కూడా నమ్మింది. రష్యాలో జన్మించిన యూదు స్టేట్స్‌మేన్‌, బయో కెమిస్టు ఐన అజ్రియల్‌ వీజ్‌ మేన్‌, జియోనిజం అన్నది ప్రపంచవ్యాప్త యూదులకు ప్రాతినిధ్యం వహిస్తుందన్న ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించాడు. ఈ నమ్మకం నుండి జియోనిస్టులకు దేశాలన్నీ సహాయం చేయాలన్న సిద్ధాంతం సృష్టించబడిరది. జియోనిజానికి మద్దతు ఇవ్వటం అన్నది ‘యూదు ప్రజలతో కాంట్రాక్టు కుదుర్చుకోవటంతో సమానం’ అని అప్పటి ప్రధాని లాయిడ్‌ జార్జి ప్రకటించే వరకు పరిస్థితి వెళ్లింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులలో మెజారిటీ ప్రజలు జియోనిజం మద్దతుదారులుగా ఉన్నారన్న నమ్మకంతో అప్పటి బ్రిటిష్‌ క్యాబినెట్‌ బాల్ఫర్‌ డిక్లరేషన్‌ను రూపొందించింది. డిక్లరేషన్‌ రూపొందించినందుకు ప్రపంచవ్యాప్తంగా  ఉన్న యూదులు బ్రిటన్‌కు మద్దతుగా ఉంటారని, కృతజ్ఞతగా ఉంటారని భావిస్తూ అప్పటి క్యాబినెట్‌ డిక్లరేషన్‌కు రూపకల్పన చేసింది. అయితే వాస్తవంలో ప్రపంచ యూదులలో అతి కొద్దిమంది మాత్రమే, అది కూడా ధనిక వర్గమే జియోనిస్టులుగా వున్నారు. ఆ తర్వాత అనేక యేళ్లపాటు వారి సంఖ్యలో పెద్ద మార్పు లేదు. ఉదాహరణకి 1913 నాటికి 1 శాతం యూదులే జియోనిజం మద్దతుదారులు (డేవిడ్‌ ఫ్రాంకిన్‌). అంటే ప్రపంచ యూదుల మేలు కోసం బాల్ఫర్‌ డిక్లరేషన్‌కు ప్రాణం పోశారని అధికారిక కథనం చెప్పినప్పటికీ, వాస్తవానికి బ్రిటిష్‌ సామ్రాజ్య అధిపతుల్లో భాగంగా ఉన్న కొద్ది మంది జియోనిస్టులు మాత్రమే బాల్ఫర్‌ డిక్లరేషన్‌కు ప్రోద్బలంగా ఉన్నారు. అందుకు వివిధ దేశాల్లో యూదు ప్రజలపై సాగుతున్న వేధింపులను సాకుగా ఉపయోగించారు.

Malnutrition in Gaza dangerously crossed all limits due to Israeli food blockade

బాల్ఫర్‌ డిక్లరేషన్‌ రూపకల్పనలో ఏ దశలో కూడా అరబ్‌ ప్రతినిధులతో చర్చించాలన్న ఆలోచన చేయకపోవటం పాలస్తీనా ప్రజల సహజ హక్కులకు వ్యతిరేకంగా జరిగిన ‘చారిత్రక కుట్ర’గా చెప్పాలి. అది అవసరం అని ఎవరూ భావించలేదు. తమ వెనుక భారీ కుట్ర జరుగుతున్నదన్న సంగతి అరబ్బు ప్రజలకు తెలియదు. పాలస్తీనా అరబ్బు ప్రజలను పట్టించుకున్న వారు లేరు. పైగా ప్రధాని లాయిడ్‌ జార్జి, పాలస్తీనా ప్రజలు ఆనాడు శత్రువు పాలనా ప్రాంతంలో ఉన్నందున వారు బ్రిటన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారని భావించాలని సెలవిచ్చాడు. కాబట్టి పాలస్తీనా ప్రజలను సంప్రదించే పరిస్థితి తల ఎత్తలేదని వాదించాడు.

1915-1926 మధ్య అరేబియా పాలకుల్లో ఒకరైన అబ్దెల్‌ అజీజ్‌ ఇబ్న్‌, బ్రిటిష్‌ సామ్రాజ్యం తరపున అరబ్బు వ్యతిరేక వినాశకర పాత్ర పోషించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే అబ్దెలాజీజ్‌ ఇబ్న్‌, బ్రిటిష్‌ సామ్రాజ్యం తరపున పని చేసే గూండా గుంపు పాత్ర పోషించాడు. సైక్స్‌-పికాట్‌ ఒప్పందం, బాల్ఫర్‌ డిక్లరేషన్‌లలో పొందుపరిచిన బ్రిటిష్‌ సామ్రాజ్యవాద లక్ష్యాలు విజయవంతంగా నెరవేర్చేందుకు కట్టుబడి పని చేశాడు. పాలస్తీనా భూభాగంతో పాటు పశ్చిమ అరేబియాను పాలిస్తున్న షరీఫ్‌ ఆఫ్‌ ఇజాజ్‌ (హుస్సేన్‌ బిన్‌ ఆలీ), మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం, ఒప్పందం ప్రకారం స్వతంత్ర అరబ్బు దేశం ఏర్పాటు చేయాలని బ్రిటన్‌ను కోరాడు. అందుకు బదులు సైక్స్‌-పికాట్‌ ఒప్పందం, బాల్ఫర్‌ డిక్లరేషన్‌ల అమలుకు మద్దతు ఇవ్వాలని బ్రిటన్‌ కోరింది. అయితే తాను పాలస్తీనా ప్రజలకు ఎప్పటికీ ద్రోహం చేయబోనని షరీఫ్‌ ఆఫ్‌ ఇజాజ్‌ తెగేసి చెప్పాడు. బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు ఇష్టారీతిన అరబ్‌ దేశాల సరిహద్దులు గీయటానికి వీలు లేదని స్పష్టం చేశాడు.

బ్రిటన్‌ తరపున మాట్లాడేందుకు వచ్చిన టి ఇ లారెన్స్‌ (లారెన్స్‌ ఆఫ్‌ అరేబియా సినిమాలో ప్రధాన పాత్ర), షరీఫ్‌ ఆఫ్‌ ఇజాజ్‌కు ఏడాదికి 100,000 పౌండ్లు బ్రిటన్‌ చెల్లిస్తుందని, బదులుగా బ్రిటన్‌తో సహకరించాలని కోరాడు. కానీ రాజీకి ఇజాజ్‌ అంగీకరించలేదు. ఓ పక్క ఇజాజ్‌తో చర్చలు జరుపుతూ మరో పక్క అరేబియాలోని ఇతర నాయకులను కలిసి ఇజాజ్‌తో జట్టు కట్టవద్దని, అలా చేస్తే ఇబ్న్‌ సాద్‌ను వారి మీదకు (వేట కుక్క వలె) వదులుతానని హెచ్చరించాడు. ఇబ్న్‌ సాద్‌, ఆయన పోషణలో ఉన్న అతివాద వహాబీ గుంపు. బ్రిటన్‌ ఈల వేస్తే ఎవరి మీదకైనా లంఘించటానికి సిద్ధంగా వున్నారు. అప్పటికి నెలకు 10,000 పౌండ్ల బంగారం గ్రాంట్‌గా ఇబ్న్‌ సాద్‌కు బ్రిటన్‌ చెల్లిస్తోంది. దండిగా ఆయుధాలు, ఆహార సరఫరాలు వహాబీ గూండాలకు సరఫరా చేసింది.

ఉత్తర అరేబియా ప్రాంత నాయకుడు ఇబ్న్‌ రషీద్‌ కూడా బ్రిటన్‌ పధకాలను తిరస్కరించాడు. పైగా తన పాలనా ప్రాంతాల్ని ఉత్తరాన పాలస్తీనా మ్యాండెట్‌ సరిహద్దు వరకు, ఇంకో పక్క ఇరాక్‌ సరిహద్దు వరకు విస్తరించాడు. దాంతో షరీఫ్‌ ఆఫ్‌ అజీజ్‌తో రషీద్‌ జట్టు కట్టడం తథ్యం అని భావించిన బ్రిటన్‌, 1921లో ఇబ్న్‌ సాద్‌ను ఇబ్న్‌ రషీద్‌ పైకి ఉసిగొల్పింది. నవంబర్‌ 1921 నాటికి ఇబ్న్‌ రషీద్‌ లొంగిపోయాడు. దరిమిలా ఇబ్న్‌ సాద్‌ను సుల్తాన్‌ ఆఫ్‌ నజ్ద్‌గా బ్రిటన్‌ ప్రమోట్‌ చేసింది. ఈ ఉత్సాహంతో బ్రిటన్‌ మరోసారి షరీఫ్‌ ఆఫ్‌ ఇజాజ్‌కు వర్తమానం పంపుతూ జియోనిజంకు సహకరిస్తానని అంగీకరిస్తున్నట్లు ఒప్పంద పత్రంపై సంతకం చేయాలని డిమాండ్‌ చేసింది. షరీఫ్‌, ఒప్పందాన్ని చదివేందుకు సైతం నిరాకరించి, అరేబియా విభజనను, బాల్ఫర్‌ డిక్లరేషన్‌ను నిరాకరిస్తూ తానే ఒక ఒప్పందాన్ని తయారు చేసి సంతకం చేయాలంటూ లండన్‌కి పంపాడు. పాలస్తీనాను జియోనిస్టు ప్రాజెక్టు కోసం బ్రిటిష్‌ స్వాధీనానికి ఎప్పటికీ ఇజాజ్‌ అప్పగించడని తేలిపోయింది.

బ్రిటన్‌ మరోసారి తన వేట కుక్కను వదిలింది. 1924 మార్చిలో ఇబ్న్‌ సాద్‌ బలగాలు షరీఫ్‌ ఆఫ్‌ ఇజాజ్‌ పాలన ప్రాంతం పైన దాడి చేశాడు. అక్టోబర్‌ నాటికి షరీఫ్‌ హుస్సేన్‌ అకబా పోర్టుకు ప్రవాసం వెళ్లాడు. అకబా నుండి కూడా వెళ్లిపోవాలని బ్రిటన్‌ డిమాండ్‌ చేయటంతో పాటు బల ప్రయోగం చేయటంతో అకబా వదిలి వెళ్లాడు. ఫలితంగా 1000 యేళ్లుగా అరేబియాను ఏలుతున్న ప్రాఫెట్‌ మహమ్మద్‌ వారసుల పాలన ముగిసింది. ఐక్యం చేసిన అరేబియా భూభాగాలకు ‘కింగ్‌ డమ్‌ ఆఫ్‌ సౌదీ అరేబియా’గా బ్రిటన్‌ నామకరణం చేసింది. ఇబ్న్‌ సాద్‌ అబ్దెల్‌ అజీజ్‌ సౌదీ అరేబియాకు రాజుగా అవతరించాడు. ఇతర ఐరోపా దేశాలు వరస పెట్టి కొత్త రాజును గుర్తింపును ప్రకటించాయి. ఒకప్పటి బ్రిటన్‌ సామ్రాజ్యం పోషించిన వేట కుక్క, అరబ్‌ ప్రజలకు పాలస్తీనా ప్రజలకు ద్రోహం చేసినందుకు ప్రతిఫలంగా ఇప్పటికీ సౌదీ అరేబియా రాజుగా వెలుగొందుతున్నాడు. 1925 నుండి 1948 వరకు బ్రిటిష్‌ మ్యాండెట్‌ క్రింద కొనసాగిన పాలస్తీనా చివరికి యూదు రాజ్యం ఇజ్రాయెల్‌గా అవతరించింది.

Palestinians gather to receive food cooked by a charity kitchen, amid a hunger crisis, as the Israel-Gaza conflict continues, in Khan Younis in the southern Gaza Strip, December 4, 2024. REUTERS/Mohammed Salem

ఆ విధంగా ఒట్టోమన్‌ సామ్రాజ్యాన్ని ఓడిరచటంలో సహకరించినందుకు స్వతంత్ర అరేబియా ఏర్పాటుకు సహకరిస్తానని వాగ్దానం చేసిన బ్రిటన్‌ సామ్రాజ్యం -అరబ్బులతో ఎలాంటి సంబంధం లేకుండా ఫ్రాన్స్‌తో కలిసి కుట్ర చేసి సైక్స్‌-పికాట్‌ ఒప్పందం, బాల్ఫర్‌ డిక్లరేషన్‌ లాంటి ఒప్పందాలతో అరబ్‌ ప్రజలను నమ్మించి మోసం చేసింది. బ్రిటిష్‌ సామ్రాజ్యానికి సేవలు చేసిన అరబ్‌ ప్రాంత దళారీ పాలకుడు ఇబ్న్‌ సాద్‌ అబ్దెల్‌ అజీజ్‌, సొంత ప్రజలకు తీరని ద్రోహం చేస్తూ పాలస్తీనాలో ఇజ్రాయెల్‌ అవతరించటానికి సంపూర్ణ సహకారం అందజేశాడు. తన మోసానికి, విద్రోహానికి ప్రతిఫలంగా సౌదీ అరేబియా రాజుగా అవతరించి, అమెరికా-ఐరోపా దేశాల మద్దతుతో చమురు సంపదలను గడిరచి అరబ్బు ప్రయోజనాలకు శాశ్వత వెన్నుపోటుదారుగా చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించాడు. జియోనిస్టు పధకం అమలును సాకారం చేయటంలో, తద్వారా ఇజ్రాయెల్‌ పేరుతో అమెరికా సామ్రాజ్యవాద భౌగోళిక రాజకీయాలకు అత్యంత కీలకమైన పశ్చిమాసియాలో ఒక ఔట్‌పోస్ట్‌ నెలకొనడంలో నమ్మిన బంటు పాత్ర పోషించాడు.

మొదట బ్రిటన్‌ సామ్రాజ్యవాదులకు, అనంతరం అమెరికా సామ్రాజ్యవాదులకు సౌదీ అరేబియా వహాబీ పాలకుల సహకారం ఈ నాటికీ కొనసాగుతూ వస్తున్నది. సిరియాలోని సెక్యులర్‌ ప్రభుత్వం కూలిపోవటంలో సౌదీ అరేబియా తయారు చేసిన ఐసిస్‌ టెర్రరిస్టు మూకలే ముఖ్యపాత్ర పోషించాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో సోవియట్‌ సైన్యం పైన యుద్ధంతో ప్రారంభించి, ఆల్‌-ఖైదా టెర్రరిస్టు సంస్థగా రూపాంతరం చెందిన ఇస్లామిక్‌ టెర్రరిస్టు మూకలకు శిక్షణ ఇవ్వటంతో పాటు ఆయుధాలు, నిధులు సరఫరా చేసింది సౌదీ అరేబియా పాలకులే. ఇరాక్‌, సిరియాలలో ఇస్లామిక్‌ కాలిఫెట్‌ ఏర్పాటుకు, అనంతరం ఐసిస్‌ మూకల స్వైర విహారానికి సహాయ సహకారాలు అందించినది సౌదీ అరేబియా పాలకులే. ఇస్లామిక్‌ దేశాలతో పాటు ముస్లింలు ఉన్న దేశాలన్నింటిలో వహాబీ తీవ్రవాద ముస్లిం భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం టెర్రరిస్టు మూకలను సృష్టించటంలో సౌదీ అరేబియా పాత్ర అత్యంత కీలకమైనది. అమెరికా, ఐరోపా దేశాలకు, ఆఫ్రికా ఆసియా దేశాలలో ఎక్కడ అవసరం వస్తే అక్కడికి టెర్రరిస్టు సైన్యాన్ని సరఫరా చేయటం సౌదీ అరేబియాకు అమెరికా సామ్రాజ్యవాదం అప్పగించిన డ్యూటీ.

సౌదీ అరేబియా, కతార్‌, యుఏఇ, బహ్రెయిన్‌, ఒమన్‌, యెమెన్‌, ఇరాక్‌, ఇరాన్‌ దేశాల సరిహద్దులను నిర్ణయించిన బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు తమ ప్రాభవం క్షీణించిన దరిమిలా పశ్చిమాసియా బాధ్యతను అమెరికా సామ్రాజ్యవాదానికి అప్పగించింది. అమెరికా, ఐరోపా దేశాలు ఉమ్మడిగా పశ్చిమాసియాలో తమ సామ్రాజ్యవాద ప్రయోజనాలు నెరవేరేందుకు ఇజ్రాయెల్‌ను ఉపయోగించుకుంటున్నారు. అందుకే పాలస్తీనా స్థాపనకు మద్దతు ఇస్తున్నట్లుగా, పాలస్తీనా స్వతంత్ర దేశాన్ని గుర్తిస్తున్నట్లుగా పశ్చిమ దేశాలు ఎన్ని ప్రకటనలు చేసినప్పటికీ అవన్నీ మోసపూరితమే.

నాటి కుట్రలకు కొనసాగింపే నేటి గాజా యుద్ధం

సైక్స్‌-పికాట్‌ ఒప్పందంతో అరబ్బు ప్రజల మధ్య విభేదాలు నాటిన బ్రిటన్‌-అమెరికా సామ్రాజ్యవాదులు బాల్ఫర్‌ డిక్లరేషన్‌ ద్వారా ఇజ్రాయెల్‌ను సృష్టించారు. ఇజ్రాయెల్‌ ప్రస్తుతం అమెరికాకు 51వ రాష్ట్రంగా తన విధులను నిర్వర్తిస్తున్నది అంటే సరిపోతుంది. ఇజ్రాయెల్‌ను మందలిస్తున్నట్లు, కోపగిస్తున్నట్లు, నిందిస్తున్నట్లు అమెరికా నటనలు సాగిస్తుంటే -ఐరోపా రాజ్యాలు స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తున్నట్లుగా ప్రకటనలు గుప్పిస్తున్నాయి. బాల్ఫర్‌ డిక్లరేషన్‌లోనే పాలస్తీనా భూభాగంలో స్వతంత్ర ఇజ్రాయెల్‌ దేశ స్థాపనకు హామీ ఇచ్చిన బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు అందులో స్వతంత్ర పాలస్తీనాకు అంగీకరించే ప్రస్తావన ఏమీ చేయలేదు. చేసిన వాగ్దానాలను ఇట్టే ఉల్లంఘించే పశ్చిమ సామ్రాజ్యవాదులు, చేయని హామీకి కట్టుబడి ఉంటాయని నమ్మటానికి అవకాశం లేదు.

ముందు చెప్పుకున్నట్లు ఇజ్రాయెల్ – అరబ్ దేశాల మధ్య సంబంధాలను అబ్రహాం ఎకార్డ్స్ ద్వారా సాధారణీకరించే ప్రయత్నాలను అమెరికా ముమ్మరం చేస్తున్న నేపధ్యంలో పాలస్తీనా సమస్య కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. నిజానికి పాలస్తీనా సమస్యను తెరమరుగు చేసేందుకే ఇజ్రాయెల్-అరబ్ సంబంధాల సాధారణీకరణ ఉద్దేశించబడింది. ఈజిప్టు, జోర్డాన్ ల తర్వాత యుఏఇ, బహ్రయిన్ దేశాలతో శాంతి ఒప్పందాలు పశ్చిమాసియా ప్రాంతీయ మరియు ప్రపంచ భౌగోళిక రాజకీయాల తెరపై ప్రత్యక్షం కావటం, త్వరలోనే సూడాన్, మొరాకోలు సాధారణీకరణ ప్రక్రియలో భాగం కావటానికి అంగీకరించటం, సౌదీ అరేబియాలతో పాటు అహ్రర్ ఆల్-షామ్ (ఆల్-ఖైదా) పాలనలోకి జారిపోయిన సిరియా, హిజ్బొల్లాను అంతం చేయటం ద్వారా లెబనాన్ దేశాలను కూడా ఈ ప్రక్రియలో కలిపేందుకు అమెరికా చర్యలు ముమ్మరం కావటం… ఈ పరిణామాలతో పాలస్తీనా సమస్యను ప్రపంచ భౌగోళిక రాజకీయాలలో ప్రధాన అంశంగా తిరిగి ప్రవేశ పెట్టవలసిన తక్షణ కర్తవ్యం అరబ్బు ప్రతిఘటనా పోరాట సంస్థల ముందుకు వచ్చింది.

Genocide in Gaza continuing day and night as the world is watching

ఈ తక్షణ కర్తవ్యం నుండే అక్టోబర్ 7, 2023 తేదీన హమాస్, పిఐజె, ఇతర సంస్థలు ముందుగా అనుకున్న పధకం ప్రకారం ఇజ్రాయెలీ పౌరులను కిడ్నాప్ చేశాయి. ఈ కిడ్నాప్ మరియు దాడిలో పాలస్తీనా తిరుగుబాటుదారులు ఇజ్రాయెలీ మహిళల పై అత్యాచారం జరిపారని, పసి పిల్లలను వృద్ధులను అమానుషంగా చంపారని, రక్తం ఏరులై ప్రవహించిందని ఇలా అనేక కధనాలను పశ్చిమ కార్పొరేట్ పత్రికలు, ఇజ్రాయెలీ మితవాద పత్రికలు ప్రచారంలో పెట్టాయి. ఇవి పాలస్తీనా ప్రతిఘటనా సంస్థల పైన జరిగిన దుష్ప్రచారం తప్ప వాస్తవం కాదు. అమెరికా, పశ్చిమ దేశాలు ప్రజాస్వామ్య దేశంగా చెప్పే ఇజ్రాయెల్ వాస్తవానికి యూదు జాత్యహంకార రాజ్యం. మోసం, కుట్ర, అబద్ధాలు, అర్ధ సత్యాలతో, అమెరికా అండతో గత వందేళ్ళకు పైగా పాలస్తీనా ప్రజలపై అరబ్ ప్రతిఘటనపై మోపిన నేరాలను ఇజ్రాయెల్ సాగిస్తూ వచ్చిందన్నది అసలు నిజం. జరిగిన ప్రతి ఒప్పందాన్ని ఉల్లంఘించి వందల సార్లు ఎలాంటి ప్రొవొకేషన్ లేకుండానే గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రజలపై హంతక దాడులు చేసిన దేశం ఇజ్రాయెల్. కిడ్నాప్ లాంటి చర్యలను పోరాట రూపంగా చేపట్టాక తప్పని పరిస్ధితి కల్పించిందే ఇజ్రాయెల్!

అటువంటి తప్పని పరిస్ధితుల్లోనే అక్టోబర్ 7, 2023 తేదీ నాడు హమాస్, పిఐజె తదితర మిలిటెంట్ గ్రూపులు గాజా చుట్టూ నిర్మించిన కంచెను ఛేదించి దక్షిణ ఇజ్రాయెల్ లోకి చొచ్చుకు వెళ్లారు. అనేక మంది మిలిటెంట్లు పారా గ్లైడర్ల ద్వారా ఆకాశ మార్గంలో ఇజ్రాయెలీ పట్టణాలపై దిగి ఇజ్రాయెలీ సైనికులపై దాడి చేశారు. బియరీ, కఫర్ ఆజా, నిర్ ఓజ్, నెటివ్ హాసరా, ఆలూమిమ్ తదితర సెటిల్‌మెంట్ల పై దాడి చేశారు. ఇజ్రాయెల్ లెక్క ప్రకారం 6,000 మందికి పైగా గాజా మిలిటెంట్లు, పౌరులు ఈ దాడిలో పాల్గొన్నారు. దాడి సందర్భంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) సైనికులతో అనేక చోట్ల తలపడ్డారు. ఇజ్రాయెల్ పౌరులు కూడా తమ వద్ద ఉన్న ఆయుధాలతో మిలిటెంట్లతో తలపడ్డారు. పరస్పర కాల్పుల్లో అటు గాజా మిలిటెంట్లు పౌరులతో పాటు ఐడిఎఫ్ సైనికులు, యూదు పౌరులు కూడా చనిపోయారు.

కంచె సమీపంలో జరుగుతున్న నోవా మ్యూజిక్ ఫెస్టివల్ నుండి ఇజ్రాయెలీ పౌరుల కిడ్నాప్ లను నివారించటానికి హాని బాల్ డైరెక్టివ్ ను ఐడిఎఫ్ అమలు చేసింది. ఈ సూత్రం ప్రకారం యూదుల, యూదు సైనికుల కిడ్నాప్ లను ఎట్టి పరిస్ధితుల్లోనూ నివారించి తీరాలి. అవసరమైతే సొంత సైన్యం చనిపోయే పరిస్ధితి వచ్చినా సరే. ఈ డైరెక్టివ్ ని రద్దు చేసినట్లు ఇజ్రాయెల్ చెప్పినప్పటికీ అది నిజం కాదని అక్టోబర్ 7 నాటి ఘటన ద్వారా తేలింది. కిడ్నాప్ లను అడ్డుకునేందుకు ఐడిఎఫ్, పాలస్తీనా మిలిటెంట్లపై ట్యాంకులతో విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 400 కు పైగా ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. మొత్తం మీద 1200 మంది వరకు ఇజ్రాయెలీయులు చనిపోగా 250 మంది వరకు యూదు పౌరులను, ఐడిఎఫ్ సైనికులను మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. ఈ దాడిని హమాస్, ఆపరేషన్ ఆల్-ఆక్సా ఫ్లడ్ అని పిలుస్తున్నది. దాడి గురించి సౌదీ అరేబియా, ఈజిప్ట్ దేశాలు ముందుగానే ఇజ్రాయెల్ హెచ్చరించాయని వచ్చిన వార్తలను బట్టి హమాస్, తదితర మిలిటెంట్ సంస్థల  దాడిని కొనసాగనిచ్చి దానిని సాకుగా చూపిస్తూ గాజా, వెస్ట్ బ్యాంక్ లను శాశ్వతంగా దురాక్రమించాలని ఇజ్రాయెల్ పధకం పన్నిందన్న అనుమానాలు తలెత్తాయి. పాలస్తీనా ప్రతిఘటనకు, నామ మాత్రంగా కొనసాగుతున్న తమ ఉనికి నిలబడాలంటే ప్రాణాలకు తెగించి తీవ్ర స్థాయి చర్యలకు పాల్పడక తప్పని పరిస్ధితిని ఎదుర్కొందన్న సంగతి స్పష్టం.

గాజా లోని ఆసుపత్రులతో పాటు సమస్త మానవ, ప్రభుత్వ నిర్మాణాలను, పౌరుల ఆవాసాలను నేలమట్టం చేస్తూ పాలస్తీనా అరబ్బుల జీనోసైడ్ కి ఇజ్రాయెల్ పాల్పడుతున్న నేపధ్యంలో, పాలస్తీనా ప్రజల కోసం పశ్చిమ దేశాలు కార్చే కన్నీరు మొసలి కన్నీరు మాత్రమే. ఇజ్రాయెల్‌ మాజీ రక్షణ మంత్రి బెన్నీ గాంట్జ్‌, సెప్టెంబర్‌ 24 తేదీన ద న్యూయార్క్‌ టైమ్స్‌లో ఒక ఆర్టికల్‌ రాస్తూ ‘పాలస్తీనా దేశ స్థాపనను వ్యతిరేకించటం అన్నది ఇజ్రాయెలీ రాజకీయాలకు హృదయం లాంటిది. రాజకీయ పార్టీల విభేదాలతో నిమిత్తం లేని వాస్తవం ఇది. నెతన్యాహు ప్రధాని పదవి నుండి దిగిపోతే, లేక ఎన్నికల్లో ఆయన ఓడిపోతే ఈ అవగాహనలో మార్పు వస్తుందని భావించటం ఒట్టి భ్రమ’ అని స్పష్టం చేశాడు. అనగా పక్క పక్కన పాలస్తీనా, ఇజ్రాయెల్‌ అనే రెండు రాజ్యాల స్థాపన అన్న అంశానికి ఇజ్రాయెలీ రాజకీయ వ్యవస్థ అంగీకారం ఎన్నడూ లేదు. పాలస్తీనా దేశం ఏర్పడితే ఇజ్రాయెల్‌ భద్రతకు గ్యారంటీ లేదని ఇజ్రాయెల్‌ రాజకీయ వ్యవస్థ నమ్ముతోంది. మితవాద, సెంట్రిస్టు, లిబరల్‌ లెఫ్ట్‌ -ఇలా ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాలస్తీనా ఉనికిని అంగీకరించబోరు. అందుకు భిన్నంగా ఎవరు ఏది చెప్పినా వాస్తవం కాబోదు.

ఈ అవగాహనలో భాగమే సిరియా ప్రభుత్వం కూల్చివేత. నిన్నటి వరకు సిరియాలో ఏ ఐసిస్‌ తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ తదితర పశ్చిమ దేశాలు చెప్పాయో అదే ఐసిస్‌/ఆల్‌-ఖైదా తీవ్రవాద సంస్థ నాయకుడికి గడ్డం ట్రిమ్‌ చేసి, తల నీట్‌గా దువ్వి సిరియా అధ్యక్షుడుగా పగ్గాలు అప్ప జెప్పారు. లెబనాన్‌లోని హిజ్బొల్లాకు, గాజాలోని హమాస్‌ ప్రతిఘటనకు ఇరాన్‌ నుండి సిరియా ద్వారా ఆయుధాలు, ఆహారం సరఫరా అయ్యేవి. ఇప్పుడు ఆ మార్గం మూసుకుపోయింది.

శత్రువు ఎవరో శత్రువు లక్ష్యం ఏమిటో స్పష్టం!

అక్టోబర్‌ 7, 2024 తేదీన హమాస్‌, పిఐజెలు చేసిన దాడిని సాకుగా చూపిస్తూ ఇజ్రాయెల్‌ ఒక్క గాజా పైనే మిసైళ్ల దాడి చేయటం లేదు. దక్షిణ లెబనాన్‌, సిరియా, జోర్డాన్‌, ఇరాన్‌, యెమెన్‌ దేశాల పైన కూడా ఇజ్రాయెల్‌ మిసైళ్ల వర్షం కురిపిస్తున్నది. ఇరాన్‌ పై దాడి చేస,ి ఇరాన్‌ స్పందన ద్వారా ఆ దేశం బలం ఏమిటో అంచనా వేసింది. పశ్చిమ సిరియా భూభాగంపై దాడులు చేసి సిరియా ఆయుధ, రక్షణ వ్యవస్థలను సర్వ నాశనం చేసింది. లెబనాన్‌ హిజ్బొల్లాతో చర్చల పేరుతో అమెరికా ప్రతిపాదనలు పంపగా సదరు ప్రతిపాదనల పరిశీలనకు ఇరాన్‌ వచ్చిన హిజ్బొల్లా అధినాయకుడిని మిసైల్‌ దాడితో హత్య చేసింది. లెబనాన్‌ పై జరిపిన దాడులతో ముఖ్య నాయకత్వాన్ని చంపేసింది. కొద్ది రోజుల క్రితం గాజాలో తాత్కాలిక సీజ్‌ ఫైర్‌ ఒప్పందం కోసం అమెరికా పంపిన ప్రతిపాదనలను అధ్యయనం చేసేందుకు కతార్‌లో బస చేస్తున్న శిబిరం పైన కూడా ఇజ్రాయెల్‌ బాంబులు, డ్రోన్‌లతో దాడులు చేసింది. ఈ దాడిలో ఒక నాయకుడి కుటుంబం, సంబంధం లేని కతార్‌ పోలీసు చనిపోవటంతో కతార్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇజ్రాయెల్‌ తన ఉద్దేశాలను ఏమీ దాచుకోవటం లేదు. అంటే అమెరికా ఉద్దేశాలు కూడా ఎక్కడో మరుగున లేవని అర్థం. పశ్చిమాసియాలో ఇరాన్‌ నాయకత్వంలో అభివృద్ధి అయిన ప్రతిఘటనా అక్షం (Aఞఱం శీట Rవంఱర్‌aఅషవ) శాశ్వతంగా రద్దు కావాలి. ఉత్తర ఈజిప్టు నుండి జోర్డాన్‌, దక్షిణ సౌదీ అరేబియా, దక్షిణ సిరియా, దక్షిణ ఇరాక్‌లతో గ్రేటర్‌ ఇజ్రాయెల్‌ ఏర్పడాలి. ఇందుకు ప్రధాన ప్రతిబంధకంగా ఉన్న ఇరాన్‌లో తిరుగుబాటు జరిగి ఇస్లామిక్‌ విప్లవ ప్రభుత్వం కూలిపోయి అమెరికా అనుకూల దళారీ నేతల నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడాలి. సిరియా, జోర్డాన్‌ల మీదుగా పశ్చిమాసియా చమురు ఐరోపా దేశాలకు పైపుల ద్వారా చమురు, గ్యాస్‌ సరఫరాకు మార్గం సుగమం కావాలి. పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్‌-పశ్చిమ ఐరోపా అను దుష్ట త్రయ రాజ్యాల లక్ష్యం నెరవేరే వరకు అమెరికా తరపున జియోనిస్టు యూదు జాత్యహంకార దౌష్ట్యం కొనసాగుతుంది. వందేళ్ల క్రితం నాటి సైక్స్‌-పికాట్‌ ఒప్పందం, బాల్ఫర్‌ డిక్లరేషన్‌ల లక్ష్యమూ, ఈనాటి గాజా జాతి హననకాండ లక్ష్యమూ రెండూ ఒకటే. కాబట్టి గాజా హత్యాకాండ, పాలస్తీనా అరబ్బులపై జాతి హత్యాకాండ కొనసాగుతుంది. అరబ్బు రాచరిక ప్రభువులు, దళారీ నేతల వల్ల ఏమీ ఒరగదు, అరబ్‌ జాతి విద్రోహం తప్ప. తిరగబడ వలసింది అరబ్‌ జాతి ప్రజలే. సరిహద్దులకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించి కార్మికవర్గ నాయకత్వంలో నిర్దిష్ట సైద్ధాంతిక మద్దతుతో సాయుధ ప్రతిఘటనకు పూనుకోవటమే అరబ్‌ జాతి ప్రజలు చేయవలసింది.

గాజా గాయం నుండి రక్తం మాత్రమే ప్రవహించటం లేదు. గాజా శరీరం లోపలి అవయవాలు ఒక్కొక్కటీ వేన వేల ముక్కలుగా ఛిద్రమై ఒక్కొక్క ముక్కా తెంపు లేకుండా ఆ గాయం నుండి బైటికి ప్రవహిస్తున్నాయి. ఆ రక్త మాంసాలు బొట్టు బొట్టుగా ముక్క ముక్కగా ప్రపంచ దేశాల మొఖాలపై చాచి కొడుతూ చిందుతోంది. నాగరిక ప్రపంచమా నీ నాగరికత ఒట్టి డొల్ల అని వెక్కిరిస్తోంది. సో-కాల్డ్‌ పెట్టుబడిదారీ ఆధునిక నాగరిక సమాజం సమాధానం లేక తిరిగి బాధితుల్నే నిందిస్తోంది, అఖ్లక్‌ని చంపి అఖ్లక్‌ పైనే కేసు మోపిన చందంగా!

‘నీవెవరో తెలుసుకో, నీ శత్రువు ఎవరో తెలుసుకో, నూరు యుద్ధాలు చేయి, నూరు విజయాలు నీ సొంతం!’ అని మావో జెడాంగ్‌ తొంభై యేళ్ల క్రితమే మూడో ప్రపంచదేశాల్లోని కార్మిక, రైతాంగ ప్రజానికానికి, విద్యార్థి మేధావులకు దిశా నిర్దేశం చేశాడు. ఆ దిశలో ప్రయాణించడమే ఇక మిగిలి ఉన్నది.

————అయిపోయింది

2 thoughts on “గాజా స్ట్రిప్‌: రక్తం ఓడుతున్న అరబ్బుల గాయం -పార్ట్ 2

వ్యాఖ్యానించండి