సీజ్ ఫైర్ ప్రతిపాదన అమెరికాదే, ఇండియా ఒప్పుకోలేదు -పాకిస్తాన్


Pakistan Foreign Minister Ishaq Dar

పహల్గామ్ టెర్రరిస్టు దాడి అనంతరం, ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన 4 రోజుల యుద్ధం విరమించే ప్రతిపాదన మొదట అమెరికా నుండే వచ్చిందని పాకిస్తాన్ వెల్లడి చేసింది. అయితే ఈ ప్రతిపాదనకు ఇండియా అంగీకరించలేదని పాకిస్తాన్ విదేశీ మంత్రి ఇషాక్ దార్ మంగళ వారం (సెప్టెంబర్ 16) వెల్లడి చేశాడు.

(పహల్గామ్ లో టూరిస్టులపై హంతక దాడి చేసిన వారిని భారత పత్రికలు, ప్రభుత్వం టెర్రరిస్టులు అని చెబుతుండగా, విదేశీ పత్రికలు మాత్రం, ముఖ్యంగా పశ్చిమ దేశాల వార్తా సంస్థలు వారిని ‘మిలిటెంట్లు’ అని సంభోధిస్తున్నాయి.)

పాకిస్తాన్ మంత్రి వెల్లడి చేసిన వాస్తవాలను బట్టి ఇరు దేశాలు యుద్ధ విరమణ కోసం అమెరికాను సంప్రదించాయన్న డొనాల్డ్ ట్రంప్ గొప్పలు అబద్ధం అని ఎట్టకేలకు తేలిపోయింది. పాక్ వెల్లడితో ట్రంప్ వాగాడంబరం మరోసారి ప్రపంచానికి తేటతెల్లం అయింది.

4 రోజుల పాటు యుద్ధం చేసుకున్న ఇండియా, పాకిస్తాన్ మిలటరీలు అకస్మాత్తుగా ఇరు దేశాలు కాల్పుల విరమణ కుదుర్చుకున్నాయని ప్రకటించాయి. ఇరు దేశాల కంటే ముందు అమెరికా అధ్యక్షుడు ప్రకటన విడుదల చేస్తూ ఇరు దేశాల కోరిక మేరకు తాను సంధి ప్రయత్నాలు చేశాననీ, ఫలితంగా ఇరు దేశాలు వెంటనే కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని, ఈ ఒప్పందం కోసం తాను తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చెయ్యటం వల్లనే ఒప్పందం సాధ్యం అయిందనీ ప్రకటించుకున్నాడు.

దానితో భారత దేశ ప్రతి పక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వం పైన విరుచుకు పడ్డాయి. జమ్ము కాశ్మీర్ సమస్య ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నది భారత దేశ విధానం కాగా ప్రభుత్వం అమెరికా మధ్యవర్తిత్వాన్ని అభ్యర్ధించటం ఏమిటని నిలదీశాయి. భారతదేశ సార్వభౌమత్వాని తీసుకెళ్లి అమెరికా చేతుల్లో పెట్టిందని ప్రభుత్వాన్ని ఏకి పారేశాయి.

మరో పక్క అమెరికా/ట్రంప్ ప్రకటనని పాకిస్తాన్ ప్రభుత్వం ధృవీకరించింది. అమెరికా చలవ వల్లనే ఇండియా, పాకిస్తాన్ దేశాలు యుద్ధం విరమించి కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని, అమెరికాకు కృతుజ్ఞతలు చెబుతున్నామని పాక్ విదేశీ మంత్రి, రక్షణ మంత్రి స్పష్టం చేశారు. దరిమిలా మోడి ప్రభుత్వం పైన విమర్శలు తీవ్రం చేశాయి.

పైగా డొనాల్డ్ ట్రంప్ తానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చానని, అందుకోసం కష్ట పడ్డానని పదే పదే చెప్పాడు. ఇప్పటి వరకు 40 సార్లు పైగా ఈ అంశాన్ని, వివిధ సందర్భాల్లో చెబుతూ వచ్చాడు. ఓ పక్క రష్యా చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు ఇండియాను తూలనాడుతూనే ఇండియా-పాక్ యుద్ధ విరమణ గురించిన తన వాదనను వినిపిస్తూ వచ్చాడు. దీని ఆధారంగా ప్రతిపక్ష నాయకులు మోడి ప్రభుత్వాన్ని నిజం చెప్పాలని నిలదీయటం తీవ్రం చేశారు.

పాకిస్తాన్ విదేశీ మంత్రి వాస్తవం ఇదీ అని చెప్పడంతో ఇంతటితో ఈ వివాదం ముగిసిపోయిందని భావించవచ్చు. మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ నోరు తెరిచి మరోసారి భిన్నమైన వాదన వినిపిస్తే తప్ప.

యుద్ధ విరమణకు మధ్యవర్తిత్వం వహించాలని పాకిస్తాన్, అమెరికా విదేశీ మంత్రి మార్కో రుబియో ను కోరిన మాట వాస్తవమేననీ, అయితే పాకిస్తాన్-ఇండియా కు సంబంధించిన అన్ని సమస్యలు “ద్వైపాక్షికం మాత్రమే” అని ఇండియా విధానం అని మాకు తెలియజేశాడు అని పాక్ మంత్రి చెప్పాడు.

“మూడో పక్షం మా వివాదంలో జోక్యం చేసుకోవటానికి మాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఇండియా మొదటి నుండి ఇరు దేశాల సమస్యలు ద్వైపాక్షికం అని చెబుతున్నది. ద్వైపాక్షిక చర్చలకు కూడా మాకు అభ్యంతరం లేదు. అయితే టెర్రరిజం, వాణిజ్యం, ఆర్ధిక సంబంధాలు, జమ్ము కాశ్మీర్ మొ.న అన్ని అంశాల పైనా సమగ్రమైన చర్చలు జరగాలన్నది మా అభిప్రాయం” అని పాక్ విదేశీ మంత్రి చెప్పాడు.

“ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలని మే నెలలో అమెరికా ప్రతిపాదించింది. ఇరు దేశాల చర్చలు తటస్థ దేశంలో జరుపుతామని ప్రతిపాదించింది. అయితే జులై 25 తేదీన జరిగిన తదుపరి సమావేశంలో అమెరికా విదేశీ మంత్రి మార్కో రుబియో, విరమణ ప్రతిపాదనకు ఇండియా అంగీకరించలేదని మాకు తెలియజేశాడు” అని ఇషాక్ దార్ తెలియజేశాడు.

దీనిని బట్టి అమెరికా మధ్యవర్తిత్వానికి ఇండియా అంగీకరించలేదన్న సంగతి పాకిస్తాన్ కు కూడా జులై 25 తేదీ వరకు తెలియదని భావించవలసి వస్తున్నది. అది కూడా ఇషాక్ దార్ చెబుతున్నది నిజమే అయితే.

“‘ఇది ద్వైపాక్షిక సమస్య’ అని ఇండియా చెబుతుంది. మేము ఎవరినీ అడుక్కోవటం లేదు. మాది శాంతికాముక దేశం. చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం సాధ్యమని మా అభిప్రాయం. అయితే ఇందుకు ఇద్దరూ అంగీకరించాల్సి ఉంది” అని దార్ వివరించాడు.

పాకిస్తాన్ లో ఇస్లామిక్ మత సంస్థలు, మిలట్రీ… ఈ రెండు పక్షాలు అత్యంత శక్తివంతులు. మిలటరీ అనుమతి లేకుండా ఎలాంటి ప్రధాన నిర్ణయం జరగదు. అడపా దడపా ఎన్నికల్లో నెగ్గిన ప్రభుత్వాలు పాలనా పగ్గాలు తమ చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించినప్పుడల్లా మిలటరీ కుట్రలు జరపడం ప్రభుత్వ నేతలను నామమాత్ర విచారణతో జైలులో బంధించడం జరుగుతుంది. గత ప్రధాని నవాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్ లను ఇలాగే జైలు పాలయ్యారు. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికీ జైలులో మగ్గుతున్నాడు.

అలాగే పాక్ మిలటరీ ఇంటలిజెన్స్ సంస్థ అయిన ఐఎస్ఐ ఇస్లామిక్ టెర్రరిస్టు సంస్థలను పెంచి పోషిస్తూ ఉంటుంది. వారి ద్వారా అటు ఆఫ్ఘనిస్తాన్, ఇటు జమ్ము కాశ్మీర్ లపై ఆధిపత్యం సంపాదించాలని ప్రయత్నాలు చేస్తుంది. అనేక మార్లు ఆఫ్ఘనిస్తాన్, జమ్ము కాశ్మీర్ లలో టెర్రరిస్టు దాడులు జరపడం ద్వారా ఇరు ప్రాంతాల్లో రాజకీయ పరిణామాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు చేసింది. ఐఎస్ఐ సంస్థకు తరచుగా అమెరికా సంస్థ సిఐఏ నుండి మద్దతు అందటం పరిపాటి. ఐఎస్ఐ ద్వారా దక్షిణాసియాలో పరిణామాలను నియంత్రించేందుకు, గుప్పిట పెట్టుకునేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తుంది.

మరో వైపు బలూచిస్తాన్ లో టెర్రరిజాన్ని, తిరుగుబాటుదారులను భారత దేశం పెంచి పోషిస్తున్నదని పాకిస్తాన్ ఆరోపిస్తుంది. మహాజీర్ ఖ్వామి మూవ్మెంట్ (MQM) వెనుక భారత హస్తం ఉందని పాక్ ఆరోపిస్తుంది.

ప్రాంతీయ ఆధిపత్యం కోసం జరుగుతున్న టెర్రరిస్టు యజ్ఞంలో అంతిమంగా ఇరు దేశాల ప్రజలు ముఖ్యంగా జమ్ము కాశ్మీర్, బలూచిస్తాన్ ప్రజలు బలి అవుతున్నారు. శాంతి అన్నదే కరువై, స్థిరమైన జీవన భృతి పొందలేక నిత్యం పేదరికంలో మగ్గుతున్నారు. ఇది అంతం లేని కధ. ఆధిపత్య శక్తులు సంపదల స్వాధీనం కోసం, ప్రజల ప్రయోజనాలను బలిగా పెడుతూ, నిరంతర అశాంతి, అస్థిరతలను సృష్టిస్తూ చేస్తున్న స్వార్ధపర, రక్తా పిపాసా పూరిత యుద్ధం ఇది.

వ్యాఖ్యానించండి