
—–న్యూ డెమోక్రసీ పత్రిక నుండి, (అనువాదం: విశేఖర్, సెప్టెంబర్ 7)
తన స్వాధీన విధానం (mode of acquisition) లో మరియు తన సౌఖ్యాలలో ద్రవ్య కులీన వర్గం అన్నది, బూర్జువా సమాజం సమున్నత స్థాయిలో, లంపెన్ కార్మిక వర్గం తిరిగి పునర్జన్మ పొందడమే. -కారల్ మార్క్స్
———-
డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ రంధిలో పడ్డాడు. టారిఫ్ లు మోపడం అంతలోనే వాటిని స్తంభింపజేయటం, వివిధ దేశాల నుండి వచ్చే దిగుమతుల పైన టారిఫ్ రేట్లు పెంచటం మళ్ళీ అంతలోనే వాటిని తగ్గించటం! చూసేందుకు పిల్ల చేష్టల వలే ఉన్నా, ఆ పిల్లాడు ప్రపంచం లోనే అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థను నడిపిస్తున్నాడు మరి! అత్యంత ప్రమాదకరమైన బొమ్మని చేతిలో ఉంచుకున్న ఒక దారితప్పిన పిల్లాడు! లేక ఆ యుక్తి చేష్టలు, గాల్లో చేతులూపడం, అవన్నీ పాత మాయల మరాఠీకి మల్లే, కనికట్టుతో ఒక మ్యాజిక్ ని సృష్టించటంలో భాగమా. ఇతర దేశాల పైన ప్రకటించిన టారిఫ్ యుద్ధం వెనుక దాగిన నిజమైన లక్ష్యం ఏమై ఉంటుంది. ఒక్క దెబ్బతో అనేక పిట్టలని కొట్టడానికి చేస్తున్న ప్రయత్నమా? లేక ఏ ఎదురులేని అమెరికా సామ్రాజ్యవాదం పోషణలో తను పుట్టి పెరిగి సంపన్నుడుగా అవతరించాడో ఆ అమెరికన్ ఆధిపత్యంలోనే తానింకా జీవిస్తున్నానని కలలు కంటున్న ఆధునిక డాన్ క్విక్జోట్ గా భావిస్తున్నాడా?
రెండో సారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నపుడు ట్రంప్ మొదటి సారి అధ్యక్ష పదవికి చేసిన వాగ్దానాలకు అదనంగా రెండు హామీలు ఇచ్చాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా) నినాదం కింద పారిశ్రామిక ఉత్పత్తిని తిరిగి అమెరికాకు రప్పిస్తానని చెప్పాడు. ఈ రెండు హామీల లక్ష్యం ఏమిటంటే మొదటిది: పన్నులను తెగ్గోయటం ద్వారా కార్పొరేట్ సూపర్-ధనిక వర్గాలకు భారీ బహుమానం అందజేయటం, రెండవది: అమెరికా ఎదుర్కొంటున్న కోశాగార లోటు మరియు ఋణ భారాన్ని తగ్గించటం. కానీ పరిస్ధితి ఎప్పటిలాగే మిగిలిపోయింది. ఏమన్నా మార్పు వచ్చిందీ అంటే అది పన్నుల కోత వలన కోశాగార లోటు మరింత పెరగటమే తప్ప తగ్గటం అనేది ఉండదు. సాధారణ అంచనా ఏమిటంటే పన్నుల కోత ద్వారా పొదుపు చేసిన మొత్తాన్ని ఆర్ధిక కార్యకలాపాలను పెంచటం తద్వారా పన్నుల పునాదిని మరింత విస్తృతం చెయ్యటం. అటువంటి అంచనా మరిన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా మార్కెట్ విస్తృతి పెరుగుతుండడం, దానితో పాటు పోటీ కూడా పెరుగుతుండడం అన్నవి ఒక కాల క్రమంలో మాత్రమే జరుగుతాయి తప్ప ఒకరి అవసరాలకు, హామీలను బట్టి జరిగేవి కావు. అది కూడా అన్ని పరిస్ధితులు అనుకూలంగా ఉంటేనే జరుగుతాయి.
తక్షణ సందర్భంలో చూసినట్లయితే, కోశాగార లోటు తగ్గాలంటే ఆదాయం లేదా రెవెన్యూ అన్నా పెరగాలి లేదా ఖర్చులైనా తగ్గించుకోవాలి. రెండో అంశం, తన ఒకప్పటి మిత్రుడు ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి నేతృత్వంలో డిపార్ట్^మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DoGE – ప్రభుత్వ సామర్ధ్య విభాగం) ని నెలకొల్పడం. ఈ మొత్తం వ్యవహారం ముత్యాలను సేకరించాలని తలపెట్టి చివరికి చివరికి చిన్న చిన్న వేరుశనగల్ని పోగు చేయటంతో ముగిసిపోయింది. అది చివరికి కుక్కకు పట్టిన గతే అయింది; కుక్కలను అవమానించే ఉద్దేశ్యం ఇక్కడ ఎంత మాత్రం లేదని గమనించాలి. ఈ పిచ్చివాడు తల పెట్టిన కార్యం (ఉపయోగం లేని పని అర్ధం) నుండి వివేక్ రామస్వామి త్వరలోనే బైట పడ్డాడు. అమెరికా ఆర్ధిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల నుండి తప్పించుకునేందుకు తల పెట్టిన ఈ విపత్కార్యాన్ని కళ్ళారా చూసేందుకు మస్క్ అందులోనే కొనసాగాడు. ఆనక అందులో నుంచి బయటపడి ట్రంప్ వ్యతిరేకిగా మారాడు.
ఖర్చుల్లో భారీ మొత్తాన్ని ఎలా తగ్గించాలి అన్న విషయంలో ఏం చెయ్యాలో తెలియని సంకట స్థితిలో DoGE కొట్టుమిట్టాతుండగానే, ట్రంప్ తన మరో హామీ అయిన సూపర్ ధనవంతులకు పన్నుల కోత హామీని అమలు చేసే పనిలో ఒక బిల్లు తయారు చేసి దానికి “బిగ్ బ్యూటీఫుల్ బడ్జెట్” అని పేరు పెట్టాడు. ఈ బిల్లు కార్పొరేషన్ల పైనా, సూపర్ రిచ్ వ్యక్తుల పైనా పన్నులను తగ్గించింది. కొన్ని అంచనాల ప్రకారం ఈ పన్ను కోతల వలన అమెరికా అప్పు రానున్న పదేళ్ళలో మరో 5 ట్రిలియన్ డాలర్లు పెరుగుతుంది. పార్లమెంటు నుండి ఎలాగోలా ఈడ్చుకొచ్చిన ఈ బడ్జెట్ లో సోషల్ వెల్ఫేర్ చర్యల్లో కోత విధించినప్పటికీ ట్రంప్ గానీ, ఆయన కార్పొరేట్ లబ్దిదారులు గానీ ఆశించినంత తీవ్ర స్థాయిలో కోతలు పెట్టలేకపోయింది. బడ్జెట్ పైన చర్చలు జరుగుతున్నప్పుడు రిపబ్లికన్ పార్టీ సభ్యులు, బడ్జెట్ లో విధించిన పన్నుల కోత వలన ప్రభుత్వం పైన చాలా కొద్ది భారం పడుతుందని వాదించారు. తీరా బడ్జెట్ ఆమోదం పొందాక “అమ్మో ఈ పన్నుల కోతలు అత్యధికంగా ఉన్నాయి” అని గుండెలు బాదు కోవటం మొదలు పెట్టారు. ఎలాన్ మస్క్ అయితే హడావుడిగా ప్రభుత్వాన్ని వదిలి పెట్టి వెళ్లిపోయాడు. ట్రంప్ మాత్రం బురద ఒంటినిండా ఎప్^స్టీన్ ఉదంతం తాలూకు బురదతో మిగిలిపోయాడు. ఈ బురదని వదిలించుకోవటానికి ట్రంప్ ఒంటిని ఎంత విదిలించుకుంటే అంత గట్టిగా ఒంటికి అంటుకు పోతున్నది.
రెవిన్యూ ఆదాయం పెంచుకునే వ్యవహారం గురించి చూస్తే, ట్రంప్ తన ఎన్నికల ప్రచారం నుండే టారిఫ్ లను పెంచే ప్రతిపాదన చేస్తూ వచ్చాడు. ఇతర దేశాల ధోరణి వలన టారిఫ్ పెంచాల్సి వస్తుందని చెబుతూ వచ్చాడు. కొన్ని దేశాలు అమెరికా విధానాల్ని తమకు అనుకూలంగా మార్చుకున్నాయని, తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్ లో అమ్ముకుంటూనే అమెరికా ఉత్పత్తులకు తమ తమ మార్కెట్లలో సమాన అవకాశాలు ఇవ్వటం లేదని ఆరోపిస్తున్నాడు. సుంకాలు (టారిఫ్ లు) పెంచటం ద్వారా రెండు లాభాలు చేకూరుతాయని ట్రంప్ చెప్పాడు. ఒకటి: పెంచిన సుంకాలు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి తద్వారా కోశాగార లోటు తగ్గిస్తాయని చెప్పాడు. రెండు: విదేశీ సరుకులను ప్రియం చేయటం ద్వారా అమెరికాలో దేశీయ ఉత్పత్తులకు ప్రోత్సాహం అందుతుందని ఆశించాడు. (ఇది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంలో భాగం -అను) అయితే ఈ సులభమైన పరిష్కారాలు, అమెరికా నుండి పరిశ్రమలు చీప్ లేబర్ తో పోటీ పడగల ఉత్పాదకత సంపాదించిన దేశాలకు తరలి వెళ్ళడం వెనుక ఉన్న అసలు సమస్యల గురించి పట్టించుకోలేదు. గతంలో అమెరికా మాన్యుఫాక్చరింగ్ రంగంలో సూపర్ పవర్ గా ఉండేది. అంతకంతకూ విస్తృతమవుతున్న మార్కెట్ ని కలిగి ఉండేది. అలాంటి గతంలో అమలు చేసిన విధానాలను అరువు తెచ్చుకున్న ట్రంప్, ఆ గతాన్ని పునరుద్ధరించలేని బలహీన స్థితిలో ఉన్నానన్న సంగతిని విస్మరించాడు. అప్పటి నుండి ద్రవ్య పెట్టుబడి చాలా దూరం ప్రయాణించింది. అంతరించి పోతున్న ధనరాశులు, కష్టంగా నెట్టుకొస్తున్న వర్తమాన కాలం.. ఇలాంటి పరిస్ధితుల మధ్య సతమతమవుతున్న వారికి గతం పైన వ్యామోహం పెంచి వారి దృష్టి మరల్చటం తేలికైన పని కావచ్చు; తమ కోసం భారీ ఆస్తులను పోగు చేసుకుంటూ, ప్రజా రాశులను మాత్రం గతకాలపు ఊహాత్మక గొప్పతనపు భ్రమల్లో ముంచే తిరోగమన పాలకులు సాధారణంగా ఇలాంటి మోసపూరిత విధానాలకు పాల్పడటం కద్దు. వర్తమానం నుండి తమ కోసం గరిష్ట స్థాయిలో ఆస్తులు సంపాదించుకుంటూ పెద్ద సంఖ్యలో ఉన్న శ్రామిక ప్రజలను మాత్రం గతించి పోయిన కాలాలకు ఎరగా వేయటం వీరికి వెన్నతో పెట్టిన విద్య.
సుంకాలు, సకల రోగాలను నివారించే పరమౌషధంగా ట్రంప్ తన చేత ధరిస్తున్నాడు. ఆయన సుంకాలు నిజానికి అనేక లక్ష్యాలను నెరవేర్చుతాయి. వాటిలో ముఖ్యమైన లక్ష్యం ప్రభుత్వ రెవిన్యూను పెంచి తద్వారా సూపర్ ధనిక వర్గానికి తగ్గించే పన్నులను పూడ్చటం. అనగా సామాన్య ప్రజల ప్రయోజనాలకు గండి కొట్టి సూపర్ ధనిక వర్గాలకు లబ్ది చేకూర్చటం. ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు సగటు సుంకాలు కేవలం 2.4 శాతం కాగా ఇప్పుడు అది సగటున 18 శాతానికి చేరింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. కొన్ని అంచనాల ప్రకారం దీని వలన కమోడిటీ ల ధరలు అదనంగా మరో 2% పెరగనున్నాయి. ద్రవ్యోల్బణం ఇప్పటికే పైకి చూస్తున్నది. అమెరికాలో ఉత్పత్తికి పట్టే ఖర్చుకూ, గ్లోబల్ సౌత్ దేశాలలో ఉత్పత్తి ఖర్చుకూ భారీ వ్యత్యాసం ఉన్న నేపధ్యంలో ఈ సుంకాలు అమెరికాలో దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించే అవకాశాలు లేవు. కంపెనీలు ఫ్రంట్ లోడింగ్ పైన దృష్టి పెట్టడం వలన సుంకాల ప్రభావం కనిపించటానికి కొంత సమయం పడుతుంది. ఫ్రంట్ లోడింగ్ అంటే టారిఫ్ లు పెరుగుతాయన్న అంచనాతో వివిధ స్టాక్ లను (షేర్లను) ముందే కొని పెట్టుకోవడం. దీని ప్రభావం మార్కెట్ పై పడేందుకు మరికొంత కాలం పడుతుంది. టారిఫ్ లో కొంత భారాన్ని కంపెనీలు అనగా ఉత్పత్తిదారులు మరియు/లేక పంపిణీదారులు, తమ లాభాల్లో కొంత తగ్గించుకుని తద్వారా తమ మార్కెట్ ను కాపాడుకోవటం ద్వారా భరించవచ్చు. కానీ పాక్షికంగానైనా వినియోగదారుల పైకి మళ్లించకుండా ఉండవు.
టారిఫ్ కోతలను ఎవరు భరిస్తారు అన్న అంశాన్ని పరిశీలించిన ఒక సిఎన్ఎన్ నివేదిక ప్రకారం, జూన్ 2025 వరకు 22 శాతం టారిఫ్ లను వినియోగదారుల పైకి తరలించ బడింది. అక్టోబర్ 2025 నాటికి ఇది 67 శాతానికి చేరవచ్చు. స్పెల్-ఓవర్ ప్రభావం వలన అనగా దేశీయ ఉత్పత్తిదారులు కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచే అవకాశం ఉన్నందున (దిగుమతుల ధరలు పెరిగినప్పుడు వాటిపై ఆధారపడిన ఉత్పత్తుల ధరలను పెంచక తప్పదు -అను) ఈ భారం 100 శాతం వరకు చేరే అవకాశం ఉన్నది. దిగుమతి చేసుకున్న సరుకుల ప్రస్తుత ధరలు టారిఫ్ ముందటి కాలం కంటే 5 శాతం అధికం కాగా దేశీయంగా ఉత్పత్తి చేసిన సరుకుల ధరలు టారిఫ్ ముందరి కాలం కంటే 3 శాతం అధికంగా ఉన్నాయి. గ్రహ పరికరాలు, లినెన్, టూల్స్, బొమ్మలు, స్పోర్ట్ సరుకులు మొదలైన వాటిని సాధారణ ప్రజలు రోజువారీ వినియోగిస్తారు. వీటి ధరలు పెరగనున్నాయి. నివేదిక ప్రకారం ట్రంప్ చెప్పినదానికి భిన్నంగా టారిఫ్ ముందరి ధరలు కొన్నిటికి పెరగకుండా ఫ్లాట్ గా ఉండగా చైనా నుండి దిగుమతి అయ్యే సరుకుల ధరలు కొన్ని తగ్గాయి కూడాను. ఇలా తగ్గిన మరియు ఫ్లాట్ గా ఉన్న సరుకుల ధరలు కూడా టారిఫ్ అనంతరం పెరిగాయని నివేదిక తెలిపింది.
ఇతర దేశాల విధానాలపై కేకలు వేస్తూ పెడబొబ్బలు పెట్టడం మాటున ట్రంప్, అమెరికన్ సాధారణ ప్రజలపై పెను భారాన్ని మోపుతున్నాడు. (గత పాలకుల కాలంలో) సాధారణ అమెరికా ప్రజల జీవన ఖర్చులు పెరిగిన ఫలితంగానే తాను తిరిగి అధికారం లోకి వచ్చానన్న సంగతిని ట్రంప్ మర్చి పోయాడు లేదా ఆ సంగతి గుర్తు పెట్టుకునే అవసరం ట్రంప్ కి లేకుండా పోయింది. ఆరంభంలో మూడో సారి కూడా అధ్యక్ష పదవి చేపడతానని ప్రగల్భాలు పలికిన ట్రంప్ ఇప్పుడు ఆ ఆశ వదులుకున్నాడు.
అయితే టారిఫ్ ల లక్ష్యం ఇదొక్కటే కాదు. ఇతర దేశాలతో వాణిజ్యాన్ని సమతూకం చేయాలని ట్రంప్ చిరకాలంగా బోధలు చేస్తున్నాడు. తమ మార్కెట్ ను ఆశగా చూపిస్తూ ఇతర దేశాల చేత బలవంతంగా ఐనా అమెరికా సరుకులు సేవలను కొనుగోలు చేయించాలని ట్రంప్ తలపోశాడు. నిజానికి ఆయన విధించిన ప్రతీకార టారిఫ్ లలో ప్రతీకారం అనేదేమీ లేదు; కేవలం బలహీన దేశాలను బ్లాక్ మెయిల్ చేయటమే ఉన్నది. తమ ఉత్పత్తుల ఎగుమతుల కోసం అమెరికా మార్కెట్ల పై ఆధారపడిన దేశాలు, అమెరికా పెట్టుబడి (ఇన్వెస్ట్‌మెంట్) పైన ఆధారపడిన దేశాలు, అమెరికా పెట్టుబడికి ముడి వేయబడి ఉన్న దళారీ పెట్టుబడిదారులు కలిగి ఉన్న దేశాలు అమెరికా చేస్తున్న బ్లాక్ మెయిల్ కి లొంగిపోయేందుకు అధిక అవకాశాలు ఉన్నాయి. తమ తమ ఆర్ధిక వ్యవస్థలలో అమెరికాతో వాణిజ్యం భాగం అంత ప్రాముఖ్యంగా లేనప్పటికీ, అక్కడి దళారీ పెట్టుబడిదారులు అమెరికన్ సామ్రాజ్యవాద పెట్టుబడితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నందున ఆ దేశాలు అమెరికా సామ్రాజ్యవాదుల ముందు తల వంచక తప్పదు.
ఇతర దేశాలతో అమెరికాకు ఉన్న వాణిజ్య లోటు అంతా కూడా ఇతర దేశాలు విధిస్తున్న సుంకాల వల్లనే అని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తున్నది. తమ ఉత్పత్తుల అధిక ధరలు లేదా నాసిరకం క్వాలిటీ కలిగిన తమ ఉత్పత్తులు లేదా దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేయటం పట్ల ఉన్న ఎలాంటి స్థిర నిర్ణయాలైనా… ఇలాంటి టారిఫేతర కారణాలు వేటినీ ట్రంప్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవటం లేదు. ఒక దేశంతో ఉన్న వాణిజ్య లోటు ఆధారంగా వివిధ దేశాలపై విధించాల్సిన టారిఫ్ లను ట్రంప్ ప్రభుత్వం లెక్క కట్టింది. అమెరికాకు వాణిజ్య మిగులు కలిగి ఉన్న యుకె, ఆస్టేలియా దేశాల పైన అత్యల్ప టారిఫ్ 10 శాతం విధించటాన్ని ఒక అమలు సూత్రంగా ట్రంప్ ప్రభుత్వం మార్చి వేసింది. ఆ తర్వాత అమెరికాకు వాణిజ్య లోటు ఉన్నప్పటికీ అమెరికా నుండి సరుకుల కొనుగోలు పెంచేందుకు, అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిన దేశాలను ఒక కేటగిరీ క్రింద చేర్చారు. ఉదాహరణకి యూరోపియన్ యూనియన్, అత్యంత చౌక ధరకు లభించే రష్యన్ గ్యాస్ వదులుకుని అత్యంత ఖరీదైన అమెరికన్ గ్యాస్ ను 750 బిలియన్ డాలర్ల మేరకు కొనుగోలు చేసేందుకు, అమెరికా ఆర్ధిక వ్యవస్థలో 600 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. ఐరోపా దేశాలు, జపాన్, సౌత్ కొరియా మొ.వి ఈ కేటగిరీ కిందికి వస్తాయి. ఈ దేశాల నుండి వచ్చే సరుకుల పైన 15 శాతం టారిఫ్ ను అమెరికా విధించింది.
ఇతర దేశాలతో, వివిధ భౌగోళిక-రాజకీయ పరిస్ధితులను బట్టి ఆయా దేశాల నుండి ఎంత మేరకు టారిఫ్ లు పిండుకోవాలి అన్న దాన్ని నిర్ణయించే ఎత్తుగడలను అమెరికా చేపట్టింది. ప్రాధమిక లక్ష్యం ఏమిటంటే తమ తమ మార్కెట్లను అమెరికా దోపిడీకి అనువుగా మరింతగా తెరిచే విధంగా ఒత్తిడి తేవటం, మరిన్ని అమెరికా సరుకులు, సేవలను కొనుగోలు చేసేలా బలవంత పెట్టడం. వివిధ దేశాల మధ్య టారిఫ్ లలో తేడా ఎందుకంటే తమ దేశాలలో వేతనాలను మరింత తగ్గించేసి, ఇప్పటికే దరిద్రంలో బ్రతుకుతున్న కార్మిక వర్గాన్ని మరింత దరిద్రం లోకి నెట్టి వేసి నిరంతరం అత్యల్ప వేతనాలు మరియు వేతనాల లేమి మధ్య కొట్టుమిట్టాడే పరిస్ధితికి వారిని నెట్టి తద్వారా తమ ఉత్పత్తుల ధరలను తగ్గించడంలో తమలో తాము పోటీ పడే విధంగా ప్రోత్సహించటం ట్రంప్ అమెరికా లక్ష్యం.
ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా అమెరికన్ డాలర్ స్థాయి నీరుగార కుండా నిరోధించటంలో ట్రంప్ ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగానే కృషి చేస్తున్నది. నిజానికి డాలర్ ఇప్పటికే మెల్లగా పతన దిశగా పయనిస్తున్నది. గత దశాబ్ద కాలంలో 12% మేరకు డాలర్ క్షీణించింది. ఈ పతనం అమెరికా లోటును భారీ మొత్తంలో డాలర్‌లను ముద్రించటం ద్వారా ప్రపంచ వ్యాపిత దేశాలు ఇముడ్చు కోవటానికి సహకరిస్తుందని, అనగా కమోడిటీ ధరల్లో ఎలాంటి ప్రతికూలత ఎదురైనా దాని ప్రభావాన్ని నిరోధించి వాటిని వివిధ దేశాల నుండి పొందటానికి సహకరిస్తుందని గత అధ్యక్షులకు మల్లే డొనాల్డ్ ట్రంప్ కు కూడా తెలుసు. ఈ క్రమంలో గత అధ్యక్షులకు మల్లే ట్రంప్ కూడా బ్రిక్స్ దేశాలు డాలర్ కు ప్రత్యామ్నాయంగా మరొక ప్రపంచ రిజర్వ్ కరెన్సీని సృష్టించటానికి వ్యతిరేకంగా సదరు కూటమి పై అక్కసు వెళ్ల గక్కుతున్నాడు. డాలర్ కు ప్రత్యామ్నాయ కరెన్సీ సృష్టించటానికి ప్రయత్నిస్తే బ్రిక్స్ కూటమి దేశాలకు అమెరికా మార్కెట్ లో ప్రవేశం లేకుండా చేస్తానని బెదిరిస్తున్నాడు.
ఇందులో భౌగోళిక వ్యూహాత్మక అంశాలు మరియు అమెరికా కార్పొరేట్ ప్రయోజనాలు కూడా ముఖ్యమైనవే. ఉదాహరణకి తమ భౌగోళిక వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఇటీవల బ్రిక్స్ కూటమిలో చేరిన ఈజిప్టు, ఇథియోపియా దేశాల పైన తక్కువ టారిఫ్ రేట్‌లను ట్రంప్ విధించాడు. యుఏఇ దేశం చమురు వాణిజ్యంలో, పెట్టుబడిని ఇన్వెస్ట్ చేయటంలో ఒక ముఖ్యమైన దేశం. అమెరికా భారీ స్థాయిలో ఆంక్షలు విధించిన రష్యా, మరియు ఇరాన్ దేశాలతో అమెరికా వాణిజ్యం దాదాపు లేదని చెప్పవచ్చు. బ్రిక్స్ కూటమిలో ఇటీవల చేరిన మరొక దేశం ఇండోనేషియా. ఈ దేశం పైన కూడా అమెరికా చాలా తక్కువ టారిఫ్ లు విధించింది. ఎందుకంటే ఈ దేశం ఎగుమతి చేసే పామాయిల్, కొకోవా, రబ్బర్ లు అమెరికాకు అవసరం. ఫలితంగా ఇండోనేషియాకు కొన్ని రాయితీలు కూడా అమెరికా ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే ఇండోనేషియాతో అమెరికా వాణిజ్యం ఏమంత పెద్ద మొత్తం కాదు. అమెరికాకు వాణిజ్య మిగులు ఉన్న సౌత్ ఆఫ్రికా పైన ఏకంగా 30 శాతం టారిఫ్ ను అమెరికా విధించింది. తెల్ల జాతి పౌరుల పైన సామూహిక హత్యాకాండను సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం అమలు చేస్తున్నదని ఆరోపిస్తూ కూడా 30 శాతం కు మించి టారిఫ్ విధించ లేదు. తెల్ల జాతి పౌరులపై హత్యాకాండ కేవలం డొనాల్డ్ ట్రంప్, ఆయన మిత్రుడు ఎలాన్ మస్క్ లకు తప్ప ఎవరికీ కనిపించకపోవడం ఒక విడ్డూరం. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ముడి ఇనుము, బొగ్గు, ముత్యాలు, వజ్రాలు వ్యవసాయ ఉత్పత్తులు, మెషినరీ, మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తులు మొదలైన సరుకులను సౌత్ ఆఫ్రికా ఎగుమతి చేస్తుంది గనుక.
———-ఇంకా ఉంది