గాజా స్ట్రిప్‌: రక్తం ఓడుతున్న అరబ్బుల గాయం -పార్ట్ 1


—–మహిళా పత్రిక ‘మాతృక’ అక్టోబర్ నెల సంచిక నుండి. (రచన: సుమన)

ఈ జాత్యహంకార దుర్గంధం ఎచటిదంటే గాయాల గాజా వైపు చూపండి! పెట్రో డాలర్లు వెదజల్లుతున్న ఈ కర్బన ఉద్గారాల కమురు వాసన గాలులు ఎక్కడివంటే గాజా తీరాన్ని చూపండి! మానవతా చూపులను మసకబార్చుతున్న ఆ గంధకపు పేలుళ్ల పొగల మేఘాలు ఎక్కడ వర్షిస్తున్నాయంటే పుడమి తల్లి రాచపుండుగా మారిన గాజాలో సొమ్మసిల్లుతున్న మానవ దేహాలను చూపండి. మన ఇంటిపై కమ్మిన ఉప్పు భాష్పాల ఆక్రందనలు ఎచ్చటివంటే కరువు తీరా ఏడ్వడానికి లేకుండా ఆవిరవుతున్న పాలస్తీనా కంటి సముద్రాలను చూపండి!

—–o0o—–

సోవియట్‌ యూనియన్‌ చిట్ట చివరి సామ్రాజ్యాధినేత, సోవియట్‌ సోషల్‌ సామ్రాజ్యవాద రాజ్యాన్ని శాస్త్రబద్ధంగా పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద రాజ్యంగా మార్చి పశ్చిమ సామ్రాజ్యవాదుల ప్రశంసలు అందుకున్న మిఖాయిల్‌ గోర్బచెవ్‌ 1980లలోనే ఆఫ్ఘనిస్తాన్‌ను ‘రక్తం ఓడుతున్న గాయం’గా అభివర్ణించాడు. భౌగోళిక రాజకీయ ఆధిపత్య వ్యూహాలకు అత్యంత కీలక ప్రాంతంలో నెలకొని ఉన్న పాపానికి ఆఫ్ఘనిస్తాన్‌ నిరంతరం దండయాత్రలకు, ఆధిపత్య రాజకీయాలకు, దురాక్రమణ దాడులకు గురి అవుతూ వచ్చింది. ప్రస్తుతం గాజా పరిస్థితి అంతకంటే తీవ్రంగా ఉన్నది. ప్రపంచ దేశాలన్నిటికంటే ముందు నాగరికత నేర్చామని చెప్పుకునే ఐరోపా, అమెరికా రాజ్యాలు గుడ్లప్పగించి చూస్తుండగా గాజాలో పాలస్తీనా అరబ్బు ప్రజలు దురహంకార యూదు రాజ్యం ఇజ్రాయెల్‌ సాగిస్తున్న అత్యంత పాశవిక, జాత్యహంకార, క్షిపణి దాడుల్లో వొళ్లంతా తూట్లు పడుతుండగా ఆర్తనాదాలు చేస్తూ ఆధునిక ప్రపంచం సాధించిన అభివృద్ధికరమైన నాగరికతను గేలి చేస్తూ నిలబడి ఉన్నది.

అమెరికా, ఐరోపాల ఆధిపత్య రాజకీయాలను ఎదిరిస్తున్నామని చెప్పుకుంటున్న రష్యా, చైనా, ఇండియా, బ్రెజిల్‌, సౌత్‌ ఆఫ్రికాలాంటి దేశాలు చేష్టలుడిగి యూదు జాత్యహంకార మారణకాండను కనీసం ప్రశ్నించటానికి కూడా ప్రయత్నం చేయకుండా కేవలం ఐరాస, భద్రతా సమితిలో ఉత్తుత్తి ప్రసంగాలతో, ఓటి చప్పుళ్లతో ఏదో చేస్తున్నామన్న భ్రమలను సృష్టిస్తున్నాయి. ఇండియా ప్రధానమంత్రి, పాలస్తీనా స్వతంత్ర రాజ్యానికి బేషరతు మద్దతు ఇచ్చే విధానానికి తిలోదకాలు పలికాడు. హిందూ మితవాద పాలకులు ఓ పక్క అమెరికా, రష్యా, చైనా, ఐరోపా ఫైనాన్స్‌ కార్పొరేట్లకు సేవలు చేస్తూ తదనుగుణంగా యూదు జాత్యహంకార జాతి హత్యాకాండకు అరమరికలు లేకుండా మద్దతునిస్తున్నారు.

అమెరికా, ఐరోపా, రష్యా, చైనా -ఇప్పుడు ప్రపంచం అంటే ఈ దేశాల పాలకవర్గాలే. ఇతరులు ఆ ప్రపంచానికి సేవలు చేసే సేవక రాజ్యాలు మాత్రమే. సేవక దేశాల శ్రామిక వర్గాలయితే ఇక లెక్కలోనే లేరు. ఇటువంటి అసమానతలు, అణచివేతలు, నిట్టనిలువు దోపిడీలే అత్యున్నత విలువలుగా కొనసాగుతున్న ప్రపంచంలో గాజా ప్రజలపై సాగుతున్న జాత్యహంకార జాతి హత్యాకాండ (జీనోసైడ్‌) ఎలా అంతం అవుతుంది అన్నది ఎడతెగని ప్రశ్న!

చరిత్రలో అక్టోబర్‌ నెల శ్రామికవర్గ విప్లవాలకు నెలవు. గాజా స్ట్రిప్‌ ప్రజలకు, యూదు మరియు జియోనిస్టు వ్యతిరేక ప్రతిఘటనా పోరాటాలకు అదే అక్టోబర్‌ నెల ఒక మూల మలుపుగా మారటం బహుశా యాదృచ్ఛికం కాకపోవచ్చు.

అబ్రహాం ఎకార్డ్స్‌ పేరుతో అమెరికా సామ్రాజ్యవాదం, యూదు రాజ్యం ఇజ్రాయెల్‌, పశ్చిమాసియాలోని అరబ్బు రాజ్యాల మధ్య సంబంధాలను అభివృద్ధి చేసేందుకు పునాది వేయటం ప్రారంభించింది. మొదట ఇజ్రాయెల్‌ మరియు యుఏఇ, బహ్రెయిన్‌ దేశాల మధ్య సెప్టెంబర్‌ 15, 2020 తేదీన ట్రంప్‌ నేతృత్వంలోని అమెరికా సారధ్యంలో శాంతి ఒప్పందం జరిగింది. దీనిని అబ్రహాం ఎకార్డ్స్‌గా పిలుస్తున్నారు. దీని ప్రధాన లక్ష్యం ఉప్పు-నిప్పుగా ఉన్నట్లు భావిస్తున్న ఇజ్రాయెల్‌, అరబ్బు రాజ్యాల మధ్య సంబంధాలను సాధారణ స్థాయికి చేర్చటం (నార్మలైజేషన్‌). తద్వారా పాలస్తీనా సమస్యకు ప్రపంచదేశాల లేదా ఐక్యరాజ్య సమితి ఎజెండా నుండి శాశ్వతంగా తప్పించటం. భవిష్యత్తు పాలస్తీనా రాజ్యంగా ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు గుర్తించిన వెస్ట్‌బ్యాంక్‌ మరియు గాజా స్ట్రిప్‌లను సంపూర్ణంగా ఇజ్రాయెల్‌ దేశంలో భాగంగా మారేందుకు అబ్రహాం ఎకార్డ్స్‌ పునాది అయింది.

అమెరికా సామ్రాజ్యవాద చారిత్రక కుట్రలు

అమెరికా మధ్యవర్తిత్వంతో 1979లో ఈజిప్టుతోనూ, 1994లో జోర్డాన్‌తోనూ ఇజ్రాయెల్‌ శాంతి ఒప్పందం చేసుకున్న 26 సంవత్సరాల అనంతరం యూదు -అరబ్బు దేశాల మధ్య కుదిరిన మొట్ట మొదటి ఒప్పందం అబ్రహాం అకార్డ్స్‌. ఒప్పందంలో పాలస్తీనా గురించిన ప్రస్తావన పొల్లు మాత్రంగా కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు. ఒప్పందం ప్రకారం యుఏఇ, బహ్రెయిన్‌లు ఇజ్రాయెల్‌లో రాయబార కార్యాలయాలు తెరిచాయి. రాయబారులను నియమించాయి. టూరిజం, వాణిజ్యం, ఆరోగ్యం, భద్రతా రంగాలలో అత్యంత వేగంగా సంబంధాలు అభివృద్ధి చేసుకున్నాయి. యుఏఇ, బహ్రెయిన్‌ తర్వాత ఇజ్రాయెల్‌తో సంబంధాల అభివృద్ధికి సూడాన్‌, మొరాకో దేశాలు కూడా అంగీకరించాయి. ట్రంప్‌/అమెరికా పధకం ప్రకారం సౌదీ అరేబియా, సిరియా, లెబనాన్‌లు కూడా ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందాలు చేసుకోవలసి ఉన్నది.

ఈ పధకంలో భాగంగానే సిరియాలో టెర్రరిస్టు ఆల్‌-ఖైదా శాఖ అహ్రర్‌ ఆల్‌-షామ్‌ (గతంలో జభాత్‌ ఆల్‌-నూస్రా) వాయవ్య రాష్ట్రమైన ఇడ్లిబ్‌ వరకే పరిమితమై ఉన్నప్పటికీ హఠాత్తుగా అక్కడి నుండి తిరుగుబాటు ప్రారంభించటం, మరో రెండు రోజుల్లోనే ముఖ్య నగరం అలెప్పో మీదుగా రాజధాని డెమాస్కస్‌ని కైవశం చేసుకోవటం, అప్పటివరకూ టెర్రరిస్టు మూకల్ని వీరోచితంగా ప్రతిఘటిస్తున్న సిరియా సైన్యం ఆయుధాలు అప్పగించి లొంగిపోవటం, బషర్‌ అస్సాద్‌ నాయకత్వంలోని బాతిస్టు సెక్యులర్‌ ప్రభుత్వం కుప్ప కూలిపోవటం జరిగిపోయింది. అధ్యక్షుడు బషర్‌ అస్సాద్‌, రష్యా రక్షణలో ఉన్న లటాకియా రాష్ట్రానికి అక్కడి నుండి రష్యాకు కుటుంబంతో తరలిపోయాడు.

ఈ దుష్పరిణామం వెనుక రష్యా, చైనా దేశాల మౌనాంగీకారం ఉన్నట్లు తదుపరి సంఘటనలు రుజువు చేశాయి. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ తాలూకు ప్రయోజనాల రీత్యా చైనా, ఇజ్రాయెల్‌లో 15 శాతం వరకు రష్యా నుండి తరలి వచ్చిన రష్యన్‌ యూదులు ఉండటం వలన రష్యా -సెక్యులర్‌ సిరియా ప్రభుత్వం కుప్ప కూలిపోవటం వెనుక పరోక్ష అంగీకారంతో వ్యవహరించాయన్న సంగతి స్పష్టం అయింది.

లెబనాన్‌లో ప్రాక్టికల్‌గా రెండు ప్రభుత్వాలు ఉనికిలో ఉన్నాయి. అధ్యక్షుడుగా మెరోనైట్‌ క్రిస్టియన్‌ మతస్థుడు, పార్లమెంటు స్పీకర్‌గా షియా ముస్లిం, ప్రధానమంత్రిగా సున్నీ ముస్లిం ఉంటారు. 1982లో లెబనాన్‌ ఆక్రమణకు ఇజ్రాయెల్‌ తెగబడడంతో షియా ముస్లిం తెగకు చెందిన పూజారి వర్గ యువకులు తీవ్రంగా ప్రతిఘటించారు. వారే హిజ్‌బొల్లా ప్రతిఘటనా గ్రూపుగా అవతరించారు. అప్పటి నుండి దక్షిణ లెబనాన్‌ను ఇరాన్‌ మద్దతుతో హిజ్‌బొల్లా గ్రూపు పాలిస్తుండగా, ఉత్తర లెబనాన్‌ ప్రభుత్వం అమెరికా, పశ్చిమ రాజ్యాల చెప్పు చేతల్లో ఉన్నది. లెబనాన్‌ను కలుపుకునేందుకు ఇజ్రాయెల్‌ అనేక మార్లు విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చినప్పటికీ హిజ్‌బొల్లా ప్రతిఘటన వలన అది సాధ్యం కాలేదు.

మరో పక్క ఐరాస, అమెరికా పర్యవేక్షణలో 1993, 1995లలో పిఎల్‌ఓ`ఇజ్రాయెల్‌ మధ్య రెండు రాజ్యాల ఏర్పాటు ఒప్పందం (టూ స్టేట్‌ సొల్యూషన్‌) కుదిరింది. గాజా, వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతాలతో పాలస్తీనా ఏర్పాటుకు ఇజ్రాయెల్‌ అంగీకరించినప్పటికీ ఆ దిశలో నిర్దిష్టంగా ఒక్క అడుగు కూడా వేయలేదు. పైగా ఒప్పందం అమలు కాకుండా చేసేందుకు సకల ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. అప్పటి పిఎల్‌ఓకు పాలస్తీనా ప్రతిఘటన నేత యాసర్‌ అరాఫత్‌ నాయకత్వం వహించాడు. (ఫతా మరియు ఇతర పాలస్తీనా ప్రతిఘటన పార్టీలు ఉమ్మడిగా పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌ – పిఎల్‌ఓ) ఏర్పడిరది. ఈ నేపధ్యంలో యాసర్‌ అరాఫత్‌ రాజీ లేని ధోరణితో విసుగు చెందిన ఇజ్రాయెల్‌, పొలోనియం రేడియో ధార్మిక విష పదార్ధాన్ని అరాఫత్‌ భోజనంలో కలిపి ఆయనను అడ్డు తొలగించుకుంది.

Oslo Accord

ఆ తర్వాత పిఎల్‌ఓ (రాజకీయ కూటమి), పాలస్తీనా అథారిటీ (పాలస్తీనా ప్రభుత్వం)లకు నేతృత్వం వహించిన మహమ్మద్‌ అబ్బాస్‌ పూర్తిగా ఇజ్రాయెల్‌, అమెరికాలకు లొంగిపోయి -పాలస్తీనా ప్రజల ప్రజాస్వామిక, స్వతంత్ర కాంక్షలకు నిలువునా ద్రోహం చేయటం ప్రారంభించాడు. స్వజాతిని లోపలి నుండి పురుగు వలె తొలుస్తూ వచ్చాడు. ఫలితంగా 1987లో ఇజ్రాయెల్‌ ఆక్రమణకు వ్యతిరేకంగా తలెత్తిన మొదటి తిరుగుబాటు యుద్ధం (ఫస్ట్‌ ఇంతిఫాదా) అనంతరం, ఇస్లామిక్‌ మత భావజాలంతో కూడిన హమాస్‌ సంస్థ ఆవిర్భవించింది. 

అరాఫత్‌ నాయకత్వంలోని మిలిటెంట్‌ సెక్యులర్‌ సంస్థ అయిన పిఎల్‌ఓను బలహీనపరిచే లక్ష్యంతో హమాస్‌ సంస్థకు ఇజ్రాయెల్‌ ప్రభుత్వమే (అమెరికా ద్వారా) ఖతార్‌ చేత నిధులు అందేలా చేసింది. సెక్యులర్‌ పిఎల్‌ఓతో పోల్చితే ఇస్లామిక్‌ హమాస్‌ను ప్రపంచం ముందు తేలికగా దోషిగా నిలబెట్టవచ్చని ఇజ్రాయెల్‌ భావించింది. అనుకున్నట్లే హమాస్‌ను టెర్రరిస్టు సంస్థగా అమెరికా చేత ముద్ర వేయించి ఎప్పుడు అనుకుంటే అప్పుడు గాజా, హమాస్‌లపై విచక్షణా రహితంగా దాడులు చేస్తూ రక్తపాతం సృష్టిస్తూ వెస్ట్‌బ్యాంక్‌లో విస్తృతంగా యూదు సెటిల్‌మెంట్లు నిర్మిస్తూ వచ్చింది. యూదు సెటిల్‌మెంట్‌లలో మితవాద, తీవ్రవాద భావాలు కలిగిన టెర్రరిస్టు యూదు జాత్యహంకార కుటుంబాలతో నింపుతూ వచ్చింది. దరిమిలా వెస్ట్‌బ్యాంక్‌, భవిష్యత్తులో పాలస్తీనా రాజధానిగా పాలస్తీనా ప్రజలు భావించిన తూర్పు జెరూసలెంలు `యూదు జాత్యహంకార టెర్రరిస్టుల ఆక్రమిత ప్రాంతం పెరుగుతూ పోగా పాలస్తీనా ప్రజల నివాస ప్రాంతాలు, పంట పొలాలు, నీటి వసతులు తరిగిపోతూ వచ్చాయి.

ఈ నేపధ్యంలో ఫతా ప్రతిష్ట దిగజారుతూ పోగా, అనేక కష్టనష్టాలకు ఓర్చుతూ రాజీలేని ప్రతిఘటనా పోరాటం చేస్తున్న హమాస్‌ ప్రతిష్ట పెరుగుతూ వచ్చింది. పాలస్తీనా ప్రజల్లో ఫతా పట్టు కోల్పోగా హమాస్‌ నికరమైన పోరాట సంస్థగా ఆవిర్భవించింది. 2000 సంవత్సరంలో మరోసారి అమెరికా మధ్యవర్తిత్వంలో ఇజ్రాయెల్‌, పాలస్తీనా ప్రతినిధుల మధ్య క్యాంప్‌ డేవిడ్‌లో చర్చలు జరిగాయి. తూర్పు జెరూసలెం భవిష్యత్తు పాలస్తీనా రాజధానిగా అంగీకరించే అంశం దగ్గర చర్చలు స్తంభించాయి. చివరికి ఎలాంటి ఒప్పందం జరగకుండానే చర్చలు ముగిశాయి. దరిమిలా పాలస్తీనా అరబ్బు ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో తిరుగుబాటు ప్రారంభించారు. ఈ తిరుగుబాటు రెండవ తిరుగుబాటు యుద్ధం (సెకండ్‌ ఇంతిఫాదా)గా చరిత్రలో రికార్డయింది. ఈ తిరుగుబాటుతో గాజా నుండి ఇజ్రాయెల్‌ సైన్యాన్ని ఖాళీ చేసేందుకు, గాజాలో నిర్మించిన ఇజ్రాయెలీ సెటిల్‌మెంట్‌లను తొలగించేందుకు ఇజ్రాయెల్‌ ప్రభుత్వం నిర్ణయించింది. 2005లో గాజాలో 21 యూదు సెటిల్‌మెంట్‌లను, వెస్ట్‌బ్యాంక్‌లో 2 సెటిల్‌మెంట్‌లను ఇజ్రాయెల్‌ ఖాళీ చేయించింది. యూదులు నివసించిన ఇళ్లను కూలగొట్టింది. గాజాను ఖాళీ చేసేందుకు చేసిన నిర్ణయాన్ని నిరసిస్తూ అప్పటి ఇజ్రాయెల్‌ క్యాబినెట్‌ మంత్రిగా ఉన్న మితవాద నేత బెంజిమన్‌ నెతన్యాహు, మంత్రి పదవికి రాజీనామా చేశాడు.

అయితే గాజా విదేశీ విధానాన్ని ఇజ్రాయెల్‌ తన గుప్పిట్లో పెట్టుకుంది. ప్రపంచంతో గాజాకు సంబంధం లేకుండా గాజా చుట్టూ సైన్యాన్ని మోహరించింది. గాజా చుట్టూ ఇనుప కంచె నిర్మించింది. ఇజ్రాయెల్‌ అనుమతి లేకుండా గాజాలో చీమ కూడా దూరకుండా కట్టుదిట్టం చేసింది. ఆ విధంగా ప్రపంచంలోనే అతి పెద్ద బహిరంగ జైలుగా గాజా స్ట్రిప్‌ అవతరించింది.

యూదు జాత్యహంకారం

2006లో జరిగిన గాజా ఎన్నికల్లో ఫతా పైన హమాస్‌ సంస్థ మెజారిటీ ఓట్లతో నెగ్గింది. అయితే గాజా అధికార పగ్గాలను హమాస్‌కు అప్పగించేందుకు ఫతా నిరాకరించటంతో రెండు సంస్థలు సాయుధ ఘర్షణకు సిద్ధపడ్డాయి. చివరికి హమాస్‌ పై చేయి సాధించటంతో గాజా పూర్తిగా హమాస్‌ పాలన కిందకు వచ్చింది. అప్పటి నుండి హమాస్‌ను టెర్రరిస్టు సంస్థగా చెబుతూ గాజా ప్రజల పైన లెక్కలేనన్ని అత్యాచారాలకు, దాడులకు, హత్యలకు, మారణకాండలకు పాల్పడిరది ఇజ్రాయెల్‌ రాజ్యం. స్వయంగా అకృత్యాలు సాగించటంతో పాటు యూదు తీవ్రవాద సంస్థలు వెస్ట్‌బ్యాంక్‌లో అక్రమ, చట్ట వ్యతిరేకమైన సెటిల్‌మెంట్ల నిర్మాణాన్ని విస్తరిస్తూ అందుకు ఆటంకంగా భావించిన ప్రతి పాలస్తీనా పౌరుడిని హత్య చేయడమో, వేధించడమో, లేదా ఏదో ఒక నేరాన్ని మోపి అమానుషమైన ఇజ్రాయెలీ జైళ్లలో కుక్కడమో చేస్తుంటారు. ఏ నేరమూ సాధ్యం కాకపోతే టెర్రరిస్టు ముద్ర వేసి జైలు పాలు చేస్తారు. టీనేజీ ఆరంభ దశలో ఉన్న అనేకమంది పాలస్తీనా పిల్లలు ఇజ్రాయెల్‌ జైళ్లలో మగ్గుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయెల్‌ జైళ్లలో పాలస్తీనా అరబ్బు ఖైదీలు అనుభవించే హింస, వేధింపులు, ఆహార లేమి, చికిత్స అందని అనారోగ్యం -ఇలా వారి యాతనలను వర్ణించటం సాధ్యం కాదు. యూదు తీవ్రవాద సంస్థలకు ఇజ్రాయెల్‌ ప్రభుత్వం సంపూర్ణ స్థాయిలో అండదండలు అందిస్తుంది. వారికి అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ తదితర పశ్చిమ రాజ్యాల నుండి నిధులు ప్రవహిస్తాయి.

గాజాపై అనునిత్యం జరిపే బాంబులు, మిసైళ్ల దాడులకు గాజా నుండి జరిగే ర్యాకెట్‌ దాడులను సాకుగా చూపిస్తుంది ఇజ్రాయెల్‌. గాజా ప్రజల మొరటుతనం గురించి, నాగరికతా లేమి గురించీ పశ్చిమ వార్తాసంస్థలు, వార్తా వెబ్‌సైట్లు చిలవలు పలవలుగా కథలు అల్లి ప్రచారంలో పెడతాయి. యూదు తీవ్రవాద కార్యకర్తలు, పార్టీలు ప్రత్యేకంగా గ్రూపులను సంస్థలను నియమించి ఇంటర్నెట్‌లో పాలస్తీనా పౌరులకు, పాలస్తీనా స్వతంత్రానికి వ్యతిరేకంగా అనేక రకాలుగా ప్రచారం (ప్రాపగాండా) చేస్తుంటారు. ఇంటర్నెట్‌లో వెబ్‌సైట్లలో, సోషల్‌ మీడియాలో పాలస్తీనా అనుకూల విశ్లేషణ గానీ, వ్యాఖ్యలు గానీ కనపడితే యూదు ప్రాపగాండిస్టులు వాలిపోయి అబద్ధాలు, అర్ధ సత్యాలు, ప్రాపగాండా కథనాలతో విరుచుకు పడిపోతుంటారు. యూదులను ఊచకోత కోసిన హిట్లర్‌ ప్రభుత్వంలో సమాచార మంత్రి గోబెల్స్‌ ప్రచార వ్యూహాల కంటే అనేక రెట్లు మించిపోయే ప్రాపగాండా సామర్ధ్యాన్ని యూదు రాజ్యం సాధించింది అంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రాపగాండాను పశ్చిమ కార్పొరేట్‌ మీడియా సంస్థలు నెత్తిన పెట్టుకుని ప్రచారం చేస్తాయి.

A Palestinian reacts as he waits to receive food from a charity kitchen, amid a hunger crisis, in Gaza City, July 28, 2025. REUTERS/Khamis Al-Rifi

గాజాలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా హమాస్‌ ఒక్కటే పోరాడటం లేదు. వివిధ ఇస్లామిక్‌ సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. పాలస్తీనియన్‌ ఇస్లామిక్‌ జిహాద్‌ (పిఐజె), ఆల్‌-ఖసమ్‌ బ్రిగేడ్స్‌ (హమాస్‌ అనుబంధ సాయుధ గ్రూపు), ఆల్‌-ఖుద్స్‌ బ్రిగేడ్‌ (పిఐజె అనుబంధ సాయుధ గ్రూపు), ఆల్‌-అక్సా మార్టిర్స్‌ బ్రిగేడ్స్‌ (ఫతా అనుబంధ సాయుధ గ్రూపు) మొదలైనవి యూదు ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఆల్‌-అక్సా మార్టిర్స్‌ బ్రిగేడ్స్‌ తాజా యుద్ధంలో మాత్రమే హమాస్‌తో కలిసి పోరాడుతున్నది. ఇతర గ్రూపుల సాయుధ కార్యకలాపాలు హమాస్‌ అదుపులో ఉండవు. తరచుగా హమాస్‌ ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ర్యాకెట్‌ దాడులు చేస్తుంటాయి. వాటితో పాటు ఇజ్రాయెల్‌ ప్రవేశ పెట్టిన విద్రోహ గ్రూపులు కూడా పాలస్తీనా ప్రజల తరపున పోరాటం పేరుతో ఫాల్స్‌ ఫ్లాగ్‌ ఆపరేషన్స్‌ నిర్వహిస్తుంటాయి. అనగా గాజా పైన ఇజ్రాయెల్‌ సాయుధ దాడి చేయాలని భావించినప్పుడు ఈ విద్రోహ గ్రూపులు హఠాత్తుగా ర్యాకెట్‌ దాడులు చేయటం, ఈ దాడి నేరాన్ని హమాస్‌ పైన మోపి ఇజ్రాయెల్‌, మిసైళ్లతో వారాల తరబడి హంతక దాడులు చేస్తుంటుంది. ఇజ్రాయెల్‌, ఐరన్‌ డోమ్‌ లాంటి మిసైల్‌ రక్షణ వ్యవస్థను పరీక్షించుకునేందుకు కూడా విద్రోహ గ్రూపుల చేత ఒక సాకు సృష్టించుకుని తీవ్రస్థాయి దాడులు చేసి వందల మంది గాజా పౌరులను బలిగొన్న ఉదాహరణలు ఉన్నాయి.

ఇలా ఏదో ఒక కారణం చూపిస్తూ వరస పెట్టి దాడులు గాజా పైన యూదు రాజ్యం ఎందుకు చేస్తుంది? ఎందుకంటే ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు మాటల్లో చెప్పాలంటే ‘శత్రువుని (పాలస్తీనా పౌరులను) కొట్టిన చోటే కొడుతూ, నిరంతరం తెంపు లేకుండా కొడుతూ ఎంతగా హింసించాలంటే వాళ్లు తట్టుకోలేక ఉన్న చోటు వదిలి పారిపోతారు. అటువంటి పరిస్థితిని పాలస్తీనా ప్రజలకు కల్పించడమే ఇజ్రాయెల్‌ దాడుల లక్ష్యం’ అని ఇజ్రాయెల్‌ ప్రధాని బహిరంగంగా కెమెరా ముందు అనేక యేళ్ల క్రితమే (2011లో) వెల్లడిరచాడు.

బ్రిటన్‌, ఫ్రాన్స్‌ చారిత్రక కుట్ర

నేటి గాజా యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా నుండి ప్రధానంగా ఆయుధాలు, నిధులు అందుతున్నాయి. అయితే అమెరికా పాత్ర రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత నుండే ప్రారంభం అయింది. చారిత్రక పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్‌ దేశాన్ని సృష్టించటానికి పథక రచన చేసి అందుకు తగిన చర్యలు తీసుకున్నదీ, అంతర్జాతీయ మద్దతు కూడగట్టిందీ బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దేశాలు.

మొదటి ప్రపంచ యుద్ధం బద్దలయ్యాక ఈజిప్టులోని బ్రిటన్‌ రాయబారి సర్‌ హెన్రీ మెక్మెహన్‌, ఆనాటి పశ్చిమ అరేబియా ప్రాంత పాలకుడు హుస్సేన్‌ బిన్‌ అలీకి ఒక ఆఫర్‌ ఇచ్చాడు. దాని ప్రకారం ఆయన ఒట్టోమన్‌ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడేందుకు కలిసి వస్తే స్వతంత్ర అరబ్‌ రాజ్య స్థాపనకు బ్రిటన్‌ సహకరిస్తుంది. అలెప్పో, డమాస్కస్‌ మధ్య రేఖకు పశ్చిమం పక్క ఉన్న ప్రాంతం మాత్రమే ఈ అరబ్‌ రాజ్యంలో ఉండదు. మిగిలిన ప్రాంతం అంతా స్వతంత్ర అరబ్‌ రాజ్యం అవుతుందని బ్రిటన్‌ (మెక్మెహన్‌) వాగ్దానం చేసింది. ఈ మేరకు మెక్మెహన్‌, హుస్సేన్‌ బిన్‌ అలీ మధ్య నెలల పాటు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. పాలస్తీనా ప్రాంతం కూడా అరబ్‌ రాజ్యంలో కలిసి ఉంటుందన్న అర్థం ఇందులో వ్యక్తం ఉంటుంది. (తీరా యుద్ధం ముగిసాక స్వతంత్ర అరబ్‌ రాజ్యంలో పాలస్తీనా భాగం కాదు అంటూ బ్రిటన్‌ నాలుక మడత పెట్టింది. మెక్మెహన్‌, హుస్సేన్‌ బిన్‌ మధ్య జరిగిన ఉత్తరాలను ప్రచురించేందుకు సైతం 1939 వరకు నిరాకరించింది) బ్రిటన్‌ మాట నమ్మి ఒట్టోమన్‌ సామ్రాజ్యాన్ని ఓడిరచటంలో హుస్సేన్‌ బిన్‌ పూర్తిగా సహకరించాడు.

అప్పటికి అరేబియా ద్వీపకల్పం ఉత్తర (హుస్సేన్‌ బిన్‌), పశ్చిమ (ఇబ్న్‌ రషీద్‌), తూర్పు (ఎమిర్‌ అబ్దెల్‌ అజీజ్‌ ఇబ్న్‌ సాద్‌ -తర్వాత సౌదీ అరేబియా రాజుగా అవతరించాడు) భాగాలుగా వివిధ అరబ్‌ పాలకుల కింద ఉన్నది. తూర్పుభాగం పాలకుడు సాద్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకుని ముగ్గురిలో సాద్‌ పక్షం వహించింది బ్రిటన్‌. సాద్‌ ఏలుబడి బ్రిటన్‌ రక్షణలో ఉంటుందని ఈ ఒప్పందంలో పేర్కొంది. ఆ విధంగా సాద్‌ దాడి నుండి హుస్సేన్‌ బిన్‌కు రక్షణ ఉంటుందన్న హామీకి తిలోదకాలు ఇచ్చింది. ఈ ఒప్పందంలోనే కువైట్‌, ఖతార్‌, యుఏఇలకు సార్వభౌమత్వం గ్యారంటీ చేసింది బ్రిటన్‌.

మే 19, 1916లో గ్రేట్‌ బ్రిటన్‌, ఫ్రాన్స్‌ ప్రతినిధులు ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ ఒప్పందం పేరు సైక్స్‌-పికాట్‌ ఒప్పందం. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసాక ఒట్టోమన్‌ సామ్రాజ్యం క్రింద ఉన్న అరబ్‌ భూభాగాన్ని బ్రిటిష్‌, ఫ్రాన్స్‌లు తమ మధ్య విభజించుకోవటం ఈ ఒప్పందం ఉద్దేశ్యం. తమ తమ ఆక్రమణలో ఉన్న భూభాగాలను తమ తమ ఇష్టానుసారం, తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఎలా కావాలంటే అలా, ప్రత్యక్ష లేదా పరోక్ష పాలిత ప్రాంతాలుగా విడగొట్టుకోవటానికి ఈ ఒప్పందం వీలు కల్పించింది. ఒట్టోమన్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తామే అప్పటి వరకు మద్దతు ఇచ్చిన అరబ్‌ జాతీయవాదం మరింత బలపడకుండా ఉండే విధంగా గ్రేట్‌ బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు తమ తమ నియంత్రణలో ఉన్న భూభాగాలలో వివిధ దేశాల సరిహద్దులను గుర్తించాయి.

సైక్స్‌-పికాట్‌ ఒప్పందం దుష్ఫలితాలను ఇప్పటికీ అరబ్‌ దేశాలు అనుభవిస్తున్నాయి. పశ్చిమాసియాలో అనంతర కాలంలో తలెత్తిన తీవ్ర హింసాకాండకు ఈ ఒప్పందమే కారణమని అరబ్‌ దేశాలు ఇప్పటికీ నిందిస్తున్నాయి. పాలస్తీనా దురాక్రమణ నుండి ఇటీవల ఐసిస్‌ పుట్టుక వరకు సైక్స్‌-పికాట్‌ ఒప్పందం పుణ్యమే అని అరబ్‌ దేశాలు భావిస్తున్నాయి. అంతేకాక ఈ ఒప్పందం హుస్సేన్‌ బిన్‌తో చేసుకున్న ఒప్పందానికి ఫక్తు వ్యతిరేకం. అరబ్‌ స్వతంత్ర రాజ్య స్థాపనకు సహాయం చేస్తామన్న ఒప్పందాన్ని తుంగలో తొక్కుతూ బ్రిటన్‌ ఇబ్న్‌ సాద్‌ను రెచ్చగొట్టి హుస్సేన్‌ బిన్‌ మీదకు దాడికి పురికొల్పింది. దరిమిలా హుస్సేన్‌ బిన్‌ రాజ్యం అంతమై సైక్స్‌-పికాట్‌ ఒప్పందం అమలుకు మార్గం సుగమం అయింది.

———–ఇంకా ఉంది

వ్యాఖ్యానించండి