ట్రంప్ టారిఫ్ మేనియా -పార్ట్ 2


——-మొదటి భాగం తరువాత

ప్రధాన ఆర్ధిక పోటీదారు అయిన చైనా దానికదే ఒక కేటగిరీ. చైనా ఉత్పత్తుల పైన 145 శాతం టారిఫ్ లు విధిస్తానని ఒకప్పుడు బెదిరించినప్పటికీ చివరికి 30 శాతం టారిఫ్ తో ట్రంప్ సరిపెట్టాడు. 30 శాతం టారిఫ్ నే ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు. చైనా ఉత్పత్తులు అమెరికా మార్కెట్లకు దిగుమతి కాకుండా నిరోధించటంలో అమెరికాకి ఉన్న పరిమితులను ఇది వెల్లడి చేసింది. అరుదైన ఖనిజ పదార్ధాల లభ్యతలో చైనా దాదాపు గుత్తస్వామ్యం కలిగి ఉండటమే దానికి ముఖ్య కారణం. అనేక వృద్ధి చెందుతున్న రంగాలలో ఈ ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తాయి. రక్షణ పరిశ్రమకు కూడా ఇవి అత్యవసరం. అంతేకాక, చైనా చేసే అనేక సరుకుల ఉత్పత్తుల యొక్క సరఫరా చెయిన్ లలో అమెరికన్ కార్పొరేట్ కంపెనీలు పీకల దాకా మునిగి ఉండటం వలన చైనాపై చేయి వేసే పరిస్ధితి అమెరికాకు లేదు. హై-టెక్ ఛిప్ లు చైనాకు ఎగుమతి చేయకుండా అమెరికా ఆరంభంలో నిషేధం విధించింది. కానీ అమెరికా కంపెనీలు చైనా ఉత్పత్తి చెయిన్ లో మునిగి ఉన్నందున ఎన్విడియా, ఏఎఫ్ఎం లాంటి అత్యున్నత స్థాయి టెక్ కంపెనీల ఛిప్ లను చైనాకు ఎగుమతి చేసేందుకు అనుమతించక తప్ప లేదు. చైనా సాంకేతిక అభివృద్ధిని ఎంతో కొంత ప్రభావితం చేయగలిగినప్పటికీ దానిని నిరోధించటం మాత్రం తన వల్ల కాదని అమెరికా కఠిన మార్గంలోనైనా తెలుసుకోవాల్సిన దుస్థితికి నెట్టబడింది.

50% అత్యధిక టారిఫ్ కు లక్ష్యాలుగా ఇండియా, బ్రెజిల్ దేశాలు తేలాయి. ఇండియాపైన విధించిన 50 శాతం టారిఫ్ లో 25 శాతం, రష్యా నుండి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు శిక్షగా విధించినట్లు అమెరికా ప్రకటించింది. బ్రెజిల్ తో అమెరికా వాణిజ్య మిగులు కలిగి ఉన్నప్పటికీ 50 శాతం టారిఫ్ విధించింది. కాబట్టి బ్రెజిల్ పైన విధించిన అత్యధిక టారిఫ్ కు రాజకీయ లక్ష్యం ఉన్నది. బ్రెజిల్ ని ఏలుతున్న లూలా ప్రభుత్వాన్ని ఒంటరిని చేసే లక్ష్యంతో ఆ దేశంపై అత్యధిక టారిఫ్ విధించింది. బ్రెజిల్ లో అమెరికాకు మద్దతు ఇచ్చే ధనిక వర్గం పెద్ద సంఖ్యలో ఉన్నది. ఈ వర్గం అమెరికాకు విధేయంగా ఉంటూ అమెరికాతో మిత్రత్వం కలిగి ఉండాలని కోరుకుంటుంది. అమెరికా అనుకూల మరియు ప్రతికూల ప్రాతిపదికన బ్రెజిల్ సమాజం సైతం చీలి ఉన్నది. అత్యధిక టారిఫ్ ల ద్వారా లూలా ప్రభుత్వ వ్యతిరేక వర్గానికి రాజకీయ మద్దతు అందించటం అమెరికా లక్ష్యం. ఇండియాను “టారిఫ్ కింగ్” గా పిలుస్తూ, రష్యా చమురు దిగుమతి చేసుకుంటున్న దేశంగా ఇండియాను ఒంటరిని చేసి అత్యధిక టారిఫ్ లను ట్రంప్ విధించాడు. గత కొన్నేళ్లుగా ఇండియా అమెరికాపై ఆధారపడటం పెరుగుతూ వచ్చింది. ఈ పరాధీనతనే ట్రంప్ ఆయుధంగా ఉపయోగిస్తున్నాడు. “అబ్ కీ బారీ ట్రంప్ సర్కార్” అంటూ ట్రంప్ మెప్పు కోసం ఊగిన వారంతా లేదా భారత దేశం నుండి అమెరికా వలస వచ్చిన వారిని ట్రంప్ కు ఓటు వేసేందుకు శ్రమించిన ఆర్ఎస్ఎస్ మద్దతు దారులంతా తమ ప్రయత్నాలు అర్ధరహితంగా మిగిలిన సంగతి, తాము కేవలం అభ్యర్ధించే వారమే తప్ప మరొకటి కాదన్న సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చినట్లయింది.

ఇండియాపై ట్రంప్ టారిఫ్ ల గురించి వ్యాఖ్యానించే ముందు, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో బహుళ పక్ష విధానం రద్దయిందని అధికారికంగా ప్రకటించి, డబల్యూ‌టి‌ఓ లాంటి వేదికలు ఇక ఎంత మాత్రం చెల్లుబాటు కాబోవని స్పష్టం చేసి తద్వారా ప్రతి ఒక్క దేశాన్ని అమెరికాతో విడివిడిగా (వాణిజ్య) చర్చలు జరపాల్సిన పరిస్ధితికి నెత్తిన సంగతిని దృష్టిలో ఉంచుకోవాలి. లాభాల రేటు తగ్గిపోతున్న నేపధ్యంలో చైనా లోనూ అంతకు మునుపు సోవియట్ రష్యా లోనూ సోషలిజం అంతం అయిన నేపధ్యంలో, సోవియట్ సోషల్ సామ్రాజ్యవాద శిబిరాన్ని సైతం రష్యా రద్దు చేసుకున్న నేపధ్యంలో, అమెరికా నేతృత్వం లోని సామ్రాజ్యవాద దేశాలు “ప్రత్యామ్నాయం లేదు” (దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్‌ – టిఐఎన్ఏ) అన్న నినాదం కింద సామ్రాజ్యవాద ప్రపంచీకరణను ప్రపంచ దేశాలపై రుద్దాయి. స్వేచ్ఛా పూరిత పెట్టుబడుల ప్రవాహం ద్వారా గరిష్ట లాభాలను గుంజుకుని మిగులును పిండుకోవటానికి అప్పటి వరకు ప్రవేశం లేని చోట్ల ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ లో మార్గాలు బలవంతంగా తెరిపించింది.

అమెరికా ఒక్కటే ఆధిపత్యం కలిగి ఉన్న ఏక ధృవ ప్రపంచంలో ఈ సామ్రాజ్యవాద ప్రపంచీకరణ చోటు చేసుకుంది. “21వ శతాబ్దంలో ప్రపంచాన్ని సొంతం చేసుకునేందుకు” సకల ప్రయత్నాలు చేసినప్పటికీ పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థల అసమాన అభివృద్ధిని నిరోధించటంలో గానీ, అమెరికా సామ్రాజ్యవాద ఏకచ్ఛత్రాధిపత్యాన్ని కొనసాగింప చేయటంలో గానీ సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విఫలం అయింది. ఫైనాన్షియల్ బుడగలతో ఆర్ధిక వనరులు సమకూర్చి ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్ లపై జరిపిన దురాక్రమణ పూరిత సామ్రాజ్యవాద దాడి ఎదురు దెబ్బలు తిన్నది. ఆర్ధిక బుడగలు బద్దలై 2008 ఆరంభం నుండి ఆర్ధిక వ్యవస్థలను కబళించిన ప్రపంచ స్థాయి ద్రవ్య ఆర్ధిక సంక్షోభంతో “నాగరికతల అంతం” కాస్తా అంతం కావటానికి దారి తీసింది. ఏక ధృవ ప్రపంచ క్షీణత వేగం పుంజుకోవటం మొదలయింది.

గరిష్ట లాభాలను సొంతం చేసుకునే లక్ష్యం కలిగిన నయా-ఉదారవాదం, స్తంభిత మార్కెట్లు లేదా సాపేక్షికంగా మెల్లగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు మరియు సాంకేతిక పరిజ్ఞానం వేగంగా వృద్ధి చెందుతున్న కాలంలో, తక్కువ వేతనాల రేట్లు కలిగిన దేశాలకు, అది కూడా యౌవనులైన, విద్యాధికులైన మరియు సుశిక్షితులైన కార్మిక జన పునాది కలిగిన దేశాలకు ప్రాధాన్యత చేకూరి, ఆ దేశాలకు ఉత్పత్తి ప్రక్రియ తరలిపోవటానికి కారణం అయింది. దీనితో పాటు కేపిటల్ గెయిన్స్ పై పన్నులు మరియు సంపదలపై పన్నుల కోతల ద్వారా పెట్టుబడి సొంతదారులు మిగులులో అత్యధిక భాగాన్ని లాభాలుగా తరలించుకు పోగలిగారు. పెట్టుబడి ఔట్ లే లు, సాంకేతిక పరిజ్ఞానంలో ఆధిపత్యం, మేధో సంపత్తి హక్కులపై గుత్తాధిపత్యం మున్నగు అంశాలు సామ్రాజ్యవాద పెట్టుబడి అంతకంతకూ ఎక్కువగా లాభాలను విదేశాల్లో ఉత్పత్తిని తరలించటం ద్వారా దోపిడీ చేయగలిగాయి. ఉత్పత్తిని తిరిగి అమెరికాకు తరలించాలంటూ ట్రంప్ పిలుపు ఇవ్వటం అంటే నానాటికీ ముదురుతున్న ప్రపంచ పోటీలో ఉత్పత్తి ఖర్చు మరింత పెరిగిపోనున్నదని అర్ధం.

తమ తమ ఆర్ధిక వ్యవస్థలలో అలజడి, సంక్షోభం ఏర్పడకుండా ఉండటానికి అనేక దేశాలు అమెరికా విధించిన ప్రతికూల షరతులను అంగీకరించాయి. అంత మాత్రాన ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలు పెంచుకోవటం మరియు తమ సొంత వాణిజ్య బ్లాక్ లు ఏర్పాటు చేసుకోవటం లాంటి ప్రతి చర్యలకు ఆ దేశాలు పాల్పడబోవని అర్ధం కాదు. తమకు పట్టిన తుప్పును వదిలించుకోవటం అంత తేలికైన విషయం కాదు గానీ కొన్ని రంగాలు ప్రభుత్వం నుండి మద్దతు పొందే అవకాశం ఉన్నది. అల్యూమినియం మరియు స్టీల్ రంగాలపై అధిక టారిఫ్ లు కొన్ని రంగాలకు మాత్రమే ఉపకరిస్తాయి. ఉత్పత్తిని తిరిగి అమెరికాకు తరలించాలన్న ట్రంప్ పిలుపు చివరికి కేవలం పొగమంచు తెర లాగే మిగిలిపోతుంది. మహా అయితే కొన్ని దేశాలు అమెరికా నుండి దిగుమతులు పెంచుకోవటానికి దారి తీయవచ్చు.

ఏదైతే చెయ్యాలో; అది మాత్రం చెయ్యరు

ఈ సంచిక లోనే ఒక ఆర్టికల్ లో భారత ఆర్ధిక వ్యవస్థపై ట్రంప్ టారిఫ్ ల భారం గురించి చర్చించబడింది. ట్రంప్ ప్రభుత్వంతో ఒక ఒప్పందానికి వచ్చేందుకు ఆర్ఎస్ఎస్-బిజెపి ప్రభుత్వం ఆతృతగా ఉన్నది. కానీ సదరు ఆర్టికల్ లో చర్చించినట్లుగా భారత వ్యవసాయం మరియు డెయిరీ రంగాలను (అమెరికా కంపెనీల దోపిడీకి అనువుగా) మరింతగా తెరవాలని ట్రంప్ ప్రభుత్వం పట్టు బట్టడంతో మోడి ప్రభుత్వానికి ఊపిరి ఆడటం లేదు. మూడు నల్ల వ్యవసాయ చట్టాలను రైతులను రుద్దటానికి ప్రయత్నించి మోడి ప్రభుత్వం ఇప్పటికే చేతులు కాల్చుకుంది. దాదాపు సగానికి పైగా కార్మిక ప్రజానీకం ఈ రంగాలలో ఉపాధి పొందటమే కాక మూడింటి రెండు వంతులు పైగా గ్రామాల్లో నివసిస్తున్న ఇండియాకు ఈ రెండు రంగాలే జీవన మార్గం. పాలకవర్గ ప్రతిపక్ష పార్టీలు ట్రంప్ ప్రభుత్వంతో చర్చలలో విఫలం చెందినందుకు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి గానీ ముఖ్యమైన సమస్య సామ్రాజ్యవాదం పైన ఆధారపడటం అన్న అంశాన్ని ఏ మాత్రం ప్రస్తావించటం లేదు.

ఆర్ఎస్ఎస్-బిజెపి ప్రభుత్వం ఒక వైపు చైనాతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకుంటూనే మరో వైపు “స్వదేశీ” (వోకల్ ఫర్ లోకల్) పిలుపు ఇస్తున్నది. ఇది వట్టి ఖాళీ నినాదం. సామ్రాజ్యవాద దేశాలకు లొంగిపోవటానికి వేసుకున్న ముసుగు మాత్రమే తప్ప అది సాధించేందుకు ఎలాంటి చర్యలను అది ప్రతిపాదించలేదు. మోడి ప్రభుత్వం హయాంలో మాన్యుఫాక్చరింగ్ రంగం తగ్గిపోతున్న నేపధ్యంలో “మేక్ ఇన్ ఇండియా” నినాదానికి పట్టిన గతి ఏమిటో బాగా తెలిసిన విషయమే. అమెరికాకు ఇండియా ఎగుమతుల విలువ 87 బిలియన్ డాలర్లు కాగా దిగుమతుల విలువ 42 బిలియన్ డాలర్లు. కాబట్టి ప్రధాన సమస్య ఏమిటంటే ఎగుమతులకు తగిలిన ఈ దెబ్బను ఎలా అధిగమించాలి అన్నదే. సమస్య వేటిని వినియోగించాలి అన్నది కాదు ఎలా వినియోగించాలి అన్నదే. ఇది కేవలం మేక్ ఇన్ ఇండియా గురించి మాత్రమే కాదు, ఆర్థికవేత్తలు చెప్పినట్లుగా ఇది “మేక్ ఫర్ ఇండియా.” ఇది ఎగుమతులకు తగిలిన దెబ్బకు సంబంధించినది కాదు, ఎందుకంటే ఇండియా చాలా కాలం నుండి డిమాండ్ లేమితో సతమతమవుతున్నది. పాలకవర్గాలు దేశీయ సామర్ధ్యాలను మరియు దేశీయ డిమాండ్ లను అభివృద్ధి చేయటానికి బదులు ఎగుమతుల సారధ్యంలోని మరియు విదేశీ పెట్టుబడి ఆధారిత పంథాను అనుసరిస్తున్నారు.

భారత పాలకవర్గ పార్టీలు ట్రంప్ టారిఫ్ ల గురించి గొంతు రాసి పోయేలా పెడుతూ ఇప్పుడు చైనాతో మెరుగైన వాణిజ్య సంబంధాల కోసం చూస్తున్నారు. అయితే చైనా భారీ ఆర్ధిక వ్యవస్థ కావడంతో పాటు వినియోగ సరుకులను చౌకగా ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి చైనాతో వాణిజ్యం అంటే భారత మాన్యుఫాక్చరింగ్ రంగం మరింత చిన్నబోతుంది. ఇప్పటికీ కూడా భారత జిడిపిలో మాన్యుఫాక్చరింగ్ రంగం వాటా కేవలం 15% మాత్రమే. ఇండియా సొంత కాళ్లపై నిలబడాలంటే దేశీయ డిమాండ్ ని అభివృద్ధి చెయ్యటమే సరైన మార్గం అన్న సంగతిని గుర్తించేందుకు భారత దళారీ వర్గాల ప్రతినిధులు నిరాకరిస్తారు, బహుశా గుర్తించ లేరు కూడా. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఇండియా. సహజ వనరులు మరియు సారవంతమైన భూములు మెండుగా కలిగిన దేశం కూడా. కష్టించి పని చేసే ప్రజలతో నిండి ప్రతి యేటా పని చేయగల యువ జనాభా పెద్ద సంఖ్యలో పెరుగుతూ పోతుండటంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన శ్రమ శక్తి సంపన్నులు నిండి ఉన్న దేశం. ఇన్ని సానుకూలతలు కలిగి ఉన్నప్పటికీ భారత పాలక వర్గాలు సామ్రాజ్యవాద శక్తుల ముందు సాగిలపడి ఉన్నారు. ఎందుకంటే స్వయం సమృద్ధ పంథా లో వెళ్లినట్లయితే అది తాము ప్రాతినిధ్యం వహించే కార్పొరేట్ మరియు ప్రగతి నిరోధక శక్తుల ప్రయోజనాలకు భిన్నంగా వెళ్లవలసి ఉంటుంది గనక!

దేశీయ డిమాండ్ ని పెంచటం అంటే, భారత ప్రజల కొనుగోలు శక్తిని పెంచటం మరియు వారి నైపుణ్యాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయటం. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే శ్రమించి పని చేసే ప్రజల వేతనాలను పెంచాలి; నిరుద్యోగాన్ని పారద్రోలాలి. ఇది సాకారం కావాలంటే వేతనాలు తెగ కోసేందుకు, కార్మికులకు అందజేసే వివిధ ప్రయోజనాలను రద్దు చేసేందుకు ఉద్దేశించిన నాలుగు లేబర్ కోడ్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. కాంట్రాక్ట్ లేబర్ లాంటి వేతనాలను తగ్గించే వివిధ ప్రభుత్వ విధానాలను రద్దు చేసి పూర్తి స్థాయిలో స్థిరమైన ఉపాధి కల్పించాలి. దేశంలో అతి పెద్ద ఉపాధి కల్పనాదారు అయిన సూక్ష్మ-చిన్న-మధ్య రకం (మైక్రో-స్మాల్-మిడిల్) పరిశ్రమల రంగం ఎదుర్కొంటున్న సమస్యలను, ఉపాధి సౌకర్యాలను పరిరక్షిస్తూ, పరిష్కరించాలి. ఈ రంగాలకు రుణాలు అందజేస్తూనే మార్కెట్ల సౌకర్యాలను కల్పించటం ఈ దిశలో ముఖ్యమైన అడుగు కాగలదు.

రెండవది, డెయిరీ ఉత్పత్తులతో సహా వ్యవసాయ ఉత్పత్తులకు లాభదాయక ధరలు అందేలా చూడాలి. వీటికి అదనంగా గ్రామీణాభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయింపులను పెంచి గ్రామీణ ప్రాంతాలలో పాక్షిక నిరుద్యోగులను ఇముడ్చు కునేందుకు తగిన పరిశ్రమలను నెలకొల్పాలి. అంతే కాకుండా చిన్న, మధ్య తరగతి రైతులకు యంత్రాలు మరియు సాంకేతిక మద్దతును అందజేయటం ద్వారా వ్యవసాయ రంగాన్ని స్థిరమైన ఆదాయం పొంద గలిగినది గా అభివృద్ధి చేయాలి. చిన్న కమతాలలో వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చగల పరిస్ధితులను సృష్టించగలిగితే, భారత ప్రజల్లో ముఖ్య భాగంగా ఉన్న ఈ భారీ సెక్షన్ యొక్క కొనుగోలు శక్తిని తగినంతగా పెంచవచ్చు. కేవలం భారత ప్రజల లబ్ది కోసమే దేశ ఖనిజ వనరులను తవ్వి తీయాలి. అది కూడా భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడేలా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ జరగాల్సి ఉంటుంది.

అలాగే ఖనిజాల తవ్వకం అన్నది గిరిజన ప్రజలకు లబ్ది చేకూరేలా జరగాలి తప్ప వారి ప్రయోజనాలను పణంగా పెడుతూ జరగరాదు. ప్రధానంగా భూములను నిజంగా దున్నేవారికే చెందేలా చట్టాలను అమలు చేయాలి. భూముల పునఃపంపిణీ ప్రక్రియలో సామాజిక న్యాయాన్ని ఒక అంతర్భాగంగా పరిగణించాలి. తద్వారా భూముల కోసం పెరిగిన డిమాండ్ నేపధ్యంలో అన్ని సెక్షన్ల ప్రజలకు సమాన న్యాయం జరిగేలా జాగ్రత్త వహించాలి. ఈ చర్యల ఫలితంగా సకల సామాజిక సమూహాలను సంపదల సృష్టిలో భాగస్తులను చేయటం ద్వారా భారత ప్రజల నిజమైన శక్తియుక్తులను దేశాభివృద్ధిలో పూర్తి స్థాయిలో ఉపయోగ పెట్టగలము. భారీ సంఖ్యలో ఉన్న జనాభాకు ఆహార భద్రత కల్పించవలసిన నేపధ్యంలో వ్యవసాయ యోగ్యమైన భూములను ఇతర ఉపయోగాలకు తరలించటం నిలిపి వేయాలి. వ్యవసాయ సాగులో లేని, ఇతర ప్రయోజనాలకు ఉపయోగ పెట్టగల భూమి మనకు దండిగానే ఉన్నది.

అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే వృద్ధులకు, శ్రమ చేయలేని బలహీనులకు, ఇంకా అటువంటి ఇతర సెక్షన్ల ప్రజలకు కేవలం రొట్టె ముక్కలు పంచి పెట్టడం కాకుండా వారికి సమగ్ర పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. ఇటువంటి మెరుగైన సామాజిక భద్రతా కవచాన్ని అభివృద్ధి చేయటం వలన వారి జీవన స్థితిగతులు మెరుగు పడటంతో పాటు వారికి అవసరమైన పరికరాల తయారీతో ఆర్ధిక వ్యవస్థకు కూడా సహకారం అందజేయవచ్చు.

డిమాండ్ ను పెంచేందుకు ఇలాంటి చర్యలను చేపట్టడంతో పాటు దేశీయ డిమాండ్ ని కూడా అభివృద్ధి చేయాలి. అందుకోసం విద్య సౌకర్యాల క్వాలిటీని మెరుగుపరుస్తూ విస్తారమైన ప్రజానీకానికి విద్యను చేరువ చేయాలి. భారత దేశం లోని విస్తారమైన మానవ వనరుల నుండి తెలివితో కూడిన, విజ్ఞాన వంతమైన నైపుణ్య సమూహాలను తయారు చేసుకోవాలంటే పిల్లలు/యువకులు/పెద్దలు అందరికీ క్వాలిటీ విద్యను అందజేసే బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించాలి. ఇది దేశానికి భారీ లాభం చేకూర్చగల పెట్టుబడి అవుతుంది. ఇలా తయారైన ట్యాలెంట్ పూల్ మెరుగైన టెక్నాలజీ మరియు నైపుణ్యాల అభివృద్ధికి ఒక ఇంజన్ లాగా పని చేస్తుంది. కాగా ఈ ఇంజన్ భారతదేశం యొక్క నిజమైన వృద్ధికి, అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. అలాగే ప్రతి ఒక్క పౌరుడికి మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలను ఆచరణలో గ్యారంటీ చేయాలి; రోగ నివారణ పైన ప్రధాన దృష్టి కేంద్రీకరించాలి. రోగాలను నయం చేసుకోవటం కోసం జేబు డబ్బులు సరిపోక తాహతుకు మించిన అప్పులతో అనేక కుటుంబంలో దరిద్రం లోకి జారిపోతున్న పరిస్ధితి దేశంలో నెలకొని ఉన్నది. వారు చివరికి వినియోగ మార్కెట్ నుండి దూరంగా విసిరివేయబడుతున్నారు. అటువంటి కుటుంబాలకు సమగ్ర ప్రభుత్వ వైద్య సేవలు వరదాయని కాగలవు.

ముఖ్యంగా భారత పాలక వర్గాలు పరిశోధనలపై ఖర్చును తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు. తద్వారా ఇండియా, శాశ్వతంగా సామ్రాజ్యవాద దేశాలపై ఆధారపడి ఉండేలా తయారు చేశారు. అధికారాలకు చేరువలో ఉండే వారి ఫ్యూడల్ తరహా నియంత్రణలో పరిశోధనా సంస్థలను నెట్టి వేయబడిన పరిస్ధితి నెలకొనగా ఇటీవల కాలంలో ఆర్ఎస్ఎస్ నామినేట్ చేసిన వ్యక్తులను పరిశోధనా సంస్థలకు అధిపతులుగా నియమిస్తున్నారు. సైన్స్ స్థానాన్ని మైథాలజీ ఆక్రమిస్తున్నది. ఊహాత్మక గతం వర్తమానాన్ని నియంత్రిస్తూ భవిష్యత్తును నాశనం చేస్తున్నది.  వివిధ తరగతుల పాఠ్య ప్రణాళికలను, మంచి ఆర్ధిక వ్యవస్థను గానీ, మంచి సమాజాన్ని గానీ, కనీసం మంచి మానవులనయినా తయారు చేయటంలో నిజమైన విలువను అందజేయలేని చెత్తతో నింపుతున్నారు. ఈ నేపధ్యంలో నిజమైన ట్యాలెంట్ పూల్ విదేశాలకు తరలి పోవాల్సిన పరిస్ధితికి నెడుతున్నారు. దేశంలో ఉండిపోయిన వారేమో విద్యుత్ ప్లాంట్ లకు నీరు పెట్టడం తప్ప మరేమీ చేతకాని అసమర్థుల కింద తప్పనిసరి బందీలై తీవ్ర నిరాశా, నిస్పృహలకు లోనై శాస్త్ర విజ్ఞానానికి, సమాజానికి తలవంపులు తేలేక ఎలాగోలా నెట్టుకువస్తున్నారు.

వనరుల లేమిని సాకుగా చూపిస్తూ పాలకవర్గాలు పైన సూచించిన పరిష్కారాలను ఆచరణ సాధ్యం కానివిగా తరచుగా కొట్టి పారేస్తుంటారు. కానీ మన సమాజంలో అతి పెద్ద వనరు మానవ వనరే. చైతన్య వంతులైన మానవులను గొలుసులతో బంధించి ఉంచటం సాధ్యం కాదు. సూపర్ ధనిక వర్గం పైన పన్నులను పెంచటం ద్వారా, కార్పొరేట్ పన్నులను పెంచటం ద్వారా, కొద్ది మొత్తంలో సంపద పన్ను విధించటం ద్వారా కూడా వనరులను సమకూర్చుకునే అవకాశాలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. అనేక దేశాలు చేస్తున్నట్లుగా, ఇండియాలో వనరులను తవ్వి తీసి విదేశాల్లో సంపదలు మరియు ఉద్యోగాలు సృష్టించే కార్పొరేట్ కంపెనీల నుండి అత్యధిక పన్నులను వసూలు చేయవచ్చు. వనరులు లేవని చెప్పే మాటలు కేవలం ప్రజలను నైతికంగా నీరస పరిచి నోరు మూయించేందుకు ఉద్దేశించినవి మాత్రమే. విదేశాల్లోని తమ యజమానులకు సేవలు చేస్తున్న ప్రజా-వ్యతిరేక పాలకులే ఇటువంటి నీరస పరిచే కధనాలను పెంచి పోషిస్తున్నారు. వీళ్ళు తమ వారసుల సంపదలకు కూడా మార్గాలు తెరిచి ఉంచి దేశంలో ప్రగతి నిరోధక శక్తులను కాపాడుతుంటారు.

తమ దోపిడీ పూరిత మరియు అణచివేతతో కూడిన పాలనను సంరక్షించుకుని కొనసాగించేందుకు పాలక వర్గాలు, ఒక సామ్రాజ్యవాద సెక్షన్ నుండి మరొక సామ్రాజ్యవాద సెక్షన్ వైపుకి పరుగులు పెడుతున్న నేటి తరుణమే ప్రజల ముందుకు ఈ ప్రధాన సమస్యలను తీసుకు వెళ్ళేందుకు సరైన సమయం. విదేశీ పెట్టుబడుల ద్వారా భారత ఆర్ధిక వృద్ధి జరుగుతుందన్న పాలక వర్గాల వాదనలు ఇప్పటికే చావు దెబ్బ తిన్నాయి. ఆరంభంలో ఇది ఒక ప్రాపగాండా గా కనిపించే అవకాశం ఉండవచ్చు గానీ, ప్రస్తుత పరిస్ధితుల్లో దేశ ప్రజానీకంలో, మేధో వర్గ ప్రజల్లో సైతం మన మాటల్లోని వాస్తవాలు అర్ధం చేసుకుని సహకరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తగిన వేదిక/ల ద్వారా అటువంటి ప్రచారాన్ని విప్లవ శ్రేణులు చేపట్ట వలసిన సమయం ఆసన్నమయింది.

————ముగిసింది

వ్యాఖ్యానించండి